23, ఆగస్టు 2013, శుక్రవారం

ప్రథమస్కంధం: 33. శమీకమహర్షి శాపవృత్తాంతాన్నిపరీక్షిత్తుకు కబురుచేయుట

అలా శమీకమహర్షి కుమారుడు శృంగి కోపోద్రేకంతో, దుష్టుడైన ఆ రాజును నేటికి ఏడవ రోజున తక్షకుడనే నాగుడు కరిచి చంపుతాడు అని శపించే సరికి, మూడులోకాల్నీ పాలించే‌ దేవతలంతా అదిరిపడ్డారు.

ఏ‌ పరీక్షిత్తు ఐతే కలిని అదుపుచేసి ధర్మపరిపాలన చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ లేని లోటును యథాశక్తిగా తీరుస్తూ ధర్మదేవుణ్ణీ, భూదేవినీ, ప్రజల్నీ దేవతల్నీ కూడా సంతోషపెడుతున్నాడో అలాంటి మహానుభావుడికి మిన్ను విరిగి మీద పడ్డట్టుగా శాపం వచ్చి పడిందే అని చాలా విచారపడ్డారు.

శమీక మహర్షి కొడుకు శృంగి ఇంకా చిన్న వాడు.  ఇప్పుడిప్పుడే మెల్లగా తపస్సులో కుదురుకుంటున్నాడు,  కౌమారప్రాయం‌ దుడుకుతనంతో కోపం తెచ్చుకుని, అనవసరంగా రాజును శపించి లోకసంక్షోభం సృష్టించాడు.  తన తపశ్శక్తినీ వృధా చేసుకున్నాడు!

సరే, ఇంతా చేసి, తండ్రి మెడలో ఉన్న పాము కళేబరం చూసి భయపడి గోలగోలగా ఏడుస్తున్నాడు.  దాంతో అతడి తోటి పిల్లలూ రాగాలు లంకించుకున్నారు.

ఈ గడబిడకు శమీక మహర్షి ధ్యానానికి భంగం‌ కలిగింది.  ఆయన మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూసాడు.  తన కొడుకూ మిగతా పిల్లలూ తనకేసి చూస్తూ ఎందుకు ఏడుస్తున్నారో అయనకు అర్థం అయేందుకు ఒక క్షణం పట్టింది.  తన దేహం కేసీ‌ చూసుకుని, ఆ మహాత్ముడు చచ్చిన పామును మెడలోంచి తీసి పారేసాడు. అసలీ పామెలా వచ్చిందీ నా మెడలోకీ, అని కొడుకునే అడిగాడు.

అప్పుడు తండ్రిగారికి జరిగిన కథ అంతా వివరంగా చెప్పాడు శృంగి.   తన కొడుకు దుడుకుతనంతో పరీక్షిన్మహారాజును శపించాడని తెలుసుకుని ఆ మహాత్ముడు చాలా కలవరపడ్డాడు.  కొడుకు చేసిన పని ఆయనకు ఏమీ‌ సంతోషం కలిగించ లేదు.  ఎంతో విచారిస్తూ

ఉ.  కాపరిలేని గొఱ్ఱియలకై వడిఁ గంటక చోరకోటిచే
నేపఱి యున్న దీ భువన మీశుఁడు గృష్ణుఁడు లేమి నిట్టిచో
భూపరిపాలనంబు సమబుధ్ధి నితం డొనరింపఁ జెల్ల రే
యీ పరిపాటి ద్రోహమున కిట్లు శపింపగ నేల బాలకా

అబ్బాయీ.  ఈ ప్రపంచం ఇప్పుడు శ్రీకృష్ణుడు లేక కాపరి లేని గొఱ్ఱెల మందలాగా ఉంది.  కేవలం దొంగలప్రపంచం, దుష్టులప్రపంచం ఐపోయింది.  అలాంటి  ఈ రోజుల్లో పరమధర్మాత్ముడై అందరిపట్లా సమదృష్టి కలిగి భూమిని చక్కగా ఈ పరీక్షిన్మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు.  ఏదో, దప్పిగొని వచ్చాడు. దేహబాధకు తాళలేక మనం పట్టించుకోలేదని విసిగి చిన్నపాటి తప్పు చేసాడు.  ఈ‌ మాత్రానికే అంతటి మహానుభావుణ్ణి ఇలా శపించాలా నాయనా?

అన్నాడు.  అయ్యో‌ నాయనా, తక్షకుడు కరిచి చంపుతాడని ఇంత ఘోరంగా ఎందుకు శపించావయ్యా!  నాయనా, నీ శాపం‌ కారణంగా మనకే‌ పాపం చుట్టుకుంది తెలుసా?  చిన్న పాటి తప్పుకే మనం‌ శపించటంతో రాజు చనిపోతాడు. అరాజకం ప్రబలుతుంది.  ఇన్నాళ్ళూ ఈ‌ మహారాజుకు భయపడి దాక్కున్న కలి ఇంక విజృంభిస్తాడు. చివరికి మనుషులు కోతుల కన్నా చపలచిత్తం తోటీ,  కుక్కలకన్నా పరస్పర కలహపూర్ణమైన హీనమైన జీవితాలతోటీ బ్రతకటం మొదలవుతుంది.  ఇదంతా మన కారణం గానే సంక్రమించిన పరిస్థితి కాబట్టి మనకే పాపం వస్తుంది.

ఉ.  భారతవంశజుం బరమభాగవతున్ హయమేధయాజి నా
చారపరున్ మహానయవిశారదు రాజకులైకభూషణున్
నీరము గోరి నేఁడు మన నేలకు వచ్చిన యర్థి భక్తి స
త్కారము సేసి పంపఁ‌ జనుఁ గాక శపింపఁగ నీకు ధర్మమే

అయ్యో.  ఈ‌ పరీక్షిత్తు అత్యంత పవిత్రమైన భరత వంశంలో జన్మించాడు.  భగవంతుడికి పరమభక్తుడని పేరు సంపాదించుకున్న పుణ్యాత్ముడు. ఆశ్వమేథయాగాలు చేసి అవబృధస్నానాలతో పవిత్రం ఐన తేజోవంతమైన శరీరంతో ఒప్పారే వీరుడు.  సదాచారపరాయణుడై ధర్మం పట్ల అత్యంత శ్రధ్ధతో ప్రవర్తించే రాజు.  సకలనీతి కోవిదుడైన పరిపాలనా దక్షుడు.  అసలు రాజలోకంలోనే సాటిలేని వాడై,  రాజశ్రేష్ఠు లందర్లో  తలలో మాణిక్యం లాంటి వాడు.  అలాంటి మహాత్ముడు, గుక్కెడు నీళ్ళకోసం మన గూటికి వస్తే, ఆ దాయం తీర్చి, భక్తితో అతిథిసత్కారం చేసి, పంపిచ వద్దా?  నా విష్ణుః పృథివీ పతిః అని వినలేదా - రాజులో విష్ణ్వంశని పూజించాలి నాయనా!   అంతే కాని, ఇలా చిలిపికోపం తెచ్చుకుని శపించటం న్యాయమేనా?

క. చెలఁగరు కలఁగరు సాధులు
మిళితములయి పరులవలన మేలుం గీడున్
నెలకొని  నైన నాత్మకు
నొలయవు సుఖదుఃఖచయము యుగ్మము లగుచున్

సుఖమూ దుఃఖమూ అనేవి రెండూ కూడా ఆత్మకు అంటేవి కానే కావు.  ఈ‌ సంగతి సాధువులు చక్కగా నిత్యం మనస్సులో ఉంచుకుంటారు.  అందుకే ఎప్పుడూ వాళ్ళు, ఇతర నరుల వల్ల కష్టాలూ సుఖాలూ కలగాపులగంగా వస్తూ పోతూ ఉంటే ఉదాసీనంగా ఉంటారు వాటి పట్ల.  అంతే కాని సాధువులు ఇతరులు తమపట్ల చేసే మంచి చెడులకు బాధా పడరు, కోపమూ‌ తెచ్చుకోరు సుమా!

పరమేశ్వరా, శ్రీకృష్ణప్రభో! తెలిసీతెలియని చిన్నతనంతో నా కొడుకు నిరపరాధి ఐన పరీక్షిత్తును శపించాడు.  ఈ  తప్పు కాచి, నా కొడుకును క్షమించి పాపం తొలగించు తండ్రీ అని దైవాన్ని వేడుకున్నాడు శమీక మహర్షి.

ఇలా శమీక మహర్షి పరిపరివిధాల జరిగిన దానికి విచారించాడు.  తన కొడుకేమీ మహా తపస్వి కాడు.  ఇచ్చిన శాపాన్ని ఉపసంహరణం చేయటానికి అతడికి అంత తపశ్శక్తి లేదు.

జరిగిందేదో జరిగిపోయింది.  పాపం మహారాజుకు ఈ శాపం సంగతి తెలియనే తెలియదు.  ఇప్పుడు తను, ఆయనకు ఈ సంగతి వర్తమానం చేయటం కనీస ధర్మం. 

అందుకని తన శిష్యుడైన ఒక ముని కుమారుణ్ణి పిలిచి, మహారాజుకు ఈ‌ శాపవృత్తాంతం తెలియజేసి రమ్మని పంపాడు శమీక మహర్షి.

పరీక్షిన్మహారాజుగారు, అరణ్యం నుండి హస్తినాపురం పోయే‌ సన్నాహంలో ఉన్నాడు.  అంతలో ఈ ముని కుమారుడు వచ్చి విషయం వివరించాడు.

 

1 కామెంట్‌:

  1. నేను రెండు మూడు టపాలు కలిపి ఒక సారి చదువుకుంటున్నా. ఒక టపా సరిపోటం లేదు. ధార చాలా బాగుంది. కొనసాగించండి.

    రిప్లయితొలగించండి