20, ఆగస్టు 2013, మంగళవారం

ప్రథమస్కంధం: 30. పరీక్షిత్తు కలిని హెచ్చరించి తరిమివేయటం.

ఆగ్రహోదగ్రుడై పరీక్షిన్మహారాజు కత్తి దూయగానే కలిపురుషుడి కళ్ళ ముందు ప్రళయమేఘపు భయంకరమైన మెఱుపుతీగ కనిపించింది.  ఆ పాపాత్ముడు మాయదారి రాజవేషం వదిలేసి హడిలిపోతూ చేతులు జోడించి పరీక్షిత్తు కాళ్ళమీద పడి సాష్టాంగ దండ ప్రణామం చేసాడు.  శరణాగతుణ్ణి రాజా నన్ను రక్షించు అని పదేపదే విన్నపాలు చేసుకున్నాడు.  పరీక్షిత్తు వాడిని

క. అర్జునకీర్తిసమేతుం
డర్జునపౌత్రుండు భయరసావృత జనులన్
నిర్జితులఁ జంపనొల్లడు
దుర్జనభావంబు విడిచి తొలఁగు దురాత్మా 

ఒరే దుష్టుడా,  ఈ రాజు సాక్షాత్తూ మహాత్ముడైన అర్జునులవారి మనవడు.  ఆయనలాగా అత్యంత నిర్మలమైన కీర్తి సంపాదించుకున్న వాడు.  భయంతో చెమట్లు పట్టి వణుకుతున్న వాణ్ణీ,  ఓడి దణ్ణం పెట్టిన వాణ్ణీ చంపడు లేరా!   బుధ్ధి తెచ్చుకుని దుష్టస్వభావం వదలిపెట్టి పోరా

అని హెచ్చరించి అభయం ఇచ్చాడు.  ఇంకా ఇలా అన్నాడు.

నువ్వు పాపివీ, పాపాలు చేసే వాళ్ళని ప్రోత్సహించే వాడివీ కూడా.  సకలపాపాలకీ నువ్వు చుట్టానివీ.   ఇలాంటి నీకు నా రాజ్యంలో ఎంత మాత్రం స్థానం లేదు.   

నువ్వు పైకి ఒక రాజులాగా వేషం వేసుకుని తిరుగుతూ ఉంటావు.  కానీ నువ్వు, అసత్యం, లోభం, చౌర్యం, దౌర్జన్యం,  దురాచారం, మాయలు, కలహం, మోసం, కాలుష్యం, దారిద్ర్యం అనే అధర్మపు లక్షణాలతో అసహ్యకరంగా సంచరిస్తూ ఉంటావు.  

చూడూ, ఇది బ్రహ్మావర్తం అనే దొడ్దదేశం.  ఇక్కడ మహాత్ములైన వాళ్ళు శ్రీహరి గురించి తపస్సు చేస్తూ ఉంటారు.  ఆయన ప్రీతి కోసం చక్కగా యజ్ఞాలు యాగాలూ చేస్తూ ఉంటారు.  ఈ‌దేశం సత్యానికీ, ధర్మానికి నివాస స్థానం సుమా.

అలాంటి ఈ‌ పుణ్యదేశం బ్రహ్మావర్తంలో,  విష్ణుమూర్తి మహాత్ము లందరికీ  సంతోషం కలిగిస్తూ తిరుగుతూ‌ ఉంటాడు.  ప్రపంచంలో వాయుదేవుడు ఎలా అన్ని చోట్లా సంచరిస్తూ ఉంటాడో‌ అలా ఆ శ్రీహరి అన్ని జీవుల్లోనూ సంచరిస్తూ ఉంటాడు.  నిర్జీవుల్లోనూ నిండి ఉంటాడు. ఆ తపోయజ్ఞ నిరతులైన మహాత్ముల్లో సాక్షాత్తూ ఆత్మస్వరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడు. వాళ్ళకు సర్వకాల సర్వావస్థల్లోనూ సుఖసంతోషాలు కలిగిస్తూ ఉంటాడు.

అర్థమైందా?  అటువంటిది ఈ‌ పుణ్యభూమి!  నీ లాంటి తుఛ్ఛుడు ఇక్కడ కాలు మోపటానికి ఈ దేశ చక్రవర్తిగా నేను అంగీకరించను. 

ఇలా అని ఆ మహారాజు తళతళ లాడుతున్న తన కత్తిని బాహువులు సాచి గుండ్రంగా తిప్పుతూ కలిని హెచ్చరించాడు.  అంటే, మళ్ళీ తన రాజ్యంలో అడుగుపెడితే చంపుతానని వాడికి అర్థమయ్యే భాషలో చెప్పటం అన్నమాట.

కలి టక్కరి కదా!  అంత మాత్రానికే వదిలి చక్కాపోయే వాడు కాదు. 

క. జగతీశ్వర నీ‌ యడిదము
ధగధగిత ప్రభల తోఁడ  దదఱచుగ మెఱయన్
బెగడెం జిత్తము గుండెలు
పగిలెడి నిఁక నెందు జొత్తు భావింపఁ గదే 

ఓ మహారాజా,  నువ్వు అలా కత్తిని గిరగిరా చుట్టూ తిప్పుతుంటే దాని మెఱుపులకే‌ నాకు మనసులో భయం అలముకుంటోంది.  నాకు నిన్ను చూస్తే గుండెలు పగిలి పోతున్నాయి.  ఇంక ఎక్కడికి పోగలనూ!  నువ్వే చెప్పు దయచేసి.

ఈ భూమండలం అంతా నీ దేశం మహారాజా!  నేను ఎక్కడికి పోయినా నాకు  విల్లంబులతోనూ కత్తీకటారులతోనూ నువ్వే కనిపిస్తావు. నేను కూడా ఎక్కడో ఒకచోట తలదాచుకోవాలి కదా? నువ్వే సెలవియ్య వలసింది అని కలిపురుషుడు పరీక్షిత్తును వినయంగా సహేతుకంగా అర్థించాడు.

పరీక్షిన్మహారాజు కొంచెం ఆలోచించాడు.  ఈ‌ కలిపురుషుడు కూడా తనకు ఉండటానికి తగిన అవకాశం ఇవ్వాలని అడగటం న్యాయమే అని అనుకున్నాడు.

సరే, నీకు నాలుగు స్థానాల్లో ఉండటానికి అవకాశం ఇస్తున్నాను, విను.  ఎక్కడ ప్రాణివధ జరుగుతూఉంటుందో అక్కడ నువ్వుండ వచ్చును.  ఎక్కడ స్త్రీలు మర్యాద వదలి ప్రవర్తిస్తూ ఉంటారో అక్కడా నువ్వుండ వచ్చును.  ఎక్కడ జూదం ఆడుతూ ఉంటారో అక్కడా నీకు నివాసం ఇస్తున్నాను.  అలాగే ఎక్కడైతే మద్యపానం జరుగుతుందో అదీ స్థానంగా నీకు నియమిస్తున్నాను.  మరి ఇంకెక్కడా నీకు చోటు లేదు.  ఇలా అని పరీక్షిత్తు కలిపురుషుడికి, వాడు ఉండటానికి నాలుగు చోట్లు చూపించాడు.

పరీక్షిత్తు జాలిగుండె వాడు కూడా అని కలి బాగానే గ్రహించాడు.  మహారాజా, ఇవి సరిపోవయ్యా,  నాకు మరి కొంచెం జాగా చూపించూ అని మరీమరీ ప్రార్థించాడు.  పని జరిగేలా ఉంటే ఎవరైనా మళ్ళీ అడుగుతారు కదా?

పరీక్షిత్తు కొంచెం మెత్తబడి ఇంకా కొన్ని చోట్ల వాడు ఉండటానికి అనుమతించాడు. 

ధనం కోసం మనుషులు అబధ్ధాలు అడే చోటూ,  ఆ ధనం చూసుకుని జనం మదించి ఉండే చోటూ, ఆ ధనం కోసం నరులు వెంపర్లాడే చోటూ, ఆ దిక్కుమాలిన ధనం కోసం మానవులు తమలో తాము కలహించుకునే చోటూ అనే ఐదు కొత్త స్థానాలు కలికి ఇచ్చాడు. 

మరి ఏ ఇతర స్థలాల్లోనూ‌ కనిపించరాదని కలిని కట్టడి చేసాడు.  

కలిపురుషుడు సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

ఎప్పుడైతే బ్రహ్మవర్తం నుంచి కలి ఇలా కొన్ని షరతులపై తప్పుకున్నాడో, అప్పుడు ధర్మవృషభానికి కుంటుబడ్డ మూడు కాళ్ళూ తిరిగి వచ్చాయి. తపస్సూ, శౌచమూ, దయా అనే ఈ‌ మూడు కాళ్ళూ తిరిగి రాగానే ధర్మం నాలుగు పాదాలా నడిచింది హాయిగా.  అది చూసి భూదేవికి అమితమైన ఆనందం‌ కలిగింది.

ఇలా శ్రీకృష్ణదేవుడి అనుగ్రహం వలన బతికి బట్టకట్టిన  పరీక్షిత్తు మహాధర్మాత్ముడై ఏ ఇబ్బందులూ లేకుండా కౌరవరాజ్యలక్ష్మిని రక్షిస్తూ ధర్మాన్ని నాలుగు పాదాలా నడిపించి భూమండలాన్ని సంతోషంగా ఏలుకున్నాడు.

1 కామెంట్‌:

  1. ప్రాణి వధ/ వేట కలిపురుష స్థానం కదా వేటకుపోయి తానే కలిప్రభావానికి లోనయ్యారు పరీక్షిత్తుమహారాజు. మృగయావినోదం రాజులకు ధర్మబద్ధమైనా అప్పటికే కలికి ఆ స్థానం ఇచ్చేసారు కాబట్టి కలి ఆయనను మోహానికి గురి చేసాడు.

    రిప్లయితొలగించండి