7, ఆగస్టు 2013, బుధవారం

ప్రథమస్కంధం: 16. శ్రీకృష్ణులవారు ద్వారకకు తిరిగి రావటం.

సూతపౌరాణికులు భీష్మాచార్యులవారి నిర్యాణం  తరువాత, ధర్మరాజులవారు పెద్దల అనుమతితో పట్టాభిషిక్తులై  ధర్మమార్గంలో ప్రజారంజకంగా రాజ్యం చేసారని చెప్పగానే, శౌనకమహర్షి ఒక ప్రశ్న వేసారు.

ఐతే, ధర్మరాజులవారికి బంధుమరణాలకు కారణమయ్యానన్న దుఃఖం పూర్తిగా పోయిందా?

సూతుపౌరాణికులు సమాధానంగా,  ఇలా అన్నారు

శ్రీకృష్ణులవారూ, భీష్మాచార్యులవారూ కూడా ధర్మరాజుకు శోకం‌ తొలగించారు తమ ఉపదేశాలతో.  అదీ కాక, పాండవ వంశాంకురమైన పరీక్షిత్తుకు ఉత్తరోత్తరా రాజ్యాన్ని అప్పగించ వలసిన బాధ్యత కూడా ధర్మరాజుల మీద ఉందని శ్రీకృష్ణులవారు స్పష్టం చేసారు.  ధర్మరాజులవారు పట్టాభిషేకం చేసుకోవటానికి అంగీకరించారు.

ఆ మహారాజు పరిపాలనలో అతివృష్టి అనావృష్టి బాధలు లేవు.  పంటలు చక్కగా పండీ, గోసంపద వృధ్ధి చెందీ ప్రజలు సుఖించారు. ఎవరికీ ఏవిధమైన రోగాలు వగైరా యీతిబాధలు లేనే లేవు. అన్ని ఋతువులూ చక్కగా ప్రవర్తించాయి.  ప్రజలంతా సత్ప్రవర్తన కలిగి ఉన్నారు.

శ్రీకృష్ణులవారు హస్తినాపురంలో అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని ద్వారకకు బయలుదేరి వెళ్ళారు.

శ్రీకృష్ణులవారు తిరిగి వెళ్ళిపోతున్నారని తెలిసి హస్తినాపురప్రజలు ఆయన దర్శనం కోసం తహతహలాడారు.  మేడలూ‌ మిద్దెలూ‌ ఎక్కి మరీ‌ పురవీధులగుండా వెళుతున్న ఆయనను దర్శించి పరవశించారు.

ఒకామె జనం మధ్యలోనుండి ఎలాగో‌ కృష్ణదర్శన భాగ్యం సంపాదించుకొని ఆనందంగా ఇలా అంటోంది, ప్రక్కనున్నఆమెతో

మ. తరుణీ యాదవరాజు గాఁ డితడు వేదవ్యక్తుఁడై యొక్కఁడై
వరుసన్ లోకభవస్థితిప్రళయముల్ వర్థిల్లగా జేయు దు
స్తరలీలారతుఁ డైన యీశుఁ డితనిన్ దర్శించితిఁ బుణ్య భా
సుర నే నంచు నటించె నొక్కత  మహాశుధ్ధాంతరంగంబునన్

అమ్మా ఈ యన యాదవుల రాజు అనుకుంటున్నావా?  కాడమ్మా! వేదాలచేత తెలియబడే మహానుభావుడు.  తన అద్భుతమైన లీలతో సకలలోకాల్నీ పుట్టించి, పెంచి, తనలో దయతో లీనం చేసుకొనే సర్వేశ్వరుడు.  నేనెంతో పుణ్యం‌ చేసుకున్నాను కాబట్టే ఈ‌వేళ ఈ‌ మహానుభావుడి దర్శనభాగ్యం నాకు లభించింది.  ఇలా అంటూ ఆమె ఎంతో‌ పరిశుధ్ధమైన అంతరంగంతో ఆయనను ధ్యానించి ఒళ్ళు తెలియని ఆనందంతో నాట్యం చేసింది.

అందరూ సంతోషంగా కృష్ణస్వామిని గురించి రకరకాలుగా ప్రశంశలు కురిపించారు.

ఈ‌ యన పూనుకోబట్టి దుష్టరాజుల పీడ లోకానికి వదిలింది. అధర్మం  పెచ్చుమీరిన ప్రతిసారీ స్వామి పూనుకొని దాని పని పడతాడట.

ఈ మహానుభావుడి జన్మ వల్ల యాదవవంశం పవిత్ర మయ్యింది.  ఈ‌ పుణ్యశ్లోకుడు నివసించటంతో మధురానగరానికి గొప్ప మహిమ కలిగింది. ఈ యనను భక్తితో ఎప్పుడూ చూడగలిగే ద్వారకాపురం జనం ధన్యులు.  ఈయన దయతలచి దుష్టశిక్షణ చేయబట్టి లోకం అంతా ప్రశాంతంగా నిష్కంటకంగా ఉంది. గోపస్త్రీలంతా ఈ యన చుట్టూ మోహించి  మూగి ఉంటారట. అవును మరిఇంతటి జగన్మోహనుణ్ణి మోహించకుండా ఉండటం స్త్రీలకు వశమా!

ఉ.  ఈ‌ కమలాక్షు నీ‌ సుభగు నీ‌ కరుణాంబుధిఁ బ్రాణనాథుగాఁ
జేకొని వేడ్కఁ‌ గాపురము సేయుచు నుండెడు రుక్మిణీముఖా
నేక పతివ్రతల్ నియతి నిర్మలమానసలై జగన్నుతా
స్తోకవిశేషతీర్థములఁ దొల్లిటి బాముల నేమి నోచిరో

ఈ కమలాల రేకుల కన్నుల వాడిని, ఈ సర్వశ్రేష్ట పురుషుడిని, ఈ‌ దయా సముద్రుడిని భర్తగా పొందిన రుక్మిణీ దేవీ మొదలయిన మహా పతివ్రతలు ఎంత అదృష్టవంతులో. వాళ్ళంతా ఎంత గొప్ప గొప్ప నోములు నోచారో గడచిన జన్మల్లో.  ఎలాంటెలాంటి పుణ్యతీర్థాల్ని నిర్మలమైన భక్తితో సేవించి వాళ్ళంతా ఇంత మహాభాగ్యాన్ని సంపాదించుకున్నారో. 

ఇలా శ్రీకృష్ణులవారిని పురస్త్రీలంతా వేనోళ్ళతో పొగడుతూ ఉంటే, వాళ్ళ మాటల్ని వింటూ,  వాళ్ళ నృత్యగానాలూ తిలకిస్తూ ఆయన వాళ్ళందరి మీదా తన దయాపూర్ణమైన చూపులు ప్రసరింప జేస్తూ సాగిపోయారు.

శ్రీకృష్ణులవారు తాను ప్రయాణం చేసిన దారి వెంబడి ఉన్న దేశాలలోని రాజులూ ప్రజలూ అంతా గౌరవించి చేసిన సత్కారాలూ,  ఇచ్చిన  కానుకలూ స్వీకరిస్తూ సాయంకాలానికి ద్వారకకు చేరుకున్నారు.

మ. జలజాతాక్షుడు శౌరి డగ్గఱె మహా సౌధాగ్రబృందారకం
గలహంసావృతహేమపద్మపరిఖా కాసారకం దోరణా
వళిసంఛాదితతారకం దరులతావర్గానువేలోదయ
త్ఫ్లలపుష్పాంకురకోరకన్ మణిమయప్రాకారకన్ ద్వారకన్

ఆ ద్వారకా నగరం ఎలా ఉందో చెబుతున్నారు. ఆ పట్టణంలో చాలా ఎత్తైన మేడ లున్నాయి.ఎంత ఎత్తైన వంటే వాటి పైభాగాల్లో దేవతలు తిరుగుతూ ఉంటారన్న  మాట. బంగారు వన్నెపుప్పొడు లుండే పద్మాలతోకూడిన సరస్సుల్లో ఎప్పుడూ కలకలా రావాలతో రాజహంసలు యీదులాడుతూ ఉంటాయి.  చుక్కల్నితాకేంత ఎత్తున్న ప్రాకారతోరణా లున్నాయి.ఆప్రాకారాల గోడలకు రత్నాలు తాపడం చేసిన ముగ్గు లున్నాయి.  రకరకాల పూలవనాలూ ఫలవనాలూ అనేకంగా ఉన్నాయి.

ఆయన పట్టణం లోనికి ప్రవేశించిన తరువాత పురప్రముఖులంతా వచ్చి సంతోషంగా కుశలప్రశ్నలు వేసారు. ఎన్నో‌రకాలుగా ప్రశంసించారు.

శా. నీ పాదాబ్జము  బ్రహ్మపూజ్యము గదా నీ‌ సేవ సంసార సం
పాపధ్వంసిసి యౌఁ‌ గదా సకల భద్రశ్రేణులం బ్రీతితో
నాపాదింతు గదా ప్రపన్నులకుఁ గాలాధీశ కాలంబు ని
ర్వ్యాపారంబు గదయ్య చాలరు నినున్ వర్ణింప బ్రహ్మాదులున్

స్వామీ నీ‌ పాదాలను బ్రహ్మగారు పూజిస్తారు కదా. వాటి మహిమ చెప్పతరమా. నీ‌ సేవతో అందరికీ సంసార తాపత్రయాలు నశిస్తాయి గదా.  నువ్వు ఆశ్రయించిన వాళ్ళందరికీ‌ సకలశుభాలను వరసగా అందిస్తావు గదా మహా ప్రేమతో.  అందరినీ మోహపరచే కాలానికి నువ్వు అధిపతివి కదా. నీ‌ ఆజ్ఞ లేకుండా కాలం ఏమీ చేయలేదు. అందు చేత బ్రహ్మాది మహా దేవతలు కూడా నీ‌ దివ్యప్రభావాన్ని తెలుసుకో లేరు. అని పొగిడారు.

అయ్యా మీరు నగరంలో లేని నిమేషమాత్రం కాలం కూడా మాకు వెయ్యి సంవత్సరాల్లాగా సుదీర్ఘంగా అనిపిస్తుంది. దయచేసి ఇంక మమ్మల్ని వదలి వెళ్ళకండి.  మీ‌ నీడలో చల్లగా ఉంటాం అని వేనోళ్ళ విన్నవించుకున్నారు అంతా.

శ్రీకృష్ణస్వామి పురజనుల నందరినీ సంతోషంగా పలకరించి వారి మీద తన దయామృతం చిలకరించి సంతోషపెట్టి రాచనగరు లోనికి ప్రవేశించారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి