10, ఆగస్టు 2013, శనివారం

ప్రథమస్కంధం: 19. గాంధారీ ధృతరాష్ట్రులు హిమాలయాలకు పోవటం.

శౌనకాది మహర్షులతో పరీక్షిన్మహారాజు పుట్టుక తరువాతి కథా విధానం‌ చెబుతున్నారు సూత పౌరాణికులు.

పట్టాబిషిక్తుడైన ధర్మరాజుగారు సుఖంగా రాజ్యం చేసుకుంటూ, తమ్ముళ్ళతోనూ, మనవడి ముద్దూముచ్చట్లతోనూ కాలం గడుపుతున్నారు. ఒకనాడు విదురుడు గుడ్డిరాజును చూడటానికి వెళ్ళాడు.  ఈ విదురుడు నిజానికి యముడు.

ఒకప్పుడు మాండవ్యుడనే ముని శాపం కారణంగా యమధర్మరాజు భూలోకంలో శుద్రుడిగా జనించవలసి వచ్చింది.  ఆ కథ సంక్షిప్తంగా చెప్పుకుందాం.

మాండవ్యుడు కళ్ళుమూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు తన ఆశ్రమంలో. 

ఒక రాత్రి ఆయన ఆశ్రమంలో దొంగలు పడ్డారు.  అబ్బే,  వాళ్ళేమీ‌ దొంగతనం చేయటానికి రాలేదు.  అయినా ఆయన దగ్గర ఏం‌ ఉంటుందనీ!  వాళ్ళు ప్రాణభయంతో‌ రాజభటుల్ని తప్పించుకుని పారిపోతూ మాండవ్యుడి ఆశ్రమంలో ప్రవేశించారు.  ఆ దొంగలు ఇలాంటీ అలాంటీ తప్పు చేయలేదు - ఏకంగా రాజుగారి అంతఃపురంలో దూరి రాజకుమారుణ్ణి చంపి నగలు దోచుకు పోయారు.   రాజభటులు వెంట పడరూ‌ మరి? 

ఆశ్రమంలో దూరినా వాళ్ళకు ఆ గుడిసె భద్రంగా తోచలేదు.  దానితో తాము దోచుకొచ్చిన సొత్తు యావత్తూ అక్కడే వదిలేసి పారిపోయారు.  రాజభటులు వచ్చి మాండవ్యుడే దొంగ అనీ మునివేషంలో నాటకం ఆడుతున్నాడనీ భావించి ఈడ్చుకు పోయారు.

రాజుగారు కూడా, అసలే పుత్రశోకంలో ఉన్నాడేమో,  విచారణ చేయకుండానే,  ఈ దొంగని శూలానికి గుచ్చండి అని శిక్ష వేసేసాడు.  ఇంత జరుగుతున్నా,  మాండవ్యుడు లోకవ్యవహారం ఏమీ పట్టించుకోకుండా మౌనంగానే ఉండి పోయాడు.  భటులు మాండవ్యుడిని ఊరి బయటకు తీసుకుపోయి శూలానికి  గుచ్చారు.   మాండవ్యుడు అదీ‌ మౌనంగానే భరిస్తున్నాడు.

ఆ రాత్రి, అనేక మంది మహర్షులు వచ్చి మాండవ్యుడిని దర్శించి ఎంతో గొప్పగా స్తుతించారు.  మాండవ్యుడు వాళ్ళతో ఈ శరీరం గురించి బాధపడటం‌ అనవసరం అనీ, తన తపస్సుకు ఈ శిక్ష యేమీ ఆటంకం‌ కాదనీ చెప్పాడు. 

కాపలా భటులు ఈ‌ సంఘటన చూసి విస్తుపోయి, రాజు వద్దకు పోయి చెప్పారు.  రాజుగారు భయంతో గడగడ లాడుతూ వచ్చి మాండవ్యుడికి శతకోటి క్షమాపణలు చెప్పుకున్నాడు.   శూలం పూర్తిగా బయటకు రావటం‌ లేదు. చేసేది లేక కొద్దిగా మొన లోపలే వదిలేసి,  శూలాన్ని కోసి తీసివేసారు.  అప్పటినుండీ ఆమునికి అణిమాండవ్యుడు అన్న పేరు వచ్చింది (అణి అంటే మొన)

మాండవ్యుడు తిన్నగా యమలోకానికి పోయి యముణ్ణే అడిగాడు.  మహానుభావా సమవర్తీ, ఏ తప్పు చేసానని నాకీ  శిక్ష పడిందీ‌ అని.  ఆయన మాండవ్యుడికి నమస్కరించి చెప్పాడు. మహామునీ, గత జన్మలో నీవు ఏడేళ్ళ పిల్లవాడిగా ఉన్నప్పుడు తూనీగలని పట్టుకునే‌ వాడివి ఆటగా. ఐతే అంతటితో‌ ఆగకుండా,  ఆ తూనీగలను ఈను పుల్లలకు గుచ్చి అవి విలవిల లాడుతుంటే వినోదించే వాడివి. అందుకే ఈ‌జన్మలో నీకీ‌ శిక్ష విధించబడింది అని చెప్పాడు యముడు.

మాండవ్యుడు విస్తుబోయాడు.  ఏమిటీ ఏడేళ్ళ పిల్లవాడి పనులకు శిక్షా? నీకు తెలియదా? పద్నాలుగేళ్ళు వచ్చేదాకా చిన్నపిల్లలు చేసిన పనులకు తల్లిదండ్రులే‌ బాధ్యులు. ఊహ తెలియని పిల్లలకు తప్పు వేయకూడదు.

ఇంత చిన్న విషయంలో పరాకుగా ఉన్నావే? అందుకని ఈ‌ దోషం పోవటానికి భూలోకంలో శూద్రుడిగా జన్మించు అని శపించాడు మాండవ్యుడు.  ఆ శాపం కారణంగా యముడు విదురుడిగా జన్మించాడు.

భూలోకంలో యముడు విదురుడిగా ఉన్నది నూరేళ్ళ పైచిలుకు కాలం. అన్నాళ్ళూ అర్యముడు అనే పితృదేవుడు యముడి స్థానంలో ఉన్నాడు.

ఈ యముడి అవతారం అయిన విదురుడు  ధృతరాష్ట్ర మహారాజు మందిరంలో ఆయన్ను చూసి నాలుగు మంచి మాటలు చెప్పాడు.

రాజా,  మనుషులు బంధువులతోనూ, భోగాలతోనూ హాయిగా ఉన్నామనుకుంటారు.  కాలం తరుముకుని వస్తోందని మాత్రం ఏమీ ఆలోచించరు!  ముసలితనం మీదపడినా, ఇంకా భోగాలూ జీవితాశలతోనే ఉంటారు.  అయినా మృత్యువు తప్పదు కదా?  నువ్వే‌మైనా ఈ‌ విషయం ఆలోచించుకున్నావా?  నీ పరిస్థితిని గమనిస్తున్నావా?

శా.  పుట్టంధుండవు పెద్దవాడఁవు భోగంబులా లేవు నీ
పట్టెల్లం జెడి పోయె దుస్సహ జరాభారంబు పైఁగప్పె నీ
చుట్టాలెల్లరు బోయి రాలుమగడున్ శోకంబునన్ మగ్నులై
కట్టా దాయల పంచ నుండఁ దగవే గౌరవ్య వంశాగ్రణీ

నువ్వా పుట్టుగుడ్డివి. పెద్దవాడివి.  ఏమన్నా మహాభోగాల్లో ములిగి తేలుతున్నావా అంటే అదేమీ‌ లేదాయె. ముసలాడివి. నీ చుట్టాలెవరూ కూడా బతికి లేరు.  ఎందుకయ్యా, ఇంకా మీ మొగుడూ పెళ్ళాలు, ఏడుస్తూ దాయాదుల కొంపలో పడి తింటున్నారూ?  ఇదేమన్నా బాగుందా?

ఏం‌ గౌరవంలే. మీరు చేసినవి ఎంతలేసి పనులనీ!  వాళ్ళను విషం పెట్టి చంపాలని చూసారు. వేరు పెట్టారు. కొంపకి నిప్పుపెట్టి చంపాలని చూసారు. ఇక్కడికి పిలిపించి, వాళ్ళనీ వాళ్ళ భార్యనీ దారుణంగా అవమానించారు.  అయినా వాళ్ళు ఉదారంగా ఇంత తిండి పెడుతున్నారు మీకీ ముసలితనంలో.  అలా వాళ్ళ దయాధర్మభిక్షం తిని బతక్క తప్పదా?  

రోజూ భీముడు ఎంతలేసి మాటలంటున్నాడో వినబడటం లేదా? పిల్లలకి బుధ్ధి చెప్పక ఇలా అయిపోయిన ముసలాళ్ళు మన నెత్తిన పడ్డారు గదా!   ఏం చేస్తాం, వాళ్ళకి ఇంత పిండం వండి పడేస్తున్నాం అని వాడు రోజూ అంటుంటే ఆ అన్నం మీకు ఎలా నోటికి పోతోందయ్యా?   ఏమయ్యా, ఇంకా బతికి మీరు పిల్లల్ని కనాలా పెంచాలా? మనవల్నెత్తాలా?  రాజభోగాలు సంపాదించి బ్రాహ్మల్ని పిలిచి దానాలివ్వాలా?  ఎందుకొచ్చిన బతుకయ్యా ఇక్కడ?  ఇదిగో వింటున్నావా?

క. దేహము నిత్యము గా దని
మోహము దెగఁ గోసి సిధ్ధ ముని వర్తనుడై
గేహము వెలువడు నరుఁ డు
త్సాహముతో జెందు ముక్తిసంపద ననఘా

ఈ శరీరం ఏమాత్రమూ‌ శాశ్వతం‌ కాదూ ఎప్పటికైన పోయేదేలే అని తెలుసుకుని శరీరమోహం వదిలేయాలి. అలా దేహభ్రాంతి వదిలి సిధ్ధులూ మునులూ ఇళ్ళు వదిలేస్తారని తెలుసుకో.  అలా ఇల్లూ వాకీలీ అనే ఇరుకు నించి బయటపడిన మనిషి ఒక మునిలాగా సిధ్ధుడిలాగా ఉత్సాహంగా యోగవృత్తి అవలంబించి మోక్షం సంపాదించుకుంటాడు.

అలా విదురుడు మార్గోపదేశం చేయగానే ధృతరాష్ట్రుడికి ఉన్న కాస్త మోహపాశమూ తెగిపోయింది.  సంతోషంగా విదురుడు చెప్పిన జ్ఞానమార్గంలో ముందుకు పోవాలని నిశ్చయించు కున్నాడు.  గాంధారీమహాదేవికి కూడా విదురుడు చెప్పిన మాటలు కనువిప్పు కలిగించాయి. ఆవిడ కూడా సంతోషంగా భర్తతో పాటు బయలుదేరింది. 

ఇద్దరు వృధ్ధులూ పరమానందంగా అంతఃపురం వదిలిపెట్టి, హస్తినాపురం వదిలి పెట్టి, హిమాలయాలకేసి సాగిపోయారు.

3 వ్యాఖ్యలు:

 1. దేహము నిత్యము గా దని ......ననఘా ఈ పద్యంలో ధృతరాష్ట్రుని అనఘా అని విదురులవారు సంబోధించారు కదా ధృతరాష్ట్రుడు అప్పటికి అనఘుడేనా అని కొంచె సందేహం ఏమైనా వివరం తెలపగలరా? లేదా అన్నగారు కాబట్టి తండ్రితో సమానుడైనందున అనఘా అని పిలిచారా? పోతనగారు చెప్పారంటే దాన్ని ప్రశ్నించేదిలేదనుక్కోండి కేవలం వివరం తెలుసుకోవడం కోసమే! ఇంకా బాగా అర్థం చేసుకోవడం కోసమే!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మంచి ప్రశ్న వేశారు.
   అన్నగారు కాబట్టి ఆయనను విదురులు అలా అనఘా అన్నా రనుకోవాలి.
   రాయాయణంలో‌ కూడా విభీషణుడు రావణుడికి హితబోధ చేస్తూ శ్రేష్ఠుడివీ, ధర్మాత్ముడివీ‌ వంటి మాటలు వాడతాడు.
   రెండు సందర్బాలలోనూ సామ్యం ఒకటి ఉంది.

   అది ఏమిటంటే పెద్దలకు పిన్నలు హితోపదేశం చేయవలసి దుస్థితి వచ్చినప్పుడు వారితో మర్యాదమీరి మాట్లాడక పోవటమే‌కాదు, వారి మనస్సు ప్రసన్నం అయ్యేందుకు కొంచెం పొగడ్త కూడా జోడించాలి. అలా అంటూనే వారి తప్పొప్పులను చర్చించి కర్తవ్యమూ‌ ధర్మమూ వంటివి మనస్సుకు ఎక్కేలా ప్రసంగించాలి.

   అంతకంటే అనఘా అనటంలో విశేషం ఏమీ‌లేదు.

   తొలగించు