22, ఆగస్టు 2013, గురువారం

ప్రథమస్కంధం: 32. శృంగి అనే మునికుమారుడు పరీక్షిత్తును శపించటం

ఈ యుగానికే‌ అధిపతి కలి . అమిత ధర్మాత్ముడూ,  సాక్షాత్తూ ఆ కలి నే అదిలించి వెళ్ళగొట్ట గలిగిన మహా తేజశ్శాలీ ఈ పరీక్షిత్తు.

అలాంటి పరీక్షిత్తును,  ఒక ముని బాలుడు శపించాడు.  ఏడు రోజుల్లో తక్షకుడనే నాగరాజు వచ్చి కరిచి చంపుతాడూ అని ఘోరంగా శపించాడు.

ఆశ్చర్యాల్లో కెల్లా ఆశ్చర్యం, ఒక మహాధర్మప్రభువుకి అంతటి శాపం తగలటం.  అదెలా జరిగిందో వినండి.

రాజులకు మృగయావినోదం అని ఒక కాలక్షేపం ఉంటుంది.  కర్మం కాలితే అది అప్పుడప్పుడు వాళ్ళకే ప్రాణాంతకం అవుతుంది కూడా.  పరీక్షిత్తు విషయంలో సరిగ్గా,  అదే జరిగింది.  అందరు రాజుల్లాగే అప్పుడప్పుడు ఈ‌ పరీక్షిన్మహారాజుగారూ వేటకు పోయేవాడు.  ఒకసారి ఆయన వేటలాడి బాగా అలసి పోతే విపరీతం ఐన దాహం పుట్టింది.

చుట్టుపక్కల ఎక్కడా నీటి జాడ ఒక్క బొట్టు కూడా కనబడ లేదు.  ఎలా కనబడుతుందీ విధి తరుము కొస్తుంటే?  దాహంతో తహతహ లాడిపోతూ ఆయన నీళ్ళ కోసం గాలిస్తూంటే,  ఒక చోట ఒక తపోవనం‌ కనిపించింది.   అమ్మయ్య బతికాం అనుకున్నాడు.

అక్కడ చూస్తే ఒక చెట్టు కింద ఒక శమీకుడు అనే మునీంద్రుడున్నాడు.  ఎలా ఉన్నా డనుకున్నారు?

సీ. మెలగుట చాలించి మీలిత నేత్రుఁడై
      శాంతుఁడై కూర్చుండి జడత లేక
ప్రాణమనోబుధ్ధిపంచేంద్రియంబుల
      బహిరంగవీథులఁ బాఱనీక
జాగరణాదిక స్థానత్రయము దాఁటి
      పరమమై యుండెడి పదముఁ దెలిసి
బ్రహ్మభూతత్వసంప్రాప్తి విక్రియుఁ డయి
      యతిదీర్ఘజటలు దన్నావరింప
తే. నలఘురురుచర్మధారియై యలరుచున్న
తపిసిఁ బొడగని శోషిత తాలుఁ డగుచు
నెండి తడి లేక కుత్తుకఁ నెలుగు డింద
మందభాషల నిట్లను మనుజవిభుఁడు

ఆ మహర్షి అసలు మన లోకంలో‌ లేడు! కళ్ళు మూసుకుని శాంతంగా కూర్చుని ధ్యానంలో ములిగిపోయి ఉన్నాడు.  ఆయన ముఖం ఏమీ మందకొడిగా నిద్రమత్తు మనిషి ముఖంలా లేదు. దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తోంది.

పంచప్రాణాలూ, మనస్సూ, బుధ్ధీ, అహంకారమూ, చిత్తమూ అనే‌ అంతఃకరణ చతుష్టయాన్నీ, బయటి ప్రపంచం నుంచి పూర్తిగా ఉపసంహరించి వేసాడు.

మెలకువా, నిద్రా, స్వప్నమూ అనే మూడు అవస్థలూ దాటి ఆయన చిట్టచివరిది అయిన అవస్థలో పరమపదంలో విహరిస్తూ ఉన్నాడు.

ఆయన కేవలం బ్రహ్మానందంలో ములిగిపోయి ఉండటం చేత ఈ ప్రకృతి వికారాలకి అందనంత దూరంలో ఉన్నాడు.  బాహ్యక్రియలు ఏమీ లేవు ఆయనకు.

ఆయన కేశసంపద అంతా జటలు కట్టి పొడుగ్గా ఒంటి మీద వేళ్ళాడుతోంది.  ఆయన ఒంటిమీద ఉన్న ఆఛ్ఛాదనం అల్లా పెద్ద లేడి చర్మం ఒక్కటే.

పరీక్షిత్తు ఇదంతా గమనించే పరిస్థితిలో లేనేలేడు.  ఆయనకు దాహంతో ప్రాణాలు కడబట్టి పోతున్నాయి.  గొంతు ఎండి పోయి నోట మాట  రావటం కూడా గగనంగా ఉంది.

నీళ్ళు!  నీళ్ళు!  అవి వెంటనే‌ గొంతులో పడకపోతే చచ్చేలా ఉంది ఆయన దీనస్థితి.

ఎలాగో అలా గొంతు పెకలించుకుని మెల్లగా హీనస్వరంతో‌ ఆ ఋషితో మాట్లాడాడు పరీక్షిత్తు.

ఓ మహర్షీవర్యా దయచేసి నాకు తాగటానికి కొన్ని నీళ్ళు ఇప్పించి పుణ్యం కట్టుకోండి. వేటలాడుతూ మా వాళ్ళ నుంచి దూరంగా వచ్చేసాను. దాహబాధతో నా ప్రాణాలు పోయే లాగ ఉన్నాయి.  మీ  తపస్సుకు ఇబ్బంది కలిగితే మన్నించండి.  దయచేసి నా దాహంతీర్చి రక్షించండి.

ఇలా చాలా వినయంగా పరీక్ష్తిత్తు ఆ మునిని వేడుకున్నాడు.  కాని ఆ మునీంద్రుడు బయటి ప్రపంచంతో ఏమీ సంబంధం లేకుండా ఉన్నాడాయె. ఈ రాజూ గట్టిగా అరిచి చెప్పే స్థితిలోనూ లేడాయె.  పాపం రాజుగారు పదే పదే‌ వేడుకున్నా,  శ్రీహరి ధ్యానంలో ఒళ్ళు మరిచి ఉన్న ఆ మునికి,  ఆ మాటలు వినిపించనే లేదు.

రాజుగారికి వింతగా అనిపించింది.  ఏం ముని!?  ఎంత ప్రాధేయ పడినా ప్రాణం పోయేలా ఉన్న వాడికి ఇన్ని నీళ్ళ చుక్కలు పోయటానికీ ఈ‌యనకి మనసు రాదేం! అనిపించింది పరీక్షిత్తుకు.

అసలే ఆయన తహతహ లాడుతున్నాడు.  ఒక వైపు విపరీతమైన అలసట. మరొక వైపు నోరు పిడచకట్టుకుని పోయింది దాహంతో.  కొంచెం సేపట్లో ప్రాణం పోతుందీ‌ అన్నంత దేహబాధ.

ఎలాంటి వారికీ,  మనిషి జన్మం ఎత్తాక, ప్రాణప్రమాదంలో ఉన్నవాడికి చేతనైనంతగా సహాయపడటం కర్తవ్యం. అలాంటిది ముని తనను పట్టించుకోక కళ్ళు మూసుకుని ఉండటం రాజుకు కోపం తెప్పించింది.

ఈ  మునికి ఎంత గర్వం! ఎక్కడి బ్రాహ్మడు వీడు. కళ్ళు తెరవడు.  మాట్లాడకూడదని నియమం ఉంటే పోనీ చేతితో నైన సైగ చేయకూడదా? కాసిని నీళ్ళు పోయకూడదా?  అరిగిపోతాడా? అశ్రమంలోంచి ఇన్ని నీళ్ళూ కాసిని పళ్ళూ‌ తెచ్చి ఇస్తే ఈ‌యన మహా తపస్సు భగ్నం ఐపోతుందా?  ఈ‌యన తపస్సు పేరుతో సంపాదించింది ఇలాంటి అమర్యాద యేనా?  ఇదెక్కడి తపస్సు అని చాలా కోపంతోనూ‌ బాధతోనూ విసుక్కున్నాడు.  

పరీక్షిత్తుకు కాలం తోసుకు వచ్చింది.  ఎన్నడు లేనిది ఆయనకు ఆ మునిది దొంగ తపస్సు అనిపించింది కాబోలు! ఈ టక్కరి ముని గర్వాన్ని అణిచి బుధ్ధి చెప్పాలీ అనుకున్నాడు.

చ. అని మనుజేశ్వరుండు మృగయాపరిబేధనితాంతదాహసం
జనితదురంత రోషమున సంయమి దన్నుఁ దిరస్కరించి పూ
జనములు సేయు నంచు మృతసర్పము నొక్కటి వింటి కొప్పునం
బనివడి తెచ్చి వైచె నటు బ్రహ్మమునీంద్రునియంసవేదికన్

రాజుకు అలసటా, దాహబాధలకు తోడుగా ముని అమర్యాదగా ప్రవర్తించినట్లు తోచటంతో రోషం పుట్టింది. అటూ ఇటూ చూసాడు. కొంచెం దూరంలో ఒక చచ్చిన పాము పడి ఉంది.  తన విల్లుకొనతో‌దానిని పైకెత్తి తీసుకు వచ్చాడు. దాన్ని ఆ ముని మెడలో వేసాడు.

కృధ్ధో హన్యాత్ గురూ నపి.  కోపంతో ఒళ్ళు మరిచిపోతే మనం ఏం చేస్తున్నదీ మనకే తెలియదు. భారవి అనే ఒక మహాకవి ఉండే వాడు.  ఆయనకు చిన్నవయసులోనే అఖండగా కీర్తి వచ్చింది.  ఊరంతా పొగిడే వారు. తండ్రి మాత్రం, వాడి మొహం వాడికే తెలుసూ, చిన్నపిల్లాడూ, అనే‌వాడు. ఒకసారి, రాజుగారే పిలిచి భారవిని ఘనంగా సన్మానించారు. మళ్ళీ అంతా బ్రహ్మరథం పట్టినా తండ్రిమాత్రం చప్పరించేసాడు.  భారవికి ఒళ్ళు మండి వివేకం పోయింది కోపంతో.  పెద్ద రాతి పొత్రం తీసుకుని అటక మీద కూర్చున్నాడు.  సమయం చూసి తండ్రి నెత్తిమీద పడేద్దామని. అదృష్టం బాగుండి, ఈ‌ పిల్లకవి ఆ పని చేయక ముందే, భారవి తండ్రిగారు భార్యతో "తల్లిదండ్రులు పిల్లల్ని పొగడితే బిడ్డలకు ఆయుక్షీణం"అన్న మాటలు విన్నాడు. తనకి తెలియనిదా? కోపంలో తట్టలేదు. చూసారా కోపం ఎంత పని చేయిస్తుందో! భారవి పోయి  తండ్రి కాళ్ళ మీద పడి ఏడ్చాడు.  మిగతా కథ చెప్పుకోవటానికి ఇది సందర్భం కాదు.  అందుచేత చదువరులకు మనవి చేసేది ఏమిటంటే, కోపం మహా చెడ్దదీ, వివేకాన్ని చంపుతుందీ - ప్రమాదం సుమా అన్న సంగతి ఎప్పుడు మరవకూడదూ అని.

ఇలా ముని శమీకుడి మెడలో పాము కళేబరం వేసి, దొంగమునికి శాస్తి చేసానని భావించి పరీక్షిత్తు అక్కండి నుంచి వెళ్ళిపోయాడు.

కొందరు మునికుమారుల కంటిలో ఈ‌ దుశ్చేష్ట పడనే‌ పడింది. వాళ్ళు పోయి కొంచెం దూరంలో వేరే పిల్లలతో ఆడుకుంటున్న శమీకుడి కొడుకైన శృంగితో ఈ విషయం చెప్పారు.  ఎవరో రాజు, మీ నాన్నగారి మెడలో ఒక చచ్చిన పామును వేసి వెళ్ళిపోయాడూ అని. 

శృంగికి చాలా కోపం వచ్చింది.  రాదూ‌ మరి.  చిన్న వయస్సులో ఉన్న వాడు. తండ్రికి అవమానం జరిగితే బాధపడడా? కోపపడడా?

సాటి మునికుమారులతో శృంగి ఇలా అన్నాడు.  వేదం ఏం చెబుతోందీ?  పూర్వం బ్రాహ్మణులే రాజుల్ని భూమికి పాలకులుగా నియమించారని కదా?  ఈ‌ రాజులు ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చే డబ్బుతో ప్రభుత్వం వెలిగిస్తున్నారు.  ఆ ప్రజలిచ్చే డబ్బుతో విలాసంగా జీవిస్తూ ఎంగిలి మెతుకులు తినే‌ కాకుల్లా బతుకుతున్నారు.  ప్రజలు గుమ్మాలకు కుక్కల్లాగా కాపలా ఉంటున్నారు.  అలాంటి వీళ్ళు బ్రహ్మద్రోహానికే తెగిస్తారా?

కళ్ళూ ముక్కూ‌ మూసుకుని కూర్చున్న మా నాన్నగారు ఈ రాజుని తిట్టారా?  ఆశ్రమంలో  ఉంటూనే‌ రాజుగారి శత్రువులతో చేతులు కలిపి కుట్రలు చేసారా? ఏదో కందమూలాలు తింటూ‌ భగవధ్యానంలో ములిగిపోయి ఉండే నా తండ్రి మెడలో ఎవడో రాజు వచ్చి చచ్చిన పామును వేస్తాడా?

ఈ రాజు దగ్గరికి పోయి మనం ఏమన్నా ధనాలడిగామా ధాన్యాలడిగామా?  వీడి అనుగ్రహం కోసం వీడి గుమ్మం ముందు అస్తమానూ నిలబడి విసిగించామా?  వీడెవడు చచ్చిన పాముని మెళ్ళో వేసి అవమానించటానికి?

ఈ రాజులు, ఇష్టం వచ్చినట్లు ప్రజలముందు విలాసంగా తిని తాగి దర్జా వెలిగిస్తే వెలిస్తారు గానీ, ఇలా మునుల ఆశ్రమాల్లో జొరబడి అకృత్యాలు చేస్తారా?  భగవంతుడైన విష్ణుమూర్తి కృష్ణావతారం విడిచేసాక దుష్టులైన రాజులు చెలరేగుతున్నట్లుగా ఉందే! 

చూడండి.  ఈ‌ దుష్టరాజును శపిస్తాను అని కోపంగా దగ్గర్లో ఉన్న కౌశికీ‌ నదికి పోయి ఆ పవిత్రనదీ జలాల్ని తాకి 

ఉ. ఓడక వింటికోపున మృతోరగముం గొని తెచ్చి మాఱు మా
టాడక యున్న మజ్జనకు నంసతలంబున బెట్టి దుర్మద
క్రీడఁ జరించు రాజు హరకేశవులొడ్డినఁ‌ గావఁ‌ జచ్చు బో
యేడవనాఁడు తక్షకఫణీంద్రవిషానలహేతిసంపదన్

ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా, వింటి కొప్పుతో చచ్చినపాముని తీసుకు వచ్చి, తపోదీక్షలో మారు మాట్లాడకుండా ఉన్న మా నాన్నగారి మెడలో వేసి ఆటపట్టించి పోయిన దుర్మార్గుడైన రాజుకు ఇదే‌ నా శాపం. ఈ‌ రోజు నుండి ఏడో రోజున వాణ్ణి భయంకరమైన తక్షకుడు అనే పాము కరిచి ఆ విషాగ్నికి వాడు చస్తాడు.  సాక్షాత్తూ శివుడూ విష్ణువూ అడ్డం పడ్డా సరే, ఆ తక్షక విషాగ్ని అనే ఆయుధం వాణ్ణి చంపి తీరుతుంది.

అలా శపించి ఆశ్రమానికి తిరిగివచ్చి, కుర్రవాడు కాబట్టి ఆ పాము కళేబరాన్ని తీయటానికి భయపడి పెద్ద గొంతుతో  ఏడుస్తూ ఉన్నాడు శృంగి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి