12, ఆగస్టు 2013, సోమవారం

ప్రథమస్కంధం: 22. కథాగమనంలో ఒక చిక్కుముడి విప్పటం.

మనం చెప్పుకున్న భాగవత కథలో ఒక చిక్కుముడి వచ్చింది.  దానిని పరిష్కరించుకోవటానికి కొంచెం శ్రమపడవలసి వచ్చింది కూడా!  వివరాలు చూద్దాం.

పోతనామాత్యులవారు వ్రాసిన వరుసలో విషయం ఇలా ఉంది.

౧. ధర్మరాజుగారు అశ్వమేధాది యజ్ఞాలు చేసారు.

౨. విదురులవారు తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చారు.

౩. గాంధారీ ధృతరాష్ట్రులు విదురుడి ఉపదేశంతో వనాలకు వెళ్ళారు.

౪. నారదతుంబురులు ధర్మరాజుగారి వద్దకు వచ్చారు.

౫. ధర్మరాజుగారు దుశ్శకునాల్ని గమనించి విచారిస్తారు.

అయితే ఈ క్రమం పాటించటంలో‌ ఒక గట్టి చిక్కు ఉంది.  కాల క్రమం సరిపోలటం లేదు.  అదెందుకో చూద్దాం.


౧. ధర్మరాజుగారు అశ్వమేధాది యజ్ఞాలు చేసారు.
సరే, ఈ యాగాలు పూర్తి అయ్యాక, అర్జునుడు కూడా హస్తిన నుండి ద్వారకకు కృష్ణుడితో పాటే వెళ్ళాడు.  (౫) ధర్మరాజు దుర్నిమిత్తాలు గమనించి భీముడితో అన్న మాట చూడండి "హరి జూడన్ నరుఁ డేగినాడు నెల లేడయ్యెం గదా..."  అంటే అప్పటికి 7 నెలలుగా అర్జునుడు ద్వారకలో ఉన్నాడన్నమాట.

(౨)విదురుడు తీర్థయాత్రల నుండి తిరిగి హస్తినకు వచ్చాడు.
అప్పుడు పోతనగారి పద్యంలో "బంధుఁడు వచ్చె నటంచును గాంధారీ విభుడు మొదలుగా నందరు..." అని ఉంది.  దీని ప్రకారంగా చూస్తే, తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చిన సమయానికి గాందారీ‌ ధృతరాష్ట్రులు ఇంకా అడవులకు పోలేదు.  ఆ తరువాతనే  (౩) గాంధారీ ధృతరాష్ట్రులు విదురుడి ఉపదేశంతో వనాలకు వెళ్ళారు.   ఇది బాగానే కనిపిస్తోంది పైకి.

అయితే తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చిన విదురుడు ధర్మరాజుతో "యదుక్షయంబు సెప్పిన నతఁ డుగ్ర శోకమున బెగ్గిలి కుందెడు నంచు నేమియున్ వినుమని చెప్పఁ డయ్యె" అని ఒక పద్యంలో పోతన గారు వ్రాసారు.  అంటే, అప్పటికే, విదురుడు తీర్థయాత్రలో ఉండగానే,  యాదవనాశనం కృష్ణనిర్యాణం జరిగాయన్న మాట.  ఇది గుర్తుంచుకోండి.


(౪) నారదతుంబురులు ధర్మరాజుగారి వద్దకు వచ్చారు.  నారదులవారు, ధృతరాష్ట్రుడు ఏమయ్యాడో అని విచారిస్తున్న ధర్మరాజుకు హితోపదేశం‌ చేసారు.  దాంట్లో ఆయన ధర్మరాజుతో ఒక ముక్క అన్నారు గమనించండి "ఎంత కాలము కృష్ణుఁ డీశ్వరుఁ డిధ్ధరిత్రిఁ‌ జరించు మీ రంత కాలము నుండుఁ డందఱున్" అని.   దాని అర్థం,  ఈ‌ హితోపదేశం నారదులవారు ధర్మరాజుకు చేసే నాటికి కృష్ణనిర్యాణం జరగ లేదనే‌ కదా?

చిక్కు వచ్చింది కదా?

విదురుడు తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చి కృష్ణనిర్యాణం చెప్పలేదు ధర్మరాజుకూ అంటున్నాం.  ఆ తరువాత ధృతరాష్ట్రుడు, విదురుడితో సహా అడవులకు పోవటం జరిగిందన్నాం.  కొన్నాళ్ళ తర్వాత నారదులవారు వచ్చి కృష్ణనిర్యాణం జరగబోయే సంగతి అని సూచించారూ అంటున్నాం.  ఇలా అనటం ఎలా పొసగుతోందీ?  పొసగటం లేదు కదా?

నారదులవారి మాట తప్పు పట్టటం‌ కుదరదు కదా?  

నారదులవారు ధృతరాష్ట్రుడి వృత్తాంతం చెబుతూ, ముసలాళ్ళు బాగానే ఉన్నారూ, మరో‌ అయిదు రోజుల్లో యోగాగ్నిలో ప్రాణం వదులుతారు అని చెప్పారు కదా?

"అంతట వారల మరణము
వింత యగుచుఁ చూడబడిన విదురుడు చింతా
సంతాప మొదవఁ బ్రీత
స్వాంతుండై తీర్థములకుఁ జనియెడు నధిపా"

అని కూడా నారదులవారు, విదురుడిని ఉద్దేశించి అన్నారు కదా?

అంటే, జరగబోయే ధృతరాష్ట్ర నిర్యాణం తరువాతనే, విదురుడి తీర్థయాత్ర అన్నమాట.  పోతనగారు విదురుడి పునరాగమనంతో మొదలుపెట్టి ఆతరువాత విదురోపదేశంతో ధృతరాష్ట్రనిర్గమనం చెప్పటమూ, పైగా ఈ రెండు ఘట్టాలకూ మధ్య 'అంత' అన్న అతుకు మాట వేయటమూ చూసి మనం విదురుడు తీర్థయాత్రల నుండి వచ్చి ధృతరాష్ట్రుణ్ణి అడవులకు పోవటానికి ప్రేరేచినట్లుగా భ్రమపడతాం.   కాని కథ నడిచిన కాలక్రమం అది కాదన్న మాట బాగా చదివితే కాని బోధపడదు.

అసలు కాలక్రమంలో‌ కధ యేమిటంటే, 
౧. ధర్మరాజు యాగాలు చేయటం
౨. అర్జునుడు కృష్ణుడితో‌ ద్వారకకు వెళ్ళటం
౩. విదురుడి బోధలో పత్నీవిదురసహితంగా ధృతరాష్ట్రుడు అడవికి పోవటం
౪. నారదాగమనం
౫. ధృతరాష్ట్ర నిర్యాణం
౬. విదురుడి తీర్థయాత్రలు
౭. విదురాగమనం
౮.  7 నెలలైనా అర్జునుడు రాలేదూ, దుశ్శకునాలు తోస్తున్నాయీ అని ధర్మరాజు, భీముడితో చర్చించటం.

అందుచేత ఈ‌ ధారావాహికలో సరి చేసిన కథాక్రమాన్ని పాటించటం జరిగింది.  విజ్ఞులు గమనించి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

ఇది కాక ఈ చిక్కుముడిలో మరొక చిన్న సంగతీ‌ ఉంది.  అది కుంతీదేవిగారి ప్రస్తావన.

అర్జునుడు తిరిగి వచ్చి కృష్ణనిర్యాణం తెలిపాక, కుంతీ దేవి 

"యాదవ కుల నాశము
 మాధవు పదవియు విని కుంతి విమలభక్తిన్ భగవ
త్పద చింతా తత్పరయై
ముదమున సంసార మార్గమునకుం బాసెన్"

అని పోతన్నగారు వ్రాసినట్లు ఉంది. 

ఈ విషయం, భాగవతంలో ప్రస్తావించలేదు.  కాని కుంతీదేవి కూడా గాంధారీధృతరాష్ట్రులతో పాటే అడవులకు వెన్నంటి వెళ్ళింది. అలా మహాభారతంలో చాలా స్పష్టంగా ఉంది.

అటువంటప్పుడు పై పద్యం కూడా పొసగదు.  కృష్ణనిర్యాణం నాటికి కుంతి హస్తినలో లేనే లేదు!  ఆవిడ కూడా నిజానికి అక్కాబావగార్లతో పాటే యోగాగ్నిలో ప్రాణం వదిలింది.  

బహుశః ఇది పోతన్నగారికి లభించిన భాగవత ప్రతిలో ఉన్న ప్రక్షిప్తమైన శ్లోకం ఆధారంగా ఆయన వ్రాసిన పద్యం అయి ఉంటుంది.

అక్కడక్కడా ఇంకా కొన్ని చిక్కు ముడులు రావచ్చును.  అప్పుడు వాటినీ‌ ప్రస్తావించుకుందాం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి