23, సెప్టెంబర్ 2013, సోమవారం

ద్వితీయస్కంధం: 18. బ్రహ్మ వివరించిన విష్ణుతత్వం.

ఈ విధంగా నారదుడికి బ్రహ్మగారు విరాట్పురుషుడి దివ్యవిగ్రహాన్ని గురించి వివరించిన తరువాత మరికొన్ని విషయాలు తెలియజేస్తున్నారు.

నారదా, ఈ‌విశ్వమే శరీరంగా అనంతశక్తి సంయుతుడైన భగవంతుని నాభికమలంలో నేను పుట్టాను.  నాకు యజ్ఞం చేయాలని కోరిక కలిగింది కాని దానికి తగిన సంభారాలు ఏమీ కనిపింలేదు.  అందుచేత భగవంతునే మనస్సులో నిలుపుకున్నాను.  అప్పుడు నాకు ఉపాయం తెలిసింది.

నా ధ్యానంలో నాకు విష్ణువు శరీరభాగాలే యజ్ఞభాగాలుగా దర్శనం ఇచ్చాయి.  అందులో యజ్ఞపశువులు, యజ్ఞవాటికలు, యూపస్థంభాలు, పాత్రసామాగ్రి,  ఓషధులు, నేయి, వివిధలోహాలు, వివిధకాలల్లో చేయవలసిన హోమాలు,  వాటికి సంబంధించిన సంప్రదాయాలు, సంకల్పవిధులు,  మంత్రాలు,తంత్రాలు, బ్రాహ్మణులు, దక్షిణలు మొదలైన మంగళకరమైన వన్నీ‌ నాకు విష్ణువు అనుగ్రహం వల్ల సమకూరాయి.

క. యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు
యజ్ఞేశుఁడు యజ్ఞకర్త యగు భగవంతున్
యజ్ఞపురుషుఁగా మానస
యజ్ఞము గావించితిం దదర్పణబుధ్ధిన్


భగవంతుడే యజ్ఞపురుషుడు. ఆయన దేహమే యజ్ఞస్వరూపం. ఆయజ్ఞానికి ఫలం అనుగ్రహించే వాడూ, యజ్ఞఫలితమూ ఆయనే.  


అప్పుడు పురోహితులు తమలో నున్న నన్ను చూచి సప్తతంతువనే యజ్ఞం నా చేత చేయించారు.

చ. మనువులు దేవదానవులు మానవనాథులు మర్త్యకోటి దా
రనయము వారివారికిఁ  బ్రియం బగు దేవతలన్ భజించుచున్
ఘనతరనిష్ఠ యజ్ఞముల గైకొని చేసిరి తత్ఫలంబు ల
య్యనుపమమూర్తి యజ్ఞమయుఁడైన రమావరునందుఁ జెందగన్


ఈ సప్తతంతువనే యజ్ఞంలో దేవతలు, రాక్షసులు, మనువులు, మనుష్యులు జన్మించారు.  వాళ్ళంతా తమకు ఇష్టమైన దేవతలనీ పూజిస్తూ రకరకాల యజ్ఞాలు చేసారు. ఎవరే విధంగా ఏఏ యజ్ఞాలు చేసినా వాటి ఫలితాలు అన్నీ కూడా భగవంతుడైన విష్ణువుకే చెందుతున్నాయి.

యజ్ఞతంత్రం అంతా భగవంతుడి స్వరూపమే. మనకు ఆ యజ్ఞతంత్రం లోనే ఇమిడి ఉండి ఆయన కనిపిస్తాడు.  కాని ఆయన కేవలం యజ్ఞాలతో మాత్రమే వ్యక్తం అయ్యే స్వరూపం కలవాడు కాదు.  ఆయన ఆది, అంతము, పుట్టుక, నాశము అనేవి లేని వాడు.  మనకు ద్రవ్యాదుల రూపంలో కనిపిస్తూ ఉన్నా వాటిని మనం కర్చు చేసినంత మాత్రానా తరిగే నిజస్వరూపం కలవాడు కాదు.  ఈ యజ్ఞాల స్వరూపం తానుగా ఉండటమే కాదు.  ఆ యజ్ఞాల ఫలం రూపం కూడా తానే ఐన వాడు. మనకు యజ్ఞఫలం ప్రసాదించేది ఆయన.  దేవతలందరి చేత ప్రస్తుతించబడే వాడు ఆ భగవంతుడే.  అందుచేత వాళ్ళంతా యజ్ఞాలు చేసారు.

క. అగుణుం డగు పరమేశుఁడు
జగములఁ గల్పించు కొఱకు జతురత మాయా 
సగుణుం డగుఁ గావున హరి
భగవంతుం‌ డనఁగ బరఁగె భవ్యచరిత్రా


భగవంతుడికి ఏ గుణాలు కూడా లేవు. రజస్తమో గుణాలూ‌లేవు. సత్వమూ లేదు. నిజానికి  ప్రపంచాన్ని నిర్మించటం కోసం ఆయనే గుణాల్ని సృష్టించాడు.  ఆ అవసరం నిమిత్తమే ప్రపంచాతీతమైన తన మాయ ఆధారంగా తానే ఈ త్రిగుణాల్ని గ్రహించి ఆ నిర్గుణుడైన హరి సగుణుడు అవుతున్నాడు. అలా సమస్తసామర్థ్యాలు, శక్తి సంపద, ఐశ్వర్యం కలిగి ఉండటం వల్లనే ఆ పరమాత్మ భగవంతుడనే నామధేయంతో పిలవబడుతున్నాడు.

క. విశ్వాత్ముఁడు విశ్వేశుడు
విశ్వమయుం డఖిలనేత విష్ణుఁ డజుం డీ
విశ్వములోఁ దా నుండును
విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు నుండున్


ఆయనకు ఈ‌విశ్వమే దేహం. ఈ విశ్వానికి అధిపతి కూడా అయనే.  ఈ‌విశ్వంలో అన్నిటా నిండి ఉన్నదీ ఆయనే.  అందరికీ‌ ప్రభువు ఆయనే.  ఆయనకు పుట్టుకే లేదు.  నిత్యం ఉన్నవాడు.  ఈ‌ సృష్టిలో తానుంటాడు.  అలాగే  ఈ సృష్టి అంతా ఆయనలో  ప్రకాశిస్తూ ఉంటుంది.

చ. అతని నియుక్తిఁ జెంది సచరాచభూతసమేతసృష్టి నే
వితతముగా సృజింతు బ్రభవిష్ణుఁడు విష్ణుఁడు ప్రోచుఁ బార్వతీ
పతి లయమొందఁ జేయు హరి పంకరుహోదరుఁ డాదిమూర్తి య
చ్యుతుఁడు త్రిశక్తియుక్తుఁ డగుచుండును నింతకుఁ దాన మూలమై


నేను కేవలం ఆయన ఆజ్ఞ తీసుకుని ఈ‌ సృష్టిని చేస్తున్నాను. ఇందులో స్థావరాలు (కదలిక లేనివి, చెట్లు వగైరా) , చరములు (‌స్వయంగా కదలగలవి - పిపీలికాది మనుష్యపర్యంతమైన జీవులు) అన్నీ ఉన్నాయి.  ఎడతెగకుండా ఇలా సృష్టి చేస్తూనే ఉంటాను.  అంతవరకే నా కర్తవ్యం.  ఈ సృష్టి అంతా సవ్యంగా ఉండేటట్లు చూసుకునేది  విష్ణువు.  ఈ సృష్టికి కాలం తీరిన సమయంలో లయం చేసేది పార్వతీ పతి ఐన శివుడు. ఈ‌ వ్యవహారం అంతా సృష్టిస్థితిలయాలనే మూడు క్రియలకీ మూలకారణం ఐన మొట్టమొదటి తత్వం విష్ణువు ఇఛ్ఛప్రకారం సృష్టి నడుస్తూ ఉంటుంది.

నారదా, నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు ఇది. ఈ విష్ణువే అన్నింటికీ మూలకారణం . సమస్తసృష్టిలోనూ‌ తాను ఒక్కడుగా నిండి ఉండి అన్ని రూపాల్లోనికీ విస్తరించి ప్రవర్తిస్తూ ఉంటాడు.  కాబట్టి అయనను పరబ్రహ్మ అని అంటారు.

క. హరి భగవంతుఁ డనంతుఁడు
గరుణాంబుధి సృష్టికార్య కారణ హేతు
స్ఫురణుం డవ్విభు కంటెం
బరుఁ డెవ్వడు లేఁడు తండ్రి పరికింపంగన్


సృష్టికి కార్యమూ, కారణమూ‌ శ్రీహరియే కాని ఆయన కరుణ కంటే వేరే‌ ఏమీ లేదు.
 

సృష్టికి కారణం ఏమిటీ అని అడిగావు.  కార్యమూ అతడే, కారణమూ అతడే. అతడి సంకల్పం సృష్టి ఉండాలని. ఆయన కరుణ అనే ఒక మహా సముద్రం.  సముద్రంలో అలలు రావటం ఎలా సముద్రానికి సహజమో చూడు. ఒక అల  కొత్తగా ముందుకు తోసుకు వస్తుంది. మరలా వెనుకకూ‌ పోతుంది. ఇదంతా సముద్రానికి సహజం.  అలాగని పనిగట్టుకుని సముద్రం అలలను సృష్టించటం లేదు, మళ్ళించటమూ‌ లేదు. కేవలం దాని సహజ క్రియ అంతే. నారదా, అందుచేత సృష్టికి సంబంధించి కార్యకారణవ్యవహారం అంతా భగవంతుడే.

నారదా, ఇదంతా పరమసత్యం.  నిత్యం కుతూహలంగా హరిగుణాల్నే ధ్యానిస్తూ ఉండే నేను పలికేది సత్యమే కాని, నా వల్ల అసత్యం ఎలా కలుగుతుంది?  ఇలా నేను చెప్పుతున్నదాని సత్యాన్ని తెలుసుకుని జ్ఞానులు  సంతోషించి పొగడుతారు.  నా సర్వేంద్రియాల చాలనమూ శ్రీహరి కృపగా భావించే నా వలన నా హావభావాలు కాని వాక్కులు కాని పొరబడి అసత్యం ప్రకటించే అవకాశమే లేదు.  అందువలనే నా శరీరం జ్ఞాననికి ఆకరమైన వేదమై, ఇంద్రాది దేవతలచేత కూడా నిత్యం పూజించ బడుతున్నది. అవును, నిజానికి ఈ దేహం హరిసముధ్బవమే కాని అన్యం కాదు కదా!  ఆ దేవదేవుడి పాదపద్మాలు సంసారమహాసాగరాన్ని దాటిస్తాయి.  అవే సమస్త సంపదలకీ శుభాలకీ మూలం.  అటువంటి ఆ దివ్యపాదాలకి నా నమస్కారం సమర్పిస్తున్నాను. 

ఉ.  ఆ నళినాక్షునందనుఁడ నయ్యుఁ బ్రజాపతి నయ్యు యోగ వి
ద్యా నిపుణుండ నయ్యును బదంపడి మజ్జనన ప్రకార మే
యేను నెఱుం నవ్విభుని యిధ్దమహత్త్వ మెఱుంగ నేర్తునే
కానఁబడున్ రమేశపరికల్పితవిశ్వము గొంతగొంతయున్


నేను విష్ణుదేవుని కుమారుడిని.  సృష్టికర్తని.  యోగవిద్యానిపుణుణ్ణి.  ఇదంతా సత్యమే.  ఐనప్పటికీ, నా జన్మరహస్యం నాకే తెలియదు!  అటువంటిది, నాకు  ఆ విష్ణుదేవుడి మహాత్మ్యం తెలియటం సాధ్యమా?  ఆ భగవంతుడు నిర్మించిన విశ్వం గురించి నాకు కొంచెం కొంచెంగా మాత్రం తెలుసును.  అంతే!

ఓ మహర్షీ. ఎందుకయ్యా రకరకాల వాదాలు? ఆ భగవంతుడి మాయ యొక్క గొప్పదనం తానే వర్ణించలేడనుకో.  అంత దొడ్డది.  అలాంటి ఆయన మాయగురించి  దేవతలో, నేనో, శివుడో మామా జ్ఞానవిశేషంతో‌ తర్కించి తెలుసుకో గలమా చెప్పు?

అదేమీటి ఆ హరికే తన మాయ గురించి తానే పూర్తిగా తెలియదా , ఆయన సర్వజ్ఞుడు కదా, అనకు.  అనంతమైన ఆకాశాన్ని తన హద్దుల్ని గురించి అడిగితే ఏమి చెబుతుంది?  అలాగ, సర్వాంతర్యామికి తాను ఏమేరకు విస్తరించాడూ విశ్వంలో అన్న ప్రశ్నకూ జవాబు లేదు. ఆ మాత్రాన ఆయన సర్వజ్ఞతకు వచ్చిన లోటు ఏమీ‌ లేదు సుమా?  ఇక్కడ జవాబే లేదు కాబట్టి హరి కూడా ఏమీ సూటి జవాబు చెప్పలేడని భావం లోని చమత్కారం.

4 వ్యాఖ్యలు:

 1. శ్యామలీయం గారు,
  మీ వ్యాఖ్యానం ఈ మధ్యనే చదవటం మొదలు పెట్టానండి. చాలామంచి పని చేస్తున్నారు. మీరు దయ ఉంచి ఈ ప్రచురణ కొనసాగించండీ.

  ఒక్కొక్క స్కందం ఒక pdf file గా మార్చి download చేసేవిదంగా పెడితే మాలాంటి వాళ్ళకు కొంచెం ఉపయుక్తం గా ఉంటుంది. ఈ-పుస్తక పఠనం చెసుకొవటానికి బాగుంటుంది. (మీకు ఇష్టం అయితేనే సుమా)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శ్యామలీయం గారు,
  మీ భాగవత వ్యాఖ్యానం చాల భాగుంది. మా లాంటి పామరులకు చక్కగా అర్థమయ్యేల వుంది. దయచేసి మీ ఈ వ్యాక్యాన ప్రస్థానం కొనసాగించగలరని ఆశిస్తున్నాము. వాసుదేవుని కృప మీపై ఎప్పుడు వుంటుంది.

  కృతజ్ఞతలు
  చైతన్య

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చక్కని వివరణ ఇస్తున్నారు శ్యామాల్ రావు సర్. ఆ వాసుదేవుని కృప మీకే కాకుండా అందరికి కలిగేలా మీ ఈ సత్కార్యం శ్లాఘనీయం.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. శ్యామలీయం గారు...

  ఈ రోజే నేను మీ బ్లాగు చూడటం జరిగింది. పొద్దుటే మంచి విషయం చదివిన ఆనందం కలిగించారు. మాలాంటి వారు అర్ధం చేసుకునే విధంగా చాలా సరళమైన భాషలో ఆ దేవదేవుడిని వర్ణించారు. ధన్యవాదాలండి.


  ప్రత్యుత్తరంతొలగించు