4, ఆగస్టు 2013, ఆదివారం

ప్రథమస్కంధం: 11. శ్రీకృష్ణపరమాత్మను ఉత్తర శరణు కోరటం

ఇంతవరకూ‌ మనం అశ్వత్థామ చేసిన దుష్కృత్యం  చూసాం.  అంత చేసి కూడా అశ్వత్థామ ద్రౌపదీమహాదేవి సౌజన్యం వలన బ్రతికి బయటపడటం‌ అనే‌ అద్భుతాన్నీ చూసాం. ఇప్పుడు తదనంతర కథ.

ఎట్టకేలకు, యుధిష్టిరులవారు పట్టాభిషిక్తులు అవటం‌ జరిగింది.  శ్రీకృష్ణులవారు కొన్నాళ్ళ పాటు పాండవుల వద్దనే ఉండి ద్వారకానగరానికి ప్రయాణం అవుతున్నారు. 

ఇంతలో రథం ఎక్కటానికి బయలుదేరుతున్న శ్రీకృష్ణులవారి దగ్గరకు గగ్గోలు పడుతూ పాండవుల కోడలైన ఉత్తర వచ్చింది. ఆవిడ పరిస్థితి చూసి అందరూ కళవళ పడ్దారు.  అప్పుడు ఉత్తర హరితో ఇలా మనవి చేసుకుంది

మ. ఇదె కాలానల తుల్యమైన విశిఖం బేతెంచె దేవేశ నేఁ
డుదరాంతర్గత గర్భదాహమునకై యుగ్రప్రభన్ వచ్చుచు
న్నది దుర్లోక్యము మానుపన్ శరణ మన్యం బేమియున్ లేదు నీ
పదపద్మంబులె కాని యొం డెఱుఁగ నీ‌ బాణాగ్ని వారింపవే

దేవతలకందరికీ‌ కూడా ప్రభువూ దేవుడవూ అయిన స్వామీ శ్రీకృష్ణదేవా, ఇదేదో బాణం‌ ప్రళయాగ్నిలాగా నిప్పులు చిమ్ముతూ నా మీదకు వస్తోంది.  ఇది నా కడుపులో ఉన్న శిశువును చంపాలనే వస్తున్నట్లుంది. ఈ బాణం చిమ్ముతున్న అగ్నిశిఖల తేజస్సును చూడటానికే  నాకు వీలు కానంత భయంకరంగా ఉందే.  దీన్ని అడ్డుకోవటం నా వశమా!  నేను నీ‌ పాదపద్మాలు నమ్ముకుని ఉన్న దాన్ని. అవి తప్ప వేరే ఏమీ‌ తెలియని దాన్ని.  ఈ బాణాగ్నిని నివారించి నా బిడ్దను రక్షించు.

స్వామీ నేను నీ‌ చెల్లెలి కోడల్ని.  నీ‌ మేనల్లుడా, యుధ్ధంలో మరణించాడు. దయచేసి ఈ బాణాగ్నిని చల్లార్చి నా గర్భంలో ఉన్న అభిమన్యుడి కొడుకును రక్షించు. వాడు ఈ‌ బాణాగ్నికి తట్టుకోలేక పోతున్నాడు.  వాడి మీద దయచూపించు.  మా పాండవులకు మిగిలిన ఏకైక వంశాంకురాన్ని సంరక్షించే‌ భారం నీదే స్వామీ!

ఆ. గర్భమందుఁ గమలగర్భాండశతములు
నిముడుకొన వహించు నీశ్వరేశ
నీకు నొక్క మానినీ గర్భరక్షణ
మెంత బరువు నిర్వహింతు గాక

స్వామీ, అన్నింటికీ నువ్వే ప్రభువ్వి.  నీ కడుపులో వందల కొద్దీ బ్రహ్మాండా లున్నాయి. అన్నింటినీ దయతో‌ కడుపులో‌ దాచుకుని సంరక్షించే‌ ప్రభూ, నీకు ఒక ఆడదాని కడుపులో ఉన్న బిడ్డను రక్షించటం కష్టమా? తప్పకుండా నువ్వు రక్షిస్తావని ఆశతో‌ వచ్చాను.

ఇంతలో పాండవులు కూడా తమ వైపుకు ఎక్కడినుండో అత్యంత దుస్సహ మైన తేజస్సుతో బాణాలు వస్తూ ఉండటం చూసారు. అవి అశ్వత్థామ వేసిన అస్త్రం వదులుతున్న బాణాలు! వాళ్ళంతా ధనుర్బాణాలతో‌ యుధ్దసన్నధ్ధు లయ్యారు.

అప్పుడు శ్రీకృష్ణులవారు ఇలా సెలవిచ్చారు.

ఇది అశ్వత్థామ చేసిన పని! ఈ లోకం అపాండవం (పాండవులూ తత్సంబంధీకులూ లేకపోవటం) చేయాలని సంకల్పించి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు.  ఈ‌ అస్త్రాన్ని ఇప్పుడు నేను అడ్డుకుంటాను. ఇదిగో‌ నా చక్రాయుధం ప్రయోగిస్తున్నాను.

ఆయన అలా అనగానే‌ అంతా సంతోషించారు.  అశ్వత్థామ వేసిన బ్రహ్మశిరస్సు అనే తిరుగులేని దివ్యాస్త్రం కాస్తా, విష్ణుచక్రం అనే వైష్ణవ మహాతేజస్సులో లీనమై, అంతర్థానం అయిపోయింది.

శ్రీకృష్ణులవారే స్వయంగా సూక్ష్మదేహంతో ఉత్తరాగర్భంలో చక్రగదాహస్తుడై ప్రవేశించి, అస్త్రాగ్నినుండి బిడ్డను రక్షించారు.

ఏ మహానుభావుడైతే తన అద్భుతమైన మాయతో సకల లోకాలూ సృష్టి చేసి, నడిపించి, తిరోధానం చేస్తాడో, ఆ మహానుభావుడు విష్ణువే కదా!  అట్లాంటి అయనకు ఒక బ్రాహ్మణవీరుడు వేసిన బ్రహ్మశిరస్సు అనే అస్త్రాన్ని తన మాయలో లీనం చేసుకోవటం అనేది ఏమంత గొప్ప విషయమూ‌ కాదు విచిత్రమూ‌ కాదు.

శ్రీహరి ఈ విధంగా ఉత్తరాగర్భాన్ని రక్షించటం వలన పాంచీలీ‌మహాదేవికీ, ధర్మజాది పంచపాండవులకూ, కుంతీ మహాదేవికీ పరమానందం కలిగింది.  పాండవవంశాన్ని నిలబెట్టిన మహానుభావుడు శ్రీకృష్ణస్వామిని వేనోళ్ల కొనియాడారు.

ఇంక ఏమీ‌ భయం లేదు, సుఖంగా ఉండండి అని అభయం ఇచ్చి శ్రీకృష్ణులవారు ప్రయాణమయ్యారు.

ఆప్పుడు కుంతీమహాదేవి శ్రీకృష్ణపరమాత్మ వద్దకు వచ్చింది వీడ్కోలు చెప్పటానికి.

1 కామెంట్‌: