11, సెప్టెంబర్ 2013, బుధవారం

ద్వితీయస్కంధం: 14. సృష్టి రహస్యాన్ని గురించి బ్రహ్మను నారదుడు ప్రశ్నించుట.

ఈ విధంగా భగవంతుణ్ణీ గురువునీ ప్రార్థించి  పరీక్షిన్మహారాజుతో శుకయోగి ఇలా అన్నాడు.  మహారాజా, నువ్వు ఇప్పుడు నన్ను అడిగిన ప్రశ్ననే పూర్వం  నారదమహర్షి బ్రహ్మగారిని అడిగాడు.  తనకు బ్రహ్మగారు చెప్పిన సమాధానాన్ని దయతో నారదమహర్షి నాకు చెప్పటం జరిగింది.  అది వివరంగా నీకు చెబుతాను విను.

మ. చతురాస్యుండవు వేల్పుఁ  బెద్దవు జగత్సర్గాను సంధాయి వీ
శ్రుతి సంఘాతము నీ ముఖాంబుజములన్ శోభిల్లు శబ్దార్థ సం
యుతమై సర్వము నీ కరామలకమై యుండుం గదా భారతీ
సతి యిల్లాలఁట నీకు నో జనక నా సందేహముం బాపవే


నారదుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, అయ్యా నీవు చతురాస్యుడివి. ఈ లోకాల సృష్టిని సంధానించే వాడివి.  నీ ముఖములనుండే వేదసంహిత అంతా, శబ్దాలూ అర్థాలతో సహా అద్భుతంగా  ఉద్భవించింది. లోకంలో ఉండే సమస్త విజ్ఞానమూ నీకు అరచేతిలో ఉసిరిపండు లాగా విస్పష్టంగా ఉంటుంది ఎప్పుడూ.  వాక్కుకు అధిదైవతమైన సరస్వతీదేవియే నీకు భార్యగా ఉంది. అలాంటి, ఓ‌మహానుభావా నా సందేహాన్ని తీర్చవలసింది అని అడిగా.

ఇక్కడ నారదుడు బ్రహ్మగారిని చతురాస్యుడు అనటంలో ఒక విశేషం ఉంది. చతురాస్యుడు అంటే నాలుగు ముఖాలు గలవాడు అని అర్థం.  అలాగే చతురాస్యుడు అన్న చోట చతుర అన్న పదానికి నాలుగు అనే కాక చతురత కల అన్న అర్థం చెప్పుకుంటే చతురత కల ముఖాలు కలవాడు - కొంచెం వివరిస్తే, చతురత కల వాక్కు ఉన్నవాడు అని అర్థం తీయవచ్చును. వాక్కు యొక్క నాలుగు అవస్థలు ఐన పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అనే నాలుగూ బ్రహ్మగారి నాలుగు ముఖాలని చెబుతారు.

అలాగే ఈ‌పద్యంలో కరామలకం (అరచేతిలో ఉసిరి పండు అనే సామెత) చెప్పబడింది. అమలకం అంటె ఉసిరికి ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత ఉంది. చ్యవనప్రాస అనేది అశ్వినీ దేవతలు చ్యవనమహర్షికి యౌవనం ప్రసాదించటం కోసం చేసి ఇచ్చిన ఔషధం. దీన్ని ఉసిరితో‌తయారు చేస్తారు.

శా. ప్రారంభాది వివేక మెవ్వఁ డొసగుం బ్రారంభసంపత్తి కా
ధారం బెయ్యది యేమి హేతువు యదర్థం బే స్వతూపంబు సం
సారానుక్రమ మూర్ణనాభి పగిదిన్ సాగించె దొక్కక్కప్పుడుం
భారం బెన్నడు లేదు నీ మనువు దుష్ప్రాపంబు వాణీశ్వరా


ఓ సరస్వతీపతీ ఈ‌సృష్టిని చేయాలనే సంకల్పం  నీకు ఎవ్వరు కలిగించారు?  అలా సృష్టి చేయటానికి ఎటువంటివి నీకు అధారం అయ్యాయి?  ఈ సృష్టిని ఎందుకు నిర్మించాలని అనుకున్నావు?  ఈ సృష్టికి ప్రయోజనం ఏమిటి?  నీవు చేసిన ఈ సృష్టి యొక్క స్వరూపం ఎటువంటిది?  సాలెపురుగు గూడు కట్టినట్లుగా ఈ‌ సృష్టిని చేసుకుంటు పోతున్నావే?  ఐనా, ఏ విధమైన శ్రమా విసుగూ నీకు కలుగుతున్నట్లు తోచదు.  నీ జీవనం నిజంగా ఒక విచిత్రం, ఒక అద్భుతం.  ఇలాంటిది మరెవ్వరికీ సాధ్యం కాదు.

ఒక పని చేయాలంటే మొదట అలా చేయాలనే సంకల్పం కలగాలి.  అలా సంకల్పం కలగాలన్నా, దానికి ఏదో ఒక హేతువు ఉండాలి కదా? ఎవరికైనా, ఒక ఇల్లు కట్టుకోవాలనే సంకల్పం కలిగిందీ అంటే దానికి కారణం, తనకు ఒక శాశ్వతమైన నివాసగృహం అవసరం అన్న హేతువు ముందు కనిపించటం వంటిది అన్నమాట.  మనస్సు సంకల్పవికల్పాలు నిత్యం చేస్తూనే ఉంటుంది.  ఒక సంకల్పం ఎంత  సహేతుకమైనదైనా అది సుధృడం అయినప్పుడు కాని కార్యరూపం దాల్చదు. తగిన పరిస్థితులు కనిపించినప్పుడు మాత్రమే అణగి ఉన్న దైనా, కొత్తదైనా ఒక ధృఢమైన సంకల్పం  బయటకు వస్తుంది. నీవు ఇల్లు కట్టగలవు ముందుకు సాగు అని ప్రోద్బలం చేసే చోదక శక్తీ అవసరం. ఒక్కొక్కసారి ఆ చోదకశక్తియే మొదట సంకల్పాన్ని వెలికితీస్తుంది. ఇల్లు కట్టాలంటే మాట అనుకోగానే సరి కాదు కదా? బోలెడు వస్తువుల అవసరం ఉంటుంది. అలాగే ఇల్లు ఇలా ఉండాలీ అనే ఒక ప్రణాళిక కూడా ఏర్పరచుకొన వలసి ఉంటుంది.

ఇక్కడ బ్రహ్మగారు కనిపించే సృష్టికి మెదటి వాడు. అందుచేత ఆయనకు సృష్టి చేయాలనే సంకల్పాన్ని ఎవరు కలిగించారా అని నారదుడి కుతూహలం. అలాగే ఈ సృష్టికి పూర్వం ఎటువంటి వస్తుసంచయం కూడా లేదు కదా మరి సృష్టికి ఏమి అవసరం అయ్యాయీ, అవి బ్రహ్మకు ఎలా లభించాయీ అని మరొక సందేహం. సృష్టికి ప్రయోజనం ఏమిటీ అన్న  ప్రశ్న ఒకటి.  ఇల్లు కావాలీ అన్నప్పుడు దాని ప్రయోజనం స్పష్టం.  మరి సృష్టికి ప్రయోజనం ఏది?  అలాగే, ఈ సృష్టికి నిర్దేశించిన స్వరూప స్వభావాలు ఏమిటీ అన్నది మరొక ప్రశ్న.

సాలెపురుగుకి గూడు కట్టటం దాని జన్మ లక్షణం. అది దాని ఉనికికి అవసరం మరి. అందుచేత అది విసుగూ విరామం లేకుండా గూళ్ళు కడుతూనే ఉంటుంది. మరి బ్రహ్మగారూ విసుగూ విరామం లేకుండా ఈ సృష్టిని చేస్తున్నారు. బ్రహ్మగారికి సృష్టి చేస్తూ పోవలసిన అవసరం ఏమీటీ అన్నది  ప్రశ్న.  నిష్కారణంగా విసుగు లేకుండా శ్రమ అనుకోకుండా ఈ సృష్టిని  బ్రహ్మ ఎందుకు చేస్తున్నట్లు?

నారదుడు ఇంకా ఇలా అన్నాడు. నాకు తెలిసి నువ్వే ఈ సృష్టికి అధిపతిగా ప్రకాశిస్తున్నావు.  అది సత్యం కాని పక్షంలో నీ కంటే అధికుడు మరొకరు ఎవరున్నారు?  ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ సృష్టిని చేస్తున్నావు? ఈ జీవుల సమూహాలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? ఇవన్నీ దేనిలో లీనమై పోతున్నాయి?

ప్రస్తుతం కనిపిస్తున్నదీ, ఇంతకు ముందు కనిపించి ఇప్పుడు లయం ఐనదీ అయిన నామరూపాత్మకమైన సమస్త సృష్టీ నీ హృదయం నుండి వచ్చినదే కదా?  అందుచేత దీనికి నువ్వే కర్తవూ అధికారివీ అవుతున్నావు.  నువ్వు  అత్యున్నతమైన స్థితిలో ఉన్నావు.  అందుచేత నీ కన్నా గొప్పవాడు ఎలా ఉంటాడు?  అటువంటి నువ్వు ఏ ప్రభువు గురించి తపస్సు చేసావు? నాకు కూడా ఆయనను తెలుసుకునే‌ మార్గం  ఉపదేశించవా?

శా. అంభోజాసన నీకు నీశుఁడు గలం డం టేనిఁ దత్పక్షమం
దంభోజాతభవాండ మే విభుని లీలాపాంగ సంయుక్తిచే
సంభూతం బగు వర్తమాన మగు సంఛన్నం బగు దద్విభున్
సంభాషింపగ వచ్చునేఁ దలపఁ నే చందంబు వా డాకృతిన్


ఓ పద్మాసనా, బ్రహ్మదేవా! నీ కంటే గొప్పవాడు ఉన్నట్లైతే, ఆ మహానుభావుని కడగంటి చూపునుండి ఈ‌ బ్రహ్మాండం పుట్టి ఉండాలి. ఆయన కరుణచేతనే ఇది నడుస్తూ ఉండాలి. అలాగే ఆయన కటాక్షంలోనే ఈ‌బ్రహ్మాండం లీనం అవుతూ కూడా ఉండాలి. అయనను గురించి చెప్పగలవా? ఆయనను ఎలా స్మరించగలం? ఆయన ఎలా ఉంటాడు?

బ్రహ్మకు సృష్టి చేయటం అనేది కనుక ఆయనకు కర్తవ్యం ఐన పక్షంలో, బ్రహ్మకు ఆ కర్తవ్యాన్ని నిర్దేశించిన ప్రభువు వేరే ఉండాలి కదా? ఆయన అనుగ్రహం బ్రహ్మకు చేరి సృష్టికి సంకల్పం జరిగినప్పుడు బ్రహ్మకు ఆయన గురించిన జ్ఞానం ఉంటుంది కదా? అందుచేత, ఆ జ్ఞానం బ్రహ్మ నుండి నారదుడు గ్రహించాలని భావిస్తున్నాడన్న మాట.

ఓ బ్రహ్మదేవా, ఈ విషయం నాకు తెలియ జేయ వలసింది. దానిని నేను సంతోషంగా నా తోడి వారికి తెలియ జేస్తాను.  అప్పుదు వాళ్ళు కూడా ఈ సంసారప్రవాహంలో పడి కొట్టుకొని పోకుండా, ఆ పరమపురుషుడి జ్ఞానం పొంది తరిస్తారు.

నీకు  భూతమూ, వర్తమానమూ, భవిష్యత్తూ సర్వం చక్కగా తెలుసు.  వాటి అన్నింటికీ నీవు అధిపతివి.  నీకు తెలియంది ఏమీ ఉండే అవకాశమే లేదు. ఈ‌ విశ్వం యొక్క విధానం అంతా దయచేసి ఉపదేశించ వలసింది.

ఇలా నారదుడు అడిగితే బ్రహ్మగారి ముఖం ఆనందంతో వికసించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి