3, ఆగస్టు 2013, శనివారం

ప్రథమస్కంధం: 10. ద్రౌపదీమహాదేవి సౌజన్యం

మనం  గత రెండు టపాలలోనూ  అశ్వత్థామ చేసిన దుష్కృత్యం  గురించీ ఆశ్వత్థామను గురించి మరికొన్ని విషయాలు  చదువుకున్నాం. ఆ అశ్వత్థామను అర్జునుడు బంధించి శిబిరానికి తీసుకొని వచ్చినట్లు చదివాం. తరువాత జరిగిన దేమిటో తెలుసుకుందాం.

తాను చేసిన బాలవధకు, సిగ్గుతో అశ్వత్థామ చితికిపోతున్నాడు. అందుచేత తలయెత్తి ఎవ్వరి ముఖమూ చూడలేక పోతున్నాడు.

అప్పుడు ఆ కృపికొడుకుని చూసి దౌపదీ‌మహాదేవి మ్రొక్కింది. దానితో అశ్వత్థామ మరింతగా సిగ్గుపడ్డాడు.  ఎంతో సుస్వభావం‌ కల ద్రౌపదీదేవి అతడితో,  

ఓ మహానుభావా, నువ్వు మా మగవారికి అస్త్రవిద్యాబిక్షపెట్టిన ద్రోణాచార్యదేవుల కుమారుడివి. కొడుకు రూపంలో‌ ఉన్న ద్రోణుడివి నువ్వు.  అయ్యో, కొంచెం కూడా దయ లేకుండా శిష్యుల బిడ్డలను గొంతులు కోసి చంపావే. ఇదేమన్నా న్యాయమా చెప్పు?

నువ్వు బ్రాహ్మణుడివి. నాకు తెలుసు, నీ మనస్సులో‌ దయ భాసిస్తూ ఉంటుంది నిత్యమూ.  ముఖ్యంగా పాండవుల మీద. వీరుల్లో నువ్వు చాలా ప్రముఖుడివి. ఎంతో గొప్పవాడివి.  తండ్రీ, ఇలా చిన్నపిల్లల్ని మారణహోమం చేసెయ్యటం ధర్మమేనా?  ఇది రాక్షసకృత్యం‌ కదా! ఎలా చేసావయ్యా?

శా. ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుధ్ధావనిన్ లేరు కిం
చిద్ద్రోహంబును నీకుఁ జేయరు  బలోత్సేకంబులోఁ జీకటిన్
భద్రాకారులఁ బిన్నపాపల రణప్రౌఢక్రియాహీనులన్
నిద్రాసక్తుల సంహరింప నకటా నీ చేతులెట్లాడెనో

అయ్యా, నా కొడుకులు చిన్న పాపలు కదా.  వాళ్ళు నీ మీదకు ఉద్రేకంతో చంప రాలేదు. వాళ్ళు ఆయుధాలు పట్టుకుని నీ మీదకు యుధ్ధభూమికి రాలేదు. నీకు ఎన్నడూ ఏ విధమైన ద్రోహమూ చేసినవాళ్ళూ కాదు.  నువ్వా మహా బలశాలివి.  నా కొడుకులా గొప్పగొప్ప యుధ్ధాలలో ఆరితేరిన వారు కాదు.  ఎంతో సుకుమారంగా శుభకరమైన ఆకారాలతో ముద్దుగా ఉన్న నా కొడుకులు రాత్రిపూట హాయిగా నిద్రలో ఉన్నారు.  అలాంటి వేళలో, బలం ఉంది కదా అని చీకటిలో నువ్వేం చేసావయ్యా? నిద్రపోతున్న చిన్నబిడ్డల్ని చంపేశావు కదా!  అయ్యయ్యో,  నీకు చేతులెట్లా ఆడాయయ్యా అలాంటి హీనమైన పని చేయటానికి?

చూడు తండ్రీ,  నువ్వు చేసిన నిర్వాకానికి ఫలితం?

ఇక్కడ బిడ్డలను అందరినీ‌ పోగొట్టుకుని పుత్రశోకంతో నేను పరమదీనురాలినై పోయాను.  ఇప్పుడు కిరీటి నిన్ను పట్టుకున్నాడూ, కట్టి ఈ‌డ్చుకు పోయాడూ అన్న వార్త తన చెవిని పడి అక్కడ నీ తల్లి ఎలా గుండెలు బాదుకుంటూ‌ ఏడుస్తోందో నాయనా!  ఒక్కసారి ఆలోచించు. పుత్రశోకం‌ మా ఆడవాళ్ళందరికీ‌ ఒకటే తండ్రీ.

ఇలా అని ద్రౌపదీదేవి కృష్ణార్జునులతో ఇలా అంది

ఉ. ద్రోణునితో శిఖిం బడక ద్రోణకుటుంబిని యున్న దింట న
క్షీణతనూజశోకవివశీకృతనై విలపించు భంగి నీ
దౌణిఁ దెఱల్చి తెచ్చుటకు దైన్యము నొందుచు నెంత సొక్కునో
ప్రాణవియుక్తుఁ డైన నతిపాపము బ్రాహ్మణహింస మానరే

పాపం,  ద్రోణాచార్యులవారి మృతి తరువాత, ఆయన భార్య భర్తతో సహగమనం చేయకుండా, కొడుకుమీద ప్రాణాలు పెట్టుకుని జీవిస్తోంది.  ఈ‌ పాటికి ఆవిడకు అశ్వత్థామను గూర్చిన వార్త తెలిసే ఉంటుంది. బిడ్డల్ని పోగొట్టుకుని మహాదుఃఖంలో నేను ఎలా ఏడుస్తున్నానో, ఇంటిపట్టునే ఉన్న ఆ తల్లి కూడా తన కొడుకు పరిస్థితినీ - అతడికి వచ్చిన ప్రాణాపాయాన్నీ తలచుకుని, ఎంత దీనంగా ఏడుస్తోందో‌ కదా.  ఈ అశ్వత్థామను చంపితే మనకు మహాపాపం చుట్టుకుంటుంది.  బ్రాహ్మణహింస మంచిది కాదు. తప్పు. మానండి.  ఈ‌ ద్రోణపుత్రుల్ని విడిపించండి.

క్షత్రియులకు బ్రాహ్మణులమీద క్రోధం ఉచితం కాదు. బ్రాహ్మణక్రోధం మహాప్రళయం వంటిది.  అది రాజకుటుంబాలను కార్చిచ్చు అడవులను తగలబెట్టినట్లు నిర్మూలనం చేస్తుంది.

ఇలా ఎంతో‌ ధర్మబధ్ధంగా, ఎంతో‌ దయగా ద్రౌపది పలికిన మాటలు విని ధర్మరాజు చాలా సంతోషించాడు. అక్కడ ఉన్న నకులసహదేవులూ, కృస్ణార్జునులూ సంతోషించారు. వాళ్ళంతా ఆవిడ మాటలు చాలా చక్కగా ఉన్నాయని అంగీకరించారు.

కాని భీమసేనుడు మాత్రం ఈ ధర్మపన్నాలు విని ఉగ్రుడైపోయాడు.

చ. కొడుకులఁ బట్టి చంపెనని కోపము నొందదు బాలఘాతకున్
విడువు మటంచుఁ జెప్పెడిని వెఱ్ఱిది ద్రౌపది వీడు విప్రుడే 
విడువగఁ నేల చంపుఁ డిటు వీనిని మీరలు సంపరేని నా
పిడికిటి పోటునన్ శిరము భిన్నము సేసెదఁ జూడు డిందఱున్

ఏమిటండీ ఈ‌ మాటలు?  వీడు తన కొడుకుల్ని చంపాడని కొంచెం కూడా కోపం లేకుండా మాట్లాడుతోంది? ఏడ్చీ ఏడ్చీ, ఈ ద్రౌపదికి బాగా వెఱ్ఱి ఎక్కింది.  వీడా బ్రాహ్మణుడు?  వీణ్ణెందుకు వదలాలండీ? చంపి తీరవలసిందే! ఏదో‌,  మన గురుపుత్రుడూ, చంపరాదూ‌ అని మొహమాటంగా ఉందా ఏమిటి మీకు?  మంచిది. నాకేం అలాంటి మొహమాటం ఏమీ లేదు.  నా పిడికిలితో ఒక్క దెబ్బ వేసి వీడి తలకాయ ముక్కలు చేస్తా చూడండి మీరంతా

అని రంకెలు వేసాడు. అలా కోపంతో చిందులు తొక్కుతూ. చెయ్యెత్తి అశ్వత్థామ మీదికి పోయాడు.

భీముడి ఉధృతి చూసి ద్రౌపది కంగారుగా పరిగెత్తుకు వెళ్ళి అశ్వత్థామకు రక్షణగా అడ్దం నిలబడింది వద్దు వద్దు అంటూ.

ఈ భీమయ్య హంగామా చూసి, శ్రీకృష్ణుడు చప్పున నాలుగు చేతులు ధరించి, రెండు చేతులలో ద్రౌపదిని పక్కకు త్రోసి,  మరొక రెండు చేతులతో భీముణ్ణి బలంగా పట్టుకుని ఆపాడు.

అవునయ్యా భీమా, వీడు శిశుహంత. వీణ్ణి నిజానికి రక్షించవలసి అవసరం ఏమీ లేదు.  కొంపకు అగ్గిపెట్టేవాణ్ణీ, నమ్మించి విషం పెట్టేవాణ్ణీ, నమ్మించి సొత్తును అపహరించేవాణ్ణీ,  భూధన-గోధనాల్ని దోచుకునే‌వాణ్ణీ, నిష్కారణంగా ఆయుధాలతో మొత్తేవాణ్ణీ, స్త్రీలను ఎత్తుకుపొయేవాణ్ణీ ఆతతాయి అంటారు. ఆతతాయిని తప్పకుండా చంపవలసిందే. నువ్వన్నది నిజమే. నువ్వు వేదం చదువుకున్నవాడివి కదా. వేదంలో "బ్రాహ్మణో నహంతవ్యః" అని ఉంది కదా? అక్కడ ఆ బ్రాహ్మణుడి యోగ్యతలను విచారించటానికి మనకు అధికారం ఏమీ వేదం ఇవ్వటం లేదు కదా?  ఒక్కసారి సహనంతో ఆలోచించు మరి.  క్షత్రియుడు అంటే అధర్మం వలన ఇతరులకు దెబ్బ తగలకుండా చూడవలసినవాడు అని అర్థం కదా?  క్షత్రియులమైన  మనమే అధర్మం చేయవచ్చునా? ఆలోచించు.  ఈ అశ్వత్థామ అనే దీనంగా పడి ఉన్న బ్రాహ్మణ్ణి రక్షించటం మన కర్తవ్యం. ఏమంటావు?

అని యీ విధంగా మృదువుగా చిరునవ్వులతో భీముడి కోపాన్ని ఉపశమింప జేసాడు మొత్తానికి.  అపైన,

అర్జునా, అన్నట్లు నువ్వు ప్రతిజ్ఞల వీరుడివి. అదొక చిక్కు వచ్చింది.  మనకా ఈ ద్రోణాచార్యులవారి కొడుకుని రక్షించక తీరదు. నీ‌ ప్రతిజ్ఞా నెరవేరాలి. అలాంటి, ఇలాంటి ప్రతిజ్ఞా నీది?  వీడి తల ఖండిస్తానన్నావు. ఇప్పుడు ఏమి చేయాలని అనుకుంటున్నావో  అలోచించి చెయ్యి అన్నాడు శ్రీకృష్ణుడు.

అప్పుడు అర్జునుడు ఆ అశ్వత్థామకు గుండు చేసేశాడు.  ఆతడి శిరస్సున, ద్రోణాచార్యులవారు రక్షగా ఇచ్చిన ఒక మహాప్రభావం‌కల రత్నం ఉంది. ఆ రత్నాన్ని తీసేసుకున్నాడు. ఆ తరువాత ఆతని కట్లు విప్పి, తమ శిబిరం‌ వెలుపలకు గెంటి వేసాడు.

[అశ్వత్థామకు ఘోరంగా అవమానం జరిగింది. చంపితీరవలసిన మహా గొప్ప తప్పు చేసిన బ్రాహ్మణుడికి ఉచితమైన శిక్ష అల్లా అతడిని సర్వసంపదలనూ లాగివేసుకోవటం‌ ఒకటీ, తలగొరిగి పంపటం‌ మరొకటీ.  కాని బ్రాహ్మణుడిని వధించరాదు. ఈ శిక్షలలో అంతరార్థం ఏమిటంటే. సంపదలకాసించి బ్రాహ్మణుడు దుర్మార్గం చేసి ఉంటే వాడి మొత్తం సంపదలాక్కోవటం ఒక శిక్ష.  బీదబ్రాహ్మణుడు అయితే అతడి శిఖా యజ్ఞోపవీతాలు తొలగించి అతడి బ్రాహ్మణత్వాన్ని గుర్తించటం లేదూ‌ అని ప్రకటించటం మరొక శిక్ష అన్నమాట.   బ్రాహ్మణులకు ధర్మాలుగా చెప్పబడ్డవి కేవలం అధ్యయనం (వేదం చదువుకోవటం), అధ్యాపనం (శిష్యులకి వేదం చెప్పటం), యజనం (యజ్ఞాలు చేయటం), యాజనం (యజ్ఞాలు చేయించటం), దానం (ఉన్నదాంట్లోనే ఇతరులకు దానధర్మాలు చేయటం), ప్రతిగ్రహణం(ఎవరైన దయతలచి ఇచ్చిన దానితో తృప్తిపడటం) మాత్రమే.  బ్రాహ్మణులకు స్వయంగా వేరే వృత్తులకు దిగటానికీ, ధనసంపాదన చేయటానికీ ఆర్షజీవనవిధానం అనుమతించటం లేదు.  వాళ్ళు సమాజానికి విజ్ఞానకోశాగారాలు, ఉపాధ్యాయులు.  ఒక్కొకసారి జ్ఞానులయిన వారి చర్యలు సమాజంలో అధికులకు వింతగానో తప్పుగానో కనిపించే‌ ప్రమాదం తప్పకుండా ఉంది. ముఖ్యంగా రాజులు జ్ఞానులయిన విప్రులను దోషులుగా ప్రమాదపడే అవకాశం ఉంది. అలా పొరపాటు పడి విప్రవధం చేస్తే సమాజంలో విజ్ఞానదాతలకు కరవు వచ్చే‌ ప్రమాదం తప్పకుండా ఉంది. ఈ రోజు పొరబడి ఒక బ్రాహ్మణ్ణి శిక్షించి విడిచినా,  క్రమంగా అతడు చేసింది మంచే నన్న విషయం తెలిసివచ్చిన రోజున రాజూ‌, సమాజమూ‌ ఆ బ్రాహ్మడి కాళ్ళమీద పడి క్షమాపణ వేడుకోవచ్చు.  ఆ బ్రాహ్మణుడు క్షమించి తీరాలి కూడా.  అందుచేత బ్రహ్మహత్యను వేదం నిషేధించింది.]

పాండవులు ఇలా అశ్వత్థామను కేవలం ప్రాణాలతో వదలి పెట్టటంతో మహాభారత యుధ్దం సర్వవిధాలా సమాప్తం అయింది.  శోకాలు పెడుతూ, పాండవులు యుధ్ధంలో మరణించిన వాళ్ళందరికీ అంత్యక్రియలన్నీ‌ యథావిధిగా చేసారు.  తమతమ ఆప్తుల్ని యుధ్ధరాక్షసికి బలి ఇచ్చి అంతులేని శోకంలో ములిగి పోయారు. గెలిచారు అనిపించుకున్న పాండవులూ, ఓడిన ధృతరాష్ట్రదంపతులూ శోకంలో సమానం అయ్యారు. అందర్నీ శ్రీకృష్ణులవారూ, మహర్షులూ తగినవిధంగా ఓదార్చారు. 

ఆ తరువాత ధర్మరాజులవారికి పట్టభిషేకం జరిగింది.

పాండవులకు దుఃఖోపశమనం కలగటానికి గాను, శ్రీకృష్ణులవారు హస్తినలోనే ఉండిపోయారు కొన్నాళ్ళు. ఆ తరువాత ఒక శుభముహూర్తం చూసుకుని ద్వారకకు తిరుగుప్రయాణం‌ కట్టారు.

1 వ్యాఖ్య:

  1. ద్రౌపది ధర్మ నిష్ట కొనియాడ తగినది, ఆమె గొప్పతనమెంత చెప్పుకున్నా తక్కువే.ధన్యోస్మి.

    ప్రత్యుత్తరంతొలగించు