1, సెప్టెంబర్ 2013, ఆదివారం

ద్వితీయస్కంధం: 06. శ్రీహరిని ఎందుకు ధ్యానించాలి

శ్రీహరి విరాడ్రూపం గురించి శుకమహర్షి పరీక్షిత్తుకు వివరించారు.  ఆ పిమ్మట, విశ్వం నిండా శ్రీహరియే ఉన్నాడనీ, ఆ శ్రీహరిలోనే విశ్వం అంతా ఇమిడి ఉందనీ కూడా చెప్పారు. శ్రీహరి యొక్క విరాట్ స్వరూపంలో అనేక విషయాలు తెలియజేయ బడ్డాయి.  కాని శ్రీశుకుడు చెప్పిన సారాంశ వాక్యం వాలా కీలకమైన ప్రతిపాదన.  సమస్తమూ శ్రీహరిలో భాగమే ఐనప్పుడు సాధకుడూ శ్రీహరిలో ఒక భాగమే.  అలాగే సమస్తమునందూ శ్రీహరి వ్యాపించి ఉన్నప్పుడు సాధకుడి లోపలా ఆయన వ్యాపించి ఉన్నాడు.  ఇంద్రియాలకు అనుభవం లోనికి వచ్చే ప్రతి దృశ్యమూ అది శ్రీహరి యొక్క న దివ్యమైన విరాట్ విగ్రహంలో ఏదో ఒక శరీరభాగం వంటిదే.  అలాగే ఇంద్రియాలకు కలిగే అనుభూతు లన్నీ కూడా శ్రీహరి యొక్క దివ్యానుభూతుల్లో భాగమే కాని తదన్యం‌ కానేకావు.  ఇది అవగాహన లోనికి తెచ్చుకుని సాధకుడు అంతఃకరణ చతుష్టయం అనబడే మనస్సూ, బుధ్ధీ, అహంకారమూ, చిత్తమూ అనే నాలుగు రకాల జీవప్రజ్ఞలనీ భగవంతుని విరాడ్రూపంలో అనుసంధానం చేసుకోవాలి.  అదే ధారణ చేయటం అంటే.

ఐతే, ఇలా ధారణ చేయటం అనేది, ఇలా మనం చెప్పుకున్నంత సులభమైన విషయం కాదు.  ఒకపట్టాన సాధకుడు ఈ విధంగా ధారణ చేయగలిగే స్థితికి చేరుకోలేడు.  ఎందుచేత నంటే,  శ్రీమహావిష్ణువు యొక్క ఈ విశ్వరూపం అనేది సమస్తబ్రహ్మాండమూ తనలోనే ఇముడ్చుకున్న కారణం చేత సాధారణ సాధకుడి యొక్క పరిమితమైన ప్రజ్ఞగల ఉపాధికి అందనంత గహనంగా ఉండి వెరగుపడేలా చేస్తుంది.  కాబట్టి సాధకుడికి ఇంతకంటే సులభంగా ధారణ చేసే విధానం ఒకటి శుకయోగి ప్రతిపాదిస్తున్నాడు.  అదే శ్రీమహావిష్ణువు యొక్క దివ్య విగ్రహం.  ఈ శ్రీహరి దివ్యవిగ్రహం పరిచయం చేయటానికి ప్రాతిపదికగా శుకయోగి ఈ సృష్టి యొక్క స్వభావాన్ని గురించీ, అందులో జీవుడి యాత్ర గురించీ‌ ప్రసంగిస్తున్నాడు.
 
శుకయోగి పరీక్షిత్తుతో ఇలా అంటున్నారు.  ఓ‌ మహారాజా, ఎవరికైనా ఒక సందేహం వస్తుంది.  ఒకడే ఐన పరమాత్మ ఇన్ని జీవ నిర్జీవ స్వరూపాలుగా ఎలా తనను తాను కల్పించు కుంటున్నాడు అని.  దీనికి సమాధానం విను.
 
ప్రతివాడికీ కలలు వస్తూ ఉంటాయి.  ఆ కలలో ఎందరో వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు.  అలా కలల్లో ప్రవ్వేశించి నిష్క్రమించే వాళ్ళల్లో నువ్వూ ఉంటున్నావు కదా? ఇందులో అసత్యం ఏమీ లేదు కదా?
 
నువ్వు కలగంటున్నావు.  అంటే కల కన్నా భిన్నంగా,  దానికి వెలుపల నువ్వు విడిగా నీ యొక్క శరీరం, నీ‌యొక్క ప్రజ్ఞతో ఉండనే ఉన్నావు.  మరి కలలోనూ‌ నువ్వు ఉంటున్నావే?  ఆ కలలోని నువ్వు బయటి ఉన్న నీ కన్నా వేరుగా ఉన్నావా లేదా?  వేరుగా ఉన్నా కలలోని నీవు నీకు ఏమీ తేడాగానూ‌ లేవు కదా?  కలలోని నీకు కలిగిన అనుభూతులు, అనుభవాలూ అన్నీ‌ నీ స్వంతమే కాని మరెవ్వరివీ‌ కాదు కదా?  అలాగే నీ‌ కలలో కనిపించిన ఇతర వస్తువులను ఎవరు సృష్టించారూ?  ఆ కలలో నీకు కనిపించిన, నీతో‌ ప్రసంగించిన  వ్యక్తులందరూ ఎవరూ?   వారిని ఎవరు సృష్టించారూ?  ఈ కలలో ఏర్పడిన సమస్త సృష్టికీ నీవే‌ కదా కర్తవి?
 
మహారాజా, నీకు కల వచ్చినప్పుడు కలలో ఉన్న సమస్త వస్తు, జీవజాలాన్నీ నీ‌ ప్రజ్ఞయే సృష్టిస్తోంది.  ఆ వస్తువుల స్వరూపస్వభావాల్ని అదే నిర్ణయిస్తోంది.  కలలోని వ్యక్తులందరికీ ఇంద్రియాలూ వాటి అనుభూతులూ కూడా అదే కలిగిస్తోంది.  అలాగే స్వప్నావస్థ ముగియగానే, ఆ సమస్తసృష్టీ నీ ప్రజ్ఞలోకి తిరోగమనం చేస్తోంది.  కలగా యేర్పడిన సమస్తమూ నీ ప్రజ్ఞయొక్క విశేషమే కాని వేరే ఏమీ లేదని నీకు నిశ్చయంగా తెలుస్తోంది.  కల అనంతరం కలకు సంబంధించిన అన్ని వికారాలూ అంతర్థానం ఐపోవటంతో నీకు నువ్వుగా కలకు ముందు ఉన్న స్వస్థితి లోనే ఉంటున్నావు.
అలాగే, భగవంతుడూ సమస్తమైన విశ్వంలోనూ ప్రవేశించి సృష్టిని నడిపిస్తూ ఉంటాడు.  కాని సృష్టికి సంబంధించిన వికారాలు ఏమీ అంటకుండా కూడా ఉంటాడు.
 
జీవుడి స్వప్నం వంటిదే దేవుడి సృష్టికూడా అని అనుకుంటే ఈ సృష్టి అంతా దేవుడి కలా అన్న ప్రశ్న వస్తుంది.  కాదు.  తేడా ఉంది.  జీవుడు స్వపం నడుస్తున్నంత కాలమూ‌ ఆ స్వప్నస్థితికి చిక్కుపడి ఉంటాడు.  అంటే స్వప్నంలో‌ కలుగుతున్న సుఖమూ దుఃఖమూ కూడా అనుభవిస్తూ ఉంటాడు.  భగవంతుడు అన్నిటికీ అతీతుడు.  ఆయన దేనిలోనూ‌ చిక్కుపడే వాడు కాదు. స్వప్నం నీ‌ సంకల్పానుసారి కాదు.  ఈ‌ సృష్టి భగవంతుడి సంకల్పానుసారి.  భగవంతుడు తాను చేసిన ఈ‌ సృష్టిలో ప్రవేసించి కూడా అందులో చిక్కుపడక, లీలా వినోదంగా సృష్టిని ఒక క్రీడగా అనందిస్తూ‌ ఉంటాడు.
భగవంతుడితో‌ తాదాత్మ్యాన్ని సాధన చేసిన సాధకుడు,  ఆ విధమైన ధారణ కారణంగా సృష్టి యొక్క వికారాలనుండి విముక్తుడై అటువంటి గమనికను సాధిస్తాడు.  అలా సాధన పక్వం అయ్యే దాకా కూడా సంసారబంధం తప్పదు జీవుడికి.
 
మ. బహు వర్షంబులు తొల్లి బ్రహ్మ జగముత్పాదింప విన్నాణి గా క హరిప్రార్థన ధారణావశమునం గాదే యమోఘోల్లస న్మహనీయోజ్వలబుధ్ధియై భువననిర్మాణ ప్రభావంబుతో విహరించెన్ నరనాథ జంతునిహవావిర్భావ నిర్ణేతయై
 
ఈ సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడి ఒక చిక్కు వచ్చింది.  సృష్టి అనేది ఎలా చేయాలో అర్థం కాలేదు!  ఎంత ప్రయత్నించినా దానికి కావలసిన విజ్ఞానసంపద ఆయనకు లభించలేదు.  అప్పుడు బ్రహ్మ తెలివి తెచ్చుకుని, శ్రీహరిని ధారణచేసి ప్రసన్నుడిని చేసుకున్నాడు.  అప్పుడు శ్రీహరి ప్రభావం వలన, ఆయన బుధ్ధి సంపూర్ణంగా వికసించింది.  తన కర్తవ్యం, తన విజ్ఞానం, సమస్తసృష్టీ  శ్రీహరియందే శాశ్వతంగా కాలాతీతంగా ఉన్నాయని గ్రహింపుతో‌ ఆయన చేసిన ధారణ ఫలితంగా,  బ్రహ్మకు సృష్టి చేయగల సామర్థ్యం అబ్బింది.  అప్పుడు ధారణా ప్రభావంతో తనయందే తాను తెలిసికొన్న సృష్టిని ఆయన బహిర్గతం చేయగలిగాడు.  అలా బ్రహ్మ సమస్తమైన జీవ నిర్జీవులతో‌కూడిన సృష్టిని ఏర్పరచగలిగాడు.
 
అందులో విశేషం ఏమిటో తెలియాలంటే మనం చెప్పుకున్న స్వప్నదృష్టాంతం ఒక సారి తిరగెయ్యాలి.  కలగంటున్న తానూ, కలలోఉన్న తానూ, తనకల అనే విభాగాలు చూడండి.  కలలో ఉన్న తాను ఒకరకమైన అజ్ఞాన స్థితిలో ఉన్నాడు. ఆ కలకు ముందూ, తరవాత తనయొక్క నిజస్థితిలోనే ఉన్నాడు. ఈ రెండు స్థితులు జీవులకు తప్పవు.  బ్రహ్మకీ తప్పవు.  ఎంతకాలం‌ పరబ్ర్హ్మము యొక్క ధారణచేత వీటిని అధిగమించడో అంతకాలమూ బ్రహ్మకూ ఈ రెండు విభిన్నమైన ప్రజ్ఞలూ ఉంటాయి.   ఎలాగైతే మనకు మనం ఒక కలని ఇఛ్ఛానుసారం తెచ్చుకోలేమో, అలాగే తనకు తానుగా సంకల్పించి బ్రహ్మ ఐనా సరే సృష్టికార్యం చేయలేడు.  ఎప్పుడైతే పరమాత్మతో తనను తాను అనుసంధానం చేసుకున్నాడో, అప్పుడు ఆ ప్రజ్ఞ బ్రహ్మకు కలిగింది.  అలా శ్రీహరిస్మరణం ఆధారంగా బ్రహ్మ సృష్టి చేసాడు.

ఈ‌ విషయాన్ని శుకయోగి మరింత వివరిస్తున్నాడు.  వేదం నేర్చుకుంటున్నారు బుధ్ధిమంతులు.  కాని సాధారణంగా వాళ్ళంతా ఆ వేదాన్ని శబ్దార్థాల సంపుటిగానే తెలుసుకుంటున్నారు.  సులభంగా అవగాహనకు వచ్చే  స్వర్గసుఖాలను కోరి కర్మలను ఆశ్రయిస్తూ ఆరాధిస్తున్నాడు.  కాని అవన్నీ‌ నిరుపయోగాలు.  వేదం లైయ జేసే పరబ్ర్హ్మ స్వరూపజ్ఞాన్ని విడిచి ఫలం ఆశించి కర్మలు చేస్తూ కమ్మని కలలు కంటూ కాలక్షేపం చేస్తూ ఉండే వాడికి కలలు తప్ప ఏమీ మిగలనట్లుగా,  వాడు ఈ‌ ప్రంచంలోనే పడి ఉంటున్నాడు.  కాని అవధి లేని సుఖస్వరూపం అయిన పరబ్రహ్మాన్ని ఏమాత్రం తెలుసుకోలేక పోతున్నాడు. అక్కడక్కడా తెలివి తెచ్చుకున్న వాడూ కనిపిస్తాడు.  ఆ తెలివైన వాడు, ఈ‌ ప్రపంచంలో సుఖాలుగా కనిపించేవన్నీ కూడా నామమాత్రమైన సుఖాలే‌ కాని వాటిలో శాశ్వతత్వం కొంచెంగా కూడా లేదని తెలుసుకుంటున్నాడు.  ఎంత వరకు దేహనిర్వహణ కోసం అవసరమో ఈ‌ ప్రాపంచిక విషయాలతో అంత వరకూ‌ మాత్రమే సాంగత్యం నెరపుతున్నాడు కాని అంతకు మించి అతడు వాటిని గ్రహించడు.  ఈ సంసారంలో కాక నిశ్చయంగా వేరొక చోటనే శాశ్వతమైన సత్యమూ సుఖమూ ఉన్నాయని భావించి ఈ  సంసారంతో అంటీ ముట్టనట్లుగా తిరుగుతూ‌ ఉంటాడు.  అలాంటి తాపసుడి జీవయాత్ర ఎలా ఉంటుందంటే,

సీ.  కమనీయ భూమి భాగములు లేకున్నవే
      పడి యుండుటకు దూది పరుపు లేల
సహజంబులగు కరాంజలులు లేకున్నవే
      భోజనభాజన పుంజ మేల
వల్క లాజిన కుశావళులు లేకున్నవే
      కట్ట దుకూలసంఘంబు లేల
గొనకొని వసియింప గుహలు లేకున్నవే
      ప్రాసాదసౌధాదిపటల మేల
తే. ఫలరసాదులు గురియవే‌ పాదపములు
స్వాదుజలముల నుండవే సకలనదులుఁ
బొసగ భిక్షము పెట్తరే పుణ్యసతులు
ధనమదాంధుల కొలు వేల తాపసులకు

నిద్రపోవలసి వస్తే దూది పరుపులే కావాలా, చక్కటి భూభాగాలు లేవా?  ఆకలి వేస్తే పండో కాయో చేతొతో పట్టుకుని తినవచ్చును కదా? భోజనం లోనికి రకరకాల సంభారాలూ, వాటిని ఉంచటం కోసం మంచిమంచి పళ్ళాలూ అవసరమా?  నారచీరలో, జంతుచర్మమో కట్టుకోవచ్చును కదా, ప్రశస్తమైన చీనిచీనాంబరాలు కావాలా తప్పనిసరిగా?  హాయిగా ప్రకృతిప్రసాదించిన కొండ గుహలు లేవా, పెద్దపెద్ద మేడలూ‌ మిద్దెలూ లేక పోతే‌ నివసించలేవా భూమిమీద?  ఈసృష్టిలో చెట్లు ఎంతో రుచిగల రసవంతమైన పండ్లను ప్రసాదిస్తున్నాయి.  వాటితీ చక్కగా ఆకలి తీరదా? నిర్మలమైన నదీజలాలు తియ్యగా ఉండి దాహం తీరుస్తున్నాయి, చాలదా?  అన్నపూర్ణల వంటి ఇల్లాళ్ళూ ఉన్నారు లోకం నిండా, ఏ‌ నాడైనా అరణ్యాల నుండి గ్రామాలూ‌ పట్టణాలలోకి ఏ యాత్రా నిమిత్తమై పోయినప్పుడు ఆకలి తీర్చటానికి.  అలాంటప్పుడు తపస్సు చేసుకునే వాడికి డబ్బుతో పనేమీ లేదు కదా? దానికోసం డబ్బుందని విర్రవీగే వాడెవడికీ నమస్కరించి సేవ చేయవలసిన పనిలేదు కదా.

అదీకాక, ఏదో పదిమంది తోనూ కలిసి ఉంటెనే ఈ‌ ప్రపంచంలో కాస్త రక్షణ ఉంటుందీ‌ అనుకోవాలంటావా?

క. రక్షకులు లేని వారల
రక్షించెద ననుచు చక్రి రాజై యుండన్
రక్షింపు మనుచు నొకనరుఁ
నక్షముఁ బ్రార్థించ నేల యాత్మజ్ఞులకున్

అందరికీ‌ రాజు నిజంగా చక్రధరుడైన శ్రీమహావిష్ణువే. రక్షకులు లేని వాళ్ళెవరూ, నేనే‌ రక్షిస్తానూ‌ అని అయన అంరరికీ నిజమైన రక్షణగా ఉన్నాడు.  అలాంటప్పుడు ఎవడో సగం సగం సమర్థత కలవాణ్ణో, అసమర్థుణ్ణో రక్షించమని వేడుకోవలసిన కర్మం ఏమిటీ?

మ. హరి జింతింపక మత్తుఁడై విషయచింతాయత్తుఁడై చిక్కి వా
సరముల్ ద్రోసెడువాఁడు కింకరగదా సంతాడి తోరస్కుఁ డై
ధరణీశోత్తమ దండభృన్నివసన ద్వారోప కంఠోగ్ర వై
తరణీ వహ్నిశిఖా పరంపరలచే దగ్ధుండు గాకుండునే

ఎవడైతే ఈ ఇంద్రియ సుఖాల మత్తులో పడి జోగుతూ శ్రీహరిని చింతించటం మాని రోజులు వెళ్ళబుచ్చుతాడో వాడి పని అయిందన్న మాటే.  వాడికి శరీరం‌ పడిపోయాక నరకమే గతి. అక్కడ వాణ్ణి యభటులు గదలతో బాది చితక్కొడతారు.  మాటిమాటికీ యమలోక ద్వారం దగ్గర ఉండే వైతరణీ నది లోని అగ్నికీలల్లో ముంచి తీస్తూ వాడి శరీరాన్ని కాలుస్తూ‌ఉంటారు.

ఈ పద్యంలో శ్రీహరిని ఆశ్రయించని వాడికి చిత్తశాంతి లేక కష్టాలు కలుగుతాయీ అని చెబుతూ దాన్నే‌ నరకం అంటున్నారు.  ఆశామోహాల వల్ల అనునిత్యం‌ కలిగే‌ అవమానాలే యమభతూల గదాప్రహారాలు.  విశృంఖల మైన జీవనం కారణంగా కలిగే వ్యాదులూ, దుఃఖాలే వైతరణీ నదిలోని అగ్నిగుండాల్లో మాడటం అని తెలుసుకోవాలి.   ధర్మవిరుధ్దమైన జీవనం వల్ల కలిగే శిక్షలను విధించే కర్మఫలప్రదాయకుడైన విధినే యమధర్మరాజు అనీ కష్టాలే  యమభటులు అనీ తెలుసుకోవాలి. 

శ్రీహరిని మరచి ఆయన సాంగత్యంలోని మధురిమను ఎరుగక కష్టపడే వారు కర్మబంధాలలో ఇరుక్కుంటున్నారు.  జీవులకు కర్మబంధాల కారణంగా యమభటుల వలన గదఘాతాలు, కత్తిపోట్లు, మంటల్లో కాలటం వంటి శిక్షలు పడుతున్నాయి.

ఈ‌ విపత్తును తప్పించుకుందుకు బుధ్దిమంతు లంతా శ్రీహరి దివ్యవిగ్రహాన్ని ధ్యానం‌ చేస్తారు.

2 కామెంట్‌లు:

  1. క. రక్షకులు లేని వారల
    రక్షించెద ననుచు చక్రి రాజై యుండన్
    రక్షింపు మనుచు నొకనరుఁ
    నక్షముఁ బ్రార్థించ నేల యాత్మజ్ఞులకున్

    ధారణ చేయవలసిన పద్యం

    రిప్లయితొలగించండి