5, ఆగస్టు 2013, సోమవారం

ప్రథమస్కంధం: 13. భీష్మాచార్యులవారు ధర్మరాజుకు దుఃఖం శమింపచేయటం

గత టపాలో కుంతీమహాదేవి భక్తి తత్పరత గురించీ, ఆవిడా, ధర్మరాజుగారూ చేసిన విజ్ఞప్తి మేరకు శ్రీకృష్ణులవారు ద్వారకకు తిరుగుప్రయాణాన్ని వాయిదా వేసుకున్న సంగతీ చదువుకున్నాం.  అటు పిమ్మటి విషయాలు తెలుసుకుందాం.

యుధిష్టిరుడు కుంతి పెద్దకుమారుడు.  అయన ధర్మవర్తనం కారణంగా,  ఆయనకు ధర్మరాజు అన్న పేరే‌ సార్థకంగా లోకంలో స్థిరపడి పోయింది.  అట్లాంటి మహానుభావుడికి క్షాత్రధర్మంగా, స్వధర్మానుష్టానంగా, రాజులు ధర్మరక్షణకోసం యుధ్ధం చేయటంలో ఏ దోషమూ‌ లేదని తెలియదా?  చక్కగా తెలుసు.  ఐతే, ధర్మరాజులవారు యుధ్ధం చేసింది సాక్షాత్తూ సోదరుల మీద.  అందుచేత ఆయన అంతులేని విషాదంలో కూరుకుని పోయాడు.  తనలో తాను బాగా మథనపడటం‌ మొదలు పెట్టాడు.

ఒక్కడు కూదా మిగలకుండా చంపించింది పెదన్నాన్నగారి నూరుగురు కొడుకుల్నీ. ఆత్మానాత్మవివేకం గలవాడు లౌకిక ధర్మాన్ని ఆశ్రయించుకొని సంపదలకోసం బంధువుల్ని సంహరించవచ్చా?  సామాన్యధర్మాలకు అన్వయించే స్థితికి అతీతమైన ప్రజ్ఞ గల తాను చివరికి, ఒక పామరుడైన రాజు లాగా రాజ్యలాభం కోసం తమ్ముళ్ళనే మట్టు పెట్టాడే!  అదీ కాక, అడ్డువచ్చిన అశేషరాజలోకాన్ని చంపించాడు.  తన పదవీలోభం‌ కారణంగా,  లెక్కలేనంత మంది రాజులూ, యువరాజులూ చనిపోయారు.  తన కుటుంబ సభ్యుల్నీ బలిపెట్టి మరీ‌ రాజ్యం సంపాదించుకున్నాడు.  ఇలాంటి పని మహాపాపం కాదా?  తాను రాజ్యార్హుడా?

ఎంతోమంది స్త్రీల మంగళసూత్రాలు తెగిపోవటానికి తాను కారణం.  వాళ్ళకు తనవల్ల జరిగిన ద్రోహాన్ని పాపం అనుకోకుండా మనస్సును సరిపుచ్చుకో గలడా? పాపం చేసిన గృహస్థులు యాగాలు చేసి పాపాల్ని కడుక్కోవచ్చు నంటారు. బ్రహ్మహత్యాదోషం నుంచి కూడా రాజును అశ్వమేధయాగం విముక్తుణ్ణి చేస్తుందంటారు.  మురికిగా ఉన్న చోటున పెట్టిన కుండలో అన్నం శుధ్దిగా ఉందంటారా ఎవరైనా?  బుధ్ధిపూర్వకంగా, రాజ్యలోభంతో ఘోరమైన యుధ్ధం చేసి అమేయమైన జీవహింస చేసాడు తాను.  ఇంకా తగుదునమ్మా అని యాగాలు చేస్తే ఏం‌ లాభం? యజ్ఞాల పవిత్రతను వెక్కిరించిన పాపం కూడా అదనంగా మూటకట్టుకోవటం తప్ప ఒరిగేదేముంది.

ఇలా ఆలోచిస్తూ అంతులేని విచారంతో, ధర్మరాజులవారు ప్రాయోపవేశం చేశారు. మనశ్శాంతి కరువై, ఆయన, పితామహుడూ, మహాప్రాజ్ఞుడూ, సర్వశాస్త్ర విశారదుడూ అయిన భీష్మాచార్యుల వారి దర్శనం కోసం వెళ్ళారు.

ధర్మరాజులవారితో పాటుగా తక్కిన పాండవులూ, శ్రీకృష్ణులవారూ కూడా భీష్ములవారి దర్శనానికి వెళ్ళారు.  భీష్మాచార్యులవారు నేలకూలిన దేవతలాగా అంపశయ్యమీద ఉన్నారు. ఆ సమయంలో బృహదశ్వుడూ, పరశురాముడూ, పర్వతుడూ, నారదుడూ, వ్యాసుడూ, కశ్యపుడూ, అంగిరసుడూ, కౌశికుడూ, ధౌమ్యుడూ. సుదర్శనుడూ, వశిష్టుడూ, శుకుడూ మొదలయిన అనేక మంది రాజర్షులూ, బ్రహ్మర్షులూ శిష్యసమేతంగా భీష్ములవారిని చూడవచ్చారు.  అందరినీ‌ భీష్మాచార్యులవారు పూజించారు.  లీలామానుషవేషధారి ఐన శ్రీకృష్ణుడు కూడా రావటంతో ప్రతేకించి భీష్ములవారికి పరమానందం అయింది.

మహానుభావుడైన భీష్ములవారు పాండవులను ఊరడించారు.  నాయనలారా, మీరు మొదటినుండీ ధర్మాన్ని నమ్ముకుని ఉన్నారు. నిత్యమూ శ్రీమన్నారాయణుడి చరణారవిందాల్ని ఆశ్రయించుకుని ధర్మానుష్టానం యథాశక్తిగా చేస్తూ ఉన్నారు.  భగవన్ముఖంగా వెలువడిన వేదాలను, బ్రహ్మజ్ఞానాన్నీ ప్రకటించే బ్రాహ్మణులను నిరంతరమూ సమారాధిస్తున్నారు. ఈ‌ మూడూ విషయాలలో అప్రమత్తులై ఉత్తమోత్తమమైన ప్రవర్తన గల మీకు జీవితం  నిండా చెప్పరానన్ని కష్టాలు కలగటం గొప్ప వింత విషయం.  మీ అమ్మ కుంతి పడ్ద కష్టాలు చూడండి.  మంచి వయస్సులోనే భర్తకు మృగశాపభయం కారణంగా దాంపత్య జీవితానికి దూరం అయింది. మీరు పుట్టగానే‌ భర్త మరణించాడు.  మీరు చిన్నపిల్లలుగా ఉండగా దిక్కు లేక పరాయి పంచన దీనురాలై చేరవలసిన దుర్గతి పట్టింది.  మీకు ఎన్నో‌కష్టాలు కలుగుతుంటే అంగలార్చింది.

నాయనలారా, ఆకాశంలో మబ్బులను చూడండి.  అవి గాలి వీచే విధానాన్ని బట్టి కలుస్తూ విడిపోతూ‌ ఉంటాయి కదా? అలాగే కాలం చేత జీవులకు అన్నీ‌ ఒక్కొక్కప్పుడు కలిసివస్తాయి - ఒక్కొక్కప్పుడు దూరం అవుతుంటాయి.  

ఉ.  రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవో
వ్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సం
యోజకుడైన చక్రి యట యుగ్రగదాధరుఁ డైన భీముఁ‌ డ
య్యాజికి దోడు వచ్చునట యాపద కల్గు టిదేమి చిత్రమో

సమస్త ధర్మాధర్మవివేకమూ కార్యాకార్యనిపుణతా కలిగిన ధర్మరాజు మీకు నాయకుడు.  సాక్షాత్తూ దేవతలకే‌ రాజైన ఇంద్రుడి కొడుకే విలుకాడు మీకు. అతని విల్లు గాండీవం పేరుచెప్పితేనే శత్రువుల గుండెలు ఝల్లుమంటాయి. ఆ విలుకాడు అర్జునుడికి సారథిగా సాక్షాత్తూ చక్రధరుడైన శ్రీమన్నారాయణుడు.  ఆ పైన అతిభయంకరమైన గదతో భీమసేనుడూ యుధ్ధానికి తోడు.  అయినా మీకు ఎంత కష్టం వచ్చింది.  ఎంతో సంహారం చేయవలసి వచ్చిందే. ఏమి చిత్రం!

ఆ. ఈశ్వరుండు విష్ణుఁ డెవ్వేళ నెవ్వని
కేమి సేయుఁ బురుషు డేమి యెఱుఁగు
నతని మాయలకు మహాత్ములు విద్వాంసు
లడఁగి మెలఁగు చుందు రంధులగుచు

అన్నిటికీ ఈశ్వరుడైన విష్ణువే‌ కారణం అని తెలుసుకోండి.  ఆయన ఎప్పుడు ఏవిధంగా సంకల్పిస్తాడో తెలుసు కోవటానికి జీవుడికి వశమా? ఎవరికి తెలుస్తుందీ? ఏమి తెలుస్తుందీ? ఆయన మాయల ముందు, ఎంతో తెలిసిన మహాత్ములూ జ్ఞానులూ‌ కూడా, కేవలం‌ గుడ్డి వాళ్ళు.  

కాబట్టి సులభంగా జరగవలసిన యుధ్ధం మహాసంహారకాండ అయిందంటే అందులో అంతా దైవసంకల్పం తప్ప మీ తప్పు ఏ మాత్రమూ లేదు.  రాజలోకం చేస్తున్న అక్రమాలకు గోలపెడుతున్న సాధుప్రజలను రక్షించాలనే భగవంతుడు వచ్చాడు కృష్ణుడుగా.  వచ్చి దుష్టశిక్షణ చేసాడు.  అయన ప్రపంచాన్ని ఎలా మోహంలో‌ ముంచి ప్రవర్తించేదీ ఆయనకు తప్ప మరెవ్వరికీ తెలియదు. భగవత్స్వరూపులైన దేవర్షి నారదులవారూ, కపిలమహర్షులవారూ దీన్ని తెలుసుకోగలరు. అంతే.

మీరంతా శ్రీకృష్ణస్వామిని మీ‌ బావ అనీ, దూత అనీ, మిత్రుడు అనీ భావిస్తున్నారు.  తప్పులేదు.  అదీ ఆయన లీలావిశేషమైన మాయే.  కాని, ఆయన ‌రాగద్వేషాలూ లేని వాడు. అహంకార మమకారాల వంటి వికారాలకు అతీతుడు. తనకు తానే సాటి ఐన వాడు.  ఏ హెచ్చుతగ్గులూ లేని నిశ్చల తత్వస్వరూపుడు. ఈ శ్రీకృష్ణుడు పరమాత్ముడు, భక్తవత్సలుడు.

యోగీశ్వరులు ఏ మహానుభావుని మనస్సులో‌ నిశ్చలంగా ధ్యానించి, ఎవ్వని నామ రూపాలను మననం చేసుకుంటూ శరీరం విడిచి పెట్టి తరిస్తారో ఆతడు ఈ‌ శ్రీకృష్ణుడే.  యోగీశ్వరులు ఏ‌ మహాత్ముని కోసం సమస్తమైన కోరికలూ క్రియాకలాపాలూ కట్టిపెట్టి మోక్షం సాధిస్తున్నారో ఆతడు ఈ‌ శ్రీకృష్ణుడే. చూడండి ఆయన నా కళ్ళముందే చిరునవ్వుతో, చతుర్భుజుడై, జగన్మోహనమైన రూపంతో నిలబడి ఉన్నాడు. నేను ఎంతపుణ్యం చేసుకున్నానో.  ఏమి నా భాగ్యం.

ఇలా శ్రీకృష్ణులవారిని భీష్మాచార్యులవారు ప్రస్తుతించారు.  ఆ మహాత్ముని మాటలతో ధర్మరాజులవారి దుఃఖం ఉపశమించింది.

ఆ తరువాత ధర్మరాజుగారు పితామహుడైన భీష్మాచార్యులవారి నడిగి చాలా విషయాలు తెలుసుకున్నారు.  మునీంద్రుల సమక్షంలో, శ్రీకృష్ణులవారి సమక్షంలో, భీష్ములు ధర్మరాజుకు మానవజాతికి సాధారణమైన ధర్మాలూ, వర్ణాశ్రమధర్మాలూ బోధించారు.  ఇంకా ధర్మసాధనకు అవసరమైన మెళకువలూ, మోక్షసాధకులు చేయవలసిన సాధన గురించీ వివరించారు. రాజైన వాడు ఆచరించవలసిన ధర్మం గురించీ, స్త్రీలు ధర్మాచరణం ఏ విధంగా చేయాలన్న విషయమూ వివరించారు. చతుర్విధ పురుషార్థాల తాత్పర్యాన్నీ, వాటి మధ్య గల సంబంధాల్నీ విశదీకరించారు. 

ధర్మరాజులవారికి పితామహులు అనేక ఇతిహాసాలూ, పురాణగాథలూ తెలియజేసారు.

క్రమంగా ఉత్తరాయణ పుణ్యకాలం‌ సమీపించింది.  తాను స్వఛ్ఛందంగా శరీరాన్ని విడిచి పెట్టవలసిన సమయం వచ్చిందని భీష్ములవారు మనస్సులో నిశ్చయించుకున్నారు.


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి