1, ఆగస్టు 2013, గురువారం

ప్రథమస్మంధం: 08. అశ్వత్థామ చేసిన దుష్కృత్యం

సూతపౌరాణికులు శౌనకాది మహర్షుకు  శ్రీవేదవ్యాసులవారు భాగవతం విరచించుట గురించి తెలియజేసిన తరువాత వారితో పరీక్షిన్మహారాజుగారి పుణ్యకథను చెప్పటం మొదలు పెట్టారు.

ధర్మపరాయణులైన పాండవులు అధర్మవర్తనులైన కౌరవులతో యుధ్దం చేయక తప్పింది కాదు. మహాదారుణమైన కురుపాండవసంగ్రామంలో  అతిభయంకరమైన జననష్టం జరిగింది. ఉభయపక్షాల సైన్యమూ పూర్తిగా నశించింది.  గొప్పగా రారాజునని చెప్పుకునే దుర్యోధనుడు పదునెనిమిదవ రోజున జయాశ వదలుకుని ప్రాణాలు దక్కించుకుందుకు పారిపోయాడు.  కాని మడుగులో జలస్థంభనవిద్య సహాయంతో దాగి ఉన్న రారాజును, ఎత్తిపొడిచి రోషం తెప్పించి, బయటకు రప్పించారు పాండవులు.  గదాయుధ్ధంలో భీమసేనుడి చేతిలో దుర్యోధనుడు తొడలు విరిగి పడిపోయాడు.  తన మిత్రుడైన దుర్యోధనుడి దురవస్థకు కోపించి ద్రోణాచార్యులవారి కొడుకైన అశ్వత్థామ చేసిన దుష్కృత్యం మిక్కిలి అసహ్యకరమైనది.  అతడు ఆరోజున రాత్రివేళ నిదురపోతున్న ఉపపాండవులను సంహరించాడు కుత్తుకలు తరిగి.  చీకట్లో తను చంపుతున్నది పాండవులనే అని భ్రమపడ్డాడు అతగాడు.

తన భర్తలకు పరమప్రేమతో అస్త్రవిద్యలు బోధించిన పరమపూజనీయుడైన ద్రోణాచార్యులవారి కొడుకు అశ్వత్థామ.  అటువంటి వాడు అంత నిర్దయగా నిదురపోతున్న తన ఐదుగురు కొడుకుల్నీ‌, కసాయి వాడు పశువుల్ని చంపినట్లు గొంతులు పరపరా కోసి మరీ, చంపుతాడని ద్రౌపదీదేవి కలలో కూడా ఊహించలేదు.  అ దుర్వార్త చెవుల్లో పడగానే ఆవిడ  కళ్ళవెంట ధారాపాతంగా నీళ్ళు కారుతుండగా, జాలి పుట్టేలా పెద్దగా రోదిస్తూ, మొదలు నరికిన అరటి చెట్టులాగా నేల మీద దబ్బున పడిపోయింది.

అప్పుడు అర్జునుడు ఆవిడను లేవదీసి ఓదార్చుతూ ఇలా అన్నాడు

మ.  ధరణీశాత్మజవీవు నీకు వగవన్ ధర్మంబె యా ద్రోణి ని
ష్కరుణుండై విదళించె బాలకుల మద్గాండీవనిర్ముక్త భీ
కర బాణంబుల నేఁడు వాని శిరమున్ ఖండిచి నేఁ దెత్తు ద
ఛ్ఛిరముం ద్రొక్కి జలంబు లాడు మిచటన్ శీతాంశుబింబాననా

ఓ‌ ద్రౌపదీ, అలా దుఃఖించవద్దు.  నువ్వు రాచకులంలో పుట్టిన దానివి.  బేల పడరాదు. ఆ అశ్వత్థామ చేసినది చాలా ఘోరం. ఏ మాత్రం జాలీ దయా అనేవి లేకుండా చిన్నపిల్లల్ని చంపేశాడా దుష్టుడు.  ఇదిగో‌ చూడూ, నా గాండీవం కేసి చూడు. దీన్ని ఎక్కుపెట్టి నేను వాడి మీద వేసే అతిభయంకరమైన బాణాలు వాడి పని పడతాయి.  ఈ‌ రోజున వాడి తలను నా బాణాలతో తెగ్గొడతాను.  ఆ తల తెచ్చి నీకు ఇస్తాను.  ఆ‌దుష్టుడి తలకాయని కసిదీరా మరీ మరీ తొక్కి నువ్వు ఆ తరువాత జలకాలాడి సంతోషంగా నీ‌ పగ తీర్చుకో. 

అలా అని అర్జునుడు చెప్పగానే అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు కూడా శభాష్ వాడి తల తీద్దాం పద అన్నాడు. 

తీరా అర్జునుడు తనని తరుముకుంటూ రావటం చూడగానే అశ్వత్థామ గుండెల్లో రాయిపడింది.  చచ్చాను బాబోయ్ అని వాడి సర్వాంగాల్లో వణుకు పుట్టింది.  అయినా సాధ్యమైనంత వేగంగా పారిపోవటానికి ప్రయత్నించాడు.  కాని క్షణక్షణం శ్రీకృష్ణార్జునులు మీదికి వచ్చేస్తున్నారు. 

తన ప్రాణాలు దక్కించు కోవాలన్న ఆత్రుతతో అతను ఏ వీరుడూ చేయకూడని మరొక దుర్మార్గానికి తలపడ్డాడు. అర్జునుడిమీద బ్రహ్మశిరస్సు అనే భయంకరమైన దివ్యాస్త్రం వేసాడు.  అది ప్రళయభయంకరమైన తేజస్సుతో‌ దిక్కులు అన్నింటినీ‌ ఆక్రమిస్తూ అర్జునుడి కేసి వస్తోంది. ఆ అస్త్ర తేజస్సును చూసి అర్జును డంతవాడే కంపితు డయ్యాడు.

అశ్వత్థామ తనకన్న పెద్ద అస్త్రవిద్యావేత్త ఏమీ కాడే! మరి ఈ‌ అస్త్రం ఏమిటీ?  అప్పుడు యథాప్రకారం తనకు సారధ్యం చేస్తున్న శ్రీకృష్ణపరమాత్మను ఇలా ప్రార్థించాడు.  

స్వామీ నువ్వు భక్తులందరికీ‌ అభయం ఇచ్చే వాడివి. అతిభయంకరమైన సంసారం అనే అగ్నిగుండం నుంచి జీవుల్ని రక్షించే‌ వాడు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే.  ప్రకృతికి వెలుపల ఉండే వాడివి కాబట్టి ఈ‌ సంసారానికీ దానిలో ఉన్న అన్ని జీవులకూ నువ్వు ప్రభుడివి. నిజానికి సృష్టిలో యేకైక పురుషుడివి నువ్వే. నీ వల్లనే పుట్టిని ప్రకృతి యొక్క మాయను నువ్వే యెరుగుదువు.  ఆ మాయ నుంచి మాలాంటి వారిని ఉధ్ధరించే ఒకే ఒక దిక్కువు నువ్వే.  నిన్నే‌ నమ్ముకున్న ధర్మాత్ములను మాయ నుండి రక్షించటానికి, ప్రేమతో స్వయంగా అవతారాలు స్వీకరించి వస్తూ ఉంటావు.  హే జగత్ప్రభూ

క.  ఇది యొక తేజము భూమియుఁ
జదలును దిక్కులును నిండి సర్వంకషమై
యెదురై వచ్చుచు నున్నది
విదితముగా నెఱుఁగ జెప్పవే దేవేశా

ఇదిగో ఇదేదో గొప్ప తేజస్సు. భూమిని నిండిపోయి కనిపిస్తోంది. ఆకాశాన్ని సంపూర్ణంగా ఆక్రమించింది. అన్ని దిక్కుల లోనూ‌ నిండిపోయింది. వేగంగా మన మీదకు వచ్చేస్తోంది. దేవతలకు అందరికీ‌ ప్రభువువు నువ్వు. అంతా నీకు తెలుసు. దయచేసి ఇదేమిటో తెలియ జేయవలసింది.

అప్పుడు శ్రీకృష్ణపరమాత్మ పార్థుడితో విషయం చెప్పాడు.  అర్జునా, ఇది బ్రహ్మశిరస్సు అనే అస్త్రం.  దీన్ని మరొక అస్త్రంతో శాంతింప చేయటం అసాధ్యం.  ఈ‌ బ్రహ్మశిరస్సును ద్రోణాచార్యులవారు నీకు తప్ప యెవరికీ బోధించ లేదు.

ఈ అశ్వత్థామ ప్రాధేయ పడితే తప్పనిసరై అతడికీ ఉపదేశం చేసాడు.  అప్పుడు ఆయన అంతరాత్మ, అశ్వత్థామ తీవ్రకోపి కాబట్టి అతడికి ఉపదేశించటం‌ అరిష్టదాయకం, అని హెచ్చరించింది.  దానితో ఆయన ఈ అస్త్రాన్ని ఉపసంహరం చేసే విధానం మాత్రం కొడుక్కి ఉపదేశం చేయలేదు.  ఉపసంహారం చేతకాని అస్త్రాన్ని యే ధనుర్వేదం నేర్చుకున్న వాడూ‌ పొరపాటున కూడా ప్రయోగించ కూడదు.  దుష్టుడైన అశ్వత్థామ ఆ మహాపాపం కూడా నిర్లజ్జగా చేసాడు. కృధ్దః పాపం నకుర్యాత్ కః.  ఒళ్ళు తెలియని కోపమూ, అంతులేని భయమూ వీడిచేత ఇంతపని చేయించాయి. ఇంక తప్పేది లేదు. నువ్వు కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించు. లేకుంటే మహాప్రమాదం సుమా అని హెచ్చరించాడు.

అర్జునుడు ఆచమనం చేసి శ్రీకృష్ణుడికి ప్రదక్షిణంగా వచ్చి తానూ‌ అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రానికి అదే అస్త్రాన్ని విరుగుడుగా ప్రయోగించాడు. దానితో ఇద్దరి అస్త్రాలూ ప్రళయ భయంకరంగా పోరాడుకోవటం మొదలు పెట్టాయి.  వాటి పోరాటతీవ్రతకు మూడులోకాలూ గజగజ లాడాయి!

(మహాభారతంలో ఇక్కడ మరి కొంత వివరం ఉంది. అప్పుడు శ్రీ‌నారదమహర్షులవారూ, వేదవ్యాసులవారూ అక్కడికి వచ్చారు. శ్రీనారదులవారు ఇద్దరినీ తమతమ అస్త్రాలను ఉపసంహరించుకోమని ఆదేశించారు. ఆయన ఆజ్ఞప్రకారం అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. నారదులవారి మహిమ వల్ల అశ్వత్థామ వేసిన అస్త్రం స్థంభించి ఉండి గర్జిస్తోంది.  అశ్వత్థామకు తన అస్త్రాన్ని ఉపసంహరించుకోవటం చేతకాలేదు.  అసలు అతడికి తెలిస్తే కదా ఆ విధానం.

అప్పుడు నారదులవారు, అర్జునా నువ్వే అశ్వత్థామ అస్త్రాన్నీ ఉపసంహరించు అని ఆదేశించారు.  అలా మరొక వీరుడు వేసిన అస్త్రాన్ని తాను ఉపసంహరిస్తే అది లోకక్షేమం కాదు వందేళ్ళ కరువు వస్తుందీ అని అర్జునుడు విన్నవించుకున్నాడు. అయినా నారదుల వారి ఆజ్ఞ పాటించాడు)

శ్రీకృష్ణుడు అర్జునా ఈ‌ పోరాడుకునే రెండు అస్త్రాలనూ వెంటనే ఉపసంహరించమని చెప్పగానే అర్జునుడు అలా చేసి అశ్వత్థామను తరిమి పట్టుకున్నాడు. ఒక పశువును కట్టినట్లుగా అతడిని తన రథానికి కట్టి పడేశాడు.

అర్జునుడి కోపం వర్ణనాతీతం.  ఈ‌ అశ్వత్థామను ఇప్పుడే సంహరిస్తాను అని గర్జించాడు.  అశ్వత్థామ గడగడా వణికి పోతున్నాడు.  అదిచూసి శ్రీకృష్ణుడు అర్జునుడితో

చ. వెఱచిన వాని దైన్యమున వేఁదురు నొందినవాని నిద్ర మై
మఱచినవాని సౌఖ్యమున మద్యముఁ ద్రావినవాని భగ్నుడై
పఱచినవాని సాధుజడభావమువానినిఁ గావు మంచు వా
చఱచినవానిఁ గామినుల జంపుట ధర్మము కాదు ఫల్గుణా

అర్జునా,  ప్రాణభయంతో వణుకుతున్న వాడినీ, దీనంగా అయిపోయి మనస్సు పనిచేయని స్థితిలోకి పోయిన వాడినీ, నిద్రపోతున్నవాడినీ, మధ్యపానం చేసి మత్తులో సుఖావస్థలో ఉన్నవాడినీ, దెబ్బతిని పారిపోయిన వాడినీ, మంచివాడుగా మారిపోయిన వాడినీ, మతిలేని పిచ్చివాడినీ, చంపొద్దు రక్షించు రక్షించు అని నెత్తీ నోరూ‌ మొత్తుకుంటున్న వాడినీ చంపటం ధర్మం కాదు. అలాగే స్త్రీలను చంపటమూ‌ ధర్మం కాదు.

వీడు, ఈ అశ్వత్థామ, బొత్తిగా దయలేకుండా ప్రవర్తించాడు.  నిస్సహాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలు బలి తీసుకుని నరకం సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్రాణభయంతో మతిపోయి ఉన్నాడు. నరకశిక్షచేత మాత్రమే పరిశుధ్దుడు కావలసిన వాడిని నువ్వు కాని చంపితే ఆ శిక్ష యేదో నువ్వే‌ వేసిన ట్లౌతుంది. రాజశిక్షతో‌ పరిశుధ్ధుణ్ణి చేసి వాడిని నరకం నుంచి రక్షిస్తుంది. నీ కెందుకా శ్రమ? అదీకాక వీడు బ్రాహ్మణుడు. కాబట్టి చంపరాదు.

శ్రీకృష్ణులవారి ఉపదేశంతో అర్జునుడు కోపాన్ని అణచుకున్నాడు. అయినా ద్రౌపదికి తాను మాట ఇచ్చాడు కదా?  అందుకని వాణ్ణి అలాగే శిబిరానికి తీసుకుని వచ్చాడు.

క. సురరాజ సుతుఁడు చూపెను
దురవధిసుతశోకయుతకు ద్రుపదుని సుతకుం
బరిచలితాంగశ్రేణిం
బరుషమహాపాశబధ్ధపాణిన్ ద్రౌణిన్

శిబిరంలో అయోనిజ, పాంచాలదేశాధిపతి ద్రుపదమహారాజుగారి గారాల కూతురు, పాందవపట్టమహిషి అయిన కృష్ణా మహాదేవి కడుపున పుట్టిన అయిదుగురు పిల్లలనూ పోగొట్టుకుని మహా దారణమైన దుఃఖభారంతో కూర్చుని ఉంది.  సాక్షాత్తూ త్రిలోకాధిపతి అయిన ఇంద్రుని అంశలో జన్మించని లోకైక వీరుడు అర్జునుడు అశ్వత్థామను రథానికి గట్టిగా తాళ్ళతో బిగించి కట్టి తీసుకుని వచ్చాడు.  వచ్చి ఆ కిరీటి పుత్రశోకంతో ఉన్న తల్లికి, ద్రౌపదీ ఇడిగో దుష్టుడు అశ్వత్థామ అని చూపించాడు.  ఆ అశ్వత్థామ భయంతో వణికి చస్తున్నాడు.

1 వ్యాఖ్య:

  1. భాష కధని పరిగెట్టించింది. ఆనందమయింది. మీదే ఆలస్యం, చదివిపెట్టడానికి మేం సిద్ధమే!

    ప్రత్యుత్తరంతొలగించు