6, ఆగస్టు 2013, మంగళవారం

ప్రథమస్కంధం: 14. భీష్మాచార్యులవారి నిర్యాణం.

గత టపాలో మనం భీష్మాచార్యులవారు ధర్మరాజుకు దుఃఖోపసమనం చేయటం గురించి తెలుసుకున్నాం. తరువాతి వృత్తాంతం చదువుకుందాం. 

ఉత్తరాయణపుణ్యకాలం వచ్చింది.  భీష్మాచార్యులవారు శరీరం వదలిపెట్టాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆ మహానుభావుడు

శా. ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముంజేసెదృ
గ్జాలంబున్ హరిమోముపై బఱపి తత్కారుణ్యదృష్టిన్ విని
ర్మూలీభూత శరవ్యధా నిచయుఁడై మోదించి భీష్ముండు సం
శీలం బొప్ప నుతించెఁ గల్మష గజ శ్రేణీ హరిన్ శ్రీహరిన్

భీష్మాచార్యులవారు ఇంక లౌకిక విషయాల గురించి సంభాషించటం‌ మానారు. బుధ్ధిని  ప్రజ్ఞ యందు నిలబెట్టారు. చూపులన్నీ‌ శ్రీహరి ముఖారవిందం మీద నిలబెట్టారు. ఆ మహాత్ముని అనుగ్రహంతో,  భీష్ములవారికి వంటిని గుచ్చుకున్న బాణాల బాధలు మాయమయ్యాయి.  జీవసంబంధమైన ఏనుగుల్లాంటి దోషాల్ని మట్టుపెట్టే సింహం అయిన శ్రీహరిని ఆశ్రయించి స్తోత్రం చేసారు. 

అలా పీతాంబరధారీ, చతుర్భుజుడూ, ఆదిపురుషుడూ, పరమేశ్వరుడూ అయిన శ్రీకృష్ణపరమాత్మను మనసా ధ్యానించారు భీష్మాచార్యుల వారు. ఇప్పుడాయన మనస్సులో ఏవిధమైన కోరికలూ‌ లేవు. ఏ విధమైన దోషమూ లేని బుధ్ధిని భగవంతుని మీద నిలిపి ఉంచారు భీష్ములవారు.  ప్రకృతిమాయను దాటుతున్న మహానుభావుడైన భీష్ములవారు శ్రీకృష్ణులవారిని ఇలా ప్రస్తుతిస్తున్నారు.

మ. త్రిజగన్మోహన నీలకాంతి తను వుద్దీపింపఁ‌ బ్రాభాత నీ
రజ బంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజసంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెకాఁడు మది నావేశించు నెల్లప్పుడున్

ముల్లోకాలనూ మోహింప జేసే నీలగగనఘనశ్యామ దివ్యకాంతితో మెరుస్తున్న దేహంతో ఉన్న స్వామి.  ఉదయిస్తున్న సూర్యుని అందమైన వర్ణంతో పైనున్న ఉత్తరీయం ప్రకాశిస్తూ ఉండే స్వామి.  నల్లని ముంగురులు అల్లలాడుతుండగా శోభాయమానమై, అందరికీ‌ సేవించదగిన ముఖపద్మం గల స్వామి.  అటువంటి రూపలావణ్యం గల స్వామి మా అర్జునుని చేరుతున్నాడు. ఆ స్వామి నా మనస్సును ఆవేశించు గాక.

ఆ మహానుభావుడు అర్జునుడి రథం నడుపుతుంటే గుఱ్ఱాల గిట్టల వలన ఎగిరిన దుమ్మ ఆయన ముఖంనిండా ముంగురుల నిండా కమ్ముకుంది.  రథం‌ నడిపే‌ శ్రమ వల్ల ఆయనకు చెమట కూడా పట్టింది. అర్జునుడి సారథి కాబట్టి ఆయనపై నేను వేసిన బాణాల దెబ్బలకు నొప్పి పుడుతున్నా అర్జునుణ్ణి ఉత్సాహ పరుస్తూనే ఉన్నాడు. ఆహా అప్పుడు ఆయన ముఖం‌ రకరకాల భావాల సమ్మిశ్రణమై ఎంత మనోహరంగా ఉందో.  ఇప్పుడు ఆ మహానుభావుడైన కృష్ణపరమాత్మ నన్ను కాపాడు గాక.

అర్జునుడి కోరిక మేరకు ఉభయ సైన్యాల మధ్యా రథాన్ని నిలబెట్టి శత్రురాజుల్ని చిరునవ్వుతో‌ పరిచయం చేస్తూ,  ఆ చిరునవ్వు తోనే ఆ శత్రువు లందరి ఆయుర్ధాయాన్నీ‌ హరించి వేసిన ఈ‌ పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు నా మనస్సులో‌ స్థిరంగా నిల్చు గాక

బంధువులన్న మోహంతో కౌరవపక్షాన్ని చంపటానికి వెనుకాడుతున్న అర్జునుడికి గీతోపదేశం చేసి యోగవిద్యతో మోహాన్ని తొలగించిన ఈ‌ మహానుభావుడు మునిలోకానికి నమస్కరించ దగిన వాడు.  ఈ‌ మహానుభావుడు కృష్ణుని మీద నాకు భక్తి నిశ్చలంగా ఉండు గాక.

సీ. కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి
      గగన భాగం బెల్ల గప్పి కొనఁగ
నుఱికిన నోర్వక యుదరంబులో నున్న
      జగముల వ్రేఁగున జగతి గదలఁ
జగ్రంబు జేబట్టి చనుదెంచు రయమున
      పైనున్న పచ్చని పటము జాఱ
నమ్మితి నాలావు నగుఁబాటి సేయక
      మన్నింపు మని క్రీడి మరలఁ దిగువఁ
తే. గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి
నేఁడు భీష్మునిఁ‌ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున యనుఁచు మద్విశిఖవృష్టిఁ
దెఱలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు


అర్జునుడు నేర్పుగా నా బాణాలను అడ్డుకుంటున్నాడే కాని వృధ్ధుణ్ణీ తాతగారినీ అయిన నాకు సూటిగా తగిలేలా బాణాలు వెయ్యటం లేదు. అతణ్ణి రెచ్చగొట్టటానికి నేను ఆతని సారథి శ్రీకృష్ణుడి మీదా వాడి బాణాలు వేసాను.  అర్జునుడి నాన్పుడు ధోరణీ‌ నా దూకుడు చూసి శ్రీకృష్ణుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఏనుగు మీదకు సింహం‌ దూకినట్లుగా ఒక్క సారి నా మీదకు విరుచుకు పడ్డాడు. ఈ‌ రోజున భీష్ముణ్ణి నేనే‌ చంపి నిన్ను రక్షిస్తాను అని గర్జించాడు.  అహా ఆ సంఘటన ఎంత మనో హరం!

రథం మీద నుండి ఎగిరి దూకుతున్న శ్రీకృష్ణస్వామి చెవుల కుండలాల కాంతులతో ఆకాశం అంతా మెరిసిపోయింది.  ఆయన ఎగిరిన అదురుకు తన కడుపులో ఉన్న అఖిల లోకాలు వణికి నట్లు భూమి అప్పుడు గజగజా వణికింది.  హడావుడిగా సుదర్శనచక్రం చేత పట్టుకుని వేగంగా నా మీదికి వస్తుంటే, పచ్చటి ఆయన ఉత్తరీయం జారిపోతోంది.  అప్పుడు అర్జునుడు దీనంగా, కృష్ణా నిన్నే‌ నమ్ముకున్నాను, నా పరాక్రమాన్ని నవ్వులపాలు చేయ వద్దయ్యా అని వేడుకుంటూ కృష్ణస్వామిని వెనక్కి లాగుతున్నాడు.  శ్రీకృష్ణుడు మాత్రం బింకంగా, ఉండు అర్జునా, నన్ను విడిచి పెట్టు, ఈ ముసలాయన్ని నేనే చంపేస్తాను - నిన్ను రక్షిస్తాను అని రంకెలు వేస్తున్నాడు.

అర్జునుణ్ణీ రెచ్చగొట్టటానికి, అలా నన్ను చంపే మిష పెట్టుకుని మీదికి వస్తున్న ఆదేవుడే నాకు దిక్కు.

తన మాటలతో, చిరునవ్వులతో, చూపులతో గోపస్త్రీల మనస్సులను దోచుకునే శ్రీకృష్ణస్వామి వారే నాకు దిక్కు. ఆయన మీదే నా మనస్సు నిలబెట్టుతున్నాను.

ధర్మరాజు చేత దిగ్విజయంగా రాజసూయం చేయించిన దేవాధిదేవుడైన కృష్ణుడి మీద నా దృష్టి నిలుచు గాక.

చ. ఒక సూర్యుండు సమస్త జీవులకుఁ తా నొక్కక్కడై తోచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచు నుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుధ్దుండనై

సూర్యుడు ఒక్కడే ఐనా అందరికీ విడివిడిగా కనిపిస్తున్నాడు గదా. అలాగే తన లీలతో పుట్టిన అన్ని జీవుల హృదయాల్లోనూ‌ శ్రీహరి ప్రకాశిస్తున్నాడు. ఎప్పుడూ అలా జీవుల హృదయాకాశాల్లో వారికి అనుగుణమైన స్వరూపంతో‌ శోభిల్లే శ్రీహరిని పరిశుధ్ధమైన మనస్సుతో ప్రార్థిస్తున్నాను.

అని భీష్మాచార్యులవారు తన మనస్సు, వాక్కు, చూపులను శ్రీకృష్ణస్వామి యందు నిలుపుకున్నారు.  శ్వాస తీసుకోవటం‌ మానివేసారు. అన్ని ఉపాధులకూ అతీతమైన వాసుదేవబ్రహ్మంలో లీనమైపోయారు.

చీకటి పడగానే కిలకిలారావాలు మాని నిశ్శబ్దంగా పక్షులు ఉండిపోయినట్లుగా, అక్కడ ఉన్న అందరూ, చప్పుడు చేయకుండా చూస్తూ ఉండిపోయారు.

తరువాత, దేవతలు దుందుభులు మ్రోగించారు.  మానవలోకంలో కూడా దుందుభులు మారుమ్రోగాయి. 

దేవతలు పూవులవాన కురిపించారు భీష్మపితామహుల పార్థివ శరీరం మీద. అందరూ ఆయనమీద పూవులు జల్లారు.

అక్కడ ఉన్న మునీంద్రులూ ఇతర సత్పురుషులూ‌ భీష్మాచార్యులవారిని కీర్తించారు.

ధర్మరాజులవారు ఆ మహాపురుషుడికి పరమశ్రధ్ధతో అంత్యక్రియలు నిర్వహించారు.  తరువాత, ఒక్క ముహూర్తం (అంటే మనకు 48 ని॥)  సమయం దుఃఖపరవశుడై ఉన్నాడు.

భీష్మనిర్యాణ సమయంలో‌ అక్కడ ఉన్న మహర్షులంతా శ్రీకృష్ణపరమాత్మను ప్రస్తుతించి తమతమ ఆశ్రమాలకు సంతోషంగా వెళ్ళిపోయారు.

5 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. నిస్సందేహంగా.
      అందుకే భీష్మాచార్యులవారికి అందరూ తర్పణాలు అర్పించేది.

      తొలగించండి
  2. అద్భుతంగా వర్ణిస్తున్నారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోతన్నగారి మాటలే. పద్యాలకు నా సొంత గొంతులో వచనం చేసనంతే. అయినా కొద్దికొద్దిగానే పోతనగారి పద్యాలను చెప్పగలను. ప్రస్తుత తరాలవాళ్ళకు యీ‌ పరిచయంతో పోతన్నగారి మీద అనురక్తి, భాగవతం మీద ఆసక్తీ, భగవంతునిమీద భక్తీ కొంతైనా కలగాలని నా ఆకాంక్ష.

      తొలగించండి
  3. ఇవి చదవడం మా బాగ్యం. ఇంత చక్కగా వర్ణoచిన మీకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి