30, ఆగస్టు 2013, శుక్రవారం

ద్వితీయస్కంధం: 04. ధారణను గూర్చి శుకయోగి వివరించుట.

పరీక్షిత్తు శుకయోగి ముందు ధారణకు సంబధించిన తన సందేహాలని అడిగాడు

ధారణ అంటే ఏమిటీ?
ఆ ధారణ స్వరూపం‌ ఎలా ఉంటుంది?
ఆ ధారణ ఎలా నిలబడుతుంది?
ఆ  ధారణ ఏ విధంగా మనస్సు నుండి మలినాన్ని తొలగిస్తుంది?

అప్పుడు శుకయోగి విషయాన్ని విపులంగా చెబుతున్నారు.

ఆ. పవనము నియమించి పరిహృత సంగుడై
యింద్రియముల వర్గ మెల్ల మాపి
హరి విశాల రూపమందుఁ  జిత్తము జేర్చి
నిలుప వలయు బుధ్ధి నెఱపి బుధుడు

రాజా, ముందు వాయువును చక్కగా నియంత్రించాలి.  అలా చేయటం వలన సంసారంతో సాంగత్యం వదిలిపెట్ట వచ్చును. ఎప్పుడైతే సంసారం పట్ల ఆసక్తి వదిలి పోతుందో అప్పుడు ఇంద్రియాలకు చేయవలసిన పని ఏమీ ఉండదు.  ఇంద్రియాలు ప్రాపంచిక విషయాల మీద ధ్యాస పెట్టేలా మనస్సుని అటూ ఇటూ లాగటం ఆగిపోతుంది దానితో.  ఇంక మనస్సును శ్రీహరి యొక్క సువిశాలమైన స్వరూపం మీద నిలబెట్టాలి.  సాధకుడు ఇలా చేయాలంటే బుధ్ధిని సక్రమంగా వినియోగించు కోవాలి.

ఎవరికైనా,  ఈ వాయువు ఏమిటీ, దానినీ నియంత్రించటం ఏమిటీ, అదెలా అనే సందేహాలు రావచ్చును.  ఇక్కడ వాయువు అని చెప్పబడింది పంచప్రాణవాయువుల సమాహారం.  

పంచప్రాణవాయువులు అంటే ఇప్పటికే‌ చెప్పుకున్నాం, అవి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు.  ప్రాణ వాయువుకు స్థానం హృదయం.  ఇది జీవుడి ఉఛ్ఛ్వాస నిశ్వాసాల్ని నియంత్రిస్తుంది. అపాన వాయువుకు స్థానం గుదప్రదేశం.  ఇది శరీరం నుండి మలినాల్ని తొలగిస్తుంది. వ్యాన వాయువు అనేది శరీరం అంతా వ్యాపించి ఉండి రకరకాల ప్రకోపాలకు కారణం అవుతూ‌ ఉంటుంది. ఉదాన వాయువుకు స్థానం నాభిప్రదేశం. ఇది శరీరం యొక్క అవయవాల్లో‌ స్పందన కలిగిస్తుంది.  సమాన వాయువు శరీరంలో‌ కంఠప్రదేశాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది.  ఇది చేసే‌ పనులు నాడీమండలాన్ని నియంత్రించటం,  అన్నసారాన్ని సర్వాంగాలకూ సమనంగా అవసరమైన విధంగా పంచటం. 

ఈ వాయువులు అన్నింటికీ అధిపతి ప్రాణవాయువు. దీని నియంత్రణలోనే జీవుడి ఉపాధి యొక్క ఆయుర్దాయం కూడా ఆధారపడి ఉంటుంది.  ఒక అభిప్రాయం ప్రకారం, ఈ ఉపాధికి ఇన్ని శ్వాసక్రియలు అని ఉపాధి యేర్పడినప్పుడే నిశ్చయం ఐపోతుంది. శ్వాస వేగం పెరిగితే, ఆ ఉపాధి భూమి మీద నిలబడి ఉండే కాలం తగ్గుతుంది. అలాగే శ్వాస ఎంత తక్కువ వేగంతో‌ జరిగితే ఆ ఉపాధి అంత హెచ్చు కాలం భూమి మీద ఉంటుంది. అందుకే చాలా నిదానంగా శ్వాసించే‌ తాబేలు వందల యేళ్ళు బ్రతుకుతుంది అని అంటారు. ప్రాణాయామంతో యోగులు శ్వాస మీద నియంత్రణ సాధిస్తారు.అందుకే వారు తమ ఇఛ్ఛానుసారం దీర్ఘకాలం జీవించ గలరని అంటారు.

సాధారణ పరిస్థితుల్లో మనకు మన శ్వాసమీద నియంత్రణ ఉండదు.  ఆ కార్యక్రమం మన ప్రమేయం‌ ఏమాత్రం కూడా జరిగిపోతూ‌ ఉంటుంది. ఐతే కావాలంటే మన శ్వాసను కొంతలో కొంత అదుపు చేసుకోగలం అన్నది అందరికీ తెలుసు. యోగసాధకులు ప్రాణాయామం అనే‌ ప్రక్రియతో దానిని బాగా అదుపు చేయగలరు.  సిథ్థి లభించిన యోగులు శ్వాసను నిలిపివేసి కూడా నిరపాయంగా ఉండగలరు.  ఇది చదివి ఎవ్వరూ ప్రయోగాలు చేయకండి.  ఈ ప్రాణాయామం అనేది కేవలం గురువు వద్ద శ్రధ్ధగా నేర్చుకోవలసిందే‌ కాని పుస్తకాలు చదివీ ఉపన్యాసాలు వినీ అభ్యాసం చేయటం మహా ప్రమాదకరం.  యుక్తేశ్వరగిరిగారు శ్వాసను పూర్తిగా నిలిపివేసే వారని వారి శిష్యుడు యోగానందగారు వ్రాసారు.  శ్వాసమీద నియంత్రణతో ప్రాణవాయువు సంచారం మీద ఆధిపత్యం లభిస్తే దానితో అనుసంధానమై ఉన్న మిగతా నాలుగు వాయువులూ కూడా స్వాధీనం అవుతాయి. 

ఇలా వాయువులని నియంత్రణ లోనికి తెచ్చుకున్న వాడికి సంసారంతో సాంగత్యం పోవటమూ, ఇంద్రియాలు అదుపులోనికి రావటమూ‌ ఎలా జరుగుతుందీ అన్నది చూద్దాం.  కోపావేశం వచ్చినప్పుడు మనకి శ్వాసవేగం పెరుగుతుందని అందరికీ తెలుసు కదా.  అలాగే కోపావేశం అనేది కలిగినప్పుడు మనస్సు అదుపు తప్పుతుందనీ కూడా మనందరకీ కూడా తెలుసు.  అలా కోపం కారణంగా అదుపు తప్పిన మనస్సుతో మనం ఎలాంటి అనవసరమైన, ప్రమాదకరమైన, అమర్యాదకరమైన మాటలు మాట్లాడేస్తామో కూడా తెలుసు కదా.  అలాంటి స్థితిలో ఎవ్వరి మీదకైనా చేయీ కాలూ‌ లేస్తాయి కూడా అప్పుడప్పుడు. అంటే కోపంతో మనం మన వాక్కు మొదలైన జ్ఞానేంద్రియాల మీదా, కరచరణాది కర్మేంద్రియాల మీదా అదుపు కోల్పోతున్నాం అన్నమాట.  కోపంతో శ్వాసవేగం పెరుగుతున్న కొద్దీ మనమీద మనం ఇలా అదుపు కోల్పోవటమూ హెచ్చుతుంది. ఇంకొక విషయం చూద్దాం.  ఎవ్వరైన ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు వారి శ్వాస నిదానంగా హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది.  ఈ గమనికలను కొద్దిగా విలోమ క్రమంలో పెట్టి ఆలోచిద్దాం.  శ్వాసను ప్రయత్నపూర్వకంగా నియంత్రిస్తే ఏమి జరుగుతుందీ? మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం కూడా సాధ్యపడుతుంది. అప్పుడు ఇంద్రియాలు కూడా వాటికి అధిపతి ఐన మనస్సు ప్రశాంతంగా ఉంటున్న కారణంగా నిరుద్వేగంగా ఉండటానికి అలవాటు పడతాయి. బయటి ఉద్వేగాల కారణంగా కోపాదికాలు చెలరేగి శ్వాసను నియంత్రణ తప్పించటం కాక విలోమంగా శ్వాస మీద నియంత్రణ చిక్కటం వలన కోపాదికాలు అణచబడి, బయటి ఉద్వేగకారకాలతో మనస్సు సంయోగం చెందటం మానేస్తుంది.  అంటే, ఎవరన్నా పిచ్చివాడని గేలి చేసినా కోపం‌ రాదన్న మాట.  ఇంద్రియాలు కూడా మనస్సునుండి ప్రతిస్పందన లేక పోవటం వల్ల అదుపులో ఉంటాయి.  అలా క్రమశిక్షణ నేర్చుకున్న ఇంద్రియాలు క్రమంగా ఉద్వేగ కారకాల్ని మనస్సుకు చేరవేయటమూ మాని వేస్తాయి.  మనస్సు పట్టించుకోదని ఇంద్రియాలు ఊరకుంటాయీ అన్న మాట.  ఇదంతా చెప్పినంత తేలిక కాదు.  కాని అభ్యాసం చేసినకొద్దీ ఈ దిశలో ఫలితం ఉంటుంది.

ఇలా,  క్రమంగా మనస్సు బహిఃప్రపంచంతో  సాంగత్యాన్ని విడిచి పెడుతుంది.  ఈ స్థితిని అభ్యాసం చేస్తూ ఉన్న మనిషి, మనస్సుని శ్రీహరి మీద నిలపాలి.  మనస్సుకి ఏదో ఒక ఆలంబన అవసరం.  అది ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చోలేదు.  అందుకని అది మళ్ళీ గాడి తప్పే ప్రమాదం రాకుండా ఉండటం కోసం మంగళప్రదం ఐన శ్రీహరి మూర్తిమీద నిలపమని చెబుతున్నారు శుకయోగి.  మరి మనకు ఆ శ్రీహరి ఇలా ఉంటాడూ అని తెలియాలి కదా మనస్సును లగ్నం చేయటానికి?  

ఇలా శ్రీహరి మంగళ విగ్రహం మీదనే ఎందుకు దృష్టి నిలపాలీ?  మనం ప్రాపంచిక విషయాల మీద ధారణ అంటే దృష్టిని నిలపటం చేస్తూ ఉంటే మనస్సు ఆ ప్రాపంచిక విషయాలనే పట్టుకుంటుంది.  ప్రాపంచిక విషయాలు దుఃఖ కారణాలు అని తెలుసు కాబట్టి అలా మనం ప్రాపంచిక విషయాల మీద ధారణ చేయటం దండగ.  ఇంగువ కట్టిన గుడ్డకి ఇంగువ వాసన అంటుకున్నట్లుగా ప్రాపంచిక విషయాల్ని మనస్సులో మనం మూట కడితే వాటి తాలూకు వాసనలు మనస్సుకు అంటుకుంటాయి. ఈ వాసనలని పట్టుకుని కూర్చున్న మనస్సు గల  శరీరం పడిపోయాక, ఆ మనస్సు గల జీవుడు ఆ వాసనలతో ప్రయాణం చేసి వాటికి అనుకూలంగా ఉండే మరో‌ దేహం వెతుక్కుని ఆశ్రయిస్తాడు.  అంటే దుఃఖం కొనసాగటమే పర్యవసానం.  మనం  ప్రాపంచిక విషయాల్ని కాక శ్రీహరిని ఆశ్రయిస్తే ఏం జరుగుతుందీ?  నిప్పును ఆశ్రయించిన బట్టకు ఏం‌జరుగుతుందో అదే!  ఆ బట్టని అంటుకుని ఉన్న మంచీ చెడూ అన్ని వాసనలతోటీ‌ అది దగ్ధం ఐపోతుందా లేదా?  అలాగే శ్రీహరిని ఆశ్రయించిన మనస్సుకూ అన్ని వాసనలూ నశిస్తాయి!  ఆ మనస్సు కూడా నశించి బుధ్దిలోకి వెళ్ళి మాయం అవుతుంది.

సరే,  శ్రీహరిని ఆశ్రయించటం అవసరం అని తెలిసింది.  ఇక ఆయన స్వరూపం తెలిసే విధానం చూడాలి.  దీనికి ఒక ఉపాయం చెబుతున్నాడు శుకయోగి. ఈ విశ్వంలోనే విష్ణువు యొక్క దివ్యస్వరూపాన్ని ఆరోపించుకుని అభ్యాసం చేయవలసిందీ అని. వాయువులని నిరోధించి, సంకల్పవికల్పాల స్వరూపమైన మనస్సుని స్వాధీనం చేసుకుని ఉన్న యోగికి అహంకారం నాశనదశలో ఉంటుంది.  కాబట్టి, విశ్వం అంతా శ్రీహరియొక్క సాకారమైన స్వరూపంగా భావన చేయటానికి చాలా అనువుగా ఉంటుంది.  అంతే కాదు, ఈ‌ విశ్వాకార విష్ణుస్వరూపంలో తాను కూడా ఒక భాగమే నన్న అవగాహనా కలుగుతుంది.

ఐతే  ఒక్క విషయం మాత్రం మరవకూడదు.  ఈ విశ్వం అంతా తానే అయిన స్వరూపంగా మనం దర్శించే హరిస్వరూపం ఆయన యదార్థ స్వరూపంలో ఒకానొక అంశ మాత్రమే!  ఆయన ఈ కనిపించే విశ్వం కన్నా అధికుడూ దానికి అతీతుడూ కూడా. 

భగవంతుడైన శ్రీహరి నుండి ఆయన లీల వలన కాలస్వరూపంగా ఈ విశ్వం ఆవిర్భవించింది.  అది ఒక అండంగా ఉంది అనుకుంటే దానికి భూమి, జలమూ, అగ్నీ, వాయువూ, ఆకాశమూ అనే ఐదు మహాభూతాలూ, వాటి పైన అహంకారమూ మహత్తూ అనే రెండు అధిభూతాలతో మొత్తం ఏడు ఆవరణలు కలిగి పొరలుపొరలుగా రేకులు ముడుచుకుని ఉన్న ఒక మొగ్గలాగా ఉంటుంది. మనం భూమి మీద ఉండి భావన చేస్తున్నాం కాబట్టి ఈ‌ క్రమంలో వాటిని గ్రహించాలి. ఈ మహాండము యొక్క పొరలని ఆశ్రయించుకొని ఉంటాడు జీవుడు.  వీటిలో లీలగా ప్రవేశించీ, నిజానికి వీటిని పూర్తిగా అధిగమించీ ఉంటాడు భగవంతుడు.  ఇలా బ్రహ్మాండ రూపంలో ఉన్న దేవుణ్ణి భావించటమే‌ ధారణ అని చెప్పబడుతుంది.

అని చెప్పి శుకయోగి ఆ తరువాత, విరాట్ విగ్రహాన్ని వర్ణించి చెబుతున్నాడు.

3 వ్యాఖ్యలు:

 1. ధారణ గురించి చక్కగా వివరించారండీ

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పోతనగారు చెప్పినదాన్ని కూడా మరీ సరళం చేశారు. మీకు కృతజ్ఞతలెలా చెప్పాలో తెలియటం లేదు. కొన సాగించ మనవి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. పోతన గారి భాగవతం చదవలేని మా లాంటి పామరులకు మీరు చేస్తున్న మేలు మాటలలో చెప్పలేనిది. ధన్యవాదాలు.
  చైతన్య.

  ప్రత్యుత్తరంతొలగించు