2, ఆగస్టు 2013, శుక్రవారం

ప్రథమస్కంధం: 09. అశ్వత్థామను గురించి తెలుసుకోవలసిన విషయాలు

నిన్నటి టపాలో అశ్వత్థామ చేసిన దుష్కృత్యం గురించీ, దాని పరిణామాన్ని గురించీ తెలుసుకున్నాం.  చదువరులకు నా విజ్ఞప్తి ఏమిటంటే కేవలం నిన్న చదివిన విషయం ఆలోచించి ఆయన వ్యక్తిత్వం గురించి ఒక అంచనాకు రావద్దని.  నేను ఇలా చెప్పటం వెనుక చాలా కారణాలున్నాయి.  పౌరాణిక లేదా ఐతిహాసిక పాత్రలను గురించి మనకు అవగాహన కల్పించేవి ఆయా పురాణాలూ ఇతిహాసాలూ మాత్రమే. ఒక్కొక్క సారి ఇందుకు ఇతర పురాణేతిహాసాలూ సహాయం చేస్తాయి.  తదనంతరం వెలసిన కావ్యాలూ వగైరాలలో కాళిదాసాది ఋషితుల్యులైన మహానుభావుల రచనలు మినహాయించి, ఇతర కవికల్పనలు సాధారణంగా కవిగారి కావ్యప్రణాళికకు అనుగుణంగా పౌరాణిక లేదా ఐతిహాసిక పాత్రల స్వరూపస్వభావాలు రూపుదిద్దుకుంటాయి. తస్మాత్ జాగ్రత!

ఆదునిక కాలంలో మొదట నాటకాలూ అత్యాధునికాలయిన సినీమాలు, టీవీ ధారావాహికలలోని పౌరాణిక లేదా ఐతిహాసిక పాత్రలను ప్రామాణికంగా తీసుకోవటం ఎంతమాత్రం మంచిది కాదు.  కాని దురదృష్టం‌ ఏమిటంటే,  నేటి యువతరానికి, భావిభారతపౌరులతరానికీ ఈ సినిమాలూ సీరియళ్ళూ అందించే చెత్త వ్యక్తిత్వాలతో కూడిన పౌరాణిక లేదా ఐతిహాసిక పాత్రలు మాత్రమే సుపరిచితం.  ఇది చాలా చాలా ఆందోళన చెందవలసిన అంశం.

ఉదాహరణకు నారదులవారి పాత్రను తీసుకుందాం.  కాళిదాసమహాకవిగారు తన కుమారసంభవంలో కాబోలు ఆకాశనుండి నారదులవారు భూమికి విచ్చేస్తుంటే అందరూ ఇదేమిటీ ఆకాశం మీద ఇద్దరు సూర్యుళ్ళు కనిపిస్తున్నారూ అని విస్తుపోయారని వర్ణించారట.  అదీ‌ ఔచిత్యం అంటే. మన సినీటీవీ నారదుడో? కేవలం ఒక హాస్యపాత్ర.  ఇంకా కొన్ని సందర్భాలలో ఒక వెకిలి పాత్రకూడా.  నారదులవారిని ఒక కమేడియన్‌గా మార్చి చూపే‌ హక్కు ఈ సినీటీవీ నిర్మాతలకూ దర్శకులకూ ఎవరిచ్చారు?  ప్రశ్నించే‌ దిక్కు లేదు.  నా బోటి చాదస్తుడూ మీ బోటి అనుమానస్తుడూ ప్రశ్నిస్తే విసుక్కుంటారు - పిచ్చివాడిలా చూస్తారు.  ఎంత దుస్థితి!

అలా అన్ని పౌరాణిక/ఐతిహాసిక పాత్రలలాగే అశ్వత్థామ పాత్ర కూడా జనసామాన్యానికి సరిగా అందలేదు.  అందుచేత, సందర్భం వచ్చింది కాబట్టి అశ్వత్థామను గురించి మరింత స్పష్టత ఇవ్వాలని భావించి వ్రాస్తున్నాను.

అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్యులవారు. తల్లి కృపి. అశ్వత్థామ మేనమామ కృపాచార్యులు. 

గౌతమమహర్షి కుమారులు శతానందులు. ఆయన కొడుకు శరద్వంతుడు అనబడే సత్యధృతి.  ఈ‌ సత్యధృతికీ జలపది అనే అప్సరసకూ ఒక ఆడ ఒక మగశిశువుల జంట జన్మించింది.  చిన్నతనంలోనే వీరిద్దరినీ అరణ్యంలో చూసి శంతనమహారాజుగారు తెచ్చి తన బిడ్దలవలే పెంచుకున్నారు. ఆ పిల్లలే కృపాచార్యులు, కృపి.  కృపాచార్యులు తండ్రివలన వేదాలు, ధనుర్వేదం నేర్చుకున్నారు.  ద్రోణాచార్యులవారు కృపిని వివాహం చేసుకున్నారు.

కురుక్షేత్రమహాసంగ్రామం కేవల కౌరవపాండవ కలహం కాదు.  అందులో అనేక మంది పగలు తీరాయి.

ద్రోణాచార్యులవారికి ద్రుపదమహారాజు సహాధ్యాయి (అంటే ఒకే గురువు వద్ద కలిసి విద్యనేర్చుకున్న వాడు. మరొక మాట సతీర్థుడు అని ఉంది. సతీర్థుడు అంటే ఒకే గురువు వద్ద వేరే సమయంలో విద్యనేర్చుకున్న వాడు. ఇక్కడ అధ్యయనం అంటే విద్యాభ్యాసం. తీర్థం అంటే గురుసాన్నిధ్యం అని గ్రహించండి).  ఆ తరువాత కాలంలో ద్రోణాచార్యులు ద్రుపదుడి దగ్గరకు పోయి మిత్రమా నాకో రెండు ఆవులు ఇవ్వయ్యా నా కొడుకు పోషణార్థం‌ అని అడిగితే ద్రుపదుడు ఆయన్ని మెడపట్టి గెంటేసాడు. అనంతర కాలంలో అర్జునుడు ద్రుపదుణ్ణి ఓడించి కట్టి తెచ్చి గురువుగారి కాళ్ళముందు పారేసి గురుదక్షిణ ఇచ్చాడు.  ద్రోణాచార్యుల అవమానభారం తీరి ఇంక ద్రుపదుడి పగ మొదలు.  ఆయన యజ్ఞం చేసి ద్రోణాచార్యులను చంపే కొడుకుగా దృష్టద్యుమ్నుడు అనే వీరుణ్ణీ, అర్జునుడికి భార్య అయ్యే కూతురుగా కృష్ణ (ద్రౌపది) అనే కూతుర్నీ సంపాదించుకున్నాడు.

ద్రోణాచార్యులు ధర్మరాజుతో తాను అస్త్రసన్యాసం చేసి మరణించవలసి ఉందని ఆ దిశగా ఆలోచించుకోమని యుధ్దారంభంలోనే సలహా ఇచ్చారు. పైగా తాను అప్రియ వాక్యం కారణంగా అస్త్రసన్యాసం చేస్తాననీ సెలవిచ్చారు. అందుచేత గత్యంతరం లేని పరిస్థితిలో ధర్మరాజులవారు అశ్వత్థామ హతః కుంజరః అని అన్నారు.  అశ్వత్థామ హతః అన్న మాట వినగానే ఇక పూర్తిగా వినకుండా మనసువిరిగి ద్రోణాచార్యులు అస్త్రసన్యాసం చేసి రథం మీదే‌ ప్రాయోపవేశం చేసి యోగముద్రలో ఉండిపోయారు.  అప్పుడు సమయం కోసం చూస్తున్న ధ్రుష్టద్యుమ్నుడు వెంటనే పోయి ఆయన తలను ఖండించాడు.

ఈ దుస్సంఘటన సహజంగా ధర్మాత్ముడూ,  పాండవపక్షపాతీ‌ అయిన అశ్వత్థామలో పగ రేకెత్తించింది. కృపాచార్యులను కూడా ఈ సంఘటన కలచి వేసింది.

అశ్వత్థామ దుర్యోధనుడి స్నేహితుడే.  కాని పాండవపక్షపాతి అన్న అనుమానంతో దుర్యోధనుడు అతడి స్నేహాన్ని పెద్దగా గౌరవించలేదు.  అతడు తరచూ‌ తన హితం కోరి చెప్పే‌ మాటలను వినిపించుకునే‌వాడు కాదు.  అయినా దుర్యోధనుడు భీముడి చేతిలో పడిపోయిన తరువాత వీరధర్మానికి విరుధ్దంగా భీముడు నిస్సహాయంగా పడి ఉన్న దుర్యోధనుడి తలను కాలితో‌ తన్నటం అశ్వత్థామకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.  అంతా సర్వనాశనం అయిపోయిన తరువాతా, తను పడిపోయిన తరువాత కూడా దుర్యోధనుడి తామసం అణగలేదు.  తనను చూడవచ్చిన అశ్వత్థామను సర్వసైన్యాధిపతిగా ప్రకటించి ఇంక నువ్వే నా పగ తీర్చాలీ - పాండవహతకులను చంపాలీ అని వేడుకున్నాడు.  అగ్రహించి ఉన్న అశ్వత్థామ సరే అన్నాడు.

దుర్యోధనుడు దురభిమాని అన్నది పక్కన పెడితే చాలా తెలివైన వాడు.  గొప్ప పరిపాలనా దక్షుడు.  కిరాతార్జునీయం అని ఒక కావ్యం. అది భారవి అనే మహాకవి వ్రాసారు. దానిలో ధర్మరాజుగారి గూఢచారి వచ్చి ఆయనతో హస్తినాపురంలో దుర్యోధనుడి పాలన బాగుందీ‌ జనం మెచ్చుకుంటున్నారూ అని చెబుతాడు. ధర్మరాజుగారికి విచారం పట్టుకుంటుంది.  ఇలా జనాన్ని తనవైపు లాక్కుంటున్నాడే తరవాత తనకెలా అని.  అంత వాడు దుర్యోధనుడు.  దుర్యోధనుడు పోయి, శ్రీకృష్ణుడిని సహాయం చేయమంటే ఆయన తన సేనాపతి  కృతవర్మని  ససైన్యంగా ఇచ్చాడు.  ఇలా వచ్చిన కృతవర్మ లోగడ రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణపరమాత్మతో పాటు తానూ వచ్చి దుర్యోధనుడి మంకుపటు పట్ల తీవ్రంగా ఆగ్రహించినవాడే.  అది దుర్యోధనుడికి తెలుసుగా.  అందుకని తన పక్షానికి కృష్ణుడు పంపగా వచ్చిన కృతవర్మకు బ్రహ్మరథం పట్టాడు. అతడి ఆదరం చూసి క్రమంగా, ఏదో‌ పాపం దాయాదులతో విరోధమే కాని, వీడు మంచివాడే నిజానికి అన్న అభిప్రాయానికి వచ్చాడు కృతవర్మ. అతడూ తొడలు విరిగి పడిపోయిన దుర్యోధనుడిని వచ్చాడు అశ్వత్థామ, కృపాచార్యులతో‌ పాటు.  దుర్యోధనుడి దైన్యం చూసి పగతీర్చవలసిందే అన్న నిర్ణయానికి వచ్చాడు.

ద్రోణవధతో‌ కలత చెంది ఉన్న కృపాచార్యులూ దుర్యోధనుడు కోరింది న్యాయమే అని భావించే స్థితిలో‌ ఉన్నారు.

కాని వీళ్ళు ముగ్గురూ పాండవులను ఏమి చేయగలరు? మరి దుర్యోధనుడి పగ చల్లారటం‌ ఎట్లా?

అప్పుడు ఆ రాత్రిపూట అశ్వత్థామ ఒక విషయం గమనించాడు.  కాకులకూ‌ గుడ్లగూబలకూ‌ జాతి వైరం.  గుడ్లగూబలకు పగలు కళ్ళు కనబడవు, రాత్రి మహ బాగా కనిపిస్తాయి.  అందుకే గుడ్లగూబకు దివాంధం అని పేరు.  అది సాకుగా, పగలు కాకులు గుడ్లగూబలపై దాడి చేసి చంపుతాయి. గుడ్లగూబలు రాత్రిపూట కాకుల గూళ్ళపై దాడి చేస్తాయి.  అలా నిద్రపోయే కాకుల గూళ్ళమీద గుడ్లగూబల దాడిని ద్రోణపుత్రుడు చూసాడు.  అతడికి ఒక ఆలోచన వచ్చింది. తాను కూడా నిద్రపోతున్న పాండవులను చంపితే? 

అవును అలా ఎందుకు చేయకూడదూ? దుష్టుడైన ధృష్టద్యుమ్నుడు, తన తండ్రిని, ప్రాయోపవేశం చేసి, కళ్ళుమూసుకుని శాంతంగా, నిస్సహాయంగా ఉండిపోయిన మహానుభావుడిని,  ఎలా చంపాడూ - తలతరిగి కాదూ? ఏం‌ పాండవులు మాత్రం తక్కువ తిన్నారా? ధృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ణి చంపుతుంటే గుడ్లప్పగించి చూస్తూ‌ ఊరుకుని ఆపైన అతడిని చీవాట్లు వేసినట్లు నటించలేదా? మంచిది. అలాగే తానూ నిస్సహాయంగా నిద్రావస్థలో ఉన్న ధృష్టద్యుమ్నుడినీ, పాండవులనూ తలలు తరిగి చంపుతాడు. తప్పేమీ‌ కాదు.  కోపంలో ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్న మేనల్లుణ్ణి చూసి కృపాచార్యులకు భయం కూడా కలిగింది.

అశ్వత్థామ సంహారకారుడైన శివుణ్ణి ఉపాసించాడు తగిన శక్తియుక్తులకోసం. శివుడు మహాభూతాకృతిలో ప్రత్యక్షమై ఒక ఖడ్గాన్ని ఇచ్చి అదృశ్యం‌ అయ్యాడు.  ఆ కత్తితో‌నే అశ్వత్థామ దృష్టద్యుమ్నుణ్ణీ,  ఉపపాండవులనీ చంపేసాడు - అదీ, సుఖనిద్రలో ఉన్నవాళ్ళని.

మరి పాండవులెలా తప్పించుకున్నారు? అదీ‌ చెప్పుకుందాం.

శ్రీకృష్ణుడు యుధ్ధానంతరం ధృతరాష్ట్రమహారాజును ఓదార్చటానికి వెళ్ళి నాలుగు మంచి మాటలు చెబుతున్నాడు.  సరిగా ఆ సమయంలోనే‌ అశత్థామ పాండవసంహారానికి బయలుదేరాడు.  సర్వహృదయాంతర్వర్తి అయిన శ్రీకృష్ణస్వామికి తెలిసిపోదా ఆ సంగతి.  అందుచేత ఆయన వెంటనే తిరిగి వచ్చి పాండవులను పాంచాలీ సహితంగా ఆ రాత్రి తన శిబిరంలో విందుకు పిలిచాడు.  వారంతా ఆ రాత్రి అక్కడే ఉండి పోయారు. ఉపపాండవులు పాండవశిబిరంలో నిదురించి దుర్మరణం‌ పొందారు.

చాలా మందికే ఉండే ఒక సందేహం‌ మనం ప్రస్తావించుకోవాలి.  శ్రీకృష్ణుడు అభిమన్యుణ్ణీ ఉపపాండవుల్నీ ఎందుకు కాపాడలేదూ‌ అన్నది ఆ సందేహం.

జాగ్రత్తగా గమనిస్తే కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధనుర్వేదం అని పిలువబడే అస్త్రవిద్య తెలిసిన వాళ్ళు ఎవరూ‌ మిగలలేదని స్పష్టం అవుతుంది. మిగిలినవాళ్ళు పాండవులూ, కృపాచార్యులూ,  అశ్వత్థామ, సాత్యకీ, కృతవర్మా.

ముఖ్యంగా పాండవుల తరం తరువాతి తరం వాళ్ళెవరూ మిగలలేదన్నది గమనార్హం.  దీనికి కారణం ఒకటే.  కలియుగం రాక అతి సమీపంలో ఉంది.  ఆ కలియుగంలో‌ ధనుర్విద్య తెలిసిన వాళ్ళు ఉండరాదు. అందుచేత శ్రీకృష్ణులవారి అవతార కార్యక్రమంలో అదికూడా ఒక ముఖ్య భాగమే.

ఇప్పుడు సాత్యకీ,కృతవర్మా, కృపాచార్యులూ, అశ్వత్థామా మిగిలారు.  వీరిలో రాబోయే రోజుల్లో సాత్యకీ కృతవర్మలు యాదవకలహంలో‌ నశిస్తారు. కృపాచార్యులవారు చిరంజీవి.  మహానుభావుడు. ఆయన కలియుగంలో అస్త్రవిద్యను ఎవరికీ‌ నేర్పరు. అశ్వత్థామ కూడా చిరంజీవి.  ఆయన సంగతి శ్రీకృష్ణులవారు నిర్ణయించారు. ఎలాగో చూడండి.

సంహారకారుడైన శివుడై ఏ పరమాత్మ అశ్వత్థామకు దివ్యఖడ్గాన్ని ఇచ్చారో ఆయనే స్థితికారకుడై శ్రీకృష్ణావతారుడై అలరారుతున్న శ్రీమహావిష్ణువు.   దీనికి నిరూపణకూడా భారతంలోనే‌ దివ్యంగా ఉంది.  అభిమన్యుడి మరణానంతరం, ఆ రోజు రాత్రి, శ్రీకృష్ణోపదేశంతో దుఃఖోపశమనం చేసుకున్నాడు అర్జునుడు. ప్రతిరోజూ‌ చేస్తున్నట్లే, ఆ రాత్రీ‌ శ్రీకృష్ణమూర్తికి గంధపుష్పాలంకార సహితంగా పూజ సమర్పించి నిదురించాడు.  ఆయనకు ఒక కలవచ్చింది. కలలో శ్రీకృష్ణుడు తనను కైలాసానికి శివసాన్నిధ్యానికి తీసుకుని వెళ్ళాడు.  శ్రీకృష్ణునికి తాను  ఏఏ పుష్పమాలికలను సమర్పించుకున్నాడో, ఏఏ అలంకారాలు ఇచ్చాడో అవి అన్నీ శివుడి మెడలో ఉండటం అర్జునుడు చూసి ఆశ్చర్యపోయాడు.  శివుడు కూడా అర్జునుడికి దుఃఖం తగ్గేటట్లుగా అనునయించి పంపాడు.  ఉదయమే శ్రీకృష్ణుడు వచ్చి బావా రాత్రి సుఖంగా నిద్రపోయావా? శివోపదేశంతో నీ దుఃఖం తగ్గిందా అని పరామర్శించాడు. దీనితో‌ శివకేశవులు ఇద్దరూ‌ ఒక్కరే అని అర్జునుడిని చక్కగా అనుభవపూర్వకంగా తెలిసింది.

అందుచేత ఉపపాండవులను తొలగించటం దైవసంకల్పం.

అయితే శ్రీకృష్ణస్వామిమాత్రం అశ్వత్థామ చేసిన బాలవధకు చాలా కోపించి శపించారు. బాలఘాతివైన నువ్వు అన్నమూ‌ నీళ్ళూ కరువై అలమటించు. దుర్మాంసంచేత శరీరం బాధపడుతుండగా మూడువేల సంవత్సరాలు భూలోకం పరిభ్రమించు అని శపించారు అశ్వత్థామను.

నిజానికి ఇది ఒక శాపం కాదు వరమే.  అశ్వత్థామ చిరంజీవి. కాబట్టి అతడు తాను చేసిన ఘోరకర్మకు ఫలితాన్ని మరొక జన్మలో‌ అనుభవించటం కుదరదు కాబట్టి ఈ‌ జన్మలోనే‌ అనుభవించాలి.  అలా అశ్వత్థామకు పాపఫలం అనుభవించి పరిశుధ్ధుడయ్యే విధానాన్ని సర్వేశ్వరుడూ సకలకర్మఫలప్రదాత అయిన శ్రీకృష్ణులవారు నిర్ణయించారు.  ఒక పూనకం‌ వచ్చినటుగా తాను అంతటి ఘోరం ఎలా చేసానా అని పశ్చాత్తాపం చెందుతున్న అశ్వత్థామ సంతోషంగా కృష్ణస్వామి నిర్ణయాన్ని ఆమోదించి అంజలించాడు.  ఆ తరువాత తపస్సు చేసుకుందుకు వ్యాసులవారి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.

కలియుగం శ్రీకృష్ణులవారు అవతారం విడచిన రోజున ప్రారంభమైంది.  ఇప్పటికి ఐదువేల యేళ్ళు గడిచాయి.  కాబట్టి అశ్వత్థామ పాపం పోగొట్టుకుని విశుధ్ధుడైపోయి రెండువేల సంవత్సరాల పైచిలుకు అన్నమాట.

అశ్వత్థామ వ్యాసులవెంట తపస్సుకు వెళ్ళటంలో‌ ఒక విశేషం ఉంది.  రాబోయే కాలంలో వేదవ్యాసుడు ఈ‌ అశ్వత్థామయే.

ఒకానొక ఆధునిక యోగిపుంగవుల వృత్తాంతంలో కూడాఈ అశ్వత్థామ ప్రసక్తి వస్తుంది.  ఆయన ఒకసారి అరణ్యంలో దారితప్పి తిరుగుతుంటే ఒక కోయవాడు కనిపించి స్వామీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఆ యోగి ఫలానా శివాలయానికి అడవిగుండా దగ్గరదారి అని బయలుదేరి తప్పిపోయాను అన్నాడు. కోయవాడు నేను దారిచూపుతాను అని కొంతదూరం తీసుకొని వెళ్ళి ఒక కొండ వాలునుండి అదిగో‌ శివాలయం‌ కొండ దిగిపో, తిరిగి ఈ‌ దారిన రాకు అని హెచ్చరించాడు. అయితే యోగికి  హఠాత్తుగా ఒక అనుమానం కలిగింది. నీవా కోయవాడివి నీ భాష స్వఛ్చమైన సంస్కృతం అదేమిటీ అని అడిగాడు. వెనుకగా వస్తున్న కోయవాడు తాపీగా నేను అశ్వత్థామను అని చెప్పాడు. ఆశ్చర్యానందాలతో యోగి వెనుదిరిగి చూస్తే అశ్వత్థామ అక్కడ లేడు.  ఆయన అబ్బురపడుతూ కొండదిగి వెళ్ళాక తెలిసింది తాను నడిచింది ఒక నలభై యేభై కిలోమీటర్ల దూరం అని. తాను మాత్రం ఒక ఘడియలో దాటి వచ్చాడన్న మాట అశ్వత్థామ మహిమవలన!

అందుచేత మహాభారత యుధ్దం ఒక కలియుగారంభానికి ప్రతిపదికగా భగవానుడు నడిపిన ఒక దివ్యకథ అని మన అర్థం చేసుకోవలసి ఉంది.

వ్రాయాలని సంకల్పించి కూడా ఎన్నో విషయాలను వ్రాయకుండానే వదిలి వేశాను. ఎందుకంటే అదంతా వ్రాస్తే ఈ‌ టపా ఒక పుస్తకం అయిపోతుంది కాబట్టి.

4 కామెంట్‌లు:

  1. చాలా మంచి విషయాలు చెప్పేరు. టపా పెద్దదయిందని బాధ పడద్దు.

    రిప్లయితొలగించండి
  2. ఒక దగ్గర "అందుచేత ఉపపాండవులను తొలగించటం దైవసంకల్పం." అన్నారు..
    మళ్ళీ
    "అలా అశ్వత్థామకు పాపఫలం అనుభవించి పరిశుధ్ధుడయ్యే విధానాన్ని సర్వేశ్వరుడూ సకలకర్మఫలప్రదాత అయిన శ్రీకృష్ణులవారు నిర్ణయించారు."

    శ్రీ కృష్ణుడు ఏమి చేసినా ఒప్పు అనేలా ఉంది మీ వ్యవహారం..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్యా, కాయగారూ, మంచి ప్రశ్న వేశారు.
      దీనికి సమాధానం పెద్దది. కాబట్టి విడిగా జవాబు చెబుతాను.


      తొలగించండి
    2. అశ్వత్థామ తక్కువవాడేం కాదు సాక్షాత్ శివ వర ప్రసాదంగా ద్రోణాచార్యులవారికి సంతానంగా వచ్చినవాడు. ధర్మం చెప్పవలసి వచ్చినప్పుడు తానూ ధర్మం మాట్లాడినట్లు కొన్ని చోట్ల భారతంలో ఉంది. ఐతే స్థిరంగా ధర్మాన్ని పట్టుకోలేకపోయాడు, స్వతహాగా అతిశయం కలవాడు, రజోగుణం పెచ్చుమీరినవాడు, ఇటువంటి వారినే దైవీ శక్తులు జగత్పాలనంలో భగవంతుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఉపయోగించుకుంటారు. ఇటువంటి వ్యక్తులు మనకు పురాణాల్లో కనపడుతూ ఉంటారు. అలాగే పుట్టుక రీత్యా జీవనం రీత్యా ఆసురీ ప్రవృత్తి కలిగినా వారిలో ఉండే ఏమంచి గుణాన్నో ఎంచుకొని మంచి కార్యాలకీ నియోగింపబడతారు. అంతే తప్ప ఈ కాలం కథల లాగా పురాణాలకి పక్షపాతం ఉండదు. తప్పెవరు చేసినా తప్పని చెప్తాయి, ఒప్పెవరు చేసినా ఒప్పని చెప్తాయి. ఏ పాత్రని ప్రశ్నించాలీ, ఏపాత్రలోని ఏ గుణవైభవాన్ని ఆదర్శంగా తీసుకోవాలీ అన్నది మన బుద్ధి నిర్ణయం.

      తొలగించండి