14, ఆగస్టు 2013, బుధవారం

ప్రథమస్కంధం: 24. అర్జునుడు శ్రీకృష్ణావతార సమాప్తి గురించిన వార్త తెచ్చుట.

ఆవిధంగా భీముడితో చర్చిస్తూ, ధర్మరాజుగారు విచారిస్తున్న సమయంలో 

క. ఖేదమున నింద్రసూనుఁడు
యాదవపురి నుండి వచ్చి యగ్రజుఁ గని త
త్పాదముల నయన సలిలో
త్పాదకుఁడై పడియె దీనుభంగి నరేంద్రా

ద్వారకానగరం నుండి అర్జునుడు వచ్చాడు.  అతడు వస్తూనే పెద్దగా దుఃఖిస్తూ, కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్ళు కారిపోతూ ఉండగా, చాలా దీనమైన ముఖంతో, అన్నగారి కాళ్ళమీద పడిపోయాడు.

ఆ వాలకం చూసి ధర్మరాజుగారికి గుండె జారిపోయి నట్లయింది.  వెలాతెలా పోతున్న మొహంతో అందరూ వింటుండగా తమ్ముడు అర్జునుణ్ణి చూసి ప్రశ్నలు గుప్పించాడు.

నాయనా,  మన తాతగారు కుంతిభోజులవారు కుశలంగా ఉన్నారా?  మన మేనమామగారు వసుదేవులవారు క్షేమంగానే ఉన్నారు కద?  మేనత్తలు ఏడుగురూ, వాళ్ళ పిల్లలూ బాగానే ఉన్నారు కదా?  ఉగ్రసేనమహారాజుగారూ, అక్రూరుడూ, కృతవర్మా బాగున్నారా?  కృష్ణుడి తమ్ముళ్ళు సాత్యకీ, గద సారణులూ అంతా కుశలంగా ఉన్నారు కదా?  అనిరుధ్ధుడు ఎలా ఉన్నాడు?  బలరామదేవులు క్షేమమేనా?  కృష్ణుడి కొడుకులు సాంబ సుషేణులు ఎలా ఉన్నారు?  ఆయన స్నేహితులు ఉధ్దవుడూ, సునందుడూ బాగున్నారా?  తక్కిన యాదవ ప్రముఖులంతా సుఖంగానే ఉన్నారా?

ఏ మహానుభావుని మహిమ వల్ల ద్వారకా నగరం వైకుంఠంగా మారిపోయిందో,  ఏ మహాత్ముడు వామనుడై ఇంద్రుడికి స్వర్గాన్ని అందించాడో,  లీలగా ఏ వీరుడు స్వర్గం నుంచి పారిజాతవృక్షాన్ని తెచ్చి సత్యభామకిచ్చాడో,  ఆ పరాత్పరుడు శ్రీకృష్ణుడు ద్వారకలో కుశలంగా ఉన్నాడు కదా?

శా.  అన్నా ఫల్గుణ భక్తవత్సలుఁడు బ్రహ్మణ్యుండు గోవిందుఁడా
పన్నానీక శరణ్యుఁ డీశుడు జగద్భద్రానుసంధాయి శ్రీ
మన్నవ్యాంబుజపత్రనేత్రుఁడు సుధర్మామధ్యపీఠంబునం
దున్నాఁడా బలభద్రుఁ గూడి సుఖియై యుత్సాహియై ద్వారకన్

 నాయనా అర్జునా, భక్తులంటే ఎంతో వాత్సల్యం చూపేవాడూ,  వేదధర్మాన్ని నిలబెట్టేవాడూ, అపదలో ఉన్న వారికి శరణం ఇచ్చేవాడూ, సర్వలోకాలకూ అధిపతి ఐన వాడూ,  అన్ని లోకాలకూ శుభం చేకూర్చేవాడూ, అప్పుడే విరిసిన కమలం రేకుల వంటి కళ్ళతో ఎంతో‌ అందంగా ఉండేవాడూ శ్రీకృష్ణస్వామి.  ఆయన క్షేమంగా ద్వారకలో ఉన్నాడా? అన్నగారు బలరామదేవులతో కలిసి  తన సభామంటపం సుధర్మలో హాయిగా ఠీవిగా ఉన్నాడా?

అయినా నిన్ను చూస్తే భయంవేస్తోంది! ఎందుకు శోకిస్తున్నావూ? పొరపాటున, నువ్వు  బలరామకృష్ణుల పట్ల భక్తిశ్రధ్ధలలో ఏమీ లోపం చేయలేదు కదా?

పూర్వం శివుడితో పోరాడవలసి వచ్చినా నువ్వు భయపడి కంట నీరు పెట్టుకోలేదు.  దేవతలకే అసాధ్యులైన రాక్షసులు కాలకేయులతో యుధ్ధం చేయవలసి వచ్చినా నీకు భయం కలగ లేదు.  గంధర్వులకు చిక్కిన దుర్యోధనుణ్ణు విడిపించే టప్పుడు వాళ్ళను లీలగా తోలివేసావు.  అలాంటి వాడివి నువ్వు.  మరి ఎన్నడూ లేని విధంగా, ఇప్పుడు నీకు కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయీ?

కాలం కలిసిరాక, నువ్వు ఏమైనా తప్పుపని చేసావా?  నీ వల్ల పొరపాటున బ్రాహ్మణులకు గాని, సాధువులకు గాని, స్త్రీబాలవృధ్ధులకు గాని, ఆశ్రితులకు గాని హాని యేమన్నా జరిగిందా?

ఇలా ధర్మరాజుగారు కంగారుగా ప్రశ్నిస్తుంటే‌, అర్జునుడు కన్నీళ్ళు తుడుచుకున్నాడు కష్టం మీద.  పెద్దగా నిట్టుర్చాడు. వణుకుతున్న కంఠంతో సర్వం పోగొట్టుకున్నవాడిలాగా దీనంగా ఇలా అన్నాడు.

క.  మన సారథి మన సచివుఁడు
మన వియ్యము మన సఖుండు మన బాంధవుడున్
మన విభుఁడు గురుఁడు దేవర
మనలను విడనాడి చనియె మనుజాధీశా

మహారాజా, ఏం చెప్పను!  మనకు సారథి, మంత్రి, వియ్యంకుడు, మిత్రుడు, చుట్టం, ప్రభువు, గురువు, దేవుడు ఇలా మనకు సర్వం అయిన మహాత్ముడు శ్రీకృష్ణుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా!

ఆయన దయతోటే మన ద్రుపదుడి సభలో మత్స్యయంత్రాన్ని విరగ్గొట్టి ద్రౌపదిని గెల్చుకున్నాం.   ఆయన దయతోటే సాక్షాత్తూ ఇంద్రుడే అడ్డుపడినా అగ్నిదేవుడికి ఖాండవవనాన్ని సమర్పించగలిగాను.  అప్పుడు అగ్నిదేవుడు ఇచ్చిందే కదా నా గాండీవం?

మనం రాజసూయం చేసామంటే అది ఆయన చలవే.  ద్రౌపది గౌరవాన్ని కాపాడింది ఆయన దయ ఒక్కటే.  

ఒకసారి పదివేలమంది శిష్యులతో వచ్చి దుర్వాసుడు మనల్ని పరీక్షించాడు.  ఆ రోజున అక్షయపాత్రలో ఏ మూలో దాక్కున్న ఒక్క మెతుకునే స్వీకరించి, దుర్వాసుడికీ ఆయనశిష్యులకూ ఆయనే కడుపునింపి, మనని కాపాడాడు.  లేకపోతే దుర్వాసుడు తప్పకుండా మనల్ని శపించి ఉండేవాడు కదా!

ఒక పంది కోసం నాకూ‌ శివుడికీ‌ యుధ్ధం వచ్చినప్పుడు, నాకు ఎవరి అండ ఉందని శంకరుడు పాశుపతం ఇచ్చాడో,  ఏ మహాత్ముని అండ నా కుండ బట్టి దేవేంద్రుడు నాకు అర్థాసనం ఇచ్చి గౌరవించాడో,  ఏ మహాపురుషుని స్మరించి కాలకేయుల్ని వధించానో,  ఉత్తరగోగ్రహణం నాడు నా విజయానికి ఏ స్వామి కరుణ కారణమో  ఆ మహాత్ముడు శ్రీకృష్ణుడే.

ఆ శ్రీకృష్ణుడు, నా రథం ఆరోహించి నా శత్రువుల ఆయుర్ధాయాలను తానే హరించి వేసేవాడు. నా బాణాలన్నీ నిమిత్తమాత్రాలే.

హిరణ్యకశిపుడు ఏమి చేసినా ప్రహ్లాదుడికి ఏ హాని రానట్లుగా, ఆయన నన్ను రక్షించాడు. భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు వంటి వారంతా వేసిన దివ్యాస్త్రాలన్నిటినీ ఆయన దయాదృష్టే తొలగించి నన్ను సదా కాపాడింది కాదా?

అసలా సైంధవుణ్ణి చంపటంలో నా ప్రజ్ఞ ఏమన్నా ఉందా? అది ఆయన దయవల్లే సాధ్య పడింది కాదా? పైగా ఆనాడు గుర్రాలు అలసిపోతే అప్పటికప్పుడు బాణాలతో భూమిని చీల్చి కోనేరు సృష్టించి మరీ వాటి దప్పిక తీర్చటం అనే అద్భుతం ఆయన కరుణవల్లే నాకు సాధ్యపడింది.

సీ. చెలికాఁడ రమ్మని చీరు నన్నొక వేళ
      మన్నించు నొకవేళ మఱఁది యనుచు
బంధుభావంబునఁ బాటించు నొకవేళ
      దాతయై యొకవేళఁ ధనము లిచ్చు
మంత్రియై యొకవేళ మంత్ర మాదేశించు
      బోధియై యెకవేళ బుధ్ది సెప్పు
సారథ్య మొనరించుఁ జనవిచ్చి యెకవేళఁ
      గ్రీడించు నొకవేళ గేళి సేయు
తే. నొక్క శయ్యాసనంబున నుండుఁ గన్న
తండ్రికైవడిఁ జేసిన తప్పుఁ గాచు
హస్తములు వట్టి పొత్తున నారగించు
మనుజవల్లభ మాధవు మఱపురాదు

శ్రీకృష్ణుడికి నేనూ ఎంత అన్యోన్యంగా ఉండే వాళ్ళం!  ఆయన ఒకసారి నన్ను మిత్రమా అని పిలుస్తాడు.  ఒకసారి బావమరది నని గౌరవిస్తాడు.  ఒకసారి  చుట్టరికం చూపిస్తాడు.  ఒకసారి ఆయన దాతా, నేను అర్థినీ.  ఒకసారి మంత్రిలా సలహాలు అందిస్తాడు.  ఒకసారి గురువులా హితబోధ చేస్తాడు.  చనువుగా నన్ను కూర్చో బెట్టుకుని నా రథం తోలుతాడు. ఒకసారి నాతో‌ ఆటలాడుతాడు.  ఒకసారి యెగతాళి చేసి ఉడికిస్తాడు.  ఒకసారి తనతో ఆసనం మీద కూర్చుండ బెట్టుకుంటాడు.  ఒక్కోసారి ఆయనతో మంచం మీద కూర్చుంటాను కూడా. ఒక్కోసారి నాతో కలిసి భోజనం చేస్తాడు.  తండ్రిలాగా నా తప్పులన్నీ‌ ఇట్టే క్షమిస్తూ ఉంటాడు.  మహారాజా, ఇలాంటి పరమాప్తుడైన కృష్ణుణ్ణి ఎలా మరచిపోగలను?

ప్రేమతో నన్ను విజయా అనీ, ధనంజయా అనీ,  ఇంకా ఫల్గుణా, పార్థా, మహనుధ్ధ్వజా పాండుకుమారా, ఇంద్రతనయా అనీ రకరకాల పేర్లతో నోరారా పిల్చి వినోదించేవాడు ప్రభువు.

శ్రీకృష్ణస్వామితోనూ ఆయన అంతఃపురంతోనూ నాకు గల చనువు అద్వితీయం.  స్వామివారు, నా ఒళ్ళొ తన పాదాలుంచి శయనించి కబుర్లాడుతూ, తన భార్యలు తనతో ముచ్చటించే విషయాలు కూడా దాపరికం లేకుండా నాతో పంచుకునే వారు.   శ్రీకృష్ణస్వామి మీద ఆయన భార్య లెవరైనా అలిగితే,   ప్రణయకలహాలలో రాయబారాలకి ఆయన వాళ్ళ దగ్గరకి నన్ను  పంపించేవారు.

అయ్యో మహారాజా, ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణమైన జగదీశ్వరుడు శ్రీహరి తన అవతారాన్ని ఉపసంహరించుకున్నాడు.  అయినా చూడవయ్యా, ఈ‌ దిక్కుమాలిన దేహాన్ని విడిచి పెట్టకుండా ఇంకా ఏం బావుకుందామనో నా ప్రాణాలు నిలబడే ఉన్నాయి.  పూర్వజన్మలో నేను ఎలాంటి దుష్ట కర్మలు చేసానో కదా!

ఇంకా మరొక ఘోరం కూడా వినండి మహారాజా! శ్రీకృష్ణులవారు నాకు పంపిన సందేశం ప్రకారం,  ఆయన అంతఃపుర స్త్రీలని తరలించుకుని వస్తున్నప్పుడు వాళ్ళల్లో చాలా మందిని బోయవాళ్ళు ఎత్తుకుపోయారు.  నేనేమీ చేయలేక అబల లాగా నిలబడి పోయానంటే నమ్ముతారా?

శా.  ఆతే రా రథికుండ నా హయము లా యస్త్రాసనం బా శర
వ్రాతం బన్యులఁ దొల్లి చంపుఁ దుదినిన్ వ్యర్థంబులై పోయె మ
చ్చేతోఽధీశుడు చక్రి లేమి భసితక్షిప్తాజ్యమాయావి మా
యాతంత్రోషరభూమిబీజముల మర్యాదన్ నిమేషంబునన్

ఏమయింది నీ‌ పరాక్రమం అని అడగండి ప్రభూ! అన్నీ ఉన్నాయి నాకు.  వేటితో అయితే గొప్ప గొప్ప యుధ్ధాలలో శత్రువులను చావమోదానో అన్నీ అలాగే నా స్వాధీనంలోనే ఉన్నాయి. ఏం చిత్రమో! అదే రథం, అదే వీరుణ్ణి నేను, అవే గుర్రాలు, అదే గాండివం, అదే అక్షయతూణీరంలోని దివ్యమైన వాడి బాణాలూ నిజంగా.  పూర్వంనుండీ అవే,  శత్రువులపై నాది పై చేయి చేస్తూవచ్చాయి.  ఇప్పుడేమో, శ్రీకృష్ణస్వామి అండ లేని నన్ను, అవే నవ్వుల పాలు చేసాయి!  నా ప్రయోజకత్వం అంతా బూడిదలో నెయ్యిపోసి మంటకోసం ఎదురుచూసినట్లు విఫలం అయిపోయింది.  ఎవరో మాయావి నన్ను సమ్మోహితుణ్ణి చేసినట్లు నా యుధ్ధక్రీడ నన్ను వదలి క్షణంలో మాయమైంది.  చవిటి పర్రలో విత్తనాలు చల్లినట్లు నా ప్రయత్నం పూర్తిగా వృధా అయిపోయింది.

ఆ ప్రభాసతీర్థంలో యాదవవీరు లంతా ఘోరంగా తగవు లాడుకున్నారు.  మునిశాపం వంక పెట్టుకుని, కాలం వాళ్ళమీద విరుచుకు పడింది మరి.  అందరూ విపరీతంగా తాగి, ఒకళ్ళ నొకళ్ళు దెప్పుకుని, కలహంలో ములిగిపోయారు. సమస్త యాదవకులమూ అంతరించి పోయింది.  మహా అయితే నలుగురో ఐదుగురో మిగిలారేమో

క.  భూతముల వలన నెప్పుడు
భూతములకు జన్మ మరణ పోషణములు ని
ర్ణీతములు సేయుచుండును
భూతమయుం డీశ్వరుండు భూతశరణ్యా.

ఓ మహారాజా, సకల భూతప్రకృతినీ ఈశ్వరుడు ఇలాగే శాసిస్తున్నాడు. జీవుల నుండే జీవులు శరీరం దాల్చి పుట్టుకుని వస్తున్నాయి. ఆ జీవులే ఒకదానిని ఒకటి తిని బతుకుతున్నాయి.  అలాగే జీవులు తమలో తాము కలహించుకుని అంతరిస్తున్నాయి.  అంతా ఈశ్వర విలాసం.

యాదవుల్లో బలహీనుల్ని బలవంతులు చంపేశారు.  బలవంతులూ తమలో తాము పరస్పరం హింసిచుకుని చనిపోయారు కూడా.  భూమికి భారం ఎక్కువైనందు వల్ల, భగవంతుడైన విష్ణువే, బలవంతులూ బలహీనులూ అయిన వీరుల మధ్య కలహాలు సృష్టించి అందరినీ తొలగించాడు. వచ్చిన పని ముగిసింది కనుక, ఇప్పుడు ఆయన అవతారాన్ని చాలించి నిజధామానికి మరలిపోయాడు.

ఇలా అన్నగారికి సంగతి సమస్తమూ నివేదించి నిట్టూరుస్తూ అర్జునుడు మౌనంగా ఉండిపోయాడు.  శ్రీకృష్ణుడు లోగడ తనకు చేసిన ఆత్మబోధను గుర్తుతెచ్చుకుంటే మనస్సు కాస్త శాంతిస్తోందని మాత్రం అన్నగారికి చివరి మాటగా చెప్పాడు.

అర్జునుడు హరిపాదాలపై మనస్సును లగ్నం చేసి, అన్ని రకాల భ్రాంతుల నుండీ విముక్తి పొందాడు.

తనకూ భగవంతుడికీ ఉన్న అభేదాన్ని విస్మరించి పామరత్వంలో పడటం వల్లనే, దుఃఖం అనేది కలుగుతోందీ, అని అర్జునుడు గ్రహించాడు.  ఈ దేహం అనేది నేను - నాది అనే భావనలను కల్పిస్తోంది. ఆ రెండూ దుఃఖం అనే భ్రాంతిని కలిగిస్తున్నాయి.   

దేహానికి మూలకారణానికి లింగం అని పేరు.  [అంటే నేను అని మనని గూర్చి మనం భావించుకునే గుర్తులైన మనస్సు, శరీరం వగైరా అన్నమాట.]

ఈ లింగం అనేదానికి కారణం సత్వమూ, రజస్సూ, తమస్సూ అనే త్రిగుణాలు.  [సత్వము అంటె నేను ఉన్నాను అనే భావన.  రజస్సు అంటే నేను ఇది చేస్తున్నాను - అది చేస్తాను అనే‌ భావన.  తమస్సు అంటే ఇది నాది, అది నాకు కావాలీ అన్న భావన.  ఇలా స్థూలంగా తెలుసుకోండి.]

ప్రకృతి అనేది ఈ‌త్రిగుణాలకీ‌ మూలం.  [తాను ఒక్కటే అయిన పరబ్రహ్మానికి భిన్నంగా ప్రత్యేకమైన ఉనికి కలిగి ఉన్నాను అనే స్పృహను కలిగించే భగవన్మాయకే ప్రకృతి అని పేరు.]

నేను పరబ్రహ్మ కన్నా వేరు కాదు అని తెలిసి రావటమే జ్ఞానం.

ఆ జ్ఞానంలో ప్రకృతి అణిగిపోతుంది.  దానిలో గుణాలు లీనమై పోతాయి.   ఇలా సిథ్థించిన నిర్గుణత్వంతో లింగం‌ నాశనమై,  ఇంక స్థూలమైన శరీరాన్ని దాల్చే పరిస్థితి నుంచి బయట పడటం జీవుడికి సాధ్యమౌతుంది.  అట్టి జీవుడు దివ్యమైన పరబ్రహ్మంలో విలీనం అవుతాడు. [ అదే కైవల్యం - అంటే కేవలం, పరబ్రహ్మంగా అయిపోవటం అన్నమాట.]

తనకు భగవంతుడైన శ్రీకృష్ణుడు అనుగ్రహించిన ఈ విజ్ఞానాన్ని స్మరించి అర్జునుడు సంపూర్ణంగా విరక్తి చెందాడు.  ఆయనకు పూర్తిగా శోకం తగ్గిపోయింది.

జ్ఞాని అయినధర్మరాజుగారు కూడా, జరిగిందంతా విని, అంతా భగవంతుడి తలంపు అని నిశ్చయంగా తెలుసుకుని శోకం చెందకుండా ఉన్నారు.  ఆయన నారదులవారు తనకు ముందే శ్రీకృష్ణావతార సమాప్తి గురించీ తన అనంతర కర్తవ్యం గురించీ చెప్పిన వాక్యాలు సంస్మరించుకున్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి