6, ఆగస్టు 2013, మంగళవారం

ప్రధమస్కంధం.: 15. ఉపపాండవ సంహారం కృష్ణసంకల్పం ఐతే అశ్వత్థామకు పాపం ఎందుకు రావాలీ?

ఈ రోజున కాయ గారనే జిజ్ఞాసువు ఒక మంచి ప్రశ్న లేవనెత్తారు. దానికి సమాథానంగా ఈ‌ టపా.  నేను కాయ గారికి ఇవ్వవలసిన జవాబు పెద్దది కావటమూ, ఈ‌ జవాబు చాలా మందికి సంశయనివృత్తి చేస్తుందన్న భావనా ఈ‌టపా రాయటానికి నా కారణాలు.

ముందుగా ఒక మాట మనవి చేసుకుంటాను. ఇక్కడ నేను వ్రాస్తున్న భాగవతం అంతా పోతన్నగారిదే. నా స్వకపోల కల్పితం కాదు.

గీతలో దుర్యోధనుడు పాండవవీరుల్ని లెక్కిస్తూ, సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహా రథాః అంటాడు. రమారమి నూటయాభై సం॥ లేదా అంతకంటే హెచ్చుకాలం జీవించే నాటి కాలంలో ముఫ్ఫై సం॥వాళ్ళు ఒక రకంగా పిల్లలే అయినా వాళ్ళు అప్పటికే అస్త్రవేదులు కావచ్చు. పై శ్లోకభాగాన్ని బట్టి వారు దివ్యాస్త్రవేత్తలైన మహారథులని తెలుస్తోంది. పరమాత్మదివ్యప్రణాళిక ప్రకారం కలియుగారంభం నాటికి దివ్యాస్త్రాలతో యుధ్ధానికి దిగే వాళ్ళు ఉండరాదు. వాళ్ళవల్ల లోకాపకారం జరగవచ్చు. ఈ విషయం వ్యాసంలోనే చర్చించాను.

అశ్వత్థామ విషయానికి వద్దాం. గీతలో  


ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా  

అని భగవానువాచ. అంటే భగవానుడు సర్వహృదయాల్లోనూ ఉండి వారిని గమనిస్తూనే ఉంటాడు. అశ్వత్థామ తత్వం శ్రీకృష్ణులవారికి తెలియదా? ఈశ్వరసంకల్పం మానవహస్తాల ద్వారా నెరవేరుతుంది. తానే ఈ యుధ్ధోన్మత్తులైన రాజులను సంహరించానని, కేవలం నీ చేతులు నా సంకల్పానికి కార్యరూపం ఇస్తున్నాయని శ్రీకృష్ణులవారు అర్జునుడితో సెలవియ్య లేదా గీతలో? అలాగే‌ ఇది కూడా.  అర్జునుడు చేసిన యుధ్ధం కృష్ణప్రబోధం మేరకు భగవవదర్పితంగా కర్తవ్యనిర్వహణ - ఫలితానికి కర్తృత్వం‌ కోరకుండా చేసినది - పాపపుణ్యాలకు అతీతమైనది. అశ్వత్థామ చేసినది కామ్యకర్మ - ఈ‌ పని నేను చేస్తున్నాను, ఫలానా ఫలితం వచ్చితీరాలి అనే‌ కాంక్షతో అహంకారంతో చేసినది - పాపపుణ్యాలకు ఆలవాలమైనది. కాబట్టి ఆయన పాపఫలం అనుభవించ వలసినదే.

ఐతే నేమి, ఈ‌ ఉపపాండవసంహారం అనేది కృష్ణసంకల్పం కదా?‌ అశ్వత్థామకు యెందుకు పాపఫలం అని ప్రశ్న వేయవచ్చును. ఫలితం ఆశించి ఈ‌ పని చేసేవాడు అశ్వత్థామ ఉన్నాడని శ్రీకృష్ణులవారికి తెలుసు కాబట్టి ఆయన తనను శివరూపిగా ఉపాసించి కోరగానే కానిమ్మన్నాడు. అంతే‌ కాని, నా కోసం ఈ‌పని చేయవయ్యా అని  శ్రీకృష్ణులవారు పోయి అశ్వత్థామను కోరలేదు. ఎవరికైనా తాను కోరి ఫలితం ఆశించి చేసిన పనికి, ఆ వచ్చే‌ ఫలం మంచైనా చెడైనా సరే కర్తృత్వం వహించి నందుకు పూచీ తీసుకుని, కర్మఫలం అనుభవించక తప్పదు.

సత్పురుషులు భగవత్సంకల్పాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. వారు ఏ విధమైన కర్మలూ తమ స్వార్థప్రయోజనాలను ఆశించి చేయరు కాబట్టి వారికి కర్మఫలం అనుభవించ వలసిన పరిస్థితి రాదు. తాను  కర్తను అన్న స్పృహ వారికి లేకపోవటం వలన వారు శుధ్ధులు గానే ఉంటారు. కర్తను అన్న స్పృహ ఉన్నప్పుడు కర్మబంధంలో చిక్కుకోక తప్పదు.

అర్జునుడు యుధ్ధానికి కర్తృత్వం కోరలేదు.  అది భగవత్సంకల్పం అని తెలియ జేసి నిర్మోహుడవై యుధ్ధం చేయమని శ్రీకృష్ణులవారు ఆదేశించారు. అందుకే గీతాబోధ అనంతరం కిరీటి నష్టోమోహ స్పృతిర్లబ్ధ్వా  అని అంటాడు.
 

ఒక మంచి శ్లోకం ఉంది.

లౌకికాం‌నాహి సాధూనాం అర్థం వాగను వర్తతే
ఋషీనాం పునరాద్యానం వాచమర్థోను ధావతి

అంటే లోకంలో సత్పురుషులు భగవదేఛ్చ తెలిసి పలుకుతారు కాబట్టి వారి వాక్కుల తదనుగుణమైన అర్థం కలిగి ఉంటాయి.  వారు జరగబోయేది తెలుసుకుని పలుకుతారు.  మహాత్ములైన ఋషులు భగవదనుభూతి నిత్యం వహించి ఉంటారు. వారి సంకల్పాలు  భగవత్సంకల్పాలే. తదనుగుణంగానే వారి వాక్కులు ప్రసరిస్తాయి.  అందుచేత వారేది అంటే అలా జరుగుతుంది. అదీ‌  పైశ్లోకం అర్థం.

భగవంతుడు మనుష్యుల మనస్సుల్లో‌ ఉంటాడన్నారు కదా, ఆయన వారి చేత చెడు చేయించట మెందుకూ వాటి ఫలితాన్ని అనుభవించరా, అనట మెందుకూ‌ అని ఒక ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది తరచుగా.  బాగానే ఉంటుంది వినటానికి.  కాని భగవంతుడు మనిషికి కర్మస్వాతంత్యం ఇచ్చాడు. సంస్కారం భగవంతుని దిశగా పరిణతి సాధించేవరకూ మనిషి తనకు దేవుడిచ్చిన కర్మస్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకుంటూ కర్మఫలాలు అనుభవిస్తూ ఉంటాడు.  కర్మఫలాల్ని ఆశ్రయించుకుని జీవించటాన్ని ప్రవృత్తిమార్గం అని కర్మఫాలాలను భగవదర్పణంగా పరిత్యాగం చేసి జీవించటాన్ని నివృత్తిమార్గం అనీ‌  అంటారు. ఎటువంటి వాడి కైనా క్రమశః  సంస్కార వికాసం జరిగితీరుతుంది. మెల్లగానో వేగంగానో నివృత్తిమార్గం లోపలికి వస్తాడు. అది తప్పదు.


అశ్వత్థామ కీర్తికామన కలవాడు. జయేఛ్ఛ కలవాడు. ఈ సంగతిని తెలిపే ఒక కథ ఉంది భారతంలో. ఒకసారి అశ్వత్థామ శ్రీకృష్ణులవారి వద్దకు పోయి నీకు నేను బ్రహ్మశిరస్సు అనే‌ రహస్య దివ్యాస్త్రాన్ని ఇస్తాను, ఈ‌ అస్త్రం పొందటం వల్ల లాభం కలిగుతుంది, నీ చక్రాయుధాన్ని నా కివ్వు, అని అడిగాడు. సమస్తసృష్టిలోని దేవ,దానవ,గంధర్వ,మనుష్య జాతుల వారి శక్తి అంతా కూడినా నా తేజస్సులో శతాంశం కూడా కాదూ, నీ‌ అస్త్రం నాకు అవసరం లేదూ,  కావలిస్తే నా ధనుస్సు, చక్రం ఏదైనా సరే, చేతనయితే పట్టుకెళ్లమన్నారు శ్రీకృష్ణులవారు. ఎంత ప్రయత్నం చేసీ, అశ్వత్థామ చక్రాయుధాన్ని అసలు పైకి లేప లేక, సిగ్గుపడి వెనుదిరిగి పోయాడు.  అలా జయకామన, అహంకారం కల అశ్వత్థామ కర్మను నమ్ముకున్న వాడే కాని ఇంకా భగవత్కటాక్షాన్ని నమ్ముకున్నవాడు కాదు.

భగవత్సంకల్పానికి మంచీ చెడూ అని ఏమీ‌ ఉండవు. అది కాలస్వరూపంగా నిత్యం జరుగుతూనే ఉంటుంది.  గీతలో భగవానుడు కాలోస్మి లోకక్షయకృత్ప్రవృధ్ధో అని తెలియ జేయ లేదా?  మనుష్యుల కర్మలకు మంచీ‌ చెడూ అన్న విభజన ఏర్పడటం ఎందుకూ‌ అంటే మనం మన స్వార్థంతో కాలంలో మంచినీ‌ చెడునూ నిక్షేపించటానికి ప్రయత్నించటం వలనే. కాలానుగుణమైనది మంచీ చెడూ‌ రెండూ‌ కాదు - కేవలం‌ కాలానుగుణవర్తనం అంతే.  వైద్యుడు అవసరమైనప్పుడు శరీరాన్ని కోసి మరీ చికిత్స చేస్తున్నాడు కదా?  దాన్ని ఎవరైన హింస అంటున్నారా?  అది చెడ్డపని అంటున్నారా?  వైద్యుడు తాను చేస్తున్నది హింస అనుకుంటున్నాడా?  అలాగే భగవంతుడిని కాలస్వరూపుడిగా తెలిసినవారు కాలోచితాన్ని తమచేత భగవంతుడు చేయిస్తే నిరీహులై చేస్తారు. అక్కడ కర్మా లేదు కర్మఫలమూ లేదు. మంచీ‌ చెడూ అన్న ప్రసక్తి అసలే లేదు.  అందుకే గీతాబోధ విన్న అర్జునుడి మాట ఏమిటి? కరిష్యే వచనం తవ అని కదా?

అశ్వత్థామ ఈ స్థితిని సాధించుకొన్న వాడు కాదు.  ఆయన స్పష్టంగా హింసను ఉద్దేశించి చేసిన ఘాతుకానికి ఫలితం అనుభవించవలసిందే.  అందుకే భగవానుడూ సకల కర్మఫలప్రదాతా అయిన శ్రీకృష్ణుడు ఆ దుర్మార్గాన్ని ఖండించాడు - ఆతడి దుష్కార్యానికి తగు విధంగా శిక్షారూపమైన ఫలం అందించాడు.

ఒక మాట ఉంది.  అత్యుత్కృటైః పాపపుణ్యైః ఇహైవ ఫలముచ్యతే అని. అంటే అతి దారుణమైన పాపమైనా, బహువిస్తారమైన పుణ్యమైనా ఫలితం ఈ‌ జన్మలోనే‌ అనుభవించ వలసి ఉంటుంది అని.  అశ్వత్థామకు జరిగింది అదే.

శ్రీ కృష్ణుడు ఏమి చేసినా ఒప్పు అనేలా ఉంది మీ వ్యవహారం అన్నారు కాయ గారు.  కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పబడింది.  ఆయన అంశావతారం కాదు, స్వయంగా దిగివచ్చిన భగవంతుడు.  ఆయన చతుర్భుజాలతో‌ దర్శనమిచ్చిన సంఘటనలు భారతభాగవతాలలో అక్కడక్కడా ఉన్నాయి.  భగవంతుడు కర్మ సంబంధం కలవాడు కాదు.  ఒప్పు తప్పులకు అతీతుడు.  కేవలం కర్మసంబంధమైన ఫలితాలను కాలస్వరూపుడై మనకు ప్రసాదిస్తాడు.  ఆయన మనకు కార్యరంగంలో‌ కనిపించినా జరిగిన సంఘటనలతో ఆయనకు సంబంధం యేమీ లేదు. ప్రతిసంఘటన వెనుకా ఆయా జీవుల పూర్వకర్మలకు అనుగుణమైన ఫలానుభవమే వారికి లభించటం చూడవచ్చును.

ఈశ్వరాఽఽస్సిధ్ధేః అని ఒక పాతంజల యోగసూత్రం.  ఈ‌శ్వరుడిని గూర్చి ఆయన ద్వారా జరిగిన లీలా విశేషాలను గూర్చి తర్కం చేసి, సిథ్థాంతాలు చేసీ,  తెలుసుకోలేము అన్నది ఈ‌ సూత్రం సారాంశం.  అయినా, లోక సంగ్రహార్థం ఎంతో కొంత వివరణ ఇవ్వవలసి వస్తున్నది కాబట్టి ఈ నా ప్రయత్నం.

8 కామెంట్‌లు:

  1. కాయ గారు మంచి ప్రశ్న వేసి మీచే చాలా మంచి సంగతులు చెప్పించారు. లేకపోతే మీరు చెప్పరుగా :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచి ప్రశ్నలకు జవాబు చెప్పాలన్న ఉత్సాహం కూడా కలుగుతుంది. ఆ ఉత్సాహం కూడా భగవానుడు ఇస్తే వచ్చేదే‌ కాని స్వబుధ్ధితో తయారు చేద్దామంటే జవాబులు రావండి. ఒకటి రెండు రోజులుగా, ఈ విషయమై వ్రాయ వలసి వస్తుందీ అన్న స్పృహ, నాకు స్థిరంగా ఏర్పడింది. అవసరం పడింది. విషయం రూపు కట్టింది. భగవదేఛ్చ.

      తొలగించండి
    2. అన్నట్లు, చెప్పటం మరచిపోయాను శ్రీకృష్ణా యదుభూషణా పద్యంతో‌ నా అనుబంధం గురించి ఒక టపా వ్రాసాను శ్యామలీయంలో చూసారా? దాని లింకు ఇదిగోనండి:

      మా బేబిపిన్ని కోసం మరోసారి శ్రీకృష్ణా యదుభూషణా..

      తొలగించండి
    3. దాని మీద నేనో వ్యాఖ్య కూడా పెట్టేను మీరు ఎందుకుచూడలేదో అనుకున్నా! స్పాంలో ఉందేమో!

      తొలగించండి
    4. చాలా వ్యాఖ్యలు, రమారమి పాతిక దాకా పక్కకు పోయాయండీ. ఇప్పుడు వాటిని పబ్లిష్ చేసి చూస్తున్నాను అన్నింటినీ. ధన్యవాదాలు

      తొలగించండి
  2. ఎంత ముందుగా తెలిసినా, ఒక విధంగా అతీతుడైనా తన కర్మని కూడా మార్చుకోలేదు మరి శ్రీకృష్ణుడు. ఎలా చనిపోయారో మనకి తెలుసు. అందుకని, ఆయన కూడా జరగవలసిన దానిని ఆపలేరు, అడ్డుపడరు అని మనం తెలుసుకోవాలేమో.
    పోయెటిక్ గా మాట్లాడుతూ పద్యకారులు చాలా దూరం వెళ్తుంటారు, అందుకని దైవత్వం పొందినవారైనా/కలవారైనా ఎవరైనా యుద్దాన్ని తేలేరు మరియూ ఆపలేరు.. ఎవరి కర్మలు వారివే..దైవేఛ్చ అనటం ఒప్పుకోను.. పోయెటిక్ గా చెప్తే దైవేఛ్చ అనొచ్చు.. కాని దైవత్వం అందని మనుషుల తత్వం చేసే పనులు దైవత్వం చేయించింది అని ఎలా అనుకోగలం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దైవానికి గుణక్రియలు లేవు. కాబట్టి, శ్రీకృష్ణులవారికి కర్మ అంటూ ఏమీ లేదు, ఉండదు. గీతలో ఆయనే చెప్పారు పరిశీలించండి. దైవేఛ్ఛను ఒప్పుకోకపోవటానికి మీకు స్వాతంత్ర్యం ఉంది. దాని పరిణామరూపమైన మంచిచెడ్డలు మీవే కాని దైవానివి కావు. ఎవరి కర్మమే వారికి చుక్కాని. దైవం‌ నడిపించే జగన్నాటకాన్ని అర్థం కొంచెగానైనా చేసుకోవటం త్రిగుణాల్ని నిరోధించిన వారికే సాధ్యం. భాగవతాన్ని చదువుతూ‌ ఉంటే క్రమంగా కొన్ని సంశయాలకు జవాబులు లభిస్తాయి. ఒకేసారి సమాధానాలు అన్నీ‌ రాకపోవచ్చు. భగవత్తత్త్వానికి రంగులు అద్దక్కర్లేదు పద్యకారులు - అది స్వతహాగా పరమసుందరమైనది.

      తొలగించండి
  3. అవతార ప్రయోజనం తరవాత ఆయనంత ఆయనే అవతార సమాప్తి విధానాన్ని ఎంచుకున్నాడు తప్ప కర్మ ఫలితం తప్పకకాదు. అన్నీ ఆయనను ఆశ్రయించి ఉంటాయి తప్ప ఆయన దేన్నీ ఆశ్రయించి ఉండడు. పద్యమైనా భావమైనా రూపమైనా ఏదైనా సరే ఆయన వాటిని పొందడం చేత వాటికి కీర్తి, పవిత్రత, గొప్పతనంకానీ ఇవి ఆయన స్థితికేమీ కొత్తవి అంటించవు. అందుకే ఆయన స్థాణుః, పూర్ణుడు, సదాశివుడు, నారాయణుడు, కృష్ణుడు, నిరతిశయ ఆనంద స్వరూపుడు.

    రిప్లయితొలగించండి