27, ఆగస్టు 2013, మంగళవారం

ద్వితీయస్కంధం: 01. శుకయోగి భాగవత మహాత్మ్యాన్ని పరీక్షిత్తుకు వివరించటం

జరిగిన కథ:

సూతపౌరాణికుడు నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులకి వ్యాసులవారు రచించిన మహాభాగవత పురాణం చెబుతున్నారు.

హస్తినా పురానికి రాజు పాండవుల మనవడైన పరీక్షిత్తు.  ఆ పరీక్షిన్మహారాజు ఎంతో ధర్మాత్ముడు.  అయినా కాలప్రభావం చేత అడవిలో తపస్సమాథిలో ఉన్న శమీకముని మెడలో చచ్చిన పాముని వేసి అవమానించాడు.  మునికొడుకు శృంగి కోపించి, దుష్టుడైన రాజు తక్షకుడు అనే పాము కరిచి ఏడు రోజుల్లో చనిపోతాడని శపించాడు.  రాజు గంగాతీరంలో ప్రాయోపవేశం చేసి చావుకు సిథ్థపడి ఉంటే అనేక మంది మునులూ,  ఆ తర్వాత వ్యాసులవారి కుమారుడైన శుకయోగీంద్రుడూ ఆ రాజును చూడ వచ్చారు.  నాకు ఈ ఏడు రోజుల్లోనే మోక్షం లబించే దారి ఉందా అని శుకయోగిని రాజు ప్రశ్నించాడు.  

అక్కడితో వెనుకటి ప్రథమస్కంధం సంపన్నం అయింది.  ఇక్కడ నుండి మహాభాగవత పురాణంలో ద్వితీయస్కంధం ప్రారంభం.

---     ---     ---     ---     ---

శుకయోగీంద్రుడికి పరీక్షిత్తు ప్రశ్న సంతోషం కలిగించింది.

సీ. క్షితిప నీ ప్రశ్నంబు శ్రేష్ఠతమం బగు
      నాత్మ విదుల్ మెత్తు రఖిలశుభద
మాకర్ణనీయంబు లయుతసంఖ్యలు గల
     వందు ముఖ్యం బిది యధికతరము
గృహము లోపల గృహమేథు లగు నరు
     లాత్మతత్వము లేశ మైన నెఱుఁగ
రంగనా రతుల నిద్రాసక్తిఁ జను రాత్రి
      పోవు కుంటుంబార్థ బుధ్ధి నహము
ఆ. పశు కళత్ర పుత్ర బాంధవ దేహాది
సంఘ మెల్లఁ‌దమకు సత్య మనుచుఁ
గాఁపురములు సేసి కడపట జత్తురు
కనియుఁ‌ గాన రంతకాల సరణి

మహారాజా, నువ్వు వేసిన ప్రశ్న గొప్పది.  అన్ని ప్రశ్నల్లోకీ అత్యంత ఉత్తమమైన ప్రశ్న ఇదే.  ఆత్మజ్ఞానులందరికీ ఈ‌ ప్రశ్న పరమానందం కలిగిస్తుంది. 

ఈ‌ ప్రశ్నకి మంచి సమాధానమే ఉంది.  అది అన్ని శుభాలనూ‌ కలిగించేదిగా ఉంటుంది సుమా! 

ప్రపంచంలో తెలుసుకో దగినవి అనేకమైన మంచి విషయాలున్నాయి.  అలాంటి తెలుసుకో దగ్గ విషయా లన్నింటి లోనూ,  ఇదే ముఖ్యమైనది.  ఇదే గొప్పది.

ఈ‌ ప్రపంచంలో ఉన్న సాధారణ గృహస్థులకి కొంచెం కూడా ఆత్మజ్ఞానం ఉండదు.  వాళ్ళకి రాత్రుళ్ళన్నీ‌  స్త్రీసుఖంతోనూ నిద్రాసుఖంతోనూ తెల్లారుతూ ఉంటాయి.   వాళ్ళ పగళ్ళన్నీ కుటుంబం కోసం డబ్బు సంపాదించటంతోనే గడిచి పోతూ ఉంటాయి.

వాళ్ళల్లో‌ ప్రతివాడూ,  నా యిల్లో, నా పెండ్లామో, నా బిడ్డలో, నా చుట్టాలో, నా ఒళ్ళో అనుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు.  ఇలా వీళ్ళు ఇవే తమ తమ జీవితాలకు సర్వస్వం అనుకుంటూ,  ఇవే‌ సత్యం అనుకుంటూ కాపురాలు చేసి చస్తూ ఉంటారు.  కాని ఎవరూ నిజం తెలుసుకోరు. 

వాళ్ళ కళ్ళముందే, అనేక మంది పుడుతూ చస్తూ ఉన్నా,  తమకూ ఇదే గతి అని ఎవరూ దృష్టిలో ఉంచుకోరు.  అందరికీ తెలుసు తమ తమ దేహాలు అశాశ్వతమనీ, ఈ‌ బంధాలేవీ నిలిచేవి కావనీ.  అయినా వాళ్ళకి ఈ సంసారలంపటం మీద ఆసక్తి నిలుస్తోంది కాని సత్యం తెలుసుకుందాం అన్న దృష్టి కలగటం లేదు.

ఇక్కడ మనం అర్థం చేసుకోవలసి విషయాలు కొన్ని ఉన్నాయి.  నిద్రాసక్తి అంటే నిద్రకాదు.  నిద్రపోవాలనే కోరిక.  ఇది సోమరితనానికి సూచన.  అలాగే ఇక్కడ ప్రస్తావించిన వాటిలో ఉన్న కుటుంబం, అంగనారతి మొదలైనవి ఆసక్తి ప్రధానంగా ఉన్నప్పుడు అవి బంధాలు.  ధర్మప్రధానంగా ఉన్నప్పుడు సందర్భోచితంగా కర్తవ్య పాలనంలో‌ భాగాలు.  ఇక్కడ శుకమహర్షి మనుషులు ఆసక్తి ప్రధానంగా జీవించి సత్యం మీద దృష్టి పెట్టక సాధారణ జనం చెడిపోతున్నారని ప్రస్తావించారని గ్రహించాలి మనం.

శుక మహర్షి ఇలా అన్నారు.  మహారాజా, ఈ సంసారం సాధారణ జనానికి బంధంగా ఉంది కదా.  దీన్నించి తప్పించు కోవాలంటే ఒక్కటే ఉపాయం.

క. కావున సర్వాత్ముండు మ
హా విభవుఁడు విష్ణుఁ డీశుఁ డాకర్ణింపన్
సేవింపను వర్ణింపను
భావింపను భావ్యుఁ డభవభాజికి నధిపా

కాబట్టి ఆ ఉపాయం విను మహారాజా.  శ్రీమహావిష్ణువు ఈ చరాచర సృష్టికి అధిపతి. అందుచేత ఈ కనిపించేదీ, కనిపించనిదీ అయిన సృష్టి అంతా ఆయన వైభవమే.  ఆ పరమపురుషు డైన విష్ణువుకు సంబంధించిన కథలు వినాలి.  ఆయననే నిత్యం శ్రథ్థాభక్తులతో సేవించాలి.  మిక్కిలి ప్రేమతో ఆ సర్వేశ్వరుడైన విష్ణువునే మనస్సులో నిత్యం భావించాలి.  ఈ సంసార బంధం నుంచి మోక్షం కోరుకునే వాడు ఆయన నామ, రూప, గుణ, కథా వైభవాల కన్నా తన మనస్సులో అనుసంధానం చేసుకో వలసినది మరేమీ లేదు.  భగవత్సంబంధం కానివి తుఛ్ఛవిషయాలు.  వాటికి దూరంగా ఉండాలి.

విష్ణువు అనగా సర్వము నందూ వ్యాపించి ఉన్న వాడు అని అర్థం.  సర్వాత్ముడు అంటే సర్వ చరాచరాల్లోనూ తానుగా ఉన్నవాడు అని అర్థం.  అందుచేత విష్ణువుని వినటం సేవించటం, భావించటం అనే‌ క్రియలు అంటే మనం చరాచరరూపక మైన జగత్తులో అంతటా విష్ణువునే అవగాహనకు తెచ్చుకోవటం అన్నమాట.  సమస్తమైన రూపాల్లో ఉన్న జీవులూ‌ నిర్జీవుల్లోనూ విష్ణువు అంశను దర్శించ కలగాలి.  అన్ని విషయాల్లోనూ విష్ణుతత్వం గ్రహించి సేవించాలి.  పరస్పరం విష్ణుతత్వాన్ని గ్రహించి శ్రవణమననాదులు చేసుకుంటూ ఉండాలి. మనస్సుల్లో ఆ తత్త్వాన్నే‌ భావించాలి నిత్యమూ.  జీవుల్లో 'నేను' అనే‌ ప్రజ్ఞగా ఉన్నది విష్ణువే అని తెలుసుకోవాలి.  ఇదే మోక్షార్థికి ముఖ్యం అని శుకమహర్షి భావం.

శుకయోగి ఈ సందర్భంగా సాంఖ్యయోగాన్ని ప్రస్తావిస్తున్నారు.  మహారాజా,

ఆ. జనుల కెల్ల శుభము సాంఖ్యయోగము దాని
వలన ధర్మనిష్ఠవలన నయిన
నంతకాల మందు హరిచింత  సేయుట
పుట్టువులకు ఫలము భూవరేంద్ర

ఈ విధంగా విష్ణుతత్వంలో నిలవటానికి సాంఖ్యయోగం చక్కగా ఉపయోగ పడుతుంది.  ఈ‌ సాంఖ్యయోగం వలన ధర్మనిష్ఠ కలుగుతుంది. దానివలన హరి చింత చేయటానికి చిత్తానికి ఇబ్బందులు తొలగుతాయి.  మరణసమయంలో హరిచింత నిలుస్తుంది మనస్సులో.  ఇదే జన్మం ఎత్తినందుకు సాఫల్యత.

సాంఖ్యం అంటే వ్యక్తికి అతీకమైన జ్ఞానం. యుజ్ సంధానే అని అర్థం - అంటే ఇక్కడ జ్ఞానాన్ని ధర్మాశ్రయం ఐన కర్మతో సంధానించటం అన్న మాట సాంఖ్యయోగం‌ అంటే.   జ్ఞానం, కర్మాచరణం అనేవి రెండు చేతుల వంటివి.  ఈ రెండూ‌ సమన్వయంతో పని చేయాలి.  అలాంటప్పుడే చివరిక్షణాల్లో నారాయణస్మరణ చేయగలిగే చిత్తవృత్తి కలుగుతుంది.

తే. అరసి నిర్గుణ బ్రహ్మంబు నాశ్రయించి
విధినిషేధవృత్తి సద్విమలమతులు
సేయు చుందురు  హరిగుణచింతనములు
మానసంబుల నే‌ ప్రొద్దు మానవేంద్ర

రాజా,  సత్పురుషులు, ఈ‌ ప్రపంచంలో ఏది చేయ దగినదీ, ఏది చేయదగనిదీ అన్న ధర్మం (ధర్మం ఈ విధి-నిషేధాల రూపంలో ఉంటుంది) తెలిసి ప్రవర్తించే వారు కాబట్టి వారిని ఈ‌ ఐహిక జగత్తు బాధించలేదు.  సర్వకాల సర్వావస్థల్లోనూ వాళ్ళు నిశ్చింతగా నిర్గుణబ్రహ్మాన్ని ఆశ్రయించి, మనస్సుల్లో శ్రీహరి దివ్యగుణాల్ని భావన చేస్తూ ఉంటారు. 

మహారాజా,  నా తండ్రిగారు వేదవ్యాసుడు.  ఆయన ద్వాపర యుగం చివర్లో ఈ వేదం వంటి భాగవతాన్ని రచించారు.  అది సాక్షాత్తూ పరబ్రహ్మస్వరూపం ఐన కృతి.  దానిని నా చేత మా నాన్నగారు చదివించారు.  మనస్సును పరబ్రహ్మానికి అర్పించి ఈ గ్రంథాన్ని పఠించాను నేను.   ఈ‌ భాగవతంలో అన్నీ ఉత్తమోత్తమమైన కథలే.  నువ్వు కూడా విష్ణుభక్తుడివి.  అందుచేత ఆ భాగవతాన్ని నీకు వినిపిస్తాను.  దీన్ని వినటం వలన నీ విష్ణుగతం అయిన బుధ్ధి మరింత ధృఢం అవుతుంది.
 
ఆ. మోక్షకామునకును మోక్షంబు సిథ్థించు
భవభయంబు లెల్ల బాసి పోవు
యోగి సంఘమునకు నుత్తమ వ్రతములు
వాసుదేవ నామ వర్ణనములు

ఈ భాగవతం శ్రథ్థాభక్తులతో వినటం వలన మోక్షం కోరుకునే వాడికి తప్పక మోక్షం లభిస్తుంది.  మళ్ళీ మళ్ళీ పుట్టటం చావటం అనే మహాభయం నుంచి విముక్తి కలుగుతుంది.  భగవంతుడైన విష్ణువు యొక్క దివ్యనామ స్మరణంతో‌ కూడుకున్న ఈ కథలు వినటం అనేదే యోగులైన వాళ్ళకు ఉత్తమమైన వ్రతదీక్ష.

అందుచేత అటువంటి యోగులు అతి స్వల్పకాలంలోనే మోక్షం సాధించగలరు.

2 వ్యాఖ్యలు:

  1. మా చేత భాగవతం పారాయణ చేయిస్తూ, "ప్రథమస్కంధం సంపన్నం" అని అప్పుడే ఒకస్కంధం పూర్తిచేయించినందుకు కృతజ్ఞతలు...

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ద్వీతీయ స్కందం అపూర్వారంభం! తమ దయ చేత పద్యాన్ని వచనంగా చదవగలుగుతున్నందుకు ధన్యవాదాలు

    ప్రత్యుత్తరంతొలగించు