25, ఆగస్టు 2013, ఆదివారం

ప్రధమస్కంధం: 35. శ్రీశుకయోగీంద్రులు పరీక్షిత్తు వద్దకు రావటం.

ఆ విధంగా పరీక్షిత్తు తనని పరామర్శించటానికి దయచేసిన మునీంద్రులతో, ఈ ఏడు రోజుల్లోనే నాకు ముక్తి దొరికే దారి ఏదన్నా ఉందా?
శా.ప్రాప్తానందులు బ్రహ్మబోధనకళాపారీణు లాత్మప్రభా
లుప్తాజ్ఞానులు మీర లార్యులు దయళుత్వభిరాముల్ మనో
గుప్తంబుల్ సకలార్థజాలములు మీకుం గానవచ్చుం గదా
సప్తాహంబుల ముక్తి కేగెడు గతిం జర్చించి భాషించరే

మీరంతా  పెద్దలు.  ఎంతో ధుఃఖమయమైన సంసారంలో మాబోటి వాళ్ళ మధ్యనే దర్శనం ఇస్తూ ఉన్నా, నిజానికి నిత్యం బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నారు మీరు.  అలాగే మీరు ముముక్షువులకు (అంటే మోక్షం కోరుకునే వాళ్ళకు అని అర్థం) పరబ్రహ్మ తత్త్వం గురించి చక్కగా బోధించి వాళ్ళకూ బ్రహ్మానందం అనుభవించే స్థితిని కలిగించటం అనే‌ కళలో బాగా నైపుణ్యం ఉన్నవారు. మీరు కేవలం మీ ఆత్మజ్ఞాన ప్రభలచేతనే అజ్ఞానాన్ని తొలగించగల సమర్థులు. మాలాంటి అజ్ఞానుల పట్ల ఎంతో దయ కలవారు.  ఎవరి మనస్సుల్లో ఏవిధ మైన కోరికలు దాగి ఉన్నా అవి మీ ఎఱుకకు తెలియకుండా ఉండవు.  నా కోరిక మీకు తెలుసు కదా! దయచేసి నాకు ఈ ఏడు రోజుల వ్యవధిలోనే ముక్తి దొరికే ఉపాయం ఉందేమో చెప్పండి.

ఇక్కడ మనస్సుల్లో ఉన్నది మీకు తెలుస్తుందీ అని ఎందు కన్నాడూ అని అనుమానం రావచ్చును.  అంటే, డాంబికంగా ఎవడైనా వచ్చి అడుగుతున్నాడా, వాడు నిజంగా సంసారలంపటం మీర విరక్తి కలవాడేనా అని మీకు తెల్లంగానే ఉంటుంది అని చెబుతున్నాడన్న మాట. 

ఒక్కోసారి వైరాగ్యం యొక్క లక్షణాలు కనిపిస్తాయి. కాని ఆ లక్షణాలు నిజమైన వైరాగ్యం చేత కాక పోవచ్చును.

శ్మశానవైరాగ్యం అని ఉంది.  ఎవరైనా కాలం చేసి నప్పుడు, బంధువుల, మిత్రుల నోట తరచుగా, ఈ జీవితం‌ శాశ్వతం కాదూ, ఈ దేహం వట్టి తోలు బొమ్మా లాంటి మాటలు వినిపిస్తాయి. కొందరైతే వినే వాళ్ళకి కూడా వైరాగ్యం కలిగే స్థాయిలో వేదాంతోపన్యాసాలు చేస్తారు. అసలు ఆత్మజ్ఞాప్రబోధకమైన గరుడపురాణాన్ని దశాహాల్లోనే చదవాలీ మిగతా రోజుల్లో చదవటం తప్పూ‌ లాంటి భ్రమవాదాలూ ఉన్నాయి.  నిజానికి ఇలా మృతాశౌచ సమయంలో జనం నోట వచ్చేది అంతా మిట్టవేదాంతం.  నాలుగురోజుల్లో అంతా గప్-చుప్.  ఎవరి ప్రాపంచిక తాపత్రయాల్లో వాళ్ళు తలమునకలుగా ఉంటారు.

ఇలాంటిదే‌ ప్రసూతి వైరాగ్యం అని మరోటి కూడా వినిపిస్తుంది.  అలాగే గట్టిగా జబ్బుచేసినప్పుడు కొందరినోట వైరాగ్య రాగాలు పలుకుతాయి.

నిజానికి ఇలాంటి మిట్టవేదాంతాలన్నీ మనస్సులు సంసారతాపత్రయాల నుండి విరమించుకోవటం వల్ల వచ్చినవి కావు. ఆ తాపత్రయాల్లో తారసపడిన చిక్కుల కారణంగా ఏర్పడిన తాత్కాలిక మైన నిస్పృహ పలికించే చిలకపలుకులు.

అలాంటి స్థితిలో ఎవ్వరైనా కొంచెం అతిగా ప్రవర్తించి సద్గురువుల దగ్గరకు పోయి.  అయ్యా, ప్రపంచం అంతా రోత అనిపిస్తోంది.  నాకు బోధ చెయ్యండి అంటే సద్గురువులు బోల్తా పడరు.  వాళ్లకు ఈ‌ క్షణభంగుర వైరాగ్యం‌ కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది.

అలాగే, ఎవరైనా నిజమైన వైరాగ్యంతో ఉన్నవాడు ఎదటబడితే,  వాడు అడక్కపోయినా, వీడురా యోగ్యుడూ అని కూడా గురువులు వెంటనే గుర్తు పడతారు.

అందుకే ఒక నానుడి ఉంది.  నువ్వు గురువుని వెదుక్కోవటం‌ కాదూ, యోగ్యుడివి అయితే నీ గురువే నిన్ను వెదుక్కుంటూ వస్తాడూ అని.

అందుచేత ప్రజలు మూడు విషయాలుగుర్తు పెట్టుకోవాలి. 

ఒకటి - ఏదో వైరాగ్యం సంపాదించేశామూ అని భ్రమలు మాని తామున్న బహ్మచర్య, గృహస్థాది ఆశ్రమ ధర్మాలను చక్కగా ఆచరించుకుంటూ ఉండాలి.

రెండు- బోధలు చేస్తూ తిరిగే వాళ్ళంతా బోధగురువులు కాదు.  వాళ్ళల్లో చాలా మంది బాధగురువులు.  ఈ‌ మధ్య కొంత మంది, కనిపించిన వాళ్ళకల్లా నెత్తిన చేయిపెట్టి ఆత్మజ్ఞానం కూడా -- తగిన ఫీజు తీసుకునే అనుకోండి -- అందించేస్తున్నారు. గురువుల్ని వెదుక్కుంటూ తిరగటం అనే ఫ్యాషన్ అనండి హాబీ అనండి ఎప్పుడు ముదురుతుందో అప్పుడు దాన్ని సొమ్ముచేసుకునే మహానుభావులూ వస్తారు మన మధ్యలోకి.  అప్పుడప్పుడు వాళ్ళల్లో దేవుళ్ళమూ అని ప్రకటించుకునే వాళ్ళు కూడా ఉంటారు.

మూడు - ఫ్యామిలీ డాక్టరులాగా, ఫ్యామిలీ గురువుల్ని ఏర్పాటు చేసుకోవటం లాంటి వేలంవెర్రులకు దూరంగా ఉండాలి. మీ గురువును మీరు గుర్తుపట్టటం సాధ్యపడకపోవచ్చు. కాని మీరు యోగ్య మైన స్థితికి వస్తే, మీకు భగవంతుడే గురువుని నియమిస్తాడు.  ఆ గురువుగారే మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తారు.

పరమభాగవతుడైన పరీక్షిన్మహారాజు వివేకాన్ని మనం ప్రశ్నించటం అవసరం లేదు.  ఆయనకు క్షుణ్ణంగా తెలుసు.  తాను ఏ స్థితిలో ఉన్నదీ.  తనను వెదుక్కుంటూ ఈ‌ మహానుభావులంతా వచ్చారంటే,  వీరిలో తనకు గురుత్వం వహించి ముక్తి మార్గం చూపగల గురువు ఎవ్వరైనా ఉన్నారేమో అని ఆశపడుతున్నాడు.  అందులో‌ తప్పు ఏమీ లేదు.

తన మనస్సులో ఏర్పడ్డ వైరాగ్యం నిజమైనది కాకపోతే, ఇంతమంది ఋషులు తనని పరామర్శించేందుకు వస్తారా? మహాత్ముల దర్శనం ఊరకనే పోకూడదు కదా?  వారు దర్శనం ఇవ్వటం వలన తనకి ఏమి మేలు కలుగుతుంది?  అసలు తాను ఎటువంటి మేలు కావాలని స్పష్టంగా కోరుకుంటున్నాడు?  అదేదో, తాను వాళ్ళకి విన్నవించుకోవాలా ప్రత్యేకంగా? తనకి కావలసినది మోక్షం. వాళ్ళు చూపవలసినది మార్గం.  తాను యోగ్యుణ్ణి అనుకుంటే వాళ్ళకు అనుగ్రహం కలిగి దారి చూపిస్తారు.  అందుకే వాళ్ళని అలా వేడుకున్నాడు.

సరేనండీ, మహారాజు అన్నీ వదిలేసాడు.  ఆయనకి మోక్షం తప్ప మరేమీ అక్కరలేదు. కాని ఏడంటే ఏడురోజుల్లో అదెలా సాధ్యమూ అన్నది మునిశ్రేష్ఠు లందరి ముందూ ఉన్న ప్రశ్న.

ఈ‌ చిక్కుప్రశ్నకు వాళ్ళు జవాబు వెతుకుతూ ఉన్నారు.

ఆసమయంలో భగవంతుడే పంపినట్లుగా ఒక మహానుభావుడు అక్కడికి దయచేసాడు.

ఇంతకు ముందు టపా చివరన మనం ఒక అద్భుతం జరిగిందీ అని అనుకున్నాం.  ఒక యోగ్యుడైన శిష్యుడి వద్దకు దైవయోగంగా ఒక సద్గురువు రావటం అనేదే ఆ అద్భుతం.  దైవయోగం అన్న మాట నా స్వకపోలకల్పితం కాదు. ఆ మాటను పోతన్నగారే ఈ‌ సందర్భాన్ని ఆవిష్కరిస్తూ వాడారు.  బహుశః ఈ మాటను పోతన్నగారు కూడా వ్యాసులవారి మూలం నుండే ఉటంకించి ఉండవచ్చును. ఈ టపాలో, ఈ మాటకు తగిన ప్రాతిపదిక ఏర్పాటు చేయటానికి గాను నేను కొంచెం ఎక్కువగా వ్రాసినట్లున్నాను. అంతే. 

దైవయోగం అని ప్రత్యేకంగా అనుకోవటం ఎందుకూ అంటే, ఈ మాట మన మనస్సులకు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.   ఒక మహానుభావుడైన గురువుకీ, ఒక  యోగ్యుడైన శిష్యుడికీ సమాగమం అనేది ఏ మాత్రమూ మానవసంకల్పం కాదు అని చెప్పటమే ఈ సందర్భాన్ని ఆవిష్కరిస్తూ మహాభాగవతం దైవయోగంగా ఒక మహానుభావుడు వచ్చారు అని చెప్పటం.

కొన్ని ఆధునిక కాలపు ఉదాహరణలూ‌ మనం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చును.   శ్రీరామకృష్ణపరమహంస వద్దకు తోతాపురి రాకను స్మరించండి.  వివేకనందుడికీ రామకృష్ణులకూ ఎలా సమగమం జరిగిందీ స్మరించండి.  పరమహంస యోగానందకూ శ్రీయుక్తేశ్వరగిరిగారికీ సమాగమం ఎలా జరిగిందో స్మరించండి.  ఈ‌ సంఘటనలు అన్నింట్లోనూ మానవసంకల్పం కన్నా దైవయోగం అనేదే చోదనశక్తి అని స్పష్టంగా అవగాహన అవుతుంది.

సరే, భాగవతకథలోకి వద్దాం.  ఆ వచ్చిన ఆ మహానుభావుడు ఎలా ఉన్నదీ చూడండి.

సీ.  ప్రతినిమేషముఁ బరబ్రహ్మంబు నీక్షించి
      మదిఁ జొక్కి వెలుపల మఱచువాఁడు
కమలంబు మీదఁ బృంగములకైవడి మోము
      పై నెఱపిన కేశపటలివాఁడు
గెఱ వ్రాసి మాయ నంగీకరించిన భంగి
       వసనంబు గట్టక వచ్చువాఁడు
సంగి గాఁ‌ డని వెంటఁ జాటు భూతములు నా
      బాలుర హాస శబ్దముల వాఁడు
తే. మహిత పద జాను జంఘోరు మధ్య హస్త
బాహు వక్షో గ ళానన ఫాల కర్ణ
నాసికా గండ మస్తక నయన యుగళుఁ
డైన యవధూతమూర్తివాఁ డరుగుదెంచె

ఆయన ప్రతిక్షణం తన చిత్తంలో పరబ్రహ్మాన్నే చూస్తూ ఉంటాడు.  కాబట్టి బాహ్యప్రపంచం అనేది కూడా ఒకటుందని ఆయన మర్చిపోయి ఉంటాడు.

ఒత్తైన నల్లని జుట్టూ, తామరపూవు రేకుల్లాంటి అందమైన కళ్ళూ ఆయనవి.  ఆ అందమైన ముంగురులు చిరుగాలికి అల్లల్లాడుతూ, ఆయన కళ్ళమీద తారాడుతుంటే, తామరపూవుల మీద తుమ్మెదలు మూగుతున్నట్లుగా సొగసుగా ఉంటుంది.

ప్రపంచాన్ని తనచుట్టూ తిప్పుకునే‌ మాయనే తనకు పైబట్టగా అంగీకరించినట్లు ఆయన వేరే బట్టలు కట్టుకోకుండా దిగంబరంగా ఉన్నాడు.  తనకన్న ఇతరం అంటూ ఒకటి ఉంది అన్నప్పుడూ,  దాని నుండి నేను అని వేరే ఉన్నానూ అన్న భావన ఉన్నప్పుడు కదా మానభిమానాల ప్రసక్తి. అందుకే ఆయన ఆ మాయనే బట్టగా చుట్టేసుకున్నాడూ అనటం.  ఇందులో మరొక చమత్కారం ఉంది. మాయనే చుట్టబెట్టి కట్టుకున్నాడూ అంటే మాయను లొంగదీసుకున్నాడూ అని.  లొంగదీసుకోవటం అని చెప్పటం కాదు కానీ, అలాంటి ముక్తసంగులకు మాయే లొంగి ఉంటుంది.

ఆయన వెంటబడి, పిల్లలు ఆటపట్టిస్తూ నవ్వుతున్నారు.  స్థూల సూక్ష్మాది సమస్త మహాభూతాలూ చిన్నపిల్లల్లా ఆయన వెంట పడుతూ ఈ‌యనకి దేనితోనూ అనుబంధం లేదూ, ఈ మహానుభావుడికి మేమే దాసులమూ అని చాటుతున్నట్లుగా ఉంది ఆ దృశ్యం.

పాదాలు, మోకాళ్ళు, పిక్కలు, తొడలు, నడుము, చేతులు, భుజాలు, వక్షస్థలం, మెడ, ముఖం, నుదురు, చెవులు, ముక్కు, చెక్కిళ్ళు, తల, కళ్ళు - ఇలా అవయవాలన్నీ చాలా అందంగా పొందిగ్గా సాముద్రికశాస్త్రం ప్రకారం అత్యంత ఉత్తమమైన లక్షణాలు కలిగి ఉన్నాయి.  

ఇలా అత్యంత అద్భుతమైన స్వరూపం గల ఒకానొక అవధూత అక్కడికి వచ్చాడు.

ఆయన ఒక అవధూత గదా. కాబట్టి,

ఉ. ఈ రని లోకులు గినిసి యెగ్గులు వల్కని వాఁడు గోరికల్
గోరని వాఁడు గూటువలఁ గూడనివాఁడు వృథాప్రపంచముం
జేరనివాఁడు దైవగతి జేరిన లాభముఁ జూచి తుష్టుడై
నేరని వాని చందమున నేర్పులు చూపనివాఁడు వెండియున్

ఎవరినీ‌ ఏమీ అడగడు.  ఎవరూ ఏదీ ఇవ్వలేదని కోపం తెచ్చుకుని దూషించడు.  పదిమంది మధ్యలోకీ వచ్చి అనవసరమైన చర్చలతో కాలక్షేపం చేసేవాడు కాదు.  అందరి మధ్యలో దూరి నాకిది వచ్చునూ, అది తెలుసునూ అంటూ తన ప్రజ్ఞను ప్రదర్శించుకోవాలనే కుతూహలం ఏమీ లేని వాడు.  దైవదత్తంగా ఏదన్న వస్తే మంచిదే, రాకపోతే కూడా మంచిదే అన్న తత్త్వం కలవాడు. 

అలాంటి వాడైన శ్రీశుకమహాయోగీంద్రులు అక్కడికి విచ్చేసారు.  ఆయన పదహారు సంవత్సరాల వయస్సు వాడు. మిక్కిలి అందగాడు.  ఆయన సర్వముక్త మహాయోగస్వరూపం చూసి ముక్తికాంతకే మక్కువ కలిగిందీ అంటే మామూలు స్త్రీల సంగతి చెప్పాలా!

ఆ. వెఱ్ఱితనము మాని విజ్ఞానమూర్తియై
బ్రహ్మభావమునను బర్యటింప
వెఱ్ఱియనుచు శుకుని వెంట నేతెంతురు
వెలఁదు లర్భకులును వెఱ్ఱులగుచు

ఏమీ వెఱ్ఱి లేని (అంటే ప్రపంచం అనేది వేరే ఉందన్న భ్రమ లేకుండా అన్నమాట) పరమ విజ్ఞానమూర్తి శ్రీశుకులు.  సాక్షాత్తూ కాళ్ళూ చేతులూ తగిలించుకుని మనమధ్యకు వచ్చిన పరబ్రహ్మమే శ్రీశుకులు.  అటువంటి శ్రీశుకుల్ని చూసి వెఱ్ఱివాడూ అని స్త్రీలూ, పిల్లలూ ఆయన వెంటబడుతున్నారు.

3 కామెంట్‌లు:

  1. అయ్యా, నాదేమీ లేదండి. అంతా పోతనగారి గ్రంథం నుండి వచ్చినదే. అక్కడక్కడా నా మాటలు కొన్ని వ్యాఖ్యానరూపంగా ఉండవచ్చును. అంతే.

    రిప్లయితొలగించండి
  2. నమోనమః బాగుంది. మాటరావాటంలేదు,చెప్పడానికి

    రిప్లయితొలగించండి
  3. అలాంటి ముక్తసంగులకు మాయే లొంగి ఉంటుంది.. అద్భుతః

    రిప్లయితొలగించండి