12, ఆగస్టు 2013, సోమవారం

ప్రథమస్కంధం: 21. విదురుడు తీర్థయాత్రలనుండి హాస్తినకు తిరిగివచ్చుట.

ఆ విధంగా ధర్మరాజులవారికి ధృతరాష్ట్రమహారాజుగారి వృత్తాంతం వినిపించి పాండవులకు కూడా వాళ్ళు రాబోయే కాలంలో చేయవలసినది ఏమిటో హెచ్చరించి నారదులవారు స్వర్గానికి వెళ్ళిపోయారు.

తీర్థయాత్ర చేస్తున్న  విదురుడు మైత్రేయుడనే మహర్షిని కలవటం జరిగింది.  మైత్రేయులవారి వద్ద నుండి విదురుడు కర్మయోగాన్ని గురించి అనేక రకాల వ్రతాలను ఆచరించటం గురించీ విపులంగా తెలుసుకున్నాడు.  అంతే గాక మైత్రేయిల వద్ద ఆత్మ విజ్ఞానానికి సంబంధించిన విషయాలు అనేకం తెలుసుకుని సంతోషించాడు.

కొన్నాళ్ళు గడిచాక విదురమహాశయుడు తన తీర్థయాత్రలు ముగించుకుని హస్తినాపురం తిరిగి వచ్చాడు.  

విదురమహాశయుడి రాక ధర్మరాజుగారికి పరమానం కలిగించింది.  అయనకు స్నానపానాదులకు ఏర్పాట్లు చేయించారు ధర్మరాజుగారు.   విదురుల  వారు భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు.  ఆ తరువాత ధర్మరాజుగారు, ఆయన తమ్ములూ విదురులవారిని చూడ వచ్చారు.  విదురుల వారితో ధర్మరాజుగారు, ఇలా అన్నారు

సీ. ఏ వర్తనంబున నింతకాలము మీరు
      సంచరించితి రయ్య జగతిలోన
నే తీర్థములు గంటి రెక్కడ నుంటిరి
      భావింప మీ వంటి భాగవతులు
తీర్థసంఘంబుల ధిక్కరింతురు గదా
      మీ‌యందు విష్ణుండు మెఱయు కతన
మీర తీర్థంబులు మీ కంటె మిక్కిలి
      తీర్థంబు లున్నవే తెలిసి చూడ
తే. వేఱ తీర్థంబు లవనిపై వెదుక నేల
మిమ్ముఁ బొడగని భాషించు మేల చాలు
వార్త లే మండ్రు లోకులు వసుధలోన
మీకు సర్వంబు నెఱిఁగెడు మేధ గలదు

పినతండ్రిగారూ, మీరు ఇన్నాళ్ళూ ఎలా భూలోక సంచారం చేసారు, ఏమేమి తీర్థాలను సేవించారూ?  ఔనా మీవంటి భాగవతోత్తములు స్వయంగా దివ్యతీర్థసమానులు.  ఇతర తీర్థాల ప్రభావాన్ని మీ యందున్న విష్ణుతేజస్సుతో మీరు ఎప్పుడూ అధిగమించి ఉంటారు గదా.  అలాంటప్పుడు, మీకంటే గొప్ప తీర్థాలున్నాయా (మా బోటి వారికి)?   వేరే తీర్థాలను మేం వెదికి సేవించాలా, మిమ్మల్ని దర్శించి మీతో మాట్లాడితేనే చాలు (అన్ని పుణ్యతీర్థాలనూ సేవించిన పుణ్యం వస్తుంది).  అయ్యూ లోకంలో ప్రజలనుకునే వార్తలు (నేను తెలుసుకోవలసినవి) ఏమన్నా ఉన్నాయా?  మీకు సర్వ విషయాలూ తెలుసుకోగల ప్రజ్ఞ ఉంది.

అయ్యా, మా నాన్నగారు పాండుమహారాజుగారు కాలం చేసిన తరువాత మేమంతా హస్తినాపురం చేరుకున్నాం.  అక్కడి నుండీ అసూయాపరులైన మా పెదతండ్రిగారి పిల్లల వలన మాకు చెప్పరానన్ని కష్టాలు వచ్చిపడ్డాయి.  వాళ్ళ వల్ల మేము సకుటుంబంగా అన్ని రకాల అవమానాలూ ప్రాణహానీ అనుభవించాం.  అటువంటి కష్టాలలో మమ్మల్ని అందరినీ మీరు కన్నతండ్రి లాగా ఆదరించి లాలించారు.  రెక్కలు రాని పిల్లలను పక్షులు తమ రెక్కల్లో దాచుకుని రక్షించినట్లుగా మీరు కాపాడబట్టి బ్రతికి బట్టకట్టాం.

అన్నట్లు ఒక్క విషయం చెప్పండి.

క.  మన్నారా ద్వారకలో
నున్నారా యదువు లంబుజోదరు కరుణం
గన్నారా లోకులచే
విన్నారా మీరు వారి విధ మెట్టిదియో.

ద్వారకాపురానికి కూడా మీరు తప్పకుండా వెళ్ళి వచ్చి ఉంటారు. అక్కడ అంతా బాగానే ఉంది కదా?  భగవంతుడైన శ్రీకృష్ణుడి దయవల్ల ద్వారకలో అంతా కుశలంగా ఉన్నారు కదా? 

ఒక వేళ మీరు ద్వారకను సందర్శించక పోయినా మీ యాత్రా సందర్భంగా ప్రజల నోట ద్వారాకా నాధుని వార్తలు ఏమన్నా వినే‌ ఉంటారు  అనుకుంటున్నాను.  నాకు యాదవలోకం వార్తలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.

అంత ఆత్రంగా అడిగిన ధర్మరాజుగారి మాటలకు విదురుల వారికి చాలానే ఇబ్బంది కలిగింది పాపం.  అప్పటికే ప్రభాసతీర్థంలో యాదవకలహం జరిగి సకల యాదవవంశమూ‌ తుడిచి పెట్టుకు పోయింది.  శ్రీకృష్ణభగవానులూ అవతారం సమాప్తం చేసి నిజధామం చేరుకున్నారు.  కాని ధర్మరాజుగారి మాటల్ని బట్టి చూస్తే ఆ వార్త లేవీ ఇంకా హస్తినాపురం చేరలేదని తెలుస్తోంది.

శూద్రుడైన తాను (అప్పటి ఆచారవ్యవహారాల ప్రకారం) శిష్టులైన వారి మరణం గురించిన వార్తను తెలియజేయటం పధ్ధతి కాదు.  అందుచేత ఈ‌ విషయం దాటవేయక తప్పదు.

విదురుల వారు తాను చూసిన తీర్థాలూ వాటి ప్రభావాల గురించీ, తన ఎరుక లోనికి వచ్చిని రకరకాల లోక వార్తల గురించీ‌ ధర్మరాజు గారితో విపులంగా ప్రసంగించాడు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి