2, సెప్టెంబర్ 2013, సోమవారం

ద్వితీయస్కంధం: 07. శ్రీమహావిష్ణువు దివ్యస్వరూపం

ఆవిధంగా శుకయోగి శ్రీహరిని  మానవుడు ఎందుకు ధారణ చేయాలో స్పష్టం చేసారు.  ఇప్పుడు శ్రీహరి దివ్య విగ్రహాన్ని మనముందు ఆవిష్కరిస్తున్నారు.

ఆ శ్రీహరి జీవుల హృదయాంతరాళాల్లోనే స్థిరంగా ఉంటాడు ఎప్పుడూ.  తమతమ హృదయాల్లో ఉన్న శ్రీహరిని తమ హృదయప్రదేశంలో నిండి ఉన్న మూర్తిగా భావించాలి. 

భగవద్గీతలో
   ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి।

   భ్రామయన్సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా॥
 

అని చెప్పబడింది కదా. అందు చేత శ్రీహరి మన హృదయంలోనే ఉంటాడనే గ్రహింపుతో చక్కగా భావించి ధ్యానించాలి.

నాలుగు దిక్కులా దిగ్గజాలు తమ తతమ తొండాలు పైకెత్తి చూపుతున్నట్లుగా బలిష్ఠమూ, దీర్ఘమూ అయిన బాహుదండాలు కలిగి ప్రకాశిస్తూ ఉంటాడు శ్రీహరి. 

విష్ణుసహస్రనామాల్లో విశ్వబాహు, వీరబాహు, చతుర్బాహు అనే‌నామాలూ,  బ్రహ్మగారిచే ఉరుబాహవే అనే సంబోధనా కనిపిస్తున్నాయి.  విశ్వబాహువు అంటే అన్ని ప్రాణులకీ  బాహువులాగా ఆలంబనం ఐన వాడనీ, అన్ని వైపులకీ విస్తరించిన బాహువులున్న వాడనీ అర్థం. 
శృతిప్రమాణంగా శ్వేతాశ్వతరోపనిషత్తు కూడా విశ్వతో బాహుః అంటూ అన్ని వైపులకీ భుజాలు కలవాడని వివరిస్తోంది.  చతుర్బాహువు అని వాసుదేవుడికి రూఢమైన నామం.  భారతకథలో అనేక పర్యాయాలు శ్రీకృష్ణుడు నాలుగు భుజాలు ధరించటం‌ కనిపిస్తుంది. వీరబాహువు అనీ విష్ణువుకు రూఢనామం. దీనికి  కారణం దేవశత్రువులని నాశనం చేయటం, వేదమర్యాదని రక్షించటం అనే వీరత్వం కల బాహువులు కలవాడు అని శంకరభాష్యం.  బ్రహ్మగారు ఉరుబాహవే అన్నప్పుడు ఉరు శబ్దానికి అర్థం బలమైన, గొప్పవైన అనే అర్థం.  ఈ‌ విధంగా శ్రీహరి బాహు సంపదను ధ్యానం చేయాలి.

ఆయన మూర్తి యొక్క సౌందర్యం కోటి మంది మన్మధుల సౌందర్యాన్ని తలదన్నేటట్లుగా ఉంటుంది.  

విష్ణుసహస్రనామాలలో వరాంగుడు, భ్రాజిష్ణువు , శుభాంగుడు అన్న పేర్లున్నాయి.  వరాంగుడు అంటే శుభకరమూ సుందరమూ ఐన దేహం ఉన్నవాడు అని అర్థం.  భ్రాజిష్ణువు అంటె మిక్కిలి ప్రకాశించే స్వరూపం కలవాడు అని అర్థం. శుభాంగుడు అంటే అందమైన వాడు, శుభ్రమైన అంతఃకరణతో ధ్యానించ దగిన వాడు, సచ్చిదానందమే స్వరూపంగా ఉన్నవాడూ అని అర్థాలు.

మంధరపర్వతాన్ని ఎత్తి పట్టుకున్న శ్రీకూర్మమూర్తి ఐన ఆయన అత్యంత బలశాలి.

విష్ణుసహస్రనామాల్లో మహాబలుడు, అక్షోభుడు, అమితవిక్రముడు, దమనుడు, దుర్జయుడు, శూరజనేశ్వర వంటి పేర్లు కనిపిస్తున్నాయి.  వీటి అర్థాలు స్పష్టం.

ఆయన వదనమండలం పూర్ణిమ నాటి చంద్రబింబంలా అత్యంత  మనోహరంగా ఉంటుంది.

విష్ణుసహస్రనామంలో సుముఖుడు అనే‌పేరు ఉంది. దీనికి అర్థం అత్యంత మనోహరమైన ముఖం కలవాడు అని. విష్ణుపురాణంలో ప్రసన్నవదనం అని చెప్పబడింది.

ఆయన ధరించిన కిరీటమూ, చెవి కుండలాలూ, ఉదయిస్తున్న సమయంలో సుర్యబింబం ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తూ ఉంటాయి.

విష్ణుసహస్రనామాల్లో కుండలీ అనే నామం ఉంది.  దీనికి శంకరులు సాంఖ్యమూ యోగమూ అనేవే కుండలాలుగా ఉన్నవాడు అన్న అర్థం కూడా చెప్పారు.

భగవద్గీతలో కిరీటాదులతో ప్రకాశిస్తున్న విష్ణుస్వరూపం ఇలా చెప్పబడింది
 
కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతో దీప్తిమన్తమ్।
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తాద్
దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్॥

 

అలాగే
 

కిరీటినం గదినం చక్రహస్తం
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ।
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో భవ విశ్వమూర్తే॥

 

ఇలా విస్ణువుకు సహజంగా మిక్కిలి ప్రకాశించే‌ కిరీటాదులున్నా యని తెలుస్తోంది.  ఇంతకు ముందే  భీష్మస్తుతిలో కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి పద్యాన్ని చదువుకున్నాం కదా.
 
ఆయన వక్షస్థలంలో శ్రీవత్సం అనే పేరుగల పుట్టుమచ్చ ఉంటుంది.  మెడలో అనేక అందమైన మణిహారాలూ, వాటిలో కౌస్తుభం అనే విశేషప్రభావం కల దివ్యమణీ ఉంటాయి.  ఆయన మెడలో నిరంతరం మంచి పరీమళం వెదజల్లే వనమాలికలు విరాజిల్లుతూ ఉంటాయి.

విష్ణుసహస్రనామాలలో శ్రీవత్సవక్షుడు, వనమాలీ అని స్పష్టంగా ఉంది.


బహు చక్కని భుజకీర్తులూ,  కంకణాలూ, పాదనూపురాలు, ఉంగరాలూ, అందమైన ధట్టీ కలిగి ఆయన మూర్తి శోబిస్తూ ఉంటుంది.

విష్ణు సహస్రనామాలలో రుచిరాంగదుడు , చందనాంగదుడు అన్న పేర్లున్నాయి.  రుచిరాంగదుడు అంటే గొప్పగా ప్రకాశించే భుజకీర్తులు కలవాడని అర్థం.  చందనాంగదుడు అంటే అందమైన భుజకీర్తులు కలవాడని అర్థం.

ఒత్తైన నల్లని జుట్టుతో వంపులు తిరిగిన ముంగురులు నుదుటిమీదకు కదలాడుతూ ఉండగా ఆయన పెదవులపై దరహసం అందమైన చంద్రరేఖలా మైమరపిస్తూ ఉంటుంది.




విష్ణుసహస్రనామాల్లో  కేశవుడు అన్న నామానికి శంకరభాష్యంలో 'అభిరూపాః కేశాః యస్య సంతి సః' అంటే సుందరమైన కేశాలు ఎవరికి కలవో అతడు  అనీ, అలాగే ప్రశస్తమైన కేశసంపద కలవాడూ అని అర్థం చెప్పబడింది.

ఆయన కనుబొమల విన్యాసమూ, పరిపూర్ణమైన కరుణతో నిండిన చల్లని చూపులూ సకలలోకాలకూ నిరంతరం సౌభాగ్యసంపదలని అనుగ్రహిస్తూ ఉంటాయి.

విష్ణుసహస్రనామాలలో పద్మనిభేక్షణుడు, సర్వదర్శనుడు, పుష్కరాక్షుడు, వృషభాక్షుడు , పుండరీకాక్షుడు, శుభేక్షణుడు, సర్వతశ్ఛక్షువు అన్న నామాలు కనిపుస్తున్నాయి.  సర్వదర్శనుడు అంటే అన్నివైపులకు ప్రసరించే జ్ఞాననేత్రాలు కలవాడు.
ఉపనిషత్తులు విశ్వతశ్ఛక్షుః అనీ విశ్వాక్షః అనీ స్పష్టం చేస్తున్నాయి.  పద్మనిభేక్షణుడన్నా, పుండరీకాక్షుదన్నా, పుష్కరాక్షుడు అంటే పద్మము(పుండరీకము, పుష్కరము)లతో పోల్చదగిన, అందమైన కన్నులు కలవాడు అని అర్థం.  ఈ పుస్కరాక్ష పదానికి విశేషించి హృదయపుస్కరంలో వ్యాపించి ఉండే వాడన్న అర్థం ఉంది.  వృషభాక్షుడంటే సమస్తమైన కోరికలనూ తీర్చే వరాలని అనుగ్రహించే వాడని అర్థం.  శుభేక్షణుడు అంటే ఎవని దర్శనం శుభం చేకూర్చుతుందో అతడు. శుభం అంటే మోక్షం‌ కాబట్టి ఎవని దర్శనం మోక్షకారణమే అతడు.  అలాగే శుభమైన చూపులు కలవాడు - శుభం చేకూర్చే చూపు కలవాడు అని చెప్పుకుంటే ఆయన చూపులు సమస్త శుభాలూ కలిగిస్తాయీ,  మోక్షప్రదాలూ అని అర్థం.


చిగురుటాకుల వలె మృదువైన ఆయన పాదపద్మాలు ఎల్లప్పుడూ‌ యోగిరాజుల యొక్క హృదయపద్మాలలో నిలిచి అనుగ్రహం చిందిస్తూ ఉంటాయి. 

ఆయన పరిపూర్ణమైన ఆనందం యొక్క స్వరూపమే.

విష్ణుసహస్రనామాల్లో మనోహరుడు అన్న పదంచేత నిరతిశయమైన ఆనందం ఆయన స్వరూపం అని అర్థం చెప్పబడుతున్నది.  అలాగే అనందుడు అన్న పేరూ కనిపిస్తోంది.

లెక్క పెట్టటానికి అసాధ్యం ఐనంత మంది సూర్యుళ్ళ వెలుగుని త్రోసిరాజనే ప్రకాశంతో ఉన్న ఆయన కనిపించేదీ, కనిపించనిదీ అయిన సర్వవిశ్వానికి అధిపతి.

విష్ణుసహస్రనామాల్లో ప్రకాశనుడు, ప్రకాశాత్ముడు,  మహాతేజుడు, బృహద్భానువు, భానుడు , మహాద్యుతి అన్న పేర్లు కనిపిస్తున్నాయి.  ప్రకాశనుడు అంటే అన్నిటినీ ప్రకాశింపజేసే స్వభావం కలవాడు అని అర్థం. అంటే సర్వమూ ఈయన కారణంగానే తెలియ బడుతూ ఉన్నాయన్న మాట.  ప్రకాశాత్మ అంటే ఎవడి ఆత్మ యొక్క స్వరూపమే‌ ప్రకాశమో అతడే విష్ణువు అనిఅర్థం. మహాతేజుడు అంటే ఎవరి తేజస్సు వలన సూర్యాదులకీ ప్రకాశం కలుగుతోందో, ఎవరి తేజస్సు చేత సమస్త విశ్వామూ భాసిస్తోందో  అతడు అని అర్థం.   బృహద్భానువు అంటే వెలుగులు అన్నింటికీ వెలుగైన పెద్ద వెలుగు అని అర్థం.  భానుడు అంటే తనంత తానుగా ఉండి ప్రకాశించే వాడు అని అర్థం.  మహాద్యుతి అంటే బృహదారణ్యకం జ్యోతిషాం జ్యోతి అన్నట్లు అన్ని వెలుగులలోనే తానే పెద్దవెలుగు అని భావం. 

 
ఈ విధంగా సర్వమనోహరంగా ఉండే శ్రీహరి రూపాన్ని మనస్సులో నిలుపుకుని ధారణ చేయాలి.   మనస్సులోనే ఆయన దివ్యశరీరావయవాలను పాదాలూ, వక్షస్థలమూ, వదనమండలమూ, బాహువులూ ఇత్యాదిగా నిరంతరంగా ప్రతిక్షణమూ ధ్యానం చేస్తూ ఉండాలి.


ఈ విధంగా చేస్తూ నిశ్చలమైన భక్తియోగం సిథ్థించేదాకా ప్రయత్నపూర్వకంగా ధారణతో అభ్యాసం చేయాలి.

ఇలా ధారణ సిథ్థించిన తరువాత అప్రయత్నంగానే ఆ ధారణ కొనసాగుతుంది.  మనస్సుకు పట్టుకొనే లక్షణం ఉందని మనకు తెలుసును కదా.  ఇప్పటికే దానిని గురించి విపులంగా చర్చించుకున్నాం.

మనకు శుకయోగీంద్రుడు రెండు విధాలుగా ధ్యానరూపాలని ఉపదేశించారు.  మొదటిది విరాట్ విగ్రహం, రెండవది ఈ దివ్యస్వరూపం.  మొదటిదైన విరాడ్రూపాన్ని ధారణ చేయటం ద్వారా సమస్త విశ్వమూ విష్ణుస్వరూపమే అని ధ్యానం చేయటం జరుగుతుం దన్న మాట, విష్ణువు సహస్రనామాల్లో కూడా ఆరంభం విశ్వం అనే పేరుతోనే‌ కదా .  రెండవది ధ్యానానికి మరింత సుకరంగా ఉండే అందమైన స్వరూపం.

2 కామెంట్‌లు: