9, సెప్టెంబర్ 2013, సోమవారం

ద్వితీయస్కంధం: 12. భగవంతుడి సృష్టి గురించి పరీక్షిత్తు ప్రశ్నలు.

పరీక్షిన్మహారాజుకు ఇలా శుకయోగి వివరించాడని సూతపౌరాణికుడు అక్కడ ఉన్న శౌనకమహర్షికీ తదితర ఋషులకీ చెప్పాడు. అప్పుడు శౌనకుడు సంతోషించి, బాగుందయ్యా! ఈ‌ మాటలన్నీ మోక్షార్థియైన భరతవంశశ్రేష్ఠుడు పరీక్షిత్తు ఎంతో‌ శ్రధ్ధగా ఆలకించి ఉంటాడనటంలో సందేహం లేదు. అప్పుడు ఆ విస్ణుభక్తుడైన రాజు శుకుణ్ణి ఇంకా ఏమేమి అడిగాడో చెప్పు.

క. ఒప్పెడి హరికథ లెయ్యవి
సెప్పెడినో‌ యనుచు మాకుఁ జిత్కోత్కంఠల్
గుప్పలు గొనుచున్నవి రుచు
లుప్పతిలల్ నీ‌ మనోహరోక్తులు వినగన్

ఇంకా ఏమేమి హరికథలు శుకుడు చెప్పాడో అని మాకు చాలా ఉత్కంఠగా ఉంది. నీ‌ సొంపైన వివరణంతో మాకు హరికథల మీద మనస్సులో ఆసక్తి మరింత పెరిగిపోతోంది.

అంటే, సూతుడు, అవునయ్యా, ఈ‌ పరీక్షిత్తుకి పుట్టు వెంట్రుకలు ముఖంమీద పడుతున్న వయస్సులోనే, తోటి చిన్న పిల్లలతో ఆటపాటలలో ములిగి ఉండే వయస్సులోనే, విష్ణుభక్తి అబ్బింది అన్నాడు.

ఈ పరీక్షిత్తు తల్లి కడుపులో ఉన్న రోజుల నుండే తన తల్లి నోట విష్ణు సంకీర్తనం వింటూ ఉండేవాడు. అది అతడికి పుట్టినప్పటి నుండే విష్ణుభక్తి కలగటానికి కారణంగా పరిణమించింది. 

ఇంకా శుకయోగి ఇలా అన్నాడు. ఏ పుణ్యాత్ముడు విష్ణుకథలు వింటూ విష్ణునామ సంకీర్తనం చేస్తూ ఉంటాడో వాడు ధన్యుడు.  ఎందుకంటే, మిగిలిన వాళ్ళ అయుర్దాయాల్ని  కాలం సూర్యోదయం సూర్యాస్తమయం అన్న మిషమీద అపహరిస్తూ ఉంటుంది.  సాధారణ సంసారి ఇది గ్రహించుకో లేక తన జీవితం ఏదో బహుదీర్ఘం అన్నట్లుగా భ్రమపడి జీవితం అంతా పనికిమాలిన పనులతో కాలక్షేపం చేస్తుంటాడు. డబ్బూదస్కం, పెళ్ళాం‌బిడ్డలూ, ఇళ్ళూతోటలూ‌ అంటూ దేవుళ్ళాడుతూ పేరాశలతో జీవించి చస్తాడు. అప్పుడు యమభటులు వచ్చి చావగొట్టి ఈడ్చుకు పోతుంటే, అప్పుడు కాస్త జ్ఞానం తెచ్చుకుంటాడు. అయ్యో పాపాలు చేస్తూ గడిపేసానూ,కొంచెం‌ పుణ్యం సంపాదించుకో లేకపోయానే అని విలపిస్తాడు.

అదీకాక,

సీ. అలరు జొంపములతో నభ్రంకషంబుల్ లై  
      బ్రతుకవే వనములఁ బాదపములు
ఖాదన మేహనాకాంక్షలఁ బశువులు
      జీవింపవే గ్రామసీమలందు
నియతిమై నుఛ్ఛ్వాస నిశ్శ్వాస పవనముల్
      ప్రాపింపవే చర్మభస్త్రికలులు
గ్రామసూకర శునకశ్రేణు లింటింటఁ
      దిరుగవే దుర్యోగ దీబవృత్తి
తే. నుష్ట్ర ఖరములు మోయవే యురుభరములఁ
బుండరీకాక్షు నెఱుఁగని  పురుషపశువు
లడవులందు నివాసములందుఁ బ్రాణ
విషయభరయుక్తితో నుంట విఫలమధిప

కొమ్మలూ, రెమ్మలూ, ఆకులూ, పువ్వులూ కలిగి అడవుల్లో చెట్లు బ్రతకటం లేదా?  నిత్యమూ తినటమూ, సంతానాన్ని కనటమూ తప్ప పని లేకుండా ఊళ్ళల్లో పశువులు జీవించటం లేదా?  కమ్మరి వాళ్ళ కొలిమితిత్తులూ చక్కగా లయప్రకారం గాలి పీలుస్తూ వదులుతూ కనిపించటం లేదా మనకి?  ఊరకుక్కలూ పందులూ కూడా నిత్యం దీనంగా ఇల్లిల్లూ తిరుగటం లేదా? ఒంటెలూ, గాడిదలూ ఎంతలేసి బరువులు మోసుకుంటూ తిరగటం లేదు?

భగవంతుణ్ణి ఎరగని వాడు పురుషరూపంలో ఉన్న పశువు. అంతే.  అలాంటి వాడు అడవుల్లో ఉన్నా ఊళ్ళల్లో ఉన్నా, ఇంద్రియసుఖాల కోసం‌ ప్రాకులాడుతూ తిరుగుతూ జీవితం వ్యర్థం చేసుకుంటున్నాడు.

అంటే, పుట్టటమూ, పెరగటమూ, సంతానం కనటమూ, ఆహారం కోసం పాకులాడ్డమూ వంటివి చేయటం అన్ని జంతువులకీ‌ సామాన్యమే. ఊపిరాడుతూ ఉన్నంత మాత్రాన చైతన్యం ఉందని అర్థం కాదు. జంతూనాం నరజన్మ దుర్లభం అన్నారు.  అలాంటి నరుడి పుట్టుక పుట్టి తాను ఇతర జంతువులకన్నా ఏ విధంగా మిన్నగా బ్రతుకుతున్నాడూ అన్నది ముఖ్యం. విషయసుఖాలు జంతుధర్మం. మరి మనిషై పుట్టాక, చేయవలసింది ఏమిటీ? అయ్యా, ఈ‌ నరజన్మంలోనే మోక్షం గురించి ఆలోచించుకునే‌ అవకాశం భగవంతుడి దయవల్ల కలుగుతోంది.  దాన్ని సద్వినియోగం చేసుకోవటం అన్నదే ఈ జన్మకు ప్రయోజనం.  అందుచేత, భగవంతుడి గురించి ఎఱుక సంపాదించు కోవాలి. అది లేకపోతే వట్టి పురుషపశువు గానే మిగిలిపోతున్నాడు.

సీ. విష్ణుకీర్తనముల వినని కర్ణంబులు
      కొండల బిలములు కువలయేశ
చక్రి పద్యంబులఁ జదువని జిహ్వలు
      గప్పల జిహ్వలు గౌరవేంద్ర
శ్రీమనోనాథు నీక్షింపని కన్నులు
      కేకిపించాక్షులు కిర్తిదయిత
కమలాక్షుపూజకుఁ గాని హస్తంబులు
      శవము హస్తంబులు సత్యవచన
ఆ. హరిపద తులసీద ళామోదరతి లేని
ముక్కు పందిముక్కు మునిచరిత్ర
గరుడగమను భజనగతి లేని పదములు
పాదపముల పాదపటల మధిప

విష్ణుకీర్తనం వినని చెవులన్నీ గొండ గుహల వంటివి.
విష్ణుకీర్తనం చదవని నాలుకలు వట్టి బెకబెకలాడే కప్పల నాలుకలు.
విష్ణుదర్శనం చేయని కళ్ళు నెమలి ఈకలలోని కళ్ళు.
విష్ణుపూజకు కలసిరాని చేతులు శవం చేతుల్లాగా నిష్ప్రయోజనం.
విష్ణుపాదాల మీద ఉండే తులసి పరిమళం తెలియని ముక్కు కేవలం పందిముక్కు.
విష్ణుసంకీర్తనం జరిగుతున్న చోట్లకు పోని కాళ్ళు చెట్ల మొదళ్ళ వంటివి.
ఓ మహారాజా, భగవంతుడైన విష్ణువు కోసం కాక అన్యప్రయోజనాలకి వెంపర్లాడే ఈ‌ శరీరమూ, దాని ఇంద్రియాలూ ఉండి ఏమి లాభం?

అంటే నరజన్మలో ఈ‌ శరీరానికీ, దాని ఇంద్రియాలకీ సార్థకత కలిగేది మోక్షం కోసం హరిని ఆశ్రయించి పని చేసినప్పుడే.  కాని పక్షంలో వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు.

సీ. నారాయణుని దివ్య నామాక్షరములపైఁ
      గరఁగని మనములు కఠినశిలలు
మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ
      మిళితమై యుండని మేను మొద్దు
చక్రికి మ్రొక్కని జడుని యౌదల నున్న
      కనక కిరీటంబు కట్టె మోపు
మాధవార్పితముగా మనని మానవు సిరి
      వనదుర్గ చంద్రికా వైభవంబు
ఆ. కైటభారిభజన గలిగి యుండని వాడు
గాలి లోన నుండి కదలు శవము
కమలనాభు పదముఁ గననివానిఁ బ్రతుకు
పసిఁడి కాయలోని ప్రాణిబ్రతుకు

నారాయణుడి దివ్యనామాలు వింటూ కూడా కరగని మనస్సులు బండరాళ్ళు.
నారాయణుడి కథలు వింటూ గగుర్పాటు చెందని, కళ్లవెంట ఆనందాశ్రువులు రాని మనస్సు ఒక పెద్ద మొద్దు.
నారాయణుడికి మొక్కని వాడి నెత్తిన ఉన్న కిరీటం ఒక కట్టెల మోపు.
నారాయణుడికి అర్పించని సిరిసంపదలన్నీ అడివిని కాచిన వెన్నెలలు.
నారాయణుడి సంకీర్తనం ఎరగని వాడు నడిచే శవం.
నారాయణుడి పాదదర్శనం లేని బ్రతుకు ఉమ్మెత్తకాయలో పురుగు బ్రతుకు.

బ్రతికి ఉన్నందుకు ఫలం, దాన్ని సద్వినియోగం చేసుకోవటంలో ఉంది. నారాయణప్రాప్తి మీద ఇఛ్ఛలేని వాళ్ళు కాయల్లో పురుగుల్లా బతికి ఏం లాభం? నారాయణుడి కోసం స్పందన లేని జీవితాలు చైతన్యం లేని వస్తువుల్లాంటివి. వాళ్ళకు సంచితంగా అబ్బిన సంపదలన్నీ‌ కూడా వాళ్ళు తినితాగి వ్యర్థం చేసుకుంటున్నారు కాని నారాయణాంకితం చేసి ఉంటే అవి మోక్షసాధనకు పనికి వచ్చేవి.

ఈ విధంగా యోగిరాజు ఐన శుకుడు నిష్కర్షగా సెలవియ్యగానే, మహారాజు పరీక్షిత్తు హృదయంలో అత్యంత నిర్మలమైన స్థితి కలిగింది.  హరిసాన్నిధ్యాన్ని పొందాలనే ఆశ మరిన్ని కొత్త చిగుళ్ళు వేసింది. ఇంకా మనస్సులో ఏమూలనో దాగిఉన్న తానూ, తనవాళ్ళూ అన్న అహంకార మమకారాలు సమూలంగా తుడిచిపెట్టుకుని పోయాయి. జీవితం అంటే అందరికీ ఉండే ఆశా, మృత్యువు అంటే ప్రాణిసహజంగా జన్మసిధ్ధంగా ఉండే భయమూ వదిలి పోయాయి. చిత్తం సంపూర్ణంగా విష్ణువు వైపుకు తిరిగి స్థిరంగా నిల్చింది. ఇంకా ఏమాత్రం ఆయుశ్శేషం ఉందో అది విష్ణులీలలు వింటూ, వాటిని మననం చేసుకుంటూ గడపాలని నిశ్చయించుకున్నాడు.  తరువాత శుకయోగిని ఇలా అడిగాడు.

క. సర్వాత్ము వాసుదేవుని
సర్వజ్ఞుడ వైన నీవు సంస్తుతి సేయన్
సర్వభ్రాంతులు వదలె మ
హోర్వీసురవర్య మానసోత్సవ మగుచున్

వాసుదేవుడు సర్వజగత్తుకీ ఆత్మ. ఆయన విభూతి వైభవాన్ని నువ్వు స్తుతించి చెప్పగానే నాకు ఈ ప్రపంచం మీద ఉన్న సర్వభ్రాంతులూ వదిలిపోయాయి.  ఓ బ్రాహ్మణోత్తమా, ఇప్పుడు నా మనస్సుకు ఎంతో ఉత్సాహం కలిగింది.

సీ. ఈశుండు విష్ణుఁ డీ విశ్వ మే రీతిఁ
      బుట్టించు రక్షించు బొలియఁ జూచుఁ
బహుశక్తియుతుఁ డగుఁ‌ భగవంతుఁ డవ్యయుఁ
      డాది నే శక్తుల నాశ్రయించి
బ్రహ్మశక్రాది రూపముల వినోదించెఁ 
      గ్రమముననో యేక కాలముననొ
ప్రకృతిగుణంబులఁ బట్టి గ్రహించుట
      నేకత్వమున నుండు నీశ్వరుండు
అ. భిన్నమూర్తి యగుచుఁ‌బెక్కు విధంబుల
నేల యుండు నతని కేమి వచ్చె
నుండ కున్నఁ దాపసోత్తమ తెలుపవే
వేడ్క నాకు సర్వవేది నీవు

ఈ‌ ప్రపంచానికి సర్వాధికారి ఐన విష్ణువు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా సృష్టిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, అలాగే అంతం చేస్తున్నాడు?

భగవంతుడు సర్వశక్తులూ గలవాడూ, తన శక్తికి ఎన్నడూ తరుగుదల లేని వాడూ కదా! ఆయన ఏఏ శక్తులని ప్రయోగించి బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన రూపాల్ని వినోదంగా సృష్టిస్తున్నాడు?

భగవంతుడు ఒక్కసారిగా ఈ‌ సృష్టిని ప్రకటించాడా, లేక క్రమక్రమంగా సృష్టిని చేసాడా?

భగవంతుడు సృష్టి చేసే ఇఛ్ఛతో ప్రక్తృతిని గుణాలని కల్పించి, వాటిని ఉపయోగించి ఇన్ని రకాల రూపాలతో ఎందుకు ప్రకాశిస్తున్నాడు?

ఇలా చేయకపోతే ఆ భగవంతుడికి వచ్చిన లోటేమిటీ?

ఓ శుకయోగీంద్రా, మీకు అన్నీ‌తెలుసును.  దయచేసి చెప్పండి అని పరీక్షిత్తు వేడుకున్నాడు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి