21, ఆగస్టు 2013, బుధవారం

ప్రథమస్కంధం: 31. విష్ణుమాహాత్మ్యాన్ని గురించి సూతుడు వివరించుట.

ఆ  విధంగా ధర్మపరిపాలన చేస్తున్న పరీక్షిన్మహారాజు అనుకోకుండా మునిశాపానికి గురి అయ్యాడు.  ఆ శాపం కారణంగా ప్రాణాలు పోతాయని తెలిసి, ప్రపంచంతో అన్ని బంధాలూ తెంచుకున్నాడు.  శ్రీశుకమహర్షి వలన బ్రహ్మజ్ఞానం సంపాదించుకుని గంగా తీరంలో శరీరం వదిలిపెట్టేశాడు.

క. హరివార్త లెఱుఁగు వారికి
హరిపదములు దలఁచువారి కనవరతంబున్
హరికథలు వినెడి వారికి
మరణాగత మోహ సంభ్రమము లే దనఘా

ఓ శౌనక మునీ, విష్ణుమూర్తి వృత్తాంతాలు తెలిసుకునే వారికీ, విష్ణుపాదాలను ధ్యానం చేసుకునే వాళ్ళకీ,  విష్ణుకథలు పరమప్రీతితో నిత్యం వినే వాళ్ళకీ మరణం అంటే ఏ విధమైన భయమూ ఉండదు.  అది వచ్చి మీద పడుతోందటే ఏమీ ఈ శరీరమూ జీవితమూ అనే వాటి పట్ల ఏ విధమైన మోహమూ ఉండదు సుమా.

స్వరసవాహీ విదుషోఽపి తథారూఢో అభినివేశః అని పాతంజలం.  అంటే, ఎలాంటి వారికీ, మహాయోగులకు కూడా శరీరం అనేదాన్ని కలిగి ఉన్నందుకు శరీరస్పృహ సహజంగా ఉండే లక్షణం.  ఏ శరీరమూ కూడా తాను పడిపోవటాన్ని ఎంతో కొంత నిరోధిస్తుంది.  అదీ‌కాక శరీరధారులకి దాన్ని రక్షించటం అనేదీ కర్తవ్యమే.  శరీర మాద్యం‌ ఖలు ధర్మసాధనం అని కదా.  అందు చేత పరీక్షిత్తు తన శరీరం మీద ఏమీ మోహం పెట్టుకుని భయపడి కాక శరీర రక్షణ అనే‌ కర్తవ్యం దృష్టిలో పెట్టుకునే ఆలోచించి తగిన ప్రయత్నాలు చేయవచ్చును.  కాని హరిభక్తుడు కాబట్టి అలాంటి శరీర సహజమైన అభినివేశం కూడా ఆయన ఏమాత్రమూ పొందకుండా ఉండిపోయాడని చెప్పటం ‌ఈ‌ పద్యం ఉద్దేశం.

శ్రీకృష్ణుడు వైకుంఠధామానికి తరలి పోయిన తరువాత కలి భూలోకంలో ప్రవేశించాడు.  కాని ఆ కలి పరీక్షిన్మహారాజు ప్రతాపానికి జడిసి అణిగి పడి ఉన్నాడు.

పాపం చేస్తే కాని అంటుదు. పుణ్యం‌ మాత్రం చేద్దాం అని సంకల్పం చేయగానే ఎంతో కొంత మనకి వస్తుంది.  కాబట్టి ఈ కలి ఒక మూలన పడి ఉంటే వచ్చే నష్టం ఏమీ లేదని పరీక్షిత్తు అనుకున్నాడు.  తేనె తాగి పువ్వుని తేనేటీగ చిదుమకుండా వదిలేస్తుంది కదా.  అలాగే కలి వల్ల కొంచెం లాభం గ్రహించి పరీక్షిత్తు అతణ్ణి విడిచిపెట్టాడు.  అధర్మం ఎంతో కొంత ప్రబలుతుంటే ధర్మాత్ములు కలికి దొరకకుండా మరింత జాగరూకులై ఉండి భగవంతునికి ఇంకా సులభంగా ప్రీతిపాత్రు లౌతారు.   బలహీనమైన జంతువులమీదకీ, తెలివి తక్కువ జంతువుల మీదకీ,  అజాగ్రత్తగా ఉన్న జంతువులమీదకీ తోడేలు దూకు తుంది.  కాని బలమైన వాటి మీదకీ, తెలివి గల వాటిమీదకీ, జాగ్రత్తగా ఉండే వాటిమీదకీ పోలేదు కదా?  అలాగే, భగవద్భక్తి అనే బలమూ, జ్ఞానమూ కలవారు చక్కగా జాగ్రతగా ధర్మాచరణం చేస్తూ ఉంటే కలి ఏమీ చేయలేదు అని భావించి కలిని పరీక్షిత్తు క్షమించి వదిలేసాడు.

అలా సూతుడు సెలవిచ్చేసరికి అక్కడ ఉన్న మునులు అతనితో సంతోషంగా ఇలా అన్నారు.   అయ్యా పౌరాణికోత్తమా నువ్వు చిరకాలం వర్థిల్లవయ్యా!  నీ వల్ల మాకు యజ్ఞయాగాలు కాదు శ్రీహరి పాద చింతనమే పరమార్థం అని తెలిసివచ్చింది. ఈ స్వర్గమూ మోక్షమూ అనేవి కూడా హరిభక్తుల సాంగత్యానికి సాటిరావని తెలిసింది.  త్రిగుణాలకీ అతీతుడైన విష్ణుమూర్తి దివ్యకథలు బ్రహ్మాదులకు కూడా పూర్తిగా తెలుసో లేదో.   అలాంటిది ఎవడైనా హరికథలు వినటానికి తీరిక లేదన్నాడో వాడి కన్నా వెఱ్ఱివాడు లోకంలో ఉండడు.

క. శ్రీపంబులు ఖండిత సం
తాపంబులు కల్మషాంధ తమస మహోద్య
ద్దీపంబులు పాషండ దు
రాపంబులు విష్ణు వంద నాలాపంబుల్

విష్ణుప్రభువును గౌరవించి చేప్పే దివ్య కథలు లక్ష్మీ ప్రదాలు.  అవి సకల దుఃఖాలనీ పోగొడతాయి.  పాపబుధ్ధు లనబడే కారుచీకట్లను తరిమివేసే మిరుమిట్లు గొలిపేటంత పెద్ద దీపాలు.  దేవుడూ దెయ్యం అంతా భ్రమా అబధ్ధమూ నాటకమూ అనే నాస్తికులకి మాత్రం విష్ణుకథలు పిచ్చిమాటల్లా అనిపించి వాళ్ళ చెవులకి ఎక్కనే ఎక్కవు.

క. పావనములు దురితలతా
లావనములు నిత్యమంగళ ప్రాభవ సం
జీవనములు లక్ష్మీ సం
భావనములు వాసుదేవు పదసేవనముల్

వాసుదేవుడి పాదసేవలు జీవితాన్ని పావనం చేసేవి.  పాపాలనే పిచ్చిదుబ్బుల్ని తవ్వి పడేసే గునపాలవి.  నిత్యం మంగళాల్ని పొందే‌ అదృష్టాన్ని సజీవంగా ఉంచే సాధనాలు.  అవే లక్ష్మీదేవికి మనపట్ల అనుగ్రహాన్ని కలిగించే పధ్ధతులు.  

మహాత్మా సూతపౌరాణికా, మాకు యోగనిష్ఠ గురించి బోధించేదీ,  పవిత్రమైన విష్ణుకథగా వీనులవిందుగా ఉండేదీ ఐన భాగవతోత్తముడు పరీక్షిత్తు కథ విన్నకొద్దీ వినాలని అనిపిస్తోంది.  పరీక్షిత్తుకు శుకమహర్షి వలన ముక్తిమార్గం ఎలా లభించిందీ చెప్పండి, అని  మహర్షులంతా అడిగారు.

అయ్యలారా, మీ బోటి పెద్దలు అడిగితే చెప్పే భాగ్యం నాకు కలిగింది. నా జన్మ సఫలం అయింది అని అన్నాడు సూత పౌరాణికుడు.  ఈ విష్ణుకథా శ్రవణమూ ప్రచారమూ చేసి ఎవడైనా సంపాదించుకునే పుణ్యం విశేషమైనది.  అది వాడికి ఉత్తరోత్తరా మంచి జన్మం ప్రసాదిస్తుంది అన్నాడు ఆయన.

సీ.  ఎవ్వాని గుణజాల మెన్న జిహ్వలు లేక

      నలినగర్భాదు లనంతుఁ డండ్రు
కోరెడు విభుదేంద్రకోటి నొల్లక లక్ష్మి
      ప్రార్థించె నెవ్వాని పాద రజము
బ్రహ్మ యెవ్వని పాదపద్మంబు  గడిగిన
      జలము ధన్యత నిచ్చె జనుల కెల్ల
భగవంతుఁ డనియెడి భద్రశబ్దమునకు
      నెవ్వఁ డర్థాకృతి నేపు మిగులు
ఆ. నే మహాత్ముఁ నాశ్రయించి శరీరాది
సంగ కోటి నెల్ల సంహరించి
ప్రాభవమున మునులు పారమహంస్యంబు
నొంది తిరిగిరాక యుందు రెలమి

ఏ మహాత్ముడి సద్గుణాలని లెక్కించటానికి నోళ్ళు చాలక బ్రహ్మ, శేషుడు మొదలైన వాళ్ళు ఆయన అనంతుడూ అని చెబుతున్నారో 

తన అనుగ్రహం కోసం దేవతాప్రముఖులంతా నిరీక్షిస్తుంటే అందరినీ కాదని లక్ష్మీ దేవి ఏ‌ మహాత్ముని పాదధూళి కోసం ప్రార్థించిందో,

ఏ మహాత్ముని పాదాలను బ్రహ్మ తన కమండలం లోని నీళ్ళతో కడిగి ధన్యుడై,  ఆ నీళ్ళని ప్రజలకోసం గంగ అనే దివ్య నదిగా ఇచ్చాడో,

ఏ మహాత్ముడు భగవంతుడు అన్న మాటకే అర్థంగా ప్రకాశిస్తున్నాడో,

ఏ మహాత్ముడిని ఆశ్రయించి మహామునులు సకల బంధాలనూ వదలి పరమహంసలై మళ్ళీ పుట్టుక అనేదే లేని అద్భుతమైన స్థితిని పొందుతున్నారో,

ఆయనే శ్రీహరి.

పక్షి ఎంత ఎత్తుకు ఎగిరినా,  అది ఆకాశం అనే దాని అంతు చూడ గలదా?  శ్రీహరిని గురించి చెప్పటానికి శక్తి ఉన్నంతగా చెప్పతమే కాని ఆయన మాహాత్మ్యాన్ని సంపూర్ణంగా ఎవడైనా చెప్పగలడా?  నా చిత్తానికి ఎంత వరకూ సాధ్యమౌతుందో అంత విస్తారంగానూ మీకు తప్పకుండా చెబుతాను వినండి.

4 కామెంట్‌లు:

  1. గత మూడు టపాలు చదవలేదు. ఇప్పుడు చదివేశా! అద్భుతః

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా సంతోషం శర్మగారూ, పెద్దలు మీరు, నేను సాహసించి చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తూ, ఆదరంతో ఈ కథనాన్ని చదువుతున్నందుకు అనేక ధన్యవాదాలు.

      క. హరికథలు చదువు వారును
      హరికథలను చెప్పువారు నాదరమొప్పన్
      హరికథలు వినెడు వారును
      హరికిం గడు గూర్చువార లగుదురు ధరణిన్

      తొలగించండి

    2. పద్యం చాలా బాగుందండి! కంఠస్థం చేయవలసినదే, మంచి పద్యం చెప్పేరు.

      తొలగించండి
  2. ఈ పద్యం మీకు నచ్చినందుకు చాలా సంతోషం. నిజం చెప్పాలంటే నాకూ చాలా నచ్చింది ఈ పద్యం.

    నామస్మరణా దన్యోపాయో నహి పశ్యామో భవతరణే , అని చెప్పారు కదా ఆర్యులు. చదవటం, ప్రసంగించటం, వినటం అనే ఈ మూడూ కూడా స్మరణం అనే దాని రూపాలే. హరిస్మరణం కన్నా ఆనందం మరొకటుండదు. రాత్రి అంతా, హరిస్మరణంతో సంతోషంగా నిద్రను పూర్తిగా వదలిపెట్టేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అయినా మరునాటి ఉదయం ఆట్టే అలసట కూడా కలగదు! అందుచేత ఈ‌ మాట సాధికారిగంగా చెప్పగలను.

    రిప్లయితొలగించండి