11, ఆగస్టు 2013, ఆదివారం

ప్రథమస్కంధం: 20. ధర్మరాజులకు నారదమహర్షులవారు కాలగతిని తెలియజేయటం

ఆ విధంగా విదురుడు బోధించగా సంసారం పట్ల విరక్తి చెంది గుడ్డిరాజుగారు తపస్సు చేసుకోవటానికి నిశ్చయించుకుని భార్యాసమేతంగా అరణ్యాలకు వెళ్ళిపోయాడు.

తన ప్రభువుకు జ్ఞాన బోధ చేసిన విదురమహాశయుడు కూడా ప్రభువు వెంట తానూ అడవులకు వెళ్ళిపోయాడు.

యుధిష్టిరమహారాజు ఎప్పటి లాగానే ఉదయం లేవగానే సంధ్యావందనం, నిత్యహోమం పూర్తిచేసుకుని బ్రాహ్మణులకు దానధర్మాలు చేసి నమస్కరించి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకున్నారు.  ఆ వెంటనే యథాప్రకారం పెద్దవాళ్ళైన పెదతలిదండ్రులు గాంధారీధృతరాష్ట్రుల ఆశీర్వచనం కోసం వెళ్ళారు. 

అక్కడ ధృతరాష్ట్ర్లమహారాజుకు ఆంతరంగికుడైన సంజయుడు మాత్రం ఉన్నాడు కాని పెద్దల జాడ లేదు.  ధర్మరాజులవారికి చాలా ఆందోళన కలిగింది.  సంజయుణ్ణి ప్రశ్నిస్తున్నారు.

సీ.  మా తల్లిదండ్రు లీ మందిరంబున లేరు
      సంజయ వా రెందుఁ జనిరి నేఁడు
ముందఱ గానఁడు ముదుసలి మా తండ్రి
      పుత్రశోకంబునఁ బొగులుఁ దల్లి
సౌజన్యనిధి ప్రాణసఖుఁడు మా పినతండ్రి
      మందబుధ్ధుల మైన మమ్ము విడిచి
యెటఁ బోయిరో మువ్వు రెఱిగింపు గంగలోఁ
      దన యపరాధంబు దడవికొనుచు
ఆ. భార్యతోడఁ దండ్రి పరితామునఁ‌ బడుఁ
గపట మింత లేదు కరుణ గలఁడు
పాండుభూవిభుండు పరలోకగతుఁ డైన
మమ్ముఁ బిన్నవాండ్ర మనిచె నతఁడు

సంజయా, ఏమిటయ్యా మా తల్లిదండ్రులూ విదురులవారూ కూడా ఏమై పోయారు?  హఠాత్తుగా వాళ్ళు ముగ్గురూ ఈ వేళ ఎక్కడికి వెళ్ళారు?  అయ్యో మా నాన్నగారు వృధ్ధుడూ  అంధుడూ కూడా.  మా అమ్మ గాంధారీదేవి అంతులేని పుత్రశోకంతో ఉంది.  మా పినతండ్ర్తి విదురులవారు కూడా లేరేమిటీ!.  ‌ఈ‌ ముగ్గురూ మందబుద్దులమైన మమ్మల్ని ఇలా హఠాత్తుగా విడిచి ఎందుకు వెళ్ళిపోయారో.  మా నాన్నగారు పాండుమహారాజుగారు పరలోకాని కి పోయిన తర్వాత వీళ్ళు చిన్నపిల్లలమైన మమ్మల్ని ఎంతో దయతో పెంచి పెద్దచేసారు.  ఒకవేళ మా తలిదండ్రులు తన బిడ్డల కారణంగా తాము మాకు చేసిన అవమానాల్ని తలుచుకుని బాధపడి గంగలో కాని దూకలేదు కదా? అయ్యో మాకు చెప్పకుండా ఇలా వెళ్ళిపోయారు.

సంజయుడు కన్నీళ్ళ పర్యంతంగా ఉన్నాడు.  మహారాజా,  పెద్ద ప్రభువులు ప్రతిరోజూ నన్ను అడిగి వార్తలు తెలుసుకుంటూ ఉండేవారు. నిన్న రాత్రి విదురులవారితో మంతనాలు చేసారు.  నన్ను అడిగి వార్తలు కూడా తెలుసుకోలేదు.  నాకు ఒక్కముక్క కూడా ఏమీ చెప్పలేదు. ఈ రోజు ప్రొద్దున్నే వచ్చిచూస్తే మాయమై పోయారు అని అతను దుఃఖించాడు.

కొద్దిరోజులకు ఆ హస్తినాపురానికి మహానుభావులైన నారదమహర్షులవారు దేవగాయకుడైన తుంబురుడితో సహా విచ్చేసారు.  ధర్మరాజుగారూ, ఆయన తమ్ముళ్ళూ ఆ మహాత్ములకు నమస్కరించి పూజించారు.

విదురసహితంగా గాందారీధృతరాష్ట్ర దంపతులు అదృశ్యం కావటం గురించి ధర్మరాజుగారు నారదులవారిని అడిగారు.  మహాత్మా మీరు సర్వం తెలిసినవారు.  మా తలిదండ్రులు అంధులూ వృధ్ధులూ ఐన వారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియక తల్లడిల్లుతున్నాం దయచేసి మీరు మాకు వారి గురించి తెలియజేయండీ అని ప్రార్థించారు.

ఈ సంఘటనజరిగే సమయానికి అర్జునుడు ద్వారకలో ఉన్నాడు.  శ్రీకృష్ణసహాయులై పాండవులు అశ్వమేధమూ మరో మూడు యజ్ఞాలూ చేసారు.

యజ్ఞానికి అవసరమైన సొత్తుకోసం బొక్కసంలోని సొమ్ముకు అదనంగా చాలా ధనం అవసరం అయితే అదంతా వేరే విధంగా సమకూర్చుకున్నారు.   పూర్వం మరుత్తు అనే చక్రవర్తి యజ్ఞాలు చేసి మోయటానికి వీల్లేనంత బంగారం బ్రాహ్మణులకు దానం చేసాడు.  వాళ్ళు అంత బంగారం ఏం చేసుకుంటాం అని అక్కడే ఉన్న చెరువులో పడవేసారు. అధికారి లేని సొత్తుకు రాజే అధికారి.  కాబట్టి వ్యాసులవారి సలహాతో అదంతా ధర్మరాజుగారు భీమార్జునులతో చెప్పి తెప్పించారు.  యజ్ఞాలు అన్నీ పూర్తయ్యాక కొన్ని నెలలు హస్తినాపురంలోనే ఉండి శ్రీకృష్ణులవారు ద్వారకకు అర్జునుణ్ణి తీసుకుని వెళ్ళారు.

అందుచేత ఇప్పుడు ఇలా పెద్దవాళ్ళు నగరం విడిచిపెట్టి వెళ్ళిన సంఘటన జరిగినప్పుడు అర్జునుడు తప్ప మిగతా పాండవులే హస్తినలోఉన్నారు.

నారదమహర్షులవారు ధర్మరాజుతో ఇలా అన్నారు.

నాయనా, ప్రపంచం ఈశ్వరుడి అధీనంలో ఉంది.  ఈశ్వరుడే జీవుల్ని ఒకదానితో మరొకదానిని చేర్చుతాడు, విడదీస్తాడు.  అలా జీవుల్ని ఒకదానితో మరొకదానిని కలిపేదీ విడదీసేదీ‌ అయిన ఈశ్వరవిభూతికి ప్రకృతి అనీ మాయ అనీ పేర్లు. జీవులంతా దీనిలో పడి రకరకాల కర్తవ్యాలూ, ధర్మాలూ అనే‌ కట్టుతాళ్ళతో బంధించబడుతున్నారు.  ఈ‌ విశ్వం అంతా ఈశ్వరుడి క్రీడాస్థలం.

సమస్త జీవులూ కూడా జీవులమనుకొనే విషయంలో స్థిరంగా ఉన్నవాళ్ళు. దేహాల రూపంలో అస్థిరమైన వాళ్ళు. నిజానికి మరొకరకంగా చూస్తే స్థిరమూ అస్థిరమూ అంటూ ఏమీ లేదు. పరబ్రహ్మస్వరూపంగా ప్రతిజీవుడు ఒకటే.

కొండచిలువ రెండు జీవాల్ని మింగితే ఒక జీవిని మరొకటి రక్షించగలదా?  అందరు జీవుల్నీ కాలం అనే చిలువ మింగుతుంది.  ధృతరాష్ట్రుడి చింత వదిలేయి.  అంతా కాలవశం.  ఆ కాలం విష్ణువే.  ఆయన ఇప్పుడు భూమి మీద శ్రీకృష్ణస్వామిగా వెలిసి ఉన్నాడు.

ఒక్క హితం విను.

మ.కో. ఎంతకాలము గృష్ణు డీశ్వరుఁ డిధ్ధరిత్రిఁ జరించు మీ
రంతకాలము నుండుఁ డందఱు నవ్వలం బని లేదు వి
బ్రాంతి మానుము కాలముం గడవంగ నెవ్వరు నోప రీ
చింత యేల నరేంద్రసత్తమ చెప్పెదన్ విను మంతయున్

ఓ మహారాజా, ఎంత కాలం‌ భగవంతుడైన విష్ణువు శ్రీకృష్ణస్వరూపంతో ఈ‌ భూమి మీద లీలావినోదంగా ఉంటారో మీరు కూడా అన్నాళ్ళే భూమి మీద ఉండండి.  ఆ తరువాత మీకూ ఇక్కడ ఉండటం అవసరం లేదు.  కాలం యొక్క ఆదేశాన్ని ఎవరూ తప్పించుకోవటం కుదరదు.  ఈ ప్రపంచం పైన భ్రాంతి వదిలి పెట్టండి.  మీకు ధృతరాష్ట్రుడి వృత్తాంతం కూడా చెప్తాను వినండి.

అన్నింటి మీదా విరక్తి చెంది ధృతరాష్ట్రుడు పత్నీవిదుర సహితంగా వనాలకు వెళ్ళిపోయాడు.  పూర్వం‌ ఒకప్పుడు సప్తర్షులకి సంతోషం కలిగిస్తూ గంగ ఏడు పాయలుగా చీలి ప్రవహించింది.  ఆ పుణ్యతీర్థంలో వాళ్ళు స్నానం చేసారు.  అక్కడ ధృతరాష్ట్రుడు హోమం చేసాడు.  సకల కర్మలూ విడిచి పెట్టాడు.  కొన్నాళ్ళు జలం మాత్రం ఆహారంగా తీసుకున్నాడు.  ఆ తరువాత అదీ వదిలేసాడు.  పంచేంద్రియాల్ని వాటి వృత్తుల్నించి మరలించి మనస్సుని విష్ణుదేవుడి మీద నిలిపాడు.  దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే  ఈషణత్రయాన్ని వదిలి పెట్టాడు.  సత్వమూ, రజస్సూ, తమస్సూ అనే మూడు గుణాల్నీ వాటి వల్ల వచ్చే కల్మషాలతో సహా భస్మం చేసేసాడు.  పాంచభౌతికమైన దేహం నుంచి మనస్సుని విడగొట్టి దాన్ని బుధ్ధిలో విలీనం చేసేసాడు.  దాన్ని జీవుడిలో‌ విలీనం చేసాడు.  ధ్యానయోగం చేత జీవుణ్ణి ఈశ్వరుడిలో విలీనం చేసాడు. ప్రస్తుతం అతడు తానున్న పర్ణశాలలో ఒక వేదికపై దేహాన్ని నిలిపి ఉంచాడు.  ఇది వాళ్ళవర్తమానం.

ఈ రోజు నుండి, ఐదవనాడు యోగశక్తిచేత అగ్నిని కల్పించి ఈ‌ పార్థివదేహాన్ని దానిలో సమర్పించ బోతున్నాడు.  గాంధారి కూడా భర్తతో పాటే ఆ  యోగాగ్నికి దేహాన్ని సమర్పిస్తుంది.  ఇదంతా తన కళ్ళ ముందే జరగటం చూసి విదురుడు కొంచెం బాధపడతాడు.  కాని వెంటనే తేరుకొని తీర్థయాత్రలకి బయలుదేరుతాడు.  ఇదీ వాళ్ళ భవిష్య వృత్తాంతం.

ఇలా జరుగుతున్నదీ, జరగబోయేదీ విడమరచి చెప్పి నారదులవారు తుంబురుడితో సహా స్వర్గానికి వెళ్ళి పోయారు.

3 కామెంట్‌లు:

  1. కాలముం గడవంగ నెవ్వరు నోప రీ చింత యేల
    త్రాసులో తూచి వేసిన మాటల్లా ఎంత నిక్కచ్చిగా ఉన్నాయో...

    కొండచిలువ రెండు జీవాల్ని మింగితే ఒక జీవిని మరొకటి రక్షించగలదా? అందరు జీవుల్నీ కాలం అనే చిలువ మింగుతుంది … అంతే నిక్కచ్చిగా ఈ మాటాలూనూ... కాల స్వరూపం జీర్ణమైతే కాని పైకి రాని మాటలివి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ వ్యాఖ్య సంతోషం కలిగించింది.
      పోతన్నగారి గద్యపద్యాలు ఆధారంగానే ఈ‌ ధారావాహికి వ్రాస్తున్నాను.

      పోతన్నగారు అన్నది "అజగరంబుచేత మ్రింగం‌బడిన పురుషుం డన్యుల రక్షింపలేమి తెరంగునఁ బంచభూతమయంబై కాలకర్మగుణాధీనం బైన దేహంబు పరుల రక్షింప సమర్థంబు గాదు... అట్టి కాలరూపు డఖిలాత్ముఁ‌ డగు విష్ణుడు..." దీనిని సంక్షిప్తంగా చెప్పాను.

      మూలం చెడకుండా సంక్షిప్తంగా చెబుతూనే ప్రతి టపాలోనూ కొద్ది పద్యాలూ ఎంపికచేసి వ్యాఖ్యానించటం చేస్తున్నాను. చదువరులు అందులో కొన్ని కొన్ని పద్యాలను కంఠగతం చేసుకుంటే బాగుంటుంది.

      తొలగించండి
    2. తప్పకుండా నండీ, మీ ఈ బ్లాగులోని వ్యాసాలతో పాటు అదే సమయంలో మీరు వ్రాసిన ఘట్టాలకు పోతనగారి భాగవతం మూలాన్ని కూడా కలిపి చదువుతున్నాను. పై గద్యలో పోతనగారు ఒకమనిషిని కొండచిలువు మింగితే ఇతరులనేమి రక్షిస్తాడు అనిఉంది. మీరింకోఅడుగు ముందుకేసి ఇద్దరిని మింగితే ఒకరు ఇంకొకరినేమి రక్షిస్తారు అని అనడం ఇంకా బాగుందనిపించింది...ఉద్ధరేత్ ఆత్మానం ఆత్మనా...

      తొలగించండి