4, సెప్టెంబర్ 2013, బుధవారం

ద్వితీయస్కంధం: 09. సృష్టిక్రమం - 1

ఇప్పుడు శుకయోగి పరీక్షిత్తుకు సృష్టి క్రమాన్ని వివరిస్తున్నారు.

మఱియు నొక్క విశేషంబు గలదు.


ఇక్కడ  '
ఇంకొక విశేషం ఉంది'  అని చెప్పారు గదా? ఆ విశేషం యేమిటో చూద్దాం .  యోగాభ్యాసం చక్కగా చేసి అది ఫలించి సిధ్ధి పొందినవారు బ్రహ్మలోకం చేరుకుంటారు.  అలా బ్రహ్మలోకం చేరిన వారు లోకానుగ్రహం చేయటం కోసం శరీరధారణ చేసి భూమిమీదికి అప్పుడప్పుడు వస్తారు కాని వారికి యేవిధమైన కర్మబంధాలూ ఉండవు. కాబట్టి వారిని ప్రకృతి శరీరధారణకు నిర్బంధించ లేదు.  కానీ  యీ సిధ్ధులకు తమ దైన ఉనికి ఉండనే ఉంటుంది.  కాబట్టి అది కైవల్యపదం కాదు.  అయితే అటు వంటి  కైవల్యం అనబడే పరమాత్మునిలో లీన మయ్యే విశేష మైన వ్యవహారం కూడా ఉంది సుమా కేవలం బ్రహ్మలోకం పొందటమే అత్యున్నత మైన స్థాయి కాదు అని శుక మహర్షుల వారు పరీక్షిత్తుతో అంటున్నారు.


పుణ్యాతిరేకంబున బ్రహ్మలోకగతు లైనవారు కల్పాంతరంబునం బుణ్యతారతమ్యంబుల నధికారవిశేషంబు నొందువార లగుదురు.

బ్రహ్మలోకం చేరుకున్నఈ గొప్ప గొప్ప పుణ్యాత్ములు  అప్పుడు నడుస్తున్న కల్పం పూర్తి కాగానే వారి పుణ్యం యొక్క కొలతను బట్టి తగిన అధికార పదవులు పొందుతారు. 

పుణ్యాతిరేకం అంటే అమిత మైన పుణ్యం అని అర్థం. పుణ్యతారతమ్యం అంటే ఆ అమితమైన పుణ్యంలో కూడ యెంతో కొంత తర-తమ బేధం ఉంటుంది కదా. ఈ తర, తమ అనేవి ఇంగ్లీషులో  more and most  అనే comparisons.  ఈ లోకంలో మనుష్యుల అర్హతలను బట్టి యెలా గైతే అధికారాలను అప్పగిస్తామూ బ్రహ్మలోకంలో అయినా అలాగే జరుగుతుంది.  అందుచేత, బ్రహ్మలోకం చేరుకున్నఈ గొప్ప గొప్ప పుణ్యాత్ములు  అప్పుడు నడుస్తున్న కల్పం పూర్తి కాగానే వారి పుణ్యం యొక్క కొలతను బట్టి తగిన అధికార పదవులు పొందుతారు.  ఇక్కడ కొంతమందికి కల్పం అంటే యెంతకాలం అనే ప్రశ్న రావచ్చును,  కల్పం  అనేది  భారతీయ మైన  కాలమానంలో  ఒక అతిదీర్ఘ మైన సమయం. మనం  ప్రస్తుతం కలి యుగం  నడుస్తోందని చెప్పుకుంటున్నాం  కదా. కృత, త్రేత, ద్వాపర  కలి యుగాలని  యుగాలు నాలుగు. వాటి  కాలప్రమాణాలు చూడండి.

కృతయుగం    17,28,000 సంవత్సరాలు
త్రేతాయుగం    12,96,000 సంవత్సరాలు
ద్వాపరయుగం   8,64,000 సంవత్సరాలు
కలియుగం       4,32,000 సంవత్సరాలు

నాలుగు  యుగాలనూ‌ కలిపి ఒక మహాయుగం‌ అంటారు. మెత్తం 43,20,000 సంవత్సరా లన్నమాట.  మహాయుగాన్ని  దివ్యయగం అని కూడా అంటారు. ఇలాంటి మహాయుగాలు 1000 గడిస్తే  అది బ్రహ్మకు  ఒక పగలు. దానినే సర్గము అనీ‌ కల్పము అనీ‌ అంటారు. మరొక 1000 మహాయుగాలు బ్రహ్మకు రాత్రి సమయం. దానినే  ప్రళయం కాలం అంటారు. ఇలా బ్రహ్మకు  ఒక రోజు పూర్తవుతుంది. ఇలాంటి రోజులు  360 గడిస్తే అది బ్రహ్మకు  ఒక సంవత్సరం. బ్రహ్మగారి ఆయుర్దాయం అటువంటి 100 సంవత్సరాలు.  ప్రస్తుతం ఉన్న బ్రహ్మగారికి 50 యేళ్ళు  దాటాయండి.  ఆయనకు ప్రస్తుతం 51వ సంవత్సరంలో  శ్వేతవరాహకల్పం నడుస్తున్నది. ఇప్పుడు కల్పం‌  అనే దాని యొక్క  ప్రమాణం 432,00,00 ,000 సంవత్సరాలు అని  తెలుస్తున్నది  కదా.
 
ఇది నిస్సందేహంగా చాలా పెద్ద కాలమే.  దీన్ని బట్టి అర్థమయ్యేది యేమిటంటే,  యోగాభ్యాసం చక్కగా చేసి జితేంద్రియు లైన వారు బోలెడన్ని పుణ్య కార్యాలు చేస్తారు.  వాటి సహాయంతో వారికి బ్రహ్మలోకంలో ఉండే అదృష్టం పడుతుంది.  అదీ యెంతో దీర్ఘకాలం పాటు. ప్రస్తుతం నడుస్తున్న కల్పం ఇంకా యెంత కాలం మిగులి ఉందో అన్నాళ్ళూ వాళ్ళు బ్రహ్మగారి లోకంలో సుఖంగా ఉంటారన్న మాట.  ఆ తరువాత వారికి వారి యోగ్యతల ననుసరించి మంచి మంచి పదవులు వస్తాయి.

ఈ విషయాన్ని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు (అక్షరపరబ్రహ్మ యోగంలో)   ఓ అర్జునా బ్రహ్మలోకంతో సహా అన్నిలోకాలూ, యేది పొందినా, అది పునర్జన్మనిచ్చేదే. నన్ను పొందిన వాళ్ళకు మాత్రం  పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పి స్పష్టం చేసాడు.


     ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోऽర్జున
    మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే

కాబట్టి బ్రహ్మలోకం పొందిన మహాయోగులకూ తిరిగి కల్పావసానం కాగానే ఒక జన్మ అనేది కలుగుతుంది.  అయితే వారి పుణ్యఫలానుసారంగా మంచి అధికారయుత మైన జన్మ దొరుకుతుంది.


బ్రహ్మాది దేవతా భజనంబునం జనువారు బ్రహ్మజీవితకాలం బెల్ల బ్రహ్మలోకంబున వసియించి ముక్తు లగుదురు.

బ్రహ్మను తదితర దేవతలను పూజించి శరీరత్యాగం చేసిన వారు బ్రహ్మలోకం చేరుకుంటారు. వారు అక్కడ ఆ బ్రహ్మ ఉన్న న్నాళ్ళు స్థిరంగా నివాసం ఉంటారు. ఆ తరువాత వారికి ముక్తి కలుగుతుంది.

ఈ‌ వాక్యం సాధకులను, కొంత వేదాంత పరిజ్ఞానం కల వాళ్ళను తప్పకుండా తికమక పెడుతుంది. బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని, సూర్యుడు మొదలయిన పూజ్య దేవతలు ముక్తిని ఇచ్చే వారని చెప్పటం శృతిప్రమాణానికి విరుధ్దం. వారికి ఇష్టకామ్యార్థసిధ్ధిని అనుగ్రహించే సామర్ధ్యమే కాని మోక్షం అనుగ్రహించే సామర్థ్యం ఉందని చెప్పటం చెల్లదు. కాని మనం వివరణం చెప్పుకుంటున్న వాక్యం యొక్క అర్థం మరి వారికి అలా మోక్షం ఇచ్చే సామర్థ్యం ఉందని నొక్కి చెప్పుతున్నట్లుగానే ఉంది.

అసలు పై వాక్యంలోనే కావలసినంత గందరగోళం ఉంది. బ్రహ్మాను గాని తదితర దేవతలలో యెవరిని గాని పూజించిన వారంతా బ్రహ్మలోకం చేరుకుంటారూ అని కదా పై వాక్యం చెబుతోంది? కాని అదెలా సంభవం. ఉదాహరణకు ఇంద్రుని పూజించిన వారు చేరుకోవలసిన ఇంద్రలోకం అంటే స్వర్గం కదా? ఈ గీతాశ్లోకం తిలకించండి:

యాన్తి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాన్తి పితృవ్రతాః
భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినోఽపి మామ్

దేవతలను సేవించువారు దేవలోకములను చేరుకుంటారు.  పితృదేవతలను సేవించే వారు ఆ పితృదేవతల లోకాలను చేరుకుంటారు .  భూతప్రేతపిశాచాలను పూజించే వారికి అట్టి రూపమే కలుగుతుంది . (పరమాత్మ నైన)నన్ను సేవించే భక్తులు నన్నే చేరుకుంటున్నారు.

ఇక్కడ శ్రీకృష్ణపరమాత్మ నన్ను సేవించు భక్తులు నన్నే పొందుచున్నారని చెప్పటం  అంటే, వాళ్ళకి తనయందు లీనమై పోయి పునరావృత్తిరహితమైన మోక్షము సిధ్ధింస్తోందని చెప్పారని భావం. ఇతరమైన ఉపాసనలకు దొరుకుచున్న యే స్థాన మైనా మోక్షం కాదు కదా.  అలాంటి అన్య దేవతోపాసకులు ఆయా దేవతల లోకాలు చేరి వారివారి యిష్టదేవతలకు గల ఆయువు పర్యంతం వారితో నివసిస్తారని అర్థం.  ఇక క్షుద్రమైన ఉపాసనలకు ఫలితం దారుణంగా ఉంటుంది. వాళ్ళూ అలాగే భూతప్రేతపిశాచాలలాగా అయిపోతారు. యద్భావం తద్భవతి అన్నమాట.

కేవలం పరబ్రహ్మోపాసన వల్లనే మోక్షం వస్తుంది కాని ఇతరత్రా ఉపాసనల వల్ల రాదు గదా.  కేనోపనిషత్తులో ఉన్న యీ మంత్రం చూడండి

సా బ్రహ్మేతి హోవాచ
బ్రహ్మణో వా ఏతత్ విజయే
మహీయధ్వమితి తతో‌ హైవ
విదాఞ్చాకార బ్రహ్మేతి

దీని అర్థం, అప్పుడు హైమవతి "అదే బ్రహ్మము. ఆ బ్రహ్మము వల్లనే మీకు విజయం కలిగింది" అని ఇంద్రునికి స్పష్టం చేసింది, అప్పుడు ఇంద్రుడు బ్రహ్మమును తెలుసుకున్నాడు అని

దీనిని బట్టి ఇంద్రుడు బ్రహ్మము కాదని హైమవతి దయతో బ్రహ్మము గూర్చి చక్కగా తెలుసుకున్నాడనీ తెలిసింది కదా. దీని వలన ఇంద్రోపాసన కాక పరబ్రహ్మోపాసనమే మోక్షం యిచ్చేది అని తెలుస్తోంది.

అందుచేత మన వివరణం చెప్పుకుంటున్న వాక్యం పోతనగారు పొరబాటున వ్రాసారా అనే సందేహం వస్తుంది!

బహుశః ఈ వాక్యం "బ్రహ్మదేవ భజనంబునం జనువారు బ్రహ్మజీవితకాలం బెల్ల బ్రహ్మలోకంబున వసియించి ముక్తు లగుదురు" అనిఉండాలేమో?  ప్రస్తుతం‌ కనిపిస్తున్న పాఠం పూర్వమే దొర్లిన లేఖక ప్రమాదమో లేక ఇటీవలి కాలం వారి ముద్రణా ప్రమాదమో కావచ్చునని ఒక అభిప్రాయం స్థిరపదుతోంది.

ఇంతకు ముందు వాక్యం లోనే బ్రహ్మను ఉపాసించే వాళ్ళకి లభించే ప్రయోజనం తెలుసుకున్నాం.  అది మోక్షం కాదు గదా.  దీనిని బట్టి సాక్షాత్తూ బ్రహ్మ అయినా ఇంద్రాది దేవతలు అయినా ముక్తిని ఇచ్చే వాళ్ళు కాదని తెలిసింది కాదా. అలాంటప్పుడు 'ముక్తు లగుదురు' అన్న ప్రయోగం కూడా పొసగట్లేదు కదా? ఏ విధంగా అన్వయించటం?

ఇక్కడ 'ముక్తు లగుదురు' అన్నది ఆయా లోకాలనుండి, ఆయా దేవతల సమక్షం నుండి విడిపోతారు అని అర్థం చెప్పుకోవాలి. అలా అయితే అంతా సరిగా ఉంటుంది. బ్రహ్మాది దేవత లంతా సృష్టిలోని వారే. కాబట్టి వారికి లయం అయిపోవటం తప్పదు.  అయితే అమిత దీర్ఘాయుర్థాయాలు. అంతే. ఆశ్రయించుకొన్న దేవతే లయం అయిపోయి నప్పుడు, ఆశ్రితులైన ఉపాసకు లంతా కూడా లయం అయిపోతారు. పునఃసృష్టిలో ఉచ్చితమైన అధికారాలూ అవకాశాలూ గల జన్మలు పొందుతారు. అయినా బ్రహ్మాది దేవతలు అని చెప్పటం పాఠదోషమే అనుకోవాలి.  ఎందుకంటే, బ్రహ్మ కంటే యితర దేవత ఆయుఃప్రమాణాలు తక్కువ. పైగా ఇతర దేవతల ప్రసక్తి తెచ్చి అంతా కట్టగట్టుకుని బ్రహ్మలోకాన్నే చేరుస్తారని చెప్పరాదు కూడా.

అలా అన్వయం కుదిరినాక ఈ వాక్యం కేవలం పూర్వవాక్యానికి కొనసాగింపు అనీ‌ విరోధం యేమీ లేదనీ బోధపడుతున్నది.


నారాయణచరణకమలభక్తిపరాయణత్వంబునం జనినవారు నిజేఛ్ఛావశంబున నిరర్గళగమనులై బ్రహ్మాండంబు భేదించి మహోన్నతవైష్ణవపదారూఢులై తేజరిల్లుదురు. 

విష్ణువును భక్తితో ఆరాధించిన వాళ్ళు బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టుకుని వెళ్ళి మహోన్నతం ఐన విష్ణుపదం సంపాదించి వెలుగొందుతారు.

బ్రహ్మను సేవించి పొందేది ఆకల్పాంతం బ్రహ్మలోక నివాసం అని తెలుసుకున్నాం కదా.  ఇప్పుడు ఈ వాక్యంలో నారాయణ భక్తునికి లభించేది యేమిటో చెప్పుతున్నారు.

శ్రీమన్నారాయణుని సేవించేవారికి బ్రహ్మను సేవించే వారికన్న ఉన్నతమైన స్థితి కలుగుతుంది నిస్సందేహంగా.  అటువంటి విష్ణుభక్తులు బ్రహ్మాండాన్ని అక్షరాలా బ్రద్దలు కొట్టుకుని ఆవలకు వెళ్ళగలుగుతారు!  ఎందుకు అలా వెళ్ళటం? బ్రహ్మాండమంటే సృష్టి.  సమస్తమూ యీ సృష్టి లోనికే వస్తుంది.   సమస్త  చరాచరాలలూ అందులోనివే.  సురగరుడోరగయక్షకిన్నరనరాది సమస్తజీవులూ సృష్టిలోని వారే.   ఇంద్రాది  దేవముఖ్యులేమి, చివరకు బ్రహ్మకూడా.  అయితే విష్ణువు సృష్టికే అధినాధుడు, దానికి ఆవలి వాడు.

సాధారణ సృష్టి చేసేవాడు బ్రహ్మ అయినా, అసలు బ్రహ్మాండాన్నే సృజించేవాడు విష్ణువు.   విష్ణువు బ్రహ్మకే తండ్రి అని తెలుసు కదా! ఈ గీతా శ్లోకం (విభూతియోగం లోనిది) చిత్తగించండి.

న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః

ఈ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ స్పష్టంగా  అందరికంటే, దేవతలు మునులూ  అందరి కంటే కూడా తానే ప్రధముడనని తన పుట్టువు వీరెవరికీ తెలియదనీ చెబుతున్నారు. అలాగే


  సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్ 

  కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్

కల్పం అంతమైనప్పుడు సమస్త భూతములూ  నా యొక్క ప్రకృతిలో లీనమై పోతున్నాయి. తిరిగి వాటిని  మరల కల్పం ప్రారంభంలో నేను సృష్టిస్తున్నాని అని శ్రీకృష్ణపరమాత్మ ఇక్కడ చెప్తున్నారు.

ఈ ప్రమాణాలు చాలు. శ్రీవిష్ణుదేవుడే సమస్తమైన సృష్టికీ మూలాధారం అని తెలుసుకోవటానికి. ఆయన ఈ సృష్టికి ఆవలి వాడే కాని మనలాగా బ్రహ్మాదులలాగా సృష్టిలోని వాడు కాదు.

విష్ణుపదం అంటే విష్ణులోకం (వైకుంఠం) సృష్టికి వెలుపలిది. బ్రహ్మాండంలో చిక్కుకున్న వారికి అందనిది.  విష్ణుభక్తులు బ్రహ్మాండాన్ని పగుల కొట్టుకొని ఆ వైకుంఠాన్ని చేరుకుంటారు.    అంతే కాదు వారికి అలా వైకుంఠాన్ని చేరుకుందుకు  ఏ విధమైన అర్గళమూ (అడ్డంకి) ఉండదు.  విష్ణు భక్తులకు ఏ విషయంలోనూ అడ్డంకీ, మరొకరి  అనుమతీ అవసరం లేదు ఏ విషయంలోనూ.  అంతా వారి  ఇఛ్ఛప్రకారమే (యిష్టం మేరకే). అందుచేత శ్రీమన్నారాయణుని చరణకమలాలను సంపూర్ణమైన భక్తితో సేవించి శరీరత్యాగం చేసిన వారు సంతోషంగా యిష్టపూర్వకంగా, యే అడ్డంకీ లేకుండా నారాయణుని నిజధామం అయిన వైకుంఠం చేరుకుంటారు.   ఇదే పరమోన్నతమైన ప్రాప్తిస్థానం - దీనికి మించినది యేదీ లేదు.  అటువంటి పుణ్యధామం చేరుకున్న విష్ణుభక్తులు  ఇతరేతరములైన ఉపాసలచేత తక్కువ స్థాయి లోకాలకు చేరుకున్నవారికి,   అలాగే సృష్టి లోని అన్యులందరికీ తేరి చూడరాని తేజస్సును పొందుతారు.

ఇక్కడ బ్రహ్మపదం చేరుకున్న వాళ్ళకూ విష్ణుపదం చేరుకున్నవాళ్ళకూ తారతమ్యం చూడండి.   బ్రహ్మపదం చేరుకున్న వాళ్ళకు బ్రహ్మతోనే అవసానం.  ఆతరువాత మళ్ళీ సృష్టిచక్రంలోనికి రాక తప్పదు.  కాని  విష్ణుపదం చేరుకున్నవాళ్ళది మహోన్నతమైన స్థితి. శ్రీ మహావిష్ణువుకు చ్యుతి లేదు.  ఆయన అచ్యుతుడని కదా  ప్రతీతి.  అందుచేత ఆయనను చేరుకున్న వాళ్ళకూ చ్యుతి లేదు.  వారికి యీ సృష్టిలోనికి వచ్చే పనే లేదు.   అదే పరమపదం. అదే మోక్షం.  అంటే సృష్టి చక్రం నుండి విడుదల పొందటం.  అంతకు మించి యేమీ లేదు -ఉండే అవకాశమే లేదు.

ఈ వాక్యంలో బ్రహ్మాండం అన్న మాట వాడబడింది. విష్ణుభక్తులు బ్రహ్మాండాన్ని పగుల గొట్టుకొని మరీ మోక్షం సాధిస్తారని ప్రతిపాదించ బడింది.  అయితే ఈ బ్రహ్మాండం అనేది యెలా ఏర్పడిందనే విషయాన్ని ముందు రాబోయే వాక్యాల్లో వివరించటం జరుగుతుంది. 

ఈశ్వరాధిష్టితం బైన  ప్రకృతి యంశంబున మహత్తత్త్వం బగు.


ఈశ్వరుడి ఆధీనంలో ఉన్న ప్రకృతి అంశతో మహత్తత్త్వం కలుగుతున్నది.
 
ఈశ్వరుడు అన్నా ఈశుడు అన్నా ప్రభువు అని అర్థం. శ్రీమన్నారాయణుడే ఈశ్వర శబ్దవాచ్యుడు.ఈ ద్వితీయ స్కంధములోనివే అయిన రెండు పద్యాలను చిత్తగించండి.

మ. వినుమీ యీశ్వరు దృష్టిమార్గమున నావేశింప శంకించి సి
గ్గున సంకోచము నొందు మాయ వలనం గుంఠీభవత్ప్రజ్ఞచే
నను లోకేశ్వరు డంచు మ్రొక్కు మతిహీన వ్రాతముం జూచి నే
ననిశంబున్ నగి ధిక్కరింతు హరి మాయాకృత్యమంచున్ సుతా

కం. ఆ యీశు డనంతుడు హరి
నాయకుఁ డీ భువనములకు నాకున్ నీకున్
మాయకు బ్రాణివ్రాతము
కీ‌ యెడలన్ లేద యీశ్వరత్వము సుతా.

బ్రహ్మగారు నారదమహర్షితో  "కుమారా,  ఈ మాయ అనేది ఉంది చూసావూ, ఇది ఈశ్వరుని దృష్టిని ఆకర్షించటానికి యెంతో సిగ్గుపడి బెరుకు తనంతో‌ ఉంటుంది. ఆట్టే ప్రజ్ఞ లేని వాళ్ళు మందమతులై నన్నే అన్ని లోకాలకూ అధిపతిని అనుకొని మొక్కుతూ‌ ఉంటారు. ఆహా, ఇదంతా ఆ శ్రీహరి మాయాప్రాభావం కదా అని నవ్వుకుంటూ ఉంటాను. వాళ్ళ మొక్కులు అంగీకరించను సుమా. ఆ శ్రీహరియే ఈశుడు. తుదీ మొదలూ‌ లేని వాడు.  నీవో నేనో ఆ మాయో మరే దైనా ప్రాణిగానీ దానికి ఈశ్వరత్వం అంటూ ఉండటం అసంభవం." అని అంటున్నారు.

ఈ‌ పద్యాలు ఎందుకు ఉదహరించా నంటే ఈశ్వర, ఈశ శబ్దాలసమత్వాన్నీ, ఆ ఈశ్వరుడు శ్రీమన్నారాయణుడే అన్న భాగవత రహస్యాన్నీ‌ వివరించటానికే.

ఇప్పుడు మనకు ఈశ్వరాధిష్టితమైన ప్రకృతి అన్న వ్యవహారానికి శ్రీహరి అధీనం లోని ప్రకృతికి అన్న అర్థం సిధ్ధిస్తున్నది కదా. గత వాక్యానికి వివరణం చెప్పుకుంటూ మనం ఒక గీతా‌శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాం. అది

 సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్
 కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్

ఈ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ 'నా యొక్క ప్రకృతి'లో అనటం‌ కూడా గమనించాం కదా!

మనకు ప్రకృతికి స్వామి యైన వాడు  శ్రీమన్నారాయణుడు అని స్పష్టం అవుతున్నది.

ఎవరికైనా సందేహం ఉండ వచ్చును, ఇదేమిటీ ఈయన శ్రీకృష్ణునీ, శ్రీమన్నారాయణునీ ఒక్కరే అని వ్యవహరిస్తున్నారూ అని. అవునండి, ఒకరే, శ్రీకృష్ణుడు 'లక్ష్మీపతి రభూత్స్వయం' అని ప్రమాణం.  ఆయన విష్ణువు యొక్క విభూత్యవతారంగానీ,  ఆవేశావతారంగాని, అంశావతారంగానీ కాదు.  ఆయన స్వయంగా విష్ణువు. దీనికి భాగవతమే ప్రమాణం. అందుకే మనం శ్రీకృష్ణ ప్రోక్తమైన గీతోపనిషత్తు నుండి ప్రమాణాలు స్వీకరిస్తున్నాము.

ఈశ్వరుడు అనాది అయినట్లే ఆయన అధీనంలో ఉన్న ప్రకృతి కూడా అనాదియే! అది ఆయన విభూతులలో ఒకటే.  ఈ‌ ప్రకృతి అంశం వలన మహత్తత్తం యేర్పదుతోంది.  ఇదీ ప్రస్తుతం మనం వివరణ చెప్పుకుంటున్న వాక్యానికి విశదీకరణ.

ఇదంతా బాగానే ఉంది కాని, ఇంతకూ ఈ‌ మహత్తత్త్వం అంటె యేమిటీ అని ప్రశ్న.

పరమాత్మ యొక్క విభూతులలో ముఖ్యమైనది ప్రకృతి. ఈ‌ ప్రకృతి అనేది సమస్తమైన నామరూపాత్మక మైన వ్యవహారాలకూ‌ మూలం.అందుకే దానికి వేదాంత పరిభాషలో ప్రధానం అనిపేరు. ఈ ప్రకృతి ద్వారా అభివ్యక్త మైన పరమాత్మ స్వరూపానికే మహత్తత్త్వం అని పేరు. అందుకే శుధ్ధపరబ్రహ్మాన్ని ప్రకృతిలయం చేయకుండా తెలుసు కోవటం సాధ్యం కాదు.

బృహదారణ్యకోపనిషత్తు లోని యీ క్రింద ఉదహరిస్తున్న, గార్గీ యాజ్ఞ్యవల్క్యుల సంవాదం లోని మాటలు చూడండి.

గార్గి: యాజ్ఞ్యవల్యా, ద్యులోకానికి పైనా, భూలోకానికి క్రిందా కూడా వ్యాపించి, యీ రెండులోకాల మధ్యనూ వ్యాపించి యున్నట్టిది, భూతము, వర్తమానము, భవిష్యత్తు లాంటి వ్యవహారాలు కలిగినిది దేనిలో పడుగు -పేక లాగా‌కూర్చబడి యుంది?
యాజ్ఞ్యవల్క్యుడు: ఆకాశంలో
గార్గి: ఈ‌ఆకాశాము ఓతప్రోతమై దేనిలో ఉంది?
యాజ్ఞ్యవల్క్యుడు: ఆకాశం అక్షరము నందు ఆధారపడి యుందని బ్రహ్మవేత్తల నిశ్చయం.
గార్గి:  అక్షరం అంటే ఏమిటి?
యాజ్ఞ్యవల్క్యుడు: ఏదైనా వస్తువును తెలుసుకోవా లంటే విశేషణాలూ నామరూపాలూ కావాలి. అక్షరం‌ అనేదానికి యెటువంటి నామరూపాలూ విశేషణాలూ లేవు. సర్వవిశేషణశూన్య మైనది అక్షరం అని తాత్పర్యం. అంటే అక్షరం అనేది పరబ్రహ్మమే.

అందుచేత మహత్తత్త్వం అంటే పరమాత్మ యొక్క వ్యక్తవిభూతి అని గ్రహించాలి.

మహత్తత్త్వాంశంబున నహంకారం బగు.

 

అహంకారం అనేది సమిష్టి అంతఃకరణం యొక్క బేధము.  ఈ అంహంకారానికి మూలమయిన మహత్తత్త్వాన్ని బుధ్ధి అని కుడా వ్యవహరిస్తారు. బ్రహ్మాండ పిండాండాలకు అబేధము. అంటే విశ్వం అనేది మానవ శరీరంలొ ఆరోపణం చేసి చూసినప్పుడు మహత్తత్తమే బుధ్ధి. ఈ బుధ్ధినుండే 'నేను' అనేది ఒక అభిజ్ఞ యేర్పడుతుంది. అదే అహంకారము. ఇలా పిండాండంలో నిరూపణము.  బ్రహ్మాండ పరంగా, పరమాత్మయొక్క వ్యక్తస్వరూపమైనది మహత్తత్త్వం అయితే దానికి అవ్వలి ముఖం అవ్యక్త పురుషుడు అంటే మూలప్రకృతిగా భాసిస్తున్న పరమాత్మ. నాణానికి ఇవ్వలి ముఖం లాగా ఉండేది నామ రూపాత్మకమైన ప్రకృతి. ఈశ్వరాధిష్టితం బైన  ప్రకృతి అని పూర్వవాక్యంలో చదువుకున్నది మూలప్రకృతి అని గ్రహించండి.  సాంఖ్యకారికలలోని క్రింది శ్లోకాన్ని చూడండి

 మూలప్రకృతిరవికృతిర్మహదాద్యాః ప్రకృతివికృతియః సప్త
 షోడశకస్తు వికారో న ప్రకృతిర్నవికృతిః పురుషః

 

మహత్తత్త్వమూ, అహంకారమూ, పంచతన్మాత్రలూ కలిపి మొత్తం యీ ఏడూ ప్రకృతి, వికృతీ కూడా. ఇవి పంచమహాభూతాలకు (వ్యుత్పత్తి)కారణాలు కావటం చేత ప్రకృతి అనీ, మూలప్రకృతికి (పరిణామ)కార్యాలు కావటం వలని వికృతి అనీ తెలుస్తున్నది.   (అవ్యక్త)పురుషుడు అంటే పరమాత్మ. అతడు దేనికీ చెందిన వాదు కాడు. దేనికీ కారణమూ కాడు కార్యమూ కాడు.

ఈ మూలప్రకృతి మరియు ప్రపంచ కారణ మయిన జడప్రకృతులలో మహత్తత్త్వం నుండి జడప్రకృతి విస్తరించటం మొదలవుతుంది. మొట్టమొదటి విస్తరణతత్వమే అహంకారం అని పిలుస్తారు. అంటే ఇక్కడ నుండి నామరూపాలతో కూడిన వ్యవహారం మొదలు అర్ధం.



అహంకారాంశంబున శబ్దతన్మాత్రం బగు.  శబ్దతన్మాత్రాంశంబున గగనం బగు.
గగనాంశంబున స్పర్శతన్మాత్రం బగు.  స్పర్శతన్మాత్రాంశంబున సమీరణం బగు.
సమీరణాంశంబున రూపతన్మాత్రం బగు.  రూపతన్మాత్రాంశంబు వలన తేజం బగు.
తేజోంశంబున రసతన్మాత్రం బగు.  రసతన్మాత్రాంశంబువలన జలం బగు.
జలాంశంబున గంధతన్మాత్రం బగు.  గంధతన్మాత్రాంశంబున పృధివి యగు.

పంచతన్మాత్రలు ఏర్పడే క్రమాన్నీ, ఆ పంచతన్మాత్రల నుండి పంచభూతాలు ఏర్పడటాన్నీ శుకయోగి విశదీకరిస్తున్నారు.  శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలనే ఐదింటికీ తన్మాత్రలని పేరు. ఇవి ఐదు కాబట్టి పంచతన్మాత్రలని వ్యవహారం.  ఈ పంచతన్మాత్రలే పంచభూతాల యొక్క రూపాలు.  అర్థ విశేషాన్ని నిరూపించే శబ్దరూపమే శబ్దతన్మాత్ర. మృదుత్వం, శీతోష్ణాలను నిశ్చయించే స్పర్శయొక్క రూపమే స్పర్శతన్మాత్ర. వస్తువు యొక్క త్రిపరిమాణాల్నీ, తెలుపూ, ఎరుపూ వగైరా వర్ణాల్నీ తెలియజేసే ధర్మరూపమే రూపతన్మాత్ర.  నాలుకకు వివిధమైన రుచుల్ని తెలియ జేసేది రసతన్మాత్ర.  పరీమళమూ, దుర్వాసన వంటి వస్తు విశేషధర్మాన్ని తెలిపేది గంధ తన్మాత్ర.

 

వీటిలో శబ్ద తన్మాత్ర నుండి ఆకాశం (space), స్పర్శతన్మాత్ర నుండి వాయువూ, రూపతన్మాత్ర నుండి తేజస్సూ, రసతన్మాత్ర నుండి జలమూ,  గంధతన్మాత్ర నుండి భూమీ ఏర్పడుతున్నాయి.

వాని మేళనంబున చతుర్దశభువనాత్మకంబైన  విరాడ్రూపం‌బగు.
 

ఈ పైన చెప్పిన మహత్తూ, అహంకారం అనే తత్త్వాలూ, పంచతన్మాత్రలూ, పంచభూతాలూ కలిపి మొత్తం పన్నెండు.  వీటికి ఈశ్వరుడి విభూతి ఐన ప్రకృతితో  కలయిక వలన పధ్నాలుగు లోకాలతో కూడిన విరాట్ స్వరూపం ఏర్పడుతోంది.

2 వ్యాఖ్యలు:

 1. నెమ్మదిగా చదివాను. చాలా క్లిష్టమైన విషయం, సుళువు చేసేరనిపించింది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గద్యపాఠం చిన్నదేనండి. కాని వివరంగా వ్రాయకపోతే సగంసగం అవగాహన అయ్యే అవకాశం ఉంది, అందుకని విపులంగా చెప్పవలసి వస్తోంది.

   అసలు మహాభాగవతం పురాణంలో వేదాంతశాస్త్రమూ, భక్తిశాస్త్రమూ, విష్ణు భక్తుల కథలూ అల్లుకుపోయి ఉంటాయి. పైపై వ్యవహారంగా చెప్పుకుంటే కథలు మాత్రమే పరిచయం లోనికి వచ్చి తాత్త్వికమైన విషయాలన్నీ మరుగున పడిపోతాయి. మనం‌ ధారణ గురించి విస్తారంగా వివరణ చూస్తున్నాం. అసలు భాగవత పారాయణం అంటే ఈ‌ పురాణంలోని తత్త్వవిజ్ఞానాన్ని బాగ ఒంట పట్టించుకుందుకు శ్రధ్ధగా దీక్షగా పురాణపఠనం చేయటం. పఠనం అంటే సవివరంగా అర్థంచేసుకుంటూ సాగటం కాని గబగబా చదువుకుంటూ‌ పోవటం కాదు. కాలక్రమేణా, దురదృష్టవశాత్తు అలా చదువుకుంటూ పోవటం అనేదే పారాయణంగా స్థిరపడింది. ఇప్పుడు మనం భాగవతాన్ని పారాయణం చేస్తున్నాం సాధ్యమైనంత వివరంగా. కొంతమందికైన ఇది ధారణాశీలాన్ని అందిస్తే ధనుణ్ణి.

   తొలగించు