8, ఆగస్టు 2013, గురువారం

ప్రథమస్కంధం: 17. ద్వారకలో శ్రీకృష్ణులవారి లీలావిహారాలు

గత టపాలో ధర్మరాజులవారికి రాజ్యాభిషేకం జరిపించి శ్రీకృష్ణులవారు ద్వారకాపురానికి తిరిగి వచ్చిన సంగతి  తెలుసుకున్నాం.  తదనంతరం కథను సూతపౌరాణికులు శౌనకాది మహర్షులకు ఇలా చెబుతున్నారు.

ఆ ద్వారకా పురంలోని ప్రజలు సంతోషంగా శ్రీకృష్ణులవారితో

ఉ. తండ్రుల కెల్లఁ దండ్రి యగు ధాతకుఁ దండ్రివి దేవ నీవు మా
తండ్రివిఁ దల్లివిం బతివి దైవమవున్ సఖివిన్ గురుండవుం
దండ్రులు నీ క్రియం బ్రజల ధన్యులఁ‌ జేసిరె వేల్పులైన నో
తండ్రి భవన్ముఖాంబుజము ధన్యతఁ‌ గానరు మా విధంబునన్

తండ్రులందరికీ‌ కూడా తండ్రి ఎవరయ్యా అంటే సృష్టికర్త అయిన బ్రహ్మగారు. నువ్వు ఆ బ్రహ్మగారికే‌ తండ్రివి! ఓ శ్రీకృష్ణప్రభూ, మా అందరికీ నువ్వే తల్లివి, తండ్రివి.  అంతే‌ కాదు మాకు రక్షకుడైనా దైవం అయినా నువ్వే. మాకు స్నేహితుడూ, గురువూ‌ ఎవరంటే అది కూడా నువ్వే.  దేవతల్లో కూడా, తమ బిడ్డలకు నీ‌ లాంటి తండ్రి ముమ్మాటికీ‌ లేడు కదా!  మాకు లభించినట్లుగా, నీ ముఖారవిందాన్ని యధేఛ్చగా తనివితీరా చూసి ఆనందించే భాగ్యం ఆ దేవతలకూ లేదు.  అది కేవలం‌ మాకే‌దక్కిన అదృష్టం.

ఇలా అంతా పొగుడుతూ ఉండగా శ్రీకృష్ణులవారు వాళ్ళను చిరునవ్వులతో అనుగ్రహిస్తూ రాచనగరుకు చేరుకున్నారు.

రాచనగరులోని స్త్రీపురుషులూ ఆయన మీద పుష్పవృష్టి కురిపిస్తూ మనసారా పొగడుతూ‌ స్వాగతం‌ పలికారు.

శ్రీకృష్ణులవారు ముందుగా తండ్రిగారైన వసుదేవులవారి మందిరానికి వెళ్ళి ఆయనకూ, దేవకీదేవి మొదలైన ఏడుగురు తల్లులకూ‌ పాదాభివందనాలు చేసారు. తండ్రిగారూ, తల్లులూ‌ ఎంతో‌ సంతోషించి దీవించారు.  ఆ తరువాత ఆయన తన రాణుల మందిరాలకు వెళ్ళాలని సంకల్పించారు.

ఆయనకు కూడా ఒక చిక్కు సమస్య!  ఏ రాణీగారి మందిరానికి ముందు వెళ్ళినా మిగతా రాణులు చిన్నబుచ్చుకుంటారు మరి.  ఫలాని రాణి దగ్గరకు ముందు వెళ్ళారు స్వామివారూ నా మీద ప్రేమ తరిగిందీ‌ అని ఏ రాణీ అనుకుని చిన్నబుచ్చు కుంటుందో! ఏ రాణీ అవమానంగా భావించి సంతాపం పొందుతుందో. ఏ‌ రాణీ‌ కోపిస్తుందో.  ఏ రాణీ అలిగి పో‌వయ్యా నాకు ముఖం చూపద్దు అంటుందో. ఏ రాణీ మనసు విరిగి పోతుందో. ఏ‌మి చేయాలబ్బా?

ఒకరా ఇద్దరా, పదహారువేల నూట ఎనిమిది మంది రాణీ లాయె! పాపం‌ వాళ్ళంతా కూడా తనకోసం బెంగపెట్టుకుని కూర్చున్నారాయె. ఏం చెయ్యాలీ?  లోకంలో మగవాళ్ళకు ఒక భార్య కోరికలూ అలకలూ తీర్చటమే బ్రహ్మప్రళయంగా ఉంటుంది. ఇద్దరు భార్యల ముద్దుల మొగుళ్ళ బాధ చెప్పనలవి కాదు.  ఏకంగా వేలాది భార్యలున్న శ్రీకృష్ణులవారికి ఎంత గడ్డు సమస్య ఇదీ?  కాని అఘటనఘటనా సమర్థుడూ సాక్షాత్తు సకలబ్రహ్మాండనాయకుడూ అయిన పరమేశ్వరుడికి ఇదేమంత సమస్య?

శ్రీకృష్ణులవారు ఒకే సారి అందరు భార్యల మందిరాల్లోకీ నిజస్వరూపంతో ప్రవేశించారు!

అప్పుడు ప్రతి భార్యామణీ కూడా స్వామివారు ముందుగా నా మందిరానికే విచ్చేసారూ అని ఉప్పొంగి ఘనస్వాగతం‌ ఇచ్చారు.  స్వామివారు కూడా ప్రతిభార్యనూ కుశలప్రశ్నలు వేసారు.

అబ్బాయిలు నీతో వినయంగా ప్రవర్తిస్తున్నారా?
కోడళ్ళు నీ‌ మాట జవదాటకుండా గౌరవించి ప్రవర్తిస్తున్నారా?
అతిథులకీ బంధువులకీ పండితులకీ‌ సత్కారాలు చక్కగా జరుగుతున్నాయా?
దేవతార్చనలకు ఏమీ‌ ఇబ్బందులు రావటం లేదు కదా?
అన్ని రకాల సంభారాలూ సమృధ్ధిగా ఉంటున్నాయి కదా?
నోములూ వ్రతాల్లాంటి శుభకార్యాలకు ఏమీ ఆటంకాలు లేవు కదా?

ఇలా ప్రతీ‌ భార్యనూ పేరుపేరునా కుశలం అడిగి ఇంటి పరిస్థితులన్నీ‌ వాకబు చేసుకున్నారు.  వారి వారి అభిరుచులన్నీ తెలిసిన వాడు కాబట్టి

సీ.  తిలక మేటికి లేదు తిలకినీ‌ తిలకమా
      పువ్వులు దుఱుమవా పువ్వుఁ‌బోఁడి
కస్తూరి యలఁదవా కస్తూరిగా గంధి
      తొడవులు దొడుగవా తొడవు తొడవ
కలహంసఁ బెంపుదే కలహంస గామిని
      కీరముఁ జదివింతె కీరవాణి
లతలఁ‌ బోషింతువా లతికాలలితదేహ
      సరిసి నోలాడుదే సరసిజాక్షి
ఆ. మృగికి మేఁత లిడుదె మృగశాబలోచన
గురుల నాదరింతె గురువివేక
బందుజనులఁ బ్రోతె బంధుచింతామణి
యనుచు సతుల నడిగె నచ్యుతుండు

ఒక రాణికి నుదుట రకరకాల వన్నెల చిన్నెల తిలకాలు ధరించటం సరదా.  అమెతో ఇదేమిటీ ఎందుకు నీవు తిలకాలు దిద్దుకోలేదూ‌ అని అడిగారు.

మరొక రాణికి రకరకాల పుస్పాలంటే పరమప్రీతి. ఆమెను ఎందుకలా పువ్వులు ముడుచుకోకుండా ఉన్నావోయ్ అని ప్రశ్న వేస్తున్నారు. అసలే పూవులాగా సుకుమారం‌ సౌందర్యం ఉన్న దేహాన్ని పువ్వులతో అలంకరించుకోక వడలిపోయినట్లు ఉంచటమేమిటీ అని అడిగారు.

వేరొక రాణికి నగలపిచ్చి. ఎప్పుడూ రకరకల నగలతో‌ అలంకరించుకుంటూ ఉంటుంది.  ఆమెతో, నువ్వు పెట్టుకుంటే నగలకే అందం వస్తుంది కదా, ఇదేమిటీ నగలు పెట్టుకోలేదూ‌ అని వాకబు చేస్తున్నారు.

ఇంకొక రాణికి హంసలను పెంచుతూ వాటితో కాలక్షేపం చేయటం వినోదం.  హంస లెక్కడా? నీ నడకను చూసి అవి మరింత అందంగా నడవటం నేర్చుకుంటూ ఉంటాయి కదా? హంసలన్నీ‌ ఎలా ఉన్నాయీ‌ అని ఆమెను అడిగి తెలుసుకుంటున్నారు.

ఒకానొక రాణికి చిలకల్ని పెంచటం వాటి ముద్దుపలుకులతో ఆనందించటం అలవాటు.  చిలకలాగా ముద్దుముద్దుగా మాట్లాడే నీ దగ్గర మన చిలకలేవీ‌ కనిపించవేం? చిలకలు బాగున్నాయా? కొత్త మాటలేమన్నా నేర్చుకున్నాయా అని అడుగుతున్నారు ఆవిడను.

రాణీల్లో‌ ఒకామెకు రకరకాల పూలతీగల్ని పెంచటం ఇష్టం. నువ్వే ఒక పూలతీగలాగా సుకుమారంగా ఉంటూ పూలతీగల పట్ల స్వజాతి అన్నట్లు అభిమానం‌ ఒలికిస్తూ ఉంటావు.  కొత్త తీగలేమైనా పెంచావా? లతలన్నీ ఎలా ఉన్నాయీ అని ఆమెను అడుగుతున్నారు.

కొలనులో విహరించటం భలే వినోదం అనుకునే రాణిగారూ ఉన్నారు. నీ కళ్ళు తామర రేకుల్లా ఉంటాయని తామరలంటే నీకు ఇష్టం‌ కదా! అందుకే మనం‌ నిత్యం జలవిహారాలు చేసే వాళ్ళం.  నేను ఊరెళ్ళానని మానేయలేదు కద?  జలవిహారాలు చేస్తున్నావా లేదా అని ప్రశ్నిస్తున్నారు.

పెంపుడు జంతువుల పట్ల మక్కువ గల రాణీని చూసి లేళ్లకూ ఇతర జంతువులకూ చక్కగా మేత వేస్తున్నావా? అవన్నీ‌ ఎలా ఉన్నాయీ అని అన్నారు. లేడికళ్ళ నిన్ను చూస్తే నీ‌ పెంపుడు లేళ్ళే వెంటనే గుర్తుకొస్తున్నాయి సుమా అని పరిహాసం చేసారు.

రాణీల్లో ఒకరు నిత్యం పండితులతో వివిధ విషయాల మీద చర్చలు చేయటం అలవాటు.  ఏమన్నా కొత్త విషయాలు నేర్చుకున్నావా? పండితగోష్టులు బాగా జరుగుతున్నాయా అని అడిగి తెలుసు కుంటున్నారు.

ఒకరాణీగారికి పరమబంధుప్రీతి. నువ్వసలే బంధువుల పాలిటి చింతామణివి. నేను ఊరెళ్ళానని వాళ్ళు రావటం మానలేదు కదా? మనవాళ్ళంతా కులాసాగా ఉన్నారా? వచ్చిపోతున్నారా యథావిదిగా అని అందరి యోగక్షేమాలూ అడుగుతున్నారు.

ఇలా అందరు ఇల్లాళ్లతోనూ వారివారికి ప్రత్యేకమైన విషయాలను గురించి అడిగి తెలుసుకుంటూ వాళ్ళందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించారు స్వామివారు. అదీ ఒకే సమయంలో అందరి ఇళ్ళల్లోనూ ప్రవేశించి!

ఆ వేలమంది రాణులూ మహాపతివ్రతలు కాబట్టి భర్త ఇంట లేనప్పుడు ఆయన్ను తలచుకుంటూ కాలక్షేపం చేయటంలో నిమగ్నమై తమతమ కేళీవిలాసాల పట్ల ఆసక్తి వదలిపెట్టి ఉన్నారు.

ఇప్పుడు శ్రీకృష్ణస్వామివారు రానే‌ వచ్చారు.  అందరి ఇళ్ళల్లోనూ‌ పండగ వాతావరణమే. 

ఆయనతో కూడి అనేక రకాల కేళీ విలాసాల్లో రాణులందరూ ఆనందసాగరంలో ఓలలాడుతున్నారు.

కాని సంగరహితుడైన శ్రీకృష్ణపరమాత్మ మాత్రం అందరినీ ఎవరికి కావలసిన విధంగా వారిని అలరిస్తూ ఉన్నారే కాని ఆయనకు ఏ వికారమూ లేదు. పైకి మాత్రం అందరి మగవాళ్ళల్లాగా భార్యాలోలుడి వలె నటిస్తూ ఉన్నారు. జగన్నాటకసూత్రధారికి అదొక లెక్కా! శివుడి మనస్సు నైనా మన్మథుడు ఒక్కక్షణం పాటు చలింప జేయగలిగాడు కాని వేలకొద్దీ మంది మన్మథబాణాల్లాంటి చూపులూ‌ చేష్టలతో చుట్టూ చేరి ఉన్నా పరమాత్ముడైన శ్రీకృష్ణస్వామి మనస్సులో ఏ వికారమూ కలిగించ లేక పోయారు.

ఇలా దేనితోనూ ఎన్నడూ కలయిక లేని శ్రీకృష్ణస్వామి సామాన్యసంసారి లాగా కనిపిస్తూ ఉంటే చూచే జనులకు మాత్రం ఆయన కూడా తమలాంటి వాడే నన్న భ్రమ కలుగుతున్నది.  ఆత్మను ఆశ్రయించుకొని ఉండే బుధ్ధి ఆత్మలో ఉన్న ఆనందం‌ వంటి లక్షణాలతో కలిసి ఉంటున్నా ఆ ఆనందాదులతో‌ సంయోగం పొందలేదు. అలాగే ఈశ్వరుడు ప్రకృతిలో ఉంటూ కూడా ప్రకృతి లక్షణాలైన సుఖమూ దుఃఖమూ ఏ మాత్రం పొందడు. 

అడవుల్లో ఎండిన వెదురు పొదల్లో గడలు వాటిలో అవి రాచుకొని అగ్ని పుట్టే టందుకు గాలి కారణం అవుతుంది.  అందుచేత నిజానికి గాలి అడవులను తగల బెడుతోంది.  అలాగే పాపంపండిన రాజలోకంలో పరస్పరం తగవులు రేకెత్తించి తన చేతికి మట్టి అంటుకోకుండా శ్రీకృష్ణుడు రాజుల్ని సంహరించాడు.  భూభారాన్ని తగ్గించాడు.

అంతా చేసి, ఏమీ‌ ఎరగని వాడిలా, మరమ శాంతంగా, ఆనందంగా స్త్రీజనం మధ్య వినోదంగా కాలక్షేపం చేస్తునాడు ఆయన!

ఆ రాణులలో ప్రతి వనితా మాత్రం నిత్యం స్వామివారు నాతోనే ఉంటున్నారూ,
ఎంత అదృష్టవంతురాల్నీ అని తలపోసి మురిసిపోతున్నది.  అప్రమేయుడైన స్వామి మాహాత్మ్యాన్ని యతులు కూడా కొంచెం‌గా మాత్రమే‌ తెలుసుకో గలరు. ఆ స్త్రీజనానికి ఏమి తెలుస్తుంది?  స్వామి వఠ్ఠి కాముకుడని కూడా వాళ్ళు అనుకుని మురుస్తున్నారు.

ఇలా శ్రీకృష్ణస్వామి వారి లీలా వినోద విహారాలను గురించి సూతపౌరాణికులు చెప్పగా విని శౌనకాది మహర్షులు చాలా ఆశ్చర్యం ఆనందం అనుభవించారు.

ఆ తరువాత, శౌనకులవారిని మరి పరీక్షిన్మహారాజు వృత్తాంతం చెప్పండి అని అడిగారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి