28, ఆగస్టు 2013, బుధవారం

ద్వితీయస్కంధం: 02. ముక్తి పొందటానికి ఒక్క రెండు ఘడియలు చాలు!

పరీక్షిన్మహారాజా, భగవన్నామం సహాయంతో మనుష్యులు ముక్తి పొందవచ్చు నని చెప్పాను.  మనస్సు భగవంతుని దివ్యప్రభావాన్ని లోన నింపుకుందుకు అయన రూపం నామం, గుణాలూ, ఆయనకు సంబంధించిన కథలూ అన్నీ దోహదం చేస్తాయి.  ఇదంతా భక్తిశ్రధ్ధలకు సంబంధించిన వ్యవహారం.  అవి పుష్కలంగా ఉన్నవాడికి, హరిస్మరణం అనేది ఒకటి రెండు ఘడియలు మాత్రమే చేయటం కుదిరినా,  అది ముక్తిప్రదం అవుతుంది.  విను

తరళం. హరి నెఱుంగక యింటిలో బహు హాయనంబులు మత్తుఁడై
పొరలు చుండెడి వెఱ్ఱి ముక్తికిఁ బోవ నేర్చునె వాఁడు సం
సరణముం బెడఁబాయఁ డెన్నఁడు సత్య మా హరినామ సం
స్మరణ మొక్క ముహూర్త మాత్రము చాలు ముక్తిదమౌ నృపా

అన్నింటికీ సర్వాధిపతి ఐన శ్రీహరిని తెలుసుకోలేక శరీరం అనబడే ఈ ఇంట్లో ఎన్నో యేళ్ళు ఉంటే మాత్రం ఏం లాభం?  ఈ ఇంద్రియాలు అనబడే బంట్లు అందించే విషయభోగాలు పైకి సుఖాల్లాగా కనిపించి మత్తెక్కిస్తుంటే వాటిలో పడి పొర్లుతూ ఉన్నవాడికి విడుదల ఎక్కడా? ఒక శరీరంతో భోగించి ఇంద్రియతృష్ణ తీరక, ఆ శరీరం కాస్తా పడిపోయాక మరొక శరీరం వెదుక్కుంటూ ఇహలోకం లోనే పరిభ్రమించటం మాత్రమే తెలిసిన వెఱ్ఱివాడు వాడు.  ఇంక వాడికి ముక్తి అనేది ఒకటి ఉంది అనేది తెలుస్తుందా?  తెలిసినా ఇంద్రియాల చెర నుండి బయటపడి దాన్ని తనంత తానుగా అందుకో గలడా?  అసలీ ప్రపంచం అనే పంజరం నుంచి వాడు తప్పించుకోనే లేడేమో! 

కానీ, అలాంటి వాడికైనా, ఎప్పటికో ఒకప్పటికి విరక్తి పుట్టి తీరుతుంది.  అదృష్టవశాత్తు హరిభక్తి కుదిరి, అటువంటి వాడు ఒక్క ముహూర్తకాలం హరినామాన్ని ఆశ్రయించి శ్రీహరిని శరణు కోరినా చాలు.  వాడికి ఆ హరినామం, ముక్తిని ప్రసాదించేది అవుతుంది.  ఇందులో సందేహం ఎంత మాత్రం లేదు.  ఇది సత్యం.

అంతరార్థం స్పష్టమే.  అన్ని ఉపాధుల్లోనూ శ్రీహరి ఉన్నాడు.  అయితే ఆ ఉపాధులకి ఉన్న పరిమితుల కారణంగా హృదయాంతర్వర్తి ఐన శ్రీహరిని తెలుసుకోవటం దాదాపు అసాధ్యం.  దీనికి కారణం నామ రూపాలతో చుట్టూ ఉన్న ప్రకృతిమీద వివిధ ఉపాధుల్లో ఉన్న జీవులకి ఏర్పడే అనుబంధం.  అదే మాయ.  మిగిలిన అన్ని జీవులకంటే,  మానవ ఉపాధిలో ఉన్న జీవుడికి ఒక సౌలభ్యం ఉంది.  అతడు ప్రాపంచిక భోగాలూ, బంధాలు అనే వాటి పట్ల విరక్తి చెంది,  అంతర్ముఖుడై హృదయంలో నెలకొన్న భగవదంశను భావించటం సాధ్యపడుతుంది.  అలా చేయగలిగిన నాడు,  అది ఒక్క క్షణం కాలం చేయగలిగినా ఇక ఈ‌ ప్రపంచానికి కట్టుబడడు.   అదే ముక్తి. అసలు ముక్తి అంటే విడుదల - ఈ‌ ప్రకృతి బంధం నుండి విడుదల.  ఆ అంతర్ముఖత్వం సాధించటానికి శ్రీహరి నామం ఒక్కటే శరణ్యం.  మిగతా వన్నీ ప్రపంచానికి సంబంధించినవి.  కాబట్టి, వాటిలో మనస్సు దేని నాశ్రయించినా అది ప్రపంచాన్ని ఎలా దాటిస్తుందీ? కాబట్టి శ్రీహరి నామాన్ని ఆశ్రయించితే మాత్రమే మోక్షం.

మహారాజా,  ఈ‌ నా మాటలు నమ్మశక్యంగా అనిపించక పోవచ్చు.  ఈ విషయాన్ని పూర్వం  ఖట్వాంగుడు ఋజువు చేసి చూపాడు.   ఆ కథ చెబుతాను విను అన్నాడు శుకయోగి.

సీ.  కౌరవేశ్వర తొల్లి ఖట్వాంగుడఁని విభుం
      డిల నేడు దీవులు నేలు చుండి
శక్రాది దివిజులు సంగ్రామభూముల
      నుగ్రదానవులకు నోడి వచ్చి
తమకు దో డడిగిన  ధరనుండి దివి కేఁగి
      దానవ విభుల నందఱ వధింప
వర మిత్తు మనుచు దేవతలు సంభాషింప
      జీవితకాలంబు సెప్పుఁ డిదియ
ఆ. వరము నాకు నొండు వర మెల్ల ననవుఁడు
నాయు వొక ముహూర్తమంత దడవు
గల దటంచుఁ బలుక గగన యానమున న
మ్మానవేశ్వరుండు మహికి వచ్చి

అనగనగా ఒక రాజు.  ఆయన పేరు ఖట్వాంగుడు.  ఇప్పుడు ఆయన పేరు కూడా ఎవ్వరికీ తెలియక పోవచ్చు.  కాని అప్పట్లో ఆ మహారాజు తన ప్రతాపంతో అందర్నీ జయించాడు.  సప్తద్వీపా వసుంధరా అంటారు.  అలాంటి ఏడు ఖండాలుగా ఉన్న సమస్త భూమండలాన్నీ ఏలిన మహా చక్రవర్తి ఆయన.

దేవతలకూ రాక్షసులకూ గొప్ప యుధ్దాలు జరుగుతూ ఉండేవి.  వాటిలో ఒక సారి దేవతలే ఓడి పోయారు కాలం కలిసిరాక.  అందుచేత దేవతల్లో ముఖ్యుల్ని వెంట బెట్టుకుని  సాక్షాత్తూ ఇంద్రుడే వచ్చి అడిగాడు.  ఓ ఖట్వాంగ చక్రవర్తీ వచ్చి మా తరపున యుధ్ధం చేసి రాక్షసుల్ని ఓడించి పుణ్యం‌ కట్టుకో అని.  

ఆ ఖట్వాంగుడు అంగీకరించి భూలోకం నుండి దేవలోకం వెళ్ళాడు. రాక్షసులతో యుధ్ధం చేసి వాళ్ళని ఓడించాడు. దేవతలకు చాల సంతోషం కలిగింది.  రాజా, ఖట్వాంగా, నీ సహాయం వల్ల గెలిచాం.  నీకు కోరిన వరం ఇస్తాం.  కోరుకో నీకు ఏమి కావాలో అన్నారు దేవతలు.

ఖట్వాంగుడు ఏమి వరం అడిగాడో తెలుసునా?  ఎప్పుడు ఎవరూ,  దేవతలు సహా ఎవరూ, కనీ వినీ‌ ఎరగని వరం అడిగాడు.  దేవతలారా,  నాకు పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు.  నాకు ఇంకా ఎంత ఆయుర్దాయం ఉందో దయచేసి చెప్పండి.  ఆ వరం చాలు నాకు.   వేరే వరం ఏమీ అక్కర్లేదు లెండి అన్నాడు.   నిజానికి అదొక పెద్ద వరమా, సాక్షాత్తూ ఇంద్రాది దేవతలనే అడగటానికి.  ఎంత చిన్న కోరికో‌ చూడు ఆయన కోరుకున్నది!

దేవతలు ఆశ్చర్యపోయి.  ఇదేమిటయ్యా ఇంత చిన్న కోరిక కోరావూ తెలిసి తెలిసీ.  సరే, విను, ఇంక నీకు మిగిలి ఉన్న ఆయుర్దాయం అల్లా ఒకే ఒక్క ముహూర్తం మాత్రమే‌ అని చెప్పారు.

ఖట్వాంగుడి ఆయుర్దాయం కాస్తా ముగిసి పోయిందన్న మాట -  మృత్యువు సిథ్థంగా ఉంది, ఒక్క ముహూర్తం తరువాత తనను తీసుకు పోవటానికి.

ఖట్వాంగుడేమీ దిగులు పడలేదు.   వెంటనే,  దేవతల అనుమతి తీసుకుని తక్షణమే ఆకాశమార్గాన భూమికి తిరిగి వచ్చేసాడు.

ఆయనకు భూలోకంలో సమస్తమైన ఐశ్వర్యాలూ ఉన్నాయి.  మహా చక్రవర్తి కదా!  ఆయనకున్న భోగాలు మరి ఎవరి వద్ద ఉంటాయి?  అవన్నీ వదిలి పెట్టేశాడు.  నిత్యం తనను అంటి పెట్టుకు తిరిగే కవుల్నీ, పండితుల్నీ, మంత్రి సామంతుల్నీ అందర్నీ వదిలి పెట్టాడు.  చివరికి తనకు ప్రాణంతో సమానం  అయిన భార్యల పట్ల ఉన్న అనుబంధాన్నీ వదిలి పెట్టాడు.

అత్యంత గాఢమైన వైరాగ్యంతో నిశ్చలమైన చిత్తంతో నిలబడ్డాడు.

క.  గోవింద నామ కీర్తనఁ
గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరి
త్రీ విభుఁడు సూర గొనియెను
గైవల్యము దొల్లి రెండు ఘడియలలోనన్

ఈ సంసారసాగరాన్ని దాటించేది కేవలం గోవిందుడు మాత్రమే అనే నమ్మకంతో సుస్థిరమైన చిత్తంతో ఉన్నాడు.  ఈ ప్రకృతి తనని ఎక్కడ వెనక్కు లాక్కుంటుందో అన్న భయం ఏమాత్రం లేకుండా స్థిరంగా గోవిందుడి వల్ల మోక్షం వస్తుందని నమ్మి నిలబడ్డాడు.  ఉన్న కాస్త ఆయుర్దాయమూ, కొంచెం వెలితిగా రెండు ఘడియలే.  (ఘడియ అంటే  24  నిమిషాలు) ఈ స్వల్పకాలం లోనే ఆ ఖట్వాంగ చక్రవర్తి గోవింద నామస్మరణ త్రికరణశుథ్థిగా చేసాడు. ఆ నామ ప్రభావంతో ఆయన మోక్షం సంపాదించుకున్నాడు.

అదండి ఖట్వాంగుడి కథ.  మనకు ఎంతో అబ్బురపాటు కలిగించే ఈ‌ కథలో ఒక ప్రశ్న తోస్తుంది సహజంగా.  దేవతలే గెలవలేని రాక్షసుల్ని ఒక మానవుడు ఎలా గెలవగలడా అని మొదటి ప్రశ్న.  బహుశః అప్పటి రాక్షసరాజుకు దేవతలచేత చావు లేకుండా వరం ఉందేమో.  అదేమీ పెద్ద విచిత్రం కాదు. 

కాని మరొక ముఖ్యమైన అంతరార్థం ఉంది, ఈ‌ ఖట్వాంగుడి కథలో.  అదేమీటో చూడండి.

ఈ‌ శరీరం బ్రహ్మాండానికి ప్రతీక.  దేవతలు ఈ‌ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉంటారు.  మనిషిలోని సర్వేంద్రియాలకూ, మనస్సుకూ వాళ్ళు అధిపతులు.  అలాగే ఈ‌ మానవ దేహాన్ని ఆక్రమించుకుని కామ, క్రోధాది అరిషడ్వర్గమూ ఉంటుంది.   వీటినే రాక్షసులుగా తెలుసుకోవాలి మనం.  జీవుడు ఈ‌ ఇహలోకాన్ని పట్టుకుని నివసిస్తూ ఉన్నంతకాలం,  ఈ‌ ఉపాధిని ఆక్రమించి కూర్చున్న కామం, క్రోధం, మదం లాంటి రాక్షసులు పెత్తనం చెలాయిస్తూ ఉంటారు.  ఈ ఉపాధిలో నివసిస్తున్న దేవతా శక్తులకి ఊపిరి అడకుండా చేస్తూ ఉంటారు. 

మానవ శరీరం అనే ఉపాధిలో ఉన్న జీవుడు ఉత్తమ గతిని సాధించాలంటే దేవతాశక్తులు గెలిచి, రాక్షసశక్తులు నశించాలి. అలా జరగాలంటే జీవుడు చాలా సాధన చేయాలి.  మూలాధారాది షట్చక్రాలగుండా ఆత్మశక్తిని ఊర్ధముఖంగా ప్రయాణం చేయించాలి.  అదే ఇక్కడి కథలో ఖట్వాంగుడి ఊర్ద్వలోక ప్రయాణం అనే సంకేతంతో చెప్పబడింది.

అలా సాధన పరిపక్వం అయిన జీవుడి ఉత్తమమైన ప్రజ్ఞ అరిషడ్వర్గాది రాక్షసులనీ హతమార్చుతుంది.  ఉపాధిలో ఉన్న దేవతా శక్తులు అన్నీ,  సంతోషంగా సంపూర్ణంగా వికసిస్తాయి.  ఇంక అవి సాధకుడికి కావలసిన శుభం చేకూర్చగలవు.  నిజానికి అసలైన శుభం అంటే మోక్షమే.

సాధకుడు మానవ ఉపాధి అనేది, అత్యల్పమైన జీవిత కాలం కలిగి ఉందని గ్రహిస్తాడు.  అనంతమైన, భగవంతుడి స్వరూపం ఐన కాలప్రవాహంలో ఒక ఉపాధి నిలబడి ఉండే సమయం ఏపాటిది నిజంగా?

ఈ గ్రహింపు రావటమే పూర్ణప్రజ్ఞా స్థితికి చేరుకోవటం.  అప్పుడు ఆ జీవుడు కోరుకునేది ఏమి ఉంటుంది?  ఈ ఉపాధే ఇంక క్షణికమూ స్వల్పమూ అనే దృష్టి కలిగాక, ఇంకా దాన్ని పోషించాలీ అలంకరించాలీ అంటూ‌ ఆలోచిస్తాడా? ఆలోచించనే ఆలోచించడు కదా? 

కొద్దో, గొప్పో ఈ ఉపాధి ఎంతకాలం భరించవలసి ఉందో అంతకాలం భరించటం తప్పదు.  అందుచేత, ఆ కాలాన్ని సర్వేశ్వరుడికి అర్పణం చేసి నిష్కామయోగంలో భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటాడు.  

'నేను' అనే భావం విసర్జించి, సమస్తం భగవంతుడే అని గ్రహింపు కలిగాక, కాలం అప్రధానం ఐపోతుంది.  కాబట్టి, అలా ఎంత కాలం భగవంతుణ్ణి స్మరిస్తాడూ అన్నది ప్రధానం కానే‌ కాదు.   అది ఒక మహాయుగం కావచ్చు, ఒక్క క్షణం కావచ్చును.  ముక్తి సిథ్థించటం‌ తథ్యం.

ఇదీ ఈ‌కథలో దాగి ఉన్న అంతరార్థం.

శుకమహర్షి మొట్ట మొదటగా ‌ఈ‌ కథను ఎందుకు చెప్పారో మనకి ఇప్పటికే అవగతం కావాలి.  ఏడు రోజులు చాలా స్వల్పకాలం కదా, ముక్తి సాధించటానికి ఆ కొద్ది సమయం సరిపోతుందా అని కదా పరీక్షిత్తు అనుమానం.  అది నివృత్తి చేయటాని కన్నమాట, ఈ‌ అద్భుత వృత్తాంతం ప్రస్తావించింది ముందుగా. 
 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి