24, ఆగస్టు 2013, శనివారం

ప్రథమస్కంధం: 34. పరీక్షిత్తు గంగాతీరంలో ప్రాయోపవేశం‌ చేయటం.

ఆ వార్త విని పరీక్షిత్తు చాలా విచారపడ్డాడు.  రాజుగా విషయసుఖాలలో ములిగి తేలుతున్న తనకు ఇదేదో ప్రపంచం‌ పట్ల విరక్తి కలిగించటానికే వచ్చింది అనుకున్నాడు.  హస్తినాపురానికి పోయి ఏకాంతంగా కూర్చుని ఆలోచనలో పడ్డాడు.

ఉ. ఏటికి వేఁట వోయితి మునీంద్రుఁడు గాఢసమాధి నుండగా
నేటికిఁ దద్భుజాగ్రమున నేసితి సర్పశవంబుఁ దెచ్చి నే
నేటికిఁ బాపసాహసము లీక్రియఁ జేసితి దైవయోగమున్
దాఁటగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై

తీరి కూర్చుని నేనీ వేటకు ఎందుకు వెళ్ళానూ, వేటకని వెళ్ళిన వాడిని గాఢమైన ధ్యానసమాథిలో ఉన్న మహాముని మెళ్ళో ఒక పాము కళేబరం ఎందుకు తెచ్చి వేసానూ,  అసలు ఇలాంటి పాపపు బుధ్ధి నాకు పుట్టటం అనేది దైవసంకల్పం కాక మరేమిటీ,  నా చేతుల్తో ఇలాంటి పనులు చేస్తానని కల్లో కూడా ఊహించలేనే అని బాధపడ్డాడు.  సరే, దేవుడి అనుగ్రహం ఇలా ఉంది, ఏం చేస్తాం.  కీడు మూడటం‌ తప్పదు అని నిశ్చయించుకున్నాడు.

ఛీ.  పాము కరిచి ఈ‌ ప్రాణాలు పోతే పోతాయి. పోక అవి శాశ్వతమా?

ఈ రాజ్యం శాశ్వతమా? రాజభోగాలు శాశ్వతమా?  అవి ఇప్పుడే పోయినా రేపు పోయినా,  పోవటం నిశ్చయం కదా?

ఈ జీవితం అనేది ఒక మెరుపు తీగలా తళుక్కుమని మాయమయ్యేదే కాని జీవుడు దాన్ని స్థిరం అని నమ్ముకోవటం  కుదురుతుందా?

అయిందేదో అయింది.  అంతా భగవత్సంకల్పం.

ఆ మునికుమారుణ్ణి  ఎందుకు తిరిగి శపించటం.  అదొక పాపం కూడా మూట కట్టుకోవాలా?

ఔరా,  మంచినీళ్ళు కావాలని వాళ్ళ ఆశ్రమానికి పోయాను.  నేను రాజుననే గర్వంతో ప్రవర్తించటం తప్పుకదా? ఆ కుర్రవాడి ఇంటికి పోయి, అతని తండ్రి మెడలో పాము శవం‌ పడేస్తే, చచ్చేటట్లు తిట్టడా మరి?

అందుచేత.మునికుమారుడి తప్పేం లేదూ అని పరీక్షిత్తు అనుకున్నాడు.  తిరిగి శపించగల సమర్థత ఉన్న రాజర్షి ఆ పరీక్షిన్మహారాజు.  ఏదో గ్రహపాటుగా ఒక అకృత్యం చేసి ఉండవచ్చు గాని ఆ రాజు నిశ్చయంగా కామక్రోధాది అరిషడ్వర్గాన్నీ జయించిన మహానుభావుడు.  కాబట్టి మునికుమారుడి తొందరపాటుకి అలిగి తిరిగి శపించకుండా ఊరుకున్నాడు.

పరీక్షిన్మహారాజుకు తగిలిన శాపం గురించి తెలిసి తక్షకుడు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు!  అతణ్ణి శాపం అలా ప్రేరేపిస్తోంది మరి. తప్పుతుందా?

ఇక్కడ పరీక్షిత్తు నేటికి ఏడవ నాడు తనకు మరణం నిశ్చయం అని తెలిసి,  ఇంక తుఛ్ఛమైన ప్రపంచసుఖాలు చాలు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు.  రాజ్యం విసర్జించాడు.  నిరశన దీక్ష పట్టాడు.

మ. తులసీసంయుతదైత్యజిత్పదరజస్తోమంబుకంటెన్ మహో
జ్వలమై దిక్పతిసంఘసంయుతజగత్సౌభాగ్యసంధాయియై
కలిదోషావలి నెల్లఁ బాపు దివిషద్గంగాప్రవాహంబులో
పలికిం బోయి మరిష్యమాణుఁ‌ డగుచుం బ్రాయోపవేశంబునన్

తిన్నగా గంగానది లోపల ఉన్న ఒక ద్వీపంలో ప్రాయోపవేశం‌ చేసి కూర్చున్నాడు.  ఆ గంగా నది ఎటువంటి దనుకున్నారు?  తులసీదళాలతో కూడిన శ్రీమహావిష్ణువు పాదరేణువుల కన్నా హెచ్చు ప్రభావం‌ కలది గంగ.  సమస్త దిక్పాలకులతో‌ సహా అన్ని లోకాలకూ సౌభాగ్యం ప్రసాదించేది గంగ.  కలి వల్ల కలిగే దోషాలు అన్నీ నిర్మూలించేది గంగ.  అలాంటి గంగా ప్రవాహం  లోపలికి పరీక్షిత్తు వెళ్ళాడు.  శాపం‌ కారణంగా పాము కాటు వల్ల వచ్చే‌ మరణం కోసం ఎదురుచూస్తూ ఆ పరీక్షిత్తు ప్రాయోపవేశ దీక్ష పట్టి కూర్చున్నాడు.

అవునూ గంగను విష్ణువుకు అతి ప్రియమైన తులసి కన్నా, ఆ తులసి దళాలతో కలసి ఉన్న ఆ విష్ణుపాదాల ధూళి కన్నా పరమ ప్రకాశమానం అని ఎందుకన్నారూ అని అను మానం వస్తోంది కదా? 

భగవానుడి పాదాల వద్ద తులసి అయినా ఆయన పాదధూళి అయినా ఆ రెండూ కలిసిన దివ్యప్రసాదం అయినా సరే అది కేవలం భగవంతుడిని నమ్మి కొలిచి దాన్ని పొందిన వాళ్ళను మాత్రమే అనుగ్రహిస్తుంది. 

గంగా నది మరింత గొప్పది.  అది విష్ణుపాదాల దగ్గర పుట్టింది.  అందుకే గంగను విష్ణువుకు కూతురు అని చెబుతారు. ఆ గంగ అఖిలలోకాల్లోనూ‌ ప్రవహిస్తోంది. గంగలో ఎవరు ములిగినా వాళ్ళ పాపాలన్నీ‌ ప్రక్షాళనం ఐపోతాయి.  వాళ్ళు విష్ణుభక్తి కలవారా అది ఏమాత్రం లేనివారా,  అసలు విష్ణువు పేరే వినని వారా,  విష్ణుద్వేషులా అన్న విచక్షణ ఏమీ చూపకుండా తనని సేవించిన వారికి అందరికీ పాపాల నుండి విమోచనం తప్పకుండా అనుగ్రహిస్తుంది గంగ.

తులసి అయినా విష్ణువు పాదధూళి అయినా మనం దానికోసం వెళ్ళి తెచ్చుకోవాలి.  గంగ ఎంత దయామయి.  మన కోసం ఎంతో కష్టపడుతూ అన్ని లోకాలు తిరుగుతోంది మన పాపాలు కడగటానికి మన వద్దకే వస్తూ.  అలా దిక్పాలకులకూ, అతిసామాన్యూలకూ ఒకే విధంగా అందుబాటులో ఉన్న మహా పుణ్యప్రదాయినీ పాపమోచనీ ఈ గంగ.

కలియుగంలో భక్తి కుదరటమే అరుదు. అందునా అది చక్కగా కుదిరి విష్ణువు పాదధూళి అదీ ఆయన పాదాల దగ్గర ఉండే తులసితో కలసి లభించటం దుర్లభం.  కాని కలియుగం అయినా మనమధ్యనే ఉంటోంది గంగ.  మనం‌ పోయి సేవిస్తే చాలు ఈ‌ కలి ప్రభావం వల్ల మనం చేసే తప్పులన్నీ తుడిచి పెట్టే చల్లని తల్లి గంగ.

మరొక సంగతి కూడా చెప్తారు పెద్దలు.  శ్రీమహావిష్ణువుకు చెందిన తులసి ఐనా పాదధూళీ ఐనా మనం సంపాదించి తలను పెట్టుకోవాలి.  అలా వాటిని సేవిస్తే అవి పాపనాశనం చేస్తాయి.  గంగాస్నానం చేస్తే పాపనాశనం అన్నారు కాని ఒక్కొక్క పరిస్థితిలో మానవులకి గంగానదిని చేరి స్నానం చేసే అవకాశం ఉండదు. ఉదాహరణకు, గంగాస్నానం కోసం ఉవ్విళ్ళూరే ఒక ముసలావిడ ఉంది.  కాశీ తీసు కెళ్ళండర్రా, గంగాస్నానం చేసి వస్తానూ అని ఆవిడ మొత్తుకుంటుంది.  కొడుకులకూ, మనవళ్ళకూ చాలా సైట్ సీయింగ్‌లకు వెళ్ళేందుకు తీరిక దొరుకుతుంది.  ముసలావిడను కాశీకి తీసుకేళ్ళేందుకు మాత్రం మనసు రాదు.  ఆవిడ ప్రాణం ఎంత కొట్టుకులాడినా ఫలితం లేదు.  మరొక ఆసామీ ఉంటాడు.  గంగా స్నానం చేయాలీ అని ఉబలాటం.  తీరిక లేని జీవితం.  ఎలాగో‌ అలా తీరిక చిక్కించుకుని,  అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాడో లేదో, వెంటనే ఏదో అవాంతరం వచ్చి అది కాస్తా వీలు పడదు.  కాశీ వెళ్ళటానికి, మరొకసారి  ప్రయత్నం చేస్తున్నాడు.  ఈ‌లోగా ప్రాణం మీదకి వచ్చింది ఏదో మాయదారి జబ్బు చేసి.  మరి ఇలాంటి జీవుళ్ళు ఉసూరు మని ఊరుకోవటమేనా?  అలా నిరాశ అక్కర్లేదని పెద్దల మాట.  ఇటువంటి వాళ్ళకి ఒక తరుణోపాయం ఉంది.  అమ్మా, గంగాభవానీ, నీ దగ్గరకు రాలేని పరిస్థితి తల్లీ, నన్ను కటాక్షించూ, అని మనసారా గంగమ్మను వేడుకుంటేనే చాలట!  వెంటనే గంగమ్మతల్లి ఆ అభాగ్యజీవికి స్నానఫలం అనుగ్రహించేస్తుందట.   చిత్రగుప్తుడు. ఆ జీవి చిట్టాలో ఫలాని సమయంలో గంగాస్నానం చేసెను అని రాసి అండర్‌లైన్ చేసేస్తాడట.

అందుకే అలా చెప్పారు గంగ గురించి.

అలా ప్రాయోపవేశం చేసి ఆ విష్ణుభక్తుడైన పరీక్షిత్తు తన మనస్సును ఇహ ప్రపంచం నుండి మరలించి, కేవలం‌ విష్ణువు మీదే నిలిపి ఉంచాడు.  ఇంక చావవలసి వస్తోందే అనే విచారమూ, చావు రోజుల్లో ఉందీ అన్న కంగారూ ఏమీ లేకుండా హాయిగా అన్ని సంగాలూ విసర్జించి కూర్చున్నాడు.

అరెరే, ఇలా పరీక్షిత్తు శాపం పొందాడే అని వార్త  తెలిసిన అనేక మంది మహర్షులు ఆయన్ను పరామర్శించటానికి ఆ గంగ దగ్గరకు వచ్చారు.

అత్రి, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, భృగువు, వశిష్టుడు, పరాశరుడు, చ్యవనుడు, భరద్వాజుడు, పరశురాముడు, దేవలుడు, గౌతముడు, కశ్యపుడు, కవషుడు, కణ్వుడు, అగస్త్యుడు, వ్యాసుడు, పర్వతుడు, నారదుడు, అరుణుడు మొదలైన గొప్ప గొప్ప ఋషులు అక్కడికి వచ్చారు. వాళ్ళ వెంబడి వాళ్ళ శిష్యులూ,  ఆ శిష్యుల శిష్యులూ కూడా వచ్చారు.

పరీక్షిత్తుకు చాలా ఆనందం కలిగింది.  ఆ వచ్చిన మహాత్ములు అందరికీ మ్రొక్కాడు.

అయ్యలారా,  ఓపిక చచ్చి, ఉచితం మరచి, మునీశ్వరుడి మెడలో పాముని వేసిన పాపిని నేను. ఈ మహాపాపం నుంచి నాకు ఎలా విముక్తి దొరుకుతుందో దయచేసి చెప్పండి.

అయినా తపస్సంపన్నులూ, మహాత్ములూ అయిన మీ‌ పాదధూళి సోకి నా పాపం అంతా పోయినట్లే అనుకుంటాను.  నా జన్మ ధన్యం అయింది.  ఇప్పుడు చావు నా వాకిట్లోకి వచ్చి కూర్చుంది.  ఆట్టే వ్యవధి లేదు.  తొందరగా నాకు మోక్షం లభించే ఉపాయం ఎదైనా దయచేసి వెంటనే చెప్పండి.

ఈ సంసార తాపత్రయంతో విసిగి పోయాను నేను.  ఇప్పుడు ఈ‌ తక్షకుడి విషం నాకు మోక్షానికి దారి చూపాలి మరి.  ఆ పిల్లవాడు నా పాలిటి విష్ణువే అనుకుంటాను.  ఆ అబ్బాయి పుణ్యమా అని నాకు వైరాగ్యం కలిగి హరిచింతన స్థిరంగా ఉంది ఇప్పుడు.

మ. ఉరగాధీశు విషానలంబునకు మే నొప్పింతు శంకింప నీ
శ్వర సంకల్పము నేఁడు మానదు భవిష్యజ్జన్మజన్మంబులన్
హరిచింతారతియున్ హరిప్రణుతిభాషాకర్ణ నాసక్తియున్
హరిపాదాంబుజసేవయుం గలుగ మీ రర్థిం బ్రసాదింపరే

ఈశ్వరుడి సంకల్పం ఇలా ఉంది.  తప్పదు.  నిశ్చింతగా పాముకాటుకి నా శరీరం అప్పగించేస్తాను. అందులో అనుమానం లేదు.

ఈ‌ జన్మకు ముక్తి దొరుకుతుందో లేదో!  ఒక వేళ దొరక్కపోతే?

రాబోయే అన్ని జన్మల్లోనూ నాకు నిత్యం విష్ణువు పట్ల ధ్యానం నిలచి ఉండేటట్లుగా అనుగ్రహించాలి మీరు.

ఆ జన్మలన్నింట్లోనూ నాకు విష్ణుకీర్తనం‌ పట్లా, విష్ణుసంబంధమైన సంభాషణల పట్లా గాఢమైన అనురక్తి ఉండేటట్లు మీరు అనుగ్రహించండి.

ఆ జన్మలన్నింట్లోనూ కూడా నిత్యం విష్ణుపాదాలు సేవించుకోవటం అనే అదృష్టం కలిగేటట్లుగా మీరు అనుగ్రహించండి.

మహర్షులారా దయచేసి నాకేది శుభం కలిగిస్తుందో అలోచించండి.  ఏ విధంగా నాకు ముక్తి కలుగుతుందో ఆలోచించండి.  నాకు ఉన్నది ఈ‌ ఏడు రోజుల వ్యవధి మాత్రమే.  ఈ కొద్ది రోజులూ‌ మీరు నాకు భగవంతుడైన శ్రీహరి కీర్తనలు వినిపించండి.  శ్రీహరి భక్తుల కథలు చెప్పండి.

ఇలా ఆ మహర్షులను అనేక విధాలుగా ప్రాధేయపడ్డాడు.  గంగకేసి తిరిగి

క. అమ్మా నినుఁ జూచిన నరుఁ
బొమ్మా యని ముక్తి కడఁకుఁ బుత్తు వఁట కృపన్
లెమ్మా నీ‌ రూపముతో
రమ్మా నా కెదుర గంగ రమ్యతరంగా

అయ్యా గంగమ్మ తల్లీ! నిన్ను నోరారా భక్తితో అమ్మా అని పిలిచిన మనుష్యుణ్ణి పోరా పో నీకు మోక్షం వచ్చింది అని చెప్పి పంపుతావట కదా? అమ్మా లే, దయతో నీ‌ దివ్యస్వరూపంతో నా ఎదురుగా వచ్చి కనబడవమ్మా!

అని గంగను వేడుకున్నాడు పరీక్షిత్తు.  జన్మజన్మల్లోనూ‌ నాకు హరిభక్తి స్థిరంగా ఉండాలీ అని గంగనీళ్ళు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసాడు.

తన కొడుకు జనమేజయుణ్ణి పిలిపించి, అతనికి రాజ్యభారం అప్పగించేసాడు.

అప్పుడొక అద్భుతం జరిగింది.

1 కామెంట్‌:

  1. క. అమ్మా నినుఁ జూచిన నరుఁ
    బొమ్మా యని ముక్తి కడఁకుఁ బుత్తు వఁట కృపన్
    లెమ్మా నీ‌ రూపముతో
    రమ్మా నా కెదుర గంగ రమ్యతరంగా

    గొప్ప పద్యం కఠస్థం చేయవలసినది.

    రిప్లయితొలగించండి