31, జులై 2013, బుధవారం

ప్రథమస్కంధం: 07. శ్రీవేదవ్యాసులవారు భాగవతం విరచించుట.

భగవంతుడైన నారదుడు ఇలా తన పూర్వజన్మవృత్తాంతం వ్యాసులవారికి తెలియజేసి వెళ్ళారని సూతుడు శౌనకాది మహర్షులకు చెబుతూ అయనొక మాట అన్నారు.

క. వాయించు వీణ నెప్పుడు
మ్రోయించు ముకుందగీతములు జగములకుం
జేయించు జెవులపండువు
మాయించు నఘాళి నిట్టి మతి గలఁడే

నారదులవారు నిత్యం మనోహరంగా వీణావాదనం చేస్తూ నారాయణుడి మీద కీర్తనలు పాడుతూ ఉంటారు. ఆ గీతాలు చెవులకు పండుగ చేస్తూ ఉంటాయి. అవి వినే వాళ్ళ పాపాలన్నీ‌ తొలగిస్తూ ఉంటాయి. ఆహా. నారదులవారి వంటి మహానుభావులెవరూ ఉండరు!

అప్పుడు శౌనకమహర్షి, బాదరాయణుడు (వ్యాసుడు) ఆ తర్వాత ఏమి చేసారూ‌ అని ప్రశ్న వేయగా సూతులవారు చెబుతున్నారు.

సరస్వతీనదికి పడమటితీరంలో ఋషులకు మిక్కిలి ఇష్టమైన శయ్యాప్రాసం అనే ఆశ్రమం ఉంది.  వేదవ్యాసులు అక్కడకు వెళ్ళారు. 

పరిపూర్ణమైన భక్తితో ఈశ్వరుని భావనలో దర్శించారు.  ఈశ్వరుడి ఆధీనంలో ఉంటుంది మాయ. ఆ మాయలో పడి మోహంతో జీవులంతా నిత్యం జననమరణ చక్రంలో‌ పరిభ్రమిస్తూ ఉంటారు.  నిజానికి ప్రతిజీవుడూ ఈశ్వరాంశయే.  ఈశ్వరుని వలే జీవుడూ త్రిగుణాలకు అతీతుడే.  కాని ఎప్పుడైతే, మాయ యొక్క ప్రభావంలో‌ పడ్డాడో, అప్పుడే జీవుడు తనకు ఈ సత్వరజస్తమో గుణాలు మూడూ సహజంగా ఉన్నాయని భ్రమపడతాడు.  ఈ‌ గుణాలపట్ల అభిమానం కలిగి ప్రవర్తిస్తాడు.  దానితో‌ తాను కర్మలు చేసేవాడూ వాటిఫలాలు పొందేవాడూ‌ అవుతున్నాడు.  జీవుడికి ఈ కర్తృనూ‌ భోక్తనూ అన్న తప్పుడు స్పృహ పోవాలీ‌ అంటే నారాయణ భక్తి అనే యోగం తప్ప వేరే దారి లేదు.  ఇదంతా చక్కగా విచారించి వ్యాసభగవానులు భాగవత మహాగ్రంథాన్ని నిర్మించారు.  దానిని మోక్షార్థి ఐన తన పుత్రుడు శుకమహర్షిచేత చదివించారు.

సూతుడు ఇలా చెప్పగా విని  శౌనకమహర్షికి ఆశ్చర్యం వేసింది.  అదేమిటి మహాత్మా,  నిత్యం మోక్షస్థితిలో ఉండేవాడూ, ప్రపంచాన్ని సాక్షిమాత్రంగా చూస్తూ ఉండేవాడూ అయిన శుకయోగీంద్రుడికి భాగవతం‌ అభ్యసించవలసిన పనేమిటీ అని ఆడిగారు.  దానికి సూతుడి సమాధానం ఏమిటంటే

ధీరులూ, దేనిమీదా ఆపేక్షలేనివారూ, ఆత్మారాములూ అయిన మునులు హరిభజన చేయటానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ‌ అవసరం లేదయ్యా.  అది వారి స్వభావం.  అదే నారాయణుడి స్వభావం.  దేనినైనా కోరి హరిభజనం చేయటం కామ్యకర్మం కాబట్టి అది కల్యాణస్వరూపమైన ముక్తిని ఇవ్వదు. అందుచేత

క. హరిగుణ వర్ణన రతుఁడై
హరితత్పరుడైన బాదరాయణి శుభత
త్పరతం‌ బఠించె త్రిజగ
ద్వర మంగళ మైన భాగవత నిగమంబున్

శుకయోగీంద్రుడు, శ్రీమహావిష్ణువు గుణవర్ణనం పట్ల మిక్కిలి ఆసక్తి కలవాడై,  ఆ విష్ణువునందే పరమ నిష్ఠ కలవాడై, పరమశుభమైన మోక్షం‌ పట్ల నిలకడ కలవాడై, ముల్లోకాలకూ మంగళప్రదమైన భాగవతం అనే వేదాన్ని అభ్యసించాడు.

క.  నిగమములు వేయుఁ జదివిన
సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్
సుగమంబు భాగవత మను
నిగమంబుఁ బఠింప ముక్తి నివసనము బుధా

ఓ‌ మహర్షులారా, అనంతా వై వేదాః అని వేదాలు వేయింటిని చదివినా ముక్తి సులభం కాదు సుమా.భాగవతం అనే వేదం చదివిన వారికి మాత్రం అది సులభం.  భాగవతం చదివిన వారు నిత్యం ముక్తులయే ఉంటారు.

ఇక మీరడిగిన పరీక్షిత్తు కథలోకి వద్దాం అని సూతపౌరాణికుడు అన్నాడు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి