19, ఆగస్టు 2013, సోమవారం

ప్రథమస్కంధం: 29. గోవృషభాలను కలి తన్నటం చూసి పరీక్షిత్తు ఆగ్రహించటం.

సమయంలో

శా. కైలాసాచల సన్నిభం బగు మహాగంభీర గోరాజముం
గాలక్రోధుఁడు దండహస్తుఁడు నృపాకార్రుండు క్రూరుండు జంఘాలుం డొక్కఁడు శూద్రుఁ డాసురగతిం కారుణ్య నిర్ముక్తుడై
నేలం గూలగ దన్నెఁ బంచితిలగా నిర్ఘాతపాదాహతిన్

ఆ ధర్మదేవుడు మిక్కిలి తెల్లని అందమైన వృషభాకారంలో ఒక కైలాసపర్వంతం లాగా  గంభీరంగా ఉన్నాడు.  అప్పుడు తాడిచెట్టులాగా పొడుగ్గా ఉన్న ఒక దుష్టుడు అక్కడికి వచ్చాడు.  వాడు యముడి లాగా కోపంతో ఊగిపోతూ ఉన్నాడు.  ఒక పెద్ద రాజదండం ఒకటి చేత పుచ్చుకుని రాజులాగం వేషం వేసుకుని ఉన్నాడు.  రావటంతోనే వాడు, జాలీ దయా యేమీ లేకుండా ఒక రాక్షసుళ్ళాగా ఆ వృషభం మీద విరుచుకు పడ్డాడు. ఆ శ్రేష్టమైన ఎద్దు కాస్తా కీళ్ళు సడలి నేలమీద కూలి పడిపోయేలాగా పిడుగుల్లాంటి తన్నులు కురిపించాడు.

శా. ఆలోంలాంగక నశ్రుతోయకణజాలాక్షిన్ మహాంభారవన్
బాలారూఢతృణావళీకబళలోభవ్యాప్తజిహ్వాగ్ర నాం
దోళస్వాంత నజీవవత్స నుదయద్దుఃఖాన్వితన్ ఘర్మకీ
లాలాపూర్ణశరీర నా మొదవు నుల్లంఘీంచి తన్నెన్ వడిన్

ఎద్దును తన్ని ఊరుకున్నాడా ఆ నీచుడు? లేదు. అక్కడ ఆవు కూడా ఉందని వాడి కంటబడింది. అసలే అది దూడలేక, పాపం దిగులుతో చిక్కి దీనంగా ఉంది.  అక్కడ కొత్తగా మెలకలెత్తుతున్న గడ్డిపరకల మీదికి నాలుక జాచి తినబోతోంది ఆ సమయంలో ఆ గోవు. ఆ గోమాత పైకి ఎగిరి దూకి తీవ్రంగా తన్నులు కురిపించాడు ఆ క్రూరుడు.  ఆ గోమాత పాపం, భయాందోళనలతో చెమటలు పడుతూ ఉండగా,  కళ్ళ వెంట నీళ్ళు కార్చుతూ, పెద్దగా అంబా అంబా అని ఆర్తితో అరుస్తూ ఉంది.  వాడు నిర్దాక్షిణ్యంగా దాన్ని తన్నుతున్నాడు.

అదే సమయానికి అక్కడకు రాజర్షి ఐన పరీక్షిన్మహారాజు కూడా వచ్చాడు.  ఈ మహాఘోర సంఘటన చూసి ఆయనకు పట్టరాని బాధ కలిగింది.  పైగా ఆ పాపాత్ముడు ఒక రాజులాగా వేషం వేసుకుని మరీ ఉండటం కూడా చూసి ఆయనకు తీవ్రంగా ఆగ్రహం‌ కలిగింది.  తక్షణం ఆ పరీక్షిన్మహారాజు వాడి మీదకు విల్లెక్కుపెట్టి

శా. నిన్నుం గొమ్ములఁ జిమ్మెనో కదిసెనో నిర్భీతివై గోవులం
దన్నం గారణ మేమి మద్భుజ సనాథక్షోణి నే వేళలం
దు న్నేరంబులు సేయరా దెఱుఁగవా ధూర్తత్వమున్ భూమి భృ
త్సన్నాహంబు నొనర్చె దెవ్వడఁవు నిన్ శాసించెదన్ దుర్మతీ

ఏమయ్యా,నిన్నేమన్నా ఇవి కొమ్ముల్తో పొడిచాయా? అసలు నీ మీదకు దాడి చేసాయా? ఎందుకు వీటిని తన్నుతున్నావూ? తప్పని తెలియదా నీకు?  పైగా నీ పాడు పనికి తోడు ఒక రాజు వేషం కూడానా?  ఈ‌ నేలకి రాజును నేను.  నా పాలనలో ఏ ప్రాంతంలోనూ ఏ సమయంలోనూ నేరాలు చేయటం కుదరదని తెలియదా నీకు?  ఎవడివిరా నువ్వు? ఉండు, నీ పని పడతాను.

ఒరే, కృష్ణార్జునులు ఇద్దరూ ఇప్పుడు భూమి మీద లేరు కాబట్టి, నన్నింక ఎవ్వరూ ఏమీ చేయలేరులే‌ అని మదమెక్కి కొట్టుకుంటున్నావా?  కొంచెం కూడా బుధ్ది లేకుందా సాధుజంతువుల్ని హింసిస్తున్నావు? అని వాడిని గట్టిగా గద్దించాడు పరీక్షిత్తు.

అలా వాడిని గద్దించి, ఇలా అంటున్నాడు

ఓ‌వృషభరాజా, కురువంశపు ప్రభువుల బాహువులే ఈ‌ రాజ్యానికి ప్రహారీగోడలు. ఈ మా భూమిలో ఇంత వరకూ అధర్మం కారణంగా, నువ్వు తప్ప మరెవరూ కన్నీళ్ళు పెట్టటం జరగలేదు.  ఈ‌ దుష్టుణ్ణి చంపి, నీకు సంతోషం కలిగిస్తాను అని ఎద్దును ఓదార్చాడు.  మళ్ళీ నీకు పుష్టికలిగి నాలుగుపాదాలా నడిచేటట్లు చేస్తాను.  నీ నోటికి హితవుగా ఇంత గడ్డి తింటావు. నదుల్లో నీళ్ళతో దాహం తీర్చుకుంటావు. అలాంటి పరమసాధువుగా ఉండే నీ‌ కాళ్ళ మీద ఇలా దెబ్బలు కొట్టిన వాడి చేతులు విరగ్గొడతాను.  వాడెవడైనా సరే, ఏ లోకాని పారిపోవాలని చూసినా లాభం లేదు.  వాడికి చావు మూడింది.

చ. అగణితవైభవుండగు మురాంతకుఁ డక్కట పోయె నంచు నె
వ్వగల గృశించి నేత్రముల వారికణంబులు దేకుమమ్మ లో
బెగడకుమమ్మ మద్విశిఖబృందములన్ వృషలున్ వధింతు నా
మగఁటిమిఁ జూడవమ్మ వెఱ మానఁ గదమ్మ శుభప్రదాయినీ

ఓ‌ గోమాతా, భయపడకు. నాకు తెలుసు.  ఇప్పటి దాకా మీ గోవుల్ని శ్రీకృష్ణస్వామి ఎంతో ప్రేమగా సంరక్షించారు.  ఇప్పుడాయన లేరు.  అందుకు బాధపడి కళ్ళ నీళ్ళు పెట్టుకోవటం మాను తల్లీ.   అమ్మా, నీ మనస్సులో భయం వదలి పెట్టు, ఇంకా రాజునూ ధర్మాన్ని రక్షించే వాడినీ‌ నేనున్నాను. నా పరాక్రమం మీద విశ్వాసం ఉంచు. నా బాణాల్తో ఈ ఛండాలుణ్ణి ఇప్పుడే వధిస్తాను. శుభప్రదాయినివి అయిన నీ‌ కష్టం ఇప్పుడే తీరుస్తాను.

సాధుజంతువుల్ని బాధపెట్టే దుష్టుల్ని శిక్షించని నిస్ప్రయోజకుడైన రాజుకి కీర్తీ నశిస్తుంది, ఆయుక్షీణమూ అవుతుంది.  ఆలాంటి రాజు చేసిన పుణ్యాలేవీ‌ ఫలించవు - వాడిని దేవతలు స్వర్గానికి రానివ్వరు.  అందుకే‌ పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మంచివాళ్ళని రక్షించటం, చెడ్డవాళ్ళని శిక్షించటం అనే రెండూ రాజుల కర్తవ్యాలుగా భగవంతుడే నిర్ణయించాడని.  అందు చేత, ఓ‌ గోమాతా, వీ‌ణ్ణి శిక్షించి నీకు సుఖమూ‌ సంతోషమూ కలిగిస్తాను.

ఇలా పరీక్షిన్మహారాజు గోవునీ, వృషభాన్నీ ఊరడిస్తూ మాట్లాడాడు.  ఆ మాటలకు  వృషభం రూపంలో ఉన్న ధర్మదేవుడు సంతోషించాడు. 

అవునయ్యా, క్రూరుల్ని చంపి, సాధువుల్ని రక్షించి పోషించే కురువంశపు మహానుభావుల వారసుడివి. మీ పూర్వీకులు ఇలాంటి సత్పురుషులు కాబట్టే, భగవంతుడు వారి  భక్తికి మెచ్చి వాళ్ళకు దూతగా కూడా వెళ్ళాడు. మరి భగవంతుడు భక్తిలతలకే కదా కట్టుబడేదీ.

మేమా, ఏ ఇతర ప్రాణులకీ బాధ కలిగించే జీవులం కాదు. సరే, మీ మనుష్యులకి మా వల్ల ఉపకారమే‌ కాని కించిత్తూ దుఃఖం అనేది ఎవ్వడికీ ఎన్నడు జరగనే జరగదు.  అసలు ఈ‌ లోకంలో‌ దుఃఖానికి కారణం ఏమిటీ అన్న విషయంలో యోగుల్లో కూడా అనేక అభిప్రాయబేధా లున్నాయి.  కొందరు తమలోని ఆత్మ యొక్క వర్తనమే సుఖదుఃఖాలకి కారణం అంటారు.  కొందరు గణితాలు చేసి గ్రహాలూ వాటి చారలే కష్టసుఖాలు కలిగిస్తున్నాయంటారు. మరి కొందరు పూర్వం చేసుకున్న కర్మల ఫలితాలే కష్టసుఖాలంటారు.  హేతువాదులైన వాళ్ళు మానవులకు జాతిస్వభావం కారణంగానే ఇవన్నీ అంటారు.  కాని ఇవేవీ నిజం కాదు. ఏ తర్కానికీ, ఏ నిర్వచనాలనీ లొంగని పరమేశ్వరుడి లీలా విలాసమే కాని నిజంగా సుఖమూ దుఃఖమూ అంటూ ఏమీ‌ లేదు. 

ఇలా వృషభం చెప్పగానే పరీక్షిత్తు ఆశ్చర్యపడ్డాడు.  ఆ వృషభం‌ రూపంలో ఉన్నది ధర్మదేవత అని గ్రహించాడు.  ఓ‌ ధర్మదేవతా నీకు, తపస్సు,శౌచం, దయ, సత్యం అనే‌ నాలుగు పాదాలనీ, కృతయుగంలో ఆ నాలుగు పాదాలూ ఉండేవనీ, ఒక్కో యుగం గడిచిన కొద్దీ నీకు ఒక్కోపాదం బలహీన పడుతూ వస్తుందనీ విన్నాను.  ఇప్పుడు కలియుగం కనుక ఒంటిపాదం అయిన దుస్థితి వచ్చింది.  అయితే, ఈగోవు భూదేవి అన్నమాట. ఈవిడ శ్రీకృష్ణరహితమై శోభారహితమైన స్థితికి చాల విచారిస్తున్నది.  ఇంక తుఛ్ఛులైన వాళ్ళు నన్నుపాలిస్తారే అని శోకిస్తోంది చూడు.

అయినా నేనున్నంతవరకూ మీకు భయం లేదు.

ఇలా వారిద్దరినీ సముదాయించి పరీక్షిన్మహారాజు కలిని చంపుతానని గర్జించి తళతళా మెరుస్తున్న తన ఖడ్గాన్ని బయటకు తీసి, కలివైపు తిరిగాడు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి