16, ఆగస్టు 2013, శుక్రవారం

ప్రథమస్కంధం: 26. పరీక్షిత్తుకు పట్టం కట్టి పాండవులు స్వర్గం చేరుకోవటం.

విధంగా శ్రీకృష్ణావతారం ముగియగానే కలి ఆవరించటం గమనించి ధర్మరాజులవారు, తానూ సోదరులూ కూడా భూలోకం నుండి నిష్క్రమించాలనే, నిశ్చయించుకున్నారు.

పవిత్రనదీ జలాలూ సముద్రజలాలూ తెప్పించారు.  వాటితో వైభవంగా తమకు ఉత్తరాధికారియైన ఉత్తరాభిమన్యుల కుమారుడు విష్ణురాతుణ్ణి (పరీక్షిత్తుని) కౌరవసామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషేకం చేసారు.  అలా ఆ రాజ్యధికారం అనే బాధ్యత తీర్చుకున్నారు.

యాదవరాజ్యానికీ ధర్మరాజుగారే తగిన ఏర్పాటు చేయవలసి వచ్చింది.  యాదవకలహంలో జరిగిన సర్వనాశనం జరగ్గా మిగిలిన రాజ్యాన్ని ధర్మరాజుగారు వ్యవస్థీకృతం చేసారు.  రుక్నిణీకృష్ణుల కుమారుడు ప్రద్యుమ్నుడు.  ఆ ప్రద్యుమ్నునికీ ఆయన భార్య ప్రభావతికీ కుమారుడు అనిరుధ్ధుడు. ఈ ప్రభావతీ ప్రద్యుమ్నులు నిజానికి రతీమన్మధులు. వీరి కుమారుడు అనిరుధ్ధుడు. ఈ‌యన భార్య, బాణాసురుడి కుమార్తె అయిన ఉష.  ఉషానిరుధ్ధుల కుమారుడు వజ్రుడు. ఈ వజ్రునికి ధర్మరాజుగారు మధురకు రాజుగా పట్టం గట్టారు.

పూర్తిగా విరక్తి చెందిన ధర్మరాజుగారు ప్రాజాపత్యం అనే ఇష్టి (యాగం) చేసారు.  బ్రాహ్మణ, క్షత్రియులకు నిత్యం అగ్నిని ఉపాసించవలసిన విధి ఉంటుంది.  ఈ అగ్ని మూడు రకాలుగా ఉంటుంది వీటిని గార్హపత్యం, దక్షిణం, ఆహవనీయం అంటారు. ఇవి వెలుపల ఉండే అగ్నులు.  లోకంలో ధర్మానుష్టానం చేస్తూ యజ్ఞయాగాదులతో సత్కార్యాలు చేయటానికి ఈ మూడు అగ్నులనూ‌ నిత్యం ఉపాసించ వలసి ఉంది. ఇక గృహస్థాశ్రమం నుండి వానప్రస్థం స్వీకరించిన వారు ఈ అగ్నులు మూడింటినీ తమలోనికే అహ్వానం చేసుకుంటారు. ఈ క్రతువుకే‌ ప్రాజాపాత్యం అని పేరు. ఆ తరువాత కర్మ మార్గం వదిలి కేవలం జ్ఞాన మార్గంతో దేహపరిత్యాగం చేస్తారు.

ఇలా అగ్నులను అత్మారోపణం చేసుకుని ధర్మరాజుగారు అహంకారాన్నీ, అన్ని బంధాలను విడిచి పెట్టేసారు.

ఇంద్రియాలన్నింటినీ ప్రవర్తింప చేసేది మనస్సు. అందుచేత వాటిని ఆయన మనస్సులో లీనం చేసుకున్నారు.

మనస్సును ప్రవర్తింప చేసేది ప్రాణం. కాబట్టి మనస్సును ప్రాణంలో లీనం చేసారు.

ఉఛ్శ్వాసానికి కారణం అయిన ప్రాణాన్ని నిశ్వాసానికి కారణం అయిన అపానంలో లయం చేసారు.

దేహాన్ని నిలిపి ఉంచే మృత్యువులో అపానాన్ని విలీనం చేసారు.

ఈ దేహం అనే ఉపాధిస్వరూపంలో మృత్యువును లీనం చేసారు.

దేహాన్ని సత్వరజస్తమో గుణాలలో (త్రిగుణాల్లో) విలీనం చేసారు.

ఈ‌త్రిగుణాల్నీ అవిద్యలో లీనం చేసారు. [అవిద్య అంటే లేని దాన్ని (జగత్తును) ఉందని భావం కల్పించే ప్రజ్ఞ]

ఈ అవిద్యను 'నేను' అనే‌ ప్రజ్ఞాస్వరూపం అయిన జీవుడిలో లీనం చేసారు.

జీవుడుగా స్థితుడైన తనను నిర్వికారమూ నిరంజనమూ అయిన పరబ్రహ్మంలో‌ విలీనం చేసారు.

ఈ విధమైన ధ్యానం చేసి ధర్మరాజుగారు నిస్సంగులై నిలిచారు. వస్త్రాభరణాల పట్ల, శరీరసంస్కారం పట్ల, ఆహారం పట్ల పూర్తిగా అపేక్ష వదిలి పెట్టారు.

ఆయన ఇప్పుడు బయటి ప్రపంచానికి ఒక తెలివి తక్కువ వాడో, మూగవాడో, జడుడో, పిచ్చివాడో అన్నట్లు తోస్తున్నారు.  ఆయనకేదో పిశాచం పట్టిందా అన్నట్లుంది.

క. చిత్తంబున బ్రహ్మము నా
యత్తముఁ గావించికొనుచు విజ్ఞానధనా
యత్తులు దొల్లి వెలింగెడి
యుత్తర దిశ కేఁగె నిర్మలోద్యోగమునన్

పూర్వం‌ పెద్దలు పరబ్రహ్మాన్ని సంస్మరించుకుంటూ ఉత్తరదిశగా హిమాలయాకు తిరిగిరాని ప్రయాణం చేసేవారు. అక్కడే పుణ్యతీర్థాలు సేవించుకుంటూ, తపస్సు చేసుకుంటూ దేహాన్ని వదిలి పెట్టేవారు.  అదే విధంగా ధర్మరాజుగారూ, హిమాలయాకేసి ఉత్తరదిశగా ప్రయాణం సాగించారు

ధర్మరాజుగారి సోదరులు కూడా, అన్నగారి మార్గాన్నే అనుసరించారు. వాళ్ళు కూడా ప్రబలుతున్న కలిని చూసి అన్నగారిలాగే విరక్తిని పొందారు.  వారూ చేయవలసిన ప్రాజాపత్యాదులు చేసి, అన్నగారితో కలిసి నారాయణ స్థానం అయిన హిమాలయాల్లోని బదరికాశ్రమం వైపుగా ప్రయాణం చేసారు.  ఆ బదరికాశ్రమం నారాయణస్థానం అని చెబుతారు.

ద్రౌపదీదేవి కూడా, వారితో పాటే వెళ్ళింది.  కాని పాండవులూ ద్రౌపదీ ఆలూ మగలన్న బంధం ఏమీ లేదు ఇప్పుడు.  ఆవిడ కూడా విష్ణువు నందు మనస్సును లగ్నం చేసి విష్ణుపదానికి వెళ్ళింది.

విదురమహాశయుడు ప్రభాసతీర్థానికి పోయి, చిత్తంలో విష్ణువును ధ్యానిస్తూ శరీరం త్యజించాడు.  ఆయన యమధర్మరాజు కాబట్టి నిజస్థానానికి చేరుకున్నారు.

క. పాండవ కృష్ణుల యానము
పాండురమతి నెవ్వడైన బలికిన విన్నన్
ఖండిత భవుడై హరి దా
సుండై కైవల్యపదంబు సొచ్చు నరేంద్రా.

శుకమహర్షులవారు, పరీక్షిత్తుతో ఇలా చెప్పారు. ఓ‌ మహారాజా, ఎవ్వరైతే శ్రీకృష్ణస్వామివారూ, పాండవులూ‌ భౌతిక శరీరాలను విడచి పరమపదానికి చేరుకున్న విధానాన్ని భక్తితో చదువుతాడో వాడికీ‌ కైవల్యమే. ఈ కథను భక్తితో విన్నా కైవల్యమే.  ఇప్పుడు ఈ‌ సంగతిని సూత పౌరాణికుడు శౌనకాది మునులతో చెప్పారు.

మునులు అందరూ ఈ‌ వృత్తాంతం విని సంతోషించారు.

4 వ్యాఖ్యలు:

 1. అయ్యా ఒకసారి పరిశీలించండి, దేవరాతుడు భీష్ములవారు కదా, పరీక్షిత్తుగారి అసలు పేరు విష్ణురాతుడనుక్కుంటా! దేవరాతుడని పైన చెప్పారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అవును నాగేంద్రగారూ, విష్ణురాతుడే. సరి చేసాను. మీకు నా ధన్యవాదాలు.

   తొలగించు
 2. అన్నట్లు, భీష్ముని నిజనామధేయం కూడా దేవరాతుడు కాదు ఆయన పేరు దేవవ్రతుడు

  ప్రత్యుత్తరంతొలగించు