5, సెప్టెంబర్ 2013, గురువారం

ద్వితీయస్కంధం: 10. సృష్టిక్రమం - 2

ఆ రూపంబునకుఁ గోటి యోజన విశాలం బైన యండకటాహంబు ప్రథమావరణం బైన పృథ్వి యగు.  దీనిఁ‌ బంచాశత్కోటి విశాలం బని కొందఱు పలుకుదురు.

విరాట్ స్వరూపానికి అనేక ఆవరణాల్లో మొదటి ఆవరణంగా భూమి ఉంటుంది.  ఇది కోటి యోజనాల విస్తీర్ణం‌ కలిగి ఉంటుంది.  కొందరు ఇది యాభైకోట్ల యోజనాల విస్తీర్ణంతో ఉంటుందని చెబుతారు.

విరాట్పురుషుని లోకం స్థూలంగా ఒక గ్రుడ్డు రూపంలో ఉంటుంది.  కాబట్టి దీనిని బ్రహ్మాండం అంటున్నాం.  నిజానికి దీని ఆకృతి ఒక పెద్ద పువ్వు యొక్క మొగ్గ లాగా పొరలు పొరలుగా ఉంటుంది అనుకోవచ్చు.  కటాహం అంటే డిప్ప.  ఇక్కడ కోటి అన్న పదం దూరాన్ని సూచించే‌ మాట కాదు.  కోటి అంటే అంచు. అలాగే యోజనం అంటే అతుకు. అంటే ఇక్కడ ఈ పృధ్వి అనేది బ్రహ్మండం‌యొక్క మొదటి పొర అనీ దానికి అంచులూ అతుకులతో మిగతా ఆవరణలు కప్పి ఉంటాయనీ అర్థం.  ఈ‌ అంచులు  యాభై అని కొందరు అనటంలో ఉద్దేశం విష్ణువు యొక్క విరాట్ విగ్రహంలోని యాభై వర్గీకరణలనూ సూచించటం అన్నమాట.

ఇయ్యావరణంబు మీద సలిల తేజ స్సమీర  గగ నాహంకార మహత్తత్త్వంబు లనియెడి యావరణంబులు క్రమంబున నొండొంటికి దశగుణోత్తరాధికంబులై యుండు.

ఈ భూమి అనే ఆవరణం (పొర) మీద జలమూ, అగ్నీ, వాయువూ, ఆకాశమూ, అహంకారమూ,  మహత్తత్వమూ అనే పొరలు ఉంటాయి.  వీటిలో ప్రతి పొరకన్నా దాని పై పొర పది రెట్లు ఎక్కువ విశాలంగా ఉంటుంది.

ఇక్కడ
జలమూ, అగ్నీ, వాయువూ, ఆకాశమూ అనేవి భూమి కాక మిగతా మహాభూతాలు.  వీటిని స్థూలభూతాలు అని కూడా అంటారు.

అట్టి యేడింటి మీదఁ బ్రకృత్యావరణంబు మహావ్యాపకం‌బగు.

ఈ ఏడు పొరల మీదా ప్రకృతి అనే పొర ఉంటుంది. ఇది అన్ని పొరలనూ కమ్మి ఉంటుంది.

ఏడు పొరలంటే, విరాట్ స్వరూపం పైన పంచభూతాల పొరలు ఐదూ, ఆపైన అహంకారమూ, మహత్తూ అనేవి రెండూ. వెరసి ఏడు పొరలు.  అన్నింటికీ పైన ఉండే‌ పొర పేరు ప్రకృతి.  అన్ని పొరలూ ఈ‌ ప్రకృతి అన్న పొరలోనే అణిగి ఉంటాయి.

బ్రహ్మాండబు భేదించి వైష్ణవపదారోహణంబు సేయువాఁడు

ఇట్లా ఉన్న బ్రహ్మాండాన్ని అతిక్రమించి ఆపైన ఉండే వైష్ణవ పదం దాకా ఎక్కి పోయేవాడి గురించి చెబుతున్నారు.

సాధకుడు ఈ‌ బ్రహ్మాండాన్ని అతిక్రమించి బయటకు వెళ్తేనే ఈ బ్రహ్మాండానికి ఆవల ఉన్న విష్ణుపదం చేరుకోగలడు. అంటే విష్ణు పదమే సర్వోన్నతం.  దానికి భిన్నమైన ఈ బ్రహ్మాండంలో ఉంటూ, దాన్ని వదిలి పెట్టకుండా సాధించేది ఏదైన సరే, ఈ‌ సాధకుడికి ఈ‌ బ్రహ్మాండంలో అనుభవించటానికి తగిన ఫలం ఇస్తుంది కాని విష్ణుపదాన్ని ఇవ్వలేదు.


నిర్భయుండై మెల్లన లింగదేహంబున పృథివ్యాత్మకత్వంబు నొంది

సాధకుడు నిర్భయంగా ఉండి, తన లింగశరీరంలో మొదట పృధ్వీ తత్వంగా తాదాత్మ్యం చెందుతాడు.

నిర్భయంగా ఉండటం అన్న మాట ఎందుకు వాడారూ? సాధకుడికి ఏ విధమైన సంశయం ఉండకూడదని చెప్పటానికే.  ఈ‌ యోగ విషయం ధారణ చేయటం అనేది గురువు దగ్గర అభ్యాసం చేయాలి.  ఇలాంటి గహన మైన విషయాలు మొదట్లో సాధకుడికి చాలా అనుమనాలు రేకెత్తిస్తాయి.  ఈ  సాధన వలన ప్రమాదం ఏమీ లేదు కదా? గురువుగారు గ్రంథావలోకనం చేసి చెబుతున్నారా?  ఆయనకు స్వానుభవం ఉందా?  సాధన సాగకపోతే ఏమి జరుగుతుంది?  సాధనానంతరం తాను ఈ‌ దేహాన్ని కలిగి ఉంటాడా అది పడి పోతుందా?  అసలు విష్ణుపదం చేరుకుంటే ఆ పిమ్మట ఏమి జరుగుతుంది?  ఇలా సవాలక్ష సందేహాలు వస్తాయి.  ఎక్కడ సందేహం ఉందో,  అక్కడ భయం తిష్టవేసుకుని కూర్చుంటుంది.  సంశయాళువు ఏమి సాధనచేస్తాడూ?  సాధన చేసేవాడు గురువుపట్లా, సాధనా క్రమం పట్లా, సాధనాఫలం పట్లా అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎలాంటి భయమూ ఉండకూదదు.

అలా నిర్భయంగా సాధన చేసి, మొదటగా పృధ్వీ తత్వంలో తాదాత్మ్యం చెందుతాడు.   ముందుగా భూతత్వం చెప్పటానికి కారణం అతడి లింగశరీరాని మొదటి ఆవరణం భూతత్వమే.

అదేమిటీ, విరాట్ విగ్రహానికి మొదటి ఆవరణం భూతత్వం అన్నారు కాని. సాధకుడికి అంటారేమిటీ ఇప్పుడు అని సందేహం తప్పకుండా వస్తుంది.  సాధకుడి ప్రజ్ఞాశరీరాన్ని పిండాండం అంటారు. దానినే లింగశరీరం అనీ అంటారని ఇప్పటికే చదువుకున్నాం.  సాధనలో బ్రహ్మాండానికీ పిండాండానికీ‌ సమన్వయం.  ఇది చాలా బాగా గుర్తు పెటుకోవాలి.

అందుచేత సాధకుడి తన ప్రజ్ఞలో మొదటగా పృధ్వీతత్త్వంతో మమేకం కావాలి.

అట్టి పృథివ్యాత్మకత్వంబున ఘ్రాణంబున గంధంబును, జలాత్మకత్వంబున రసనేంద్రియంబున రసంబును, తేజోరూపకత్వంబున  దర్శనంబున రూపంబును, సమీరణాత్మకత్వంబున దేహంబున స్పర్శనంబును, గగనాత్మకత్వంబున శ్రవణంబున శబ్దంబును అతిక్రమించిన

భూతత్త్వంలో ప్రజ్ఞను నిలబెట్టి దాని రూపం ఐన గంధాన్ని అతిక్రమించాలి.  జలతత్త్వంలో
ప్రజ్ఞను నిలబెట్టి దాని రూపం ఐన రుచిని అతిక్రమించాలి.   అగ్నితత్త్వంలో ప్రజ్ఞను నిలబెట్టి దాని రూపం ఐన రూపదర్శనాన్ని అతిక్రమించాలి.  వాయుతత్త్వంలో ప్రజ్ఞను నిలబెట్టి దాని రూపం ఐన స్పర్శని అతిక్రమించాలి.  ఆకాశతత్త్వంలో ప్రజ్ఞను నిలబెట్టి దాని రూపం ఐన శబ్ధాన్ని అతిక్రమించాలి.

భూమి వగైరా పంచభూతాలకూ పంచ సూక్ష్మభూతాలైన గంధాదులు ఉన్నాయి వాటి లక్షణస్వరూపాలుగా.  క్రమంగా ఈ‌ పంచభూతాల్లోనూ‌ ప్రజ్ఞని నిలబెట్టి ఆయా సూక్ష్మభూతాలని అతిక్రమించాలి.  అతిక్రమించటం అన్న మాట తరచుగా వాడుతున్నాం కదా.  అతిక్రమించటం అంటే వాటి మీద పూర్తి ఆధిపత్యం‌ చెలాయించటం అన్నమాట.

భూతసూక్ష్మేంద్రియ లయస్థానం బైన యహంకారావరణంబున సంప్రాప్తుండై

పంచభూతాలయొక్క సూక్ష్మమైన ఇంద్రియాలకి లయం చెందే స్థానం అహంకారం అనే‌ పొర.  దీన్ని చేరుకోవాలి.

మహాభూతాలైన భూమీ, ఆకాశం వంటి వాటిని ఐదింటినీ ఒక్కొక్కటిగా తన ప్రజ్ఞతో‌ స్వాధీనం చేసుకోవాలి.  వాటిని స్వాధీనం‌ చేసుకోవటం అంటే వాటి లక్షణాలైన గంధరసాది పంచసూక్ష్మభూతాలనీ జయించాలి.  వీటిని అన్నింటినీ అతిక్రమించిన సాధకుడు అహంకారం యొక్క ఆవరణం చేరుకుంటాడు.

అందు మనోమయంబును దేవమయంబును నైన సాత్త్వికాహంకార గమనంబున మత్తత్త్వంబు సొచ్చి

మనస్సుకూ దేవతలకూ ఆధారమైన  సాత్వికాహంకారాన్ని ఆశ్రయించుకుని మహత్తత్త్వంలో ప్రవేశించి.

మహత్తత్త్వం నుంచి మూడు రకాల త్రిగుణాలు ఆధారంగా మూడు రకాల అహంకారాలు పుట్టాయి. అవి సాత్విక, రాజసిక, తామసిక అహంకారాలు.  తామసిక అహంకారం నుండి పంచతన్మాత్రలైన 
శబ్ద, స్పర్శ రస, రూప, గంధాలు పుట్టాయి.  వీటి నుండి ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలు పుట్టాయి. వాటి నుండి చర్మమూ, కళ్ళూ, చెవులూ, జిహ్వా, నాసికా అనే జ్ఞానేంద్రియాలూ, మనస్సూ పుట్టాయి.  రాజసిక అహంకారం నుండి ఇంద్రియాలు పుట్టాయి.  సాత్వికాహంకారం నుండి జ్ఞానేంద్రియాలకీ,  కర్మేంద్రియాలకీ  అధిష్టాన దేవతలైన ఇంద్రాది దేవతలు పుట్టారు. 

అహంకారం అనే ఆవరణ లోనికి చేరుకున్న సాధకుడు అక్కడ సాత్వికాహంకారాన్ని ఆశ్రయిస్తాడు. అలా అహంకారాన్ని అధిగమించి మహత్తును చేరుకుంటాడు.

గుణత్రయంబున లయించి
ప్రధానంబు నొంది

గుణత్రయంలో లీనమై  ప్రకృతిని పొంది

గుణత్రయం అంటే సత్వమూ, రజస్సూ, తమస్సూ అనే త్రిగుణాలు.  సత్వగుణం ఆధారంగా కల సాత్వికాహంకారాన్ని అధిగమించిన వాడు మొత్తం మూడు గుణాలనీ అధిగమించిన వాడయ్యాడు.  అప్పుడు త్రిగుణాలకీ‌ అధారమైన మూలప్రకృతిని స్వాధీనంలో‌నికి తెచ్చుకుంటున్నాడు.

ప్రధానాత్మకత్వంబున దేహంబును

ప్రకృతి ఆధారంగా ఏర్పడుతున్న శరీరంలో తన ఉనికిని జయిస్తున్నాడు.

అంటే,  జీవుడు శరీరంలో బంధించి ఉండబడటానికి కారణం ప్రకృతి.  ఈ‌ ప్రకృతికి వశంలో ఉన్నంత కాలమూ ఆ జీవుడు చేసే ప్రతి కర్మా త్రిగుణాలని ఆశ్రయించి వాటి కనుగుణమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది.  తాను కర్తను అన్న భ్రమలో ఉంటాడు జీవుడు.  దీన్నే‌ మాయ అంటాము. ఎప్పుడైతే త్రిగుణాత్మకం‌ ఐన ప్రకృతి వశంలోకి వచ్చిందో, అప్పుడు తాను కర్తను అన్న భ్రమ తొలగి పోతుంది.  బంధరూపంగా ఉన్న మాయ విడిపోతుంది.  జీవుడుగా శరీరం అతనకు ఆశ్రయంగా ఉండే స్థితిని అధిగమించా డన్నమాట.

ఉపాధి పరంపరావస్థానంబునం  బ్రకృతిం బాసి యానందమయుండై

ఇంక తనకు ఉపాధి పరంపర అనేది లేదు కాబట్టి,  ప్రకృతిని నుండి తప్పుకని కేవలం ఆనందమయుడుగా ఉంటాడు.

ఉపాధి పరంపరకి కారణం కర్మాను బంధం.  దానికి కారణం కర్తృత్వభ్రమ.  దానికి కారణం ప్రకృతి.  ఎప్పుడైతే ప్రకృతి విజయం కలిగిందో ఇంక కర్తృత్వమూ లేదు,  ప్రస్తుత ఉపాధితో‌ బంధమూ లేదు. కర్మబంధం లేదు కాబట్టి ఇంక రాగల ఉపాధులూ‌ ఉండవు.  ప్రకృతితో సంబంధమే‌ దుఃఖానికి కారణం. ప్రకృతితో సంబంధం లేకుందా ఉన్నాక ఇంక దుఃఖం ఎక్కడిదీ?  అనందమే ఆనందం.  తాను కేవలం ఆనంద స్వరూపుడే అవుతున్నాడు.

ఆనందంబునం‌ బరమాత్మరూపం బైన వాసుదేవ బ్రహ్మంబు నందు గలయును

ఈ  అనంద కారణంగా వాసుదేవుడితో‌ కలిసిపోతున్నాడు.  వాసుదేవుడు అన్నది పరమాత్మ స్వరూపం.

ప్రకృతిలయం ఐపోయాక ప్రపంచం నుండి విముక్తి దొరికాక, ఏర్పడే స్థితి అంటూ‌ ఏమీ‌ ఉండదు.  ప్రకృతి అంటేనే నామరూపాత్మకమైన ఉనికి.  తన ఉనికిని తానే వదిలి పెడుతున్నట్లేగా ప్రకృతిని వదిలేయటం అంటే.  ప్రకృతికి ఆవల ఉన్నది కేవలం ఒక్కటే తత్త్వం.  దానినే‌ పరబ్రహం అంటారు.  ఈ స్థితిని సాధించిన వాడిని సంకేతంగా వాసుదేవుడు అని చెప్పవచ్చు.

ఇదీ సృష్టి క్రమమూ  అలాగే సాధకుడి సృష్టినుండి విడివడి పరబ్రహ్మప్రజ్ఞను సాధించే విధానమూ అని శుకయోగి పరీక్షిత్తుకు చెప్పారు.  ఈ సృష్టిభేదన క్రమాన్ని ప్రశంసిస్తూ శుకయోగి

ఆ. పరమభాగవతులు పాటించు పథమిది
యీ పథమున యోగి యేఁగె నేని
మగిడి రాఁడు వాఁడు మఱి సంశయములేదు
కల్పశతములైన గౌరవేంద్ర

ఇలా ఈ పధ్దతిలో ఎవరు భగవంతుని ధారణ చేసి తెలుసుకుంటారో వాళ్ళను పరమ భాగవతులు అంటారు.  ఈ విధానంలో ముక్తి సంపాదించిన వాడు ఎప్పటికీ‌ తిరిగి సృష్టిలోకి రాడు.  కల్పం పూర్తయ్యాక కూడా తిరిగి రాడు. ఒక వంద కల్పాల కాలం పూర్తయ్యాక కూడా తిరిగి రాడు. ఓ పరీక్షిన్మహారాజా, ఈ విషయంలో ఏమీ‌ సందేహం‌ అక్కర్లేదు.

2 కామెంట్‌లు:

  1. చాలా కొత్త సంగతులు తెలిసాయి, కొన్ని అనుమానాలూ ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చదవాలి అర్థం కావడానికి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొంచెం క్లిష్టమైన గద్యమే నండి, చిన్నదైనా. అందుకే రెండు భాగాలుగా వివరించాను.

      తొలగించండి