15, ఆగస్టు 2013, గురువారం

ప్రథమస్కంధం: 25. కలియుగ ప్రారంభం

అర్జునుడు ద్వారక నుండి తిరిగి వచ్చి, శ్రీకృష్ణావతార పరిసమాప్తిని వివరించిన తర్వాత, ధర్మజులవారు ఇక పై చేయవలసినది నిశ్చయం చేసుకున్నారు. 

తమ్ముళ్ళతో సమావేశమై, వారితో నారదులవారు లోగడ తనతో "ఎంత కాలము కృష్ణు డీశ్వరు డిధ్ధరిత్రి చరించు, మీ రంతకాలము ఉండుడు.  అవ్వలం పని లేదు" అని ఆదేశించిన వాక్యాలను గురించి చర్చించారు.

అందరూ కలిసి ఇక మనం స్వర్గానికి పోవలసిన సమయం వచ్చింది అని నిర్ణయించుకున్నారు.

ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని సంకల్పించారు.

ముల్లును ముల్లుతో తీసి వేసి, ఆ తరువాత రెండు ముళ్ళనూ వదిలేస్తాం‌ కదా?  అలాగ, ఈశ్వరుడు కూడా లోక కంటమైన అనేక శరీరాలను పడగొట్టటానికి స్వయంగా తానూ ఒక శరీరం ధరించి వచ్చాడు.

అలా ఈశ్వరుడు ధరించి వచ్చినది ఈ శ్రీకృష్ణస్వరూపమైన యాదవదేవం.  ఆయన  తాను చేయటానికి సంకల్పించిన కార్యం నెఱవేర్చుకున్నాక, తనకు తాను ఆపాదించుకున్న ఈ యాదవ దేహాన్నీ వదలి పెట్టి వైకుంఠానికి తిరిగిపోయాడు.

ఈశ్వరుడికి నాదీ, పరాయిదీ వంటి బేధాలు ఏమీ ఉండవు.  తనది అని స్వీకరించిన శరీరమూ, దుష్టము అని పడగొట్టిన యితర శరీరాలూ, సంహరించటానికి సమానమే ఆయనకు.

ఒక నటుడు, ఏ విధంగా తన అసలు రూపంతో తాను తెర వెనుకనే ఉంటూ, తెర మీదకు మాత్రం అవసరార్థంగా ఎలా రకరకాల వేషాలతో వస్తాడో, ఈశ్వరుడు కూడా జగన్నాటకంలో అలాగే చేస్తాడు.

అందుకే ఆయన సందర్భోచితంగా మత్సావతారం, కూర్మావతారం అంటూ అనేక అవతారాలను ఒక లీలగా ధరిస్తూ ఉంటాడు.  అవసరం తీరగానే ఆ అవతారాలను విడిచి పెట్టి నిజధామానికి మరలి పోతూ ఉంటాడు.

సూతపౌరాణికుడు శౌనకాది మహర్షులకి ఈ విధంగా స్పష్టం చేసి ఇంకా ఇలా అన్నాడు.

క.  ఏ దినమున వైకుంఠుఁడు
మేదినిపైఁ దాల్చి నట్టి మేను విడచినాఁ
డా దినమున నశుభ ప్రతి
పాదకమగు కలియుగంబు ప్రాప్తం బయ్యెన్

అంతా భగవంతుడూ వైకుంఠవాసుడూ అయిన శ్రీహరి సంకల్పం.  అయన దుష్టసంహారం కోసంగా భూమి మీదకు అవతరించటానికి  శ్రీకృష్ణుడనే పేరుతో ఒక శరీరాన్ని ధరించాడు.

ఏ రోజున అయితే శ్రీహరి ఆ శరీరాన్ని విడిచి పెట్టి శ్రీకృష్ణావతారాన్ని పరిసమాప్తం చేసాడో,  సరిగ్గా ఆ దినాన్నే, కలియుగం‌ ప్రారంభం అయింది.  ఈ‌ కలియుగం అనేది అశుభాలన్నిటికీ‌ మూలం.

కలియుగం నాలుగుయుగాల క్రమంలో ఆఖరిది.  యుగాల క్రమం ఒకసారి చూద్దాం.

1. కృతయుగం             17,28000  =   4 x 4,32,000
2. త్రేతాయుగం            12,96,000  =   3 x 4,32,000
3. ద్వాపరయుగం           8,64,000  =   2 x 4,32,000
4. కలియుగం                4,32,000  =   1 x 4,32,000
మొత్తం (మహాయుగం)  43,20,000  = 10 x 4,32,000

నాలుగు యుగాలనీ కలిపి మహాయుగం అంటారు.  ఇది పది కలియుగా లంత కాలం.  ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో కలియుగం నడుస్తోంది. 

కలియుగం ప్రారంభంలో గ్రహాలన్నీ మేషరాశిలో జతకట్టాయి.  ఈ‌ సంఘటన కాలాన్ని వెనుక ఎప్పుడు జరిగిందని లెక్కగడితే , క్రీ.పూ. 3,102 సం॥ ఫిబ్రవరి 18వ తారీఖుకు సరిపోతోంది.

ఆ రోజునే శ్రీకృష్ణావతార పరిసమాప్తి జరిగింది.
ఆ రోజునే కలియుగం ప్రారంభం అయింది.

మన పంచాగాలలో కల్యాబ్దాః అంటూ కలిప్రారంభం నుండి ఎన్ని యుగాలయిందీ కూడా లెక్క చెప్తారు. గమనించండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి