16, సెప్టెంబర్ 2013, సోమవారం

ద్వితీయస్కంధం: 15. నారదుడికి బ్రహ్మ బోధించిన సృష్టిరహస్యం

బ్రహ్మగారు సంతోషంగా ఇలా అన్నారు. 

క. రారా బుధులు విరక్తులు
గారా యీ రీతి నడుగఁగా నేరరు వి
స్మేరావహము భవన్మత
మౌరా నా విభుని మర్మ మడిగితి వత్సా


నాయనా, ఇప్పటిదాకా ఈ సృష్టిలోనికి ఎందరు జ్ఞానులూ విరాగులూ రాలేదు?  కాని ఇంతవరకూ ఈ‌ ప్రశ్నని అడిగిన వారు లేరు.  నువ్వు ఏకంగా నా ప్రభువును గురించి రహస్యం అడిగావు కదా!

బ్రహ్మగారు 'నా విభుని మర్మం' అన్నారు. బ్రహ్మకు పైన భగవంతుడు.  బ్రహ్మకు దిగువ చరాచర సృష్టి. జీవునిలో ఉండే నేను అనే ప్రజ్ఞనే సాత్వికాహంకారం అంటాం. ఈ‌ప్రజ్ఞాస్థితి యే బ్రహ్మలోకం - తనకూ తనకు అనుభూతం అయ్యే సకలచరాచర జగత్తునూ నిర్మించేది అదే. దీనికి పైనున్నది అంతర్యామి ఐన భగవంతుడు. ఈ నేను అనే భావనకు మూలం ఏది? దాని వెనుక ఉన్న శక్తి ఏది అన్న ప్రశ్నను సూచించేదే ఈ 'నా విభుని మర్మం' అన్న మాట అర్థం.  జీవుని అహంకారానికి మూలం ఐన స్థితికి చేరుకునే మార్గం చెప్పేదే ఆ మర్మం.  దానినే విద్య అంటాం. తద్విరుధ్ధమైన సర్వం అవిద్యయే.  ఈ విద్యను అందిచేది వేదం. ఈవిధంగా భగవం తుని తెలుసుకునే విద్యకే‌ భాగవతం అన్న సార్థకమైన పేరు.

శా. నానా స్థావర జంగమ ప్రకరముల్ నా యంత నిర్మింప వి
జ్ఞానం బేమియు లేక తొట్రుపడ నిచ్చన్ నాకు సర్వాను సం
ధానారంభ విచక్షణత్వము మహోదారంబుగా నిచ్చె ము
న్నే నా యీశ్వరు నాజ్ఞఁ గాక జగముల్ నిర్మింప శక్తుండనే


నారదా, నాకు ఈ‌ లోకాల్ని నిర్మించే శక్తి ఎక్కడిది? వట్టిమాట. ఈ  జీవుల్నీ, నిర్జీవుల్నీ సృష్టించటానికి నాకు ఏమీ చేతగాక తడబడుతూ ఉన్నాను మొదట.  ఈ జగత్తును సమకూర్చేందుకు తగిన సంకల్పబలాన్నీ, శక్తియుక్తులనీ  ఈశ్వరుడే నాకు ఇచ్చాడు. అంతా ఆయన ఆజ్ఞ ప్రకారమే చేసాను కాని నా ప్రతిభ ఏమీ లేదు.  మొదట నాకు చేయవలసినది ఏమో తెలియని స్థితి.  అలాగే ఫలానిది కావాలీ అని తెలియని స్థితి.  అటువంటి స్థితిలో ఉన్న నాకు ఎంతో ఉదారంగా నా ఈశ్వరుడు తగిన సామర్థ్యాన్ని ప్రసాదించాడు.

బ్రహ్మకుముందు ఈ  సృష్టి అనేది లేనే లేదు.  అందుచేత స్థావరాలూ లేవు జంగమాలూ లేవు. తొలుత భగవంతుడి చేత సృష్టించ బడినవాడు బ్రహ్మ. ఆయనకు సహజంగానే తాను ఏమి చేయాలీ అన్న ప్రశ్న ఉత్పన్నం అయింది.  ఈ‌ ప్రశ్నతో బాటే ఆయనకు , ఈ‌ ప్రశ్న ఎలా వచ్చిందీ, ఈ‌ ప్రశ్న కలిగేందుకు తనకు ఏది కారణం అయిందీ, ఈ‌ జ్ఞానానికి వెనుక నున్న శక్తి ఏది అన్న విషయాలపైన ఆలోచన కలిగింది. ఐతే వీటి వల్ల  తాను చేయవలసినదానిని గురించి స్పష్టత తెచ్చుకునేంత సమర్థత రాలేదు.

సాధారణంగా లోకంలో ఎవరికైన కర్తవ్యం గురించిన అవగాహన రెండు రకాలుగా వస్తుంది.  జన్మసిధ్ధమైన సంస్కారంతో వస్తుంది  లేదా ఇతరుల బోధ వలన వస్తుంది. పుట్టగానే బిడ్డకు తల్లిదగ్గర పాలు తాగాలి అన్న  జ్ఞానం జన్మసిధ్ధంగానే వస్తోంది కాని ఎవరో బోధించటం వలన రావటం లేదు కదా. ఈ జన్మసిధ్ధమైన జ్ఞానం కూడా రెండు రకాలు.  ఒకటి జాతి సహజమైనది. గుడ్డులోంచి బయటకు వస్తూనే నాగుపాము పడగ విప్పటం వంటిది. రెండవది జీవుడికి జన్మపరంపరగా వచ్చి సంస్కారం కారణంగా వచ్చే జ్ఞానం. ఈ‌ జన్మపరంపరాగతమైన సంస్కారం కారణంగానే కొందరు పిల్లలు పసితనంలోనే సంగీతచిత్రకళాదులో మంచి ప్రతిభ ప్రదర్శించటం వంటివి చూస్తుంటాము. జన్మసిధ్ధంగా వచ్చిన సంస్కారం ద్వారా కాక ఇతరుల బోధనతో వచ్చిన జ్ఞానం అనేది ఆ జీవుడిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేదిగా ఉంటుంది . జీవియొక్క సంస్కారానికి నప్పనిది ఐన బోధన ఆ జీవికి ఫలించదు కాబట్టి ఏ జీవికైన బోధతో వస్తున్న జ్ఞానం అనేది  ఆ జీవిలో బీజప్రాయంగా ఉన్న ప్రజ్ఞకు మెరుగుదిద్ది వృధ్ధి చేయటమే‌ అవుతున్నది.

బ్రహ్మకు వచ్చిన ఇబ్బంది ఏమింటంటే, ఆ యనకు పూర్వం సృష్టే లేదు కాబట్టి. ఆయనకా జన్మపరంపర లేదు.  ఆయనకంటే ముందుగా సృష్టిలో ఎవరూ లేరు కాబట్టి బోధించే వాళ్ళూ లేరు. అందుచేత జన్మాంతర సంస్కారంతో వచ్చే జ్ఞానమూ లేదు, బోధనతో వచ్చే జ్ఞానమూ లేదు. తానే‌సృష్టికి ఆద్యుడు కాబట్టి తాను ఫలాని జాతి వాడు కాబట్టి దానికి సహజమైన జ్ఞానము అంటూ కూడా లేదు.

ఇలా అన్ని విధాల అశక్తుడైన బ్రహ్మకు ఆయనను సృష్టించిన భగవంతుడే ఆదుకున్నాడు. ఆయనే ఎంతో దయతో బ్రహ్మ ఉనికికి అర్థమూ, ఆయన చేయవలసిన పనీ తెలియ జేసాడు. బ్రహ్మకు కర్తవ్యం ఐన సృష్టిని చేసే సామర్థ్యమూ ఆ ఈశ్వరుడే అనుగ్రహించాడు.

మ. అనఘా విశ్వము నెల్ల దీప్తముగఁ జేయన్ నే సమర్థుండ నే
యిన చంద్రానల తారకా గ్రహగణం బేరీతి నా రీతి నె
వ్వని దీప్తిం బ్రతిదీప్త మయ్యె భువనవ్రాతంబు దద్దీప్తిచే
ననుదీప్తం బ నట్టి యీశ్వరున కే నశ్రాంతమున్ మ్రొక్కెదన్


ఓ పాపరహితుడా నారదమునీ, ఈ‌ ప్రపంచం ఇలా ప్రకాశమానంగా ఉందంటే దానికి నా సమర్థత కారణం కాదు.  ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రమండలాలు అన్నీ బాగానే‌ ప్రకాశిస్తున్నాయి.  కాని వాటి వెలుగులు అన్నీఈశ్వరుడి ప్రకాశానికి నకళ్ళు మాత్రమే. ఈ సమస్త విశ్వాన్నీ ఈశ్వరుడి వెలుగు ఆధారంగానే సృష్టించాను. ఈ కనిపించే సమస్త మైన విశ్వప్రకాశమూ  ఏఈశ్వరుడి వెలుగులో అంశ మాత్రమే అవుతున్నదో ఆ  భగవ్వంతుడికి నేను నిర్విరామంగా నమస్కరిస్తున్నాను.

ఈశ్వరుడి విభూతిలో ఈ సృష్టి ఒక అంశ మాత్రమే.  అది వ్యక్తం కావటానికి భగవంతుడికి బ్రహ్మ ఒక ఉపకరణం మాత్రమే. గింజలో చెట్టు దాగి ఉంది.  అలాగని గింజను విభజించి చూస్తే ఆ చెట్టు కనబడదు. ఒక గింజ చెట్టుగా పరిణామం చెందటానికి వలసిన సమస్తమైన మూలద్రవ్యమూ  మూలశక్తీ ఆ గింజలో దాగి ఉంది. గింజ నాటిని వ్యక్తికి  ఆగామి కాలంలో ఆ చెట్టు యొక్క స్వరూపంపైన అవగాహన ఉండదు కదా. నాటటమే అతని పని.  అలాగే సృష్టి చేయటమే‌ బ్రహ్మపని. ఆ సృష్టి వికాసం ఎలా ఉండేదీ అన్నది ఆయనకు మించిన భగవంతుడి ఇఛ్చ యొక్క పరిణామం మాత్రమే‌ కాని బ్రహ్మ నిర్దేశించినది కాదు. బ్రహ్మ నిర్దేశించగలదీ కాదు. తన చేత భగవంతుడు ఏర్పరుస్తున్న సృష్టి ఇది అన్న అవగాహనతో బ్రహ్మ నిత్యం వినయంతో ఉంటాడు. ఆ  అద్భుతమైన సృష్టిని చూస్తూ ఆశ్చర్యానందాలతో భగవంతుడికినిత్యం నమస్కారం చేస్తునే ఉంటాడు.

బ్రహ్మగారు ఇంకా ఇలా అంటున్నారు.

మ. విను మీ యీశ్వరు దృష్టిమార్గమున నావేశింప శంకించి సి
గ్గున సంకోచము పొందు మాయవలనం గుంఠీభవత్ప్రజ్ఞచే
నను లోకేశ్వరుఁ డం మ్రొక్కు మతిహీనవ్రాతముం జూచి నే
ననిశంబున్ నగి ధిక్కరింతు హరి మాయాకృత్య మంచున్ సుతా


అబ్బాయీ, విను. ఈశ్వరుడైన హరి మాయను సృష్టించాడు. ఆ మాయ జీవుల్ని సమ్మోహపరచగలదు కాని ఈశ్వరుడి విషయానికి వస్తే ఆయన జోలికి పోవటాని సిగ్గుపడుతుంది. మాయవల్ల జీవుల బుధ్ధి మందగిస్తుంది.  వాళ్ళంతా ఈ‌ సృష్టిని నేనే చేస్తున్నానని భ్రమపడుతూ‌ఉంటారు. ఆ మతిహీనులు అలా అనుకుని మొక్కుతూ ఉంటే నాకు నవ్వు వస్తుంది. ఆ స్తుతులకు ఏమీ‌ ఉప్పొంగకుండా, ఇదంతా హరిమాయ అనే జ్ఞానం కలిగి, వాటిని తిరస్కరిస్తూ ఉంటాను.

భగవంతుడికి సృష్టి చేయటానికి ఉపకరణంగా మాయను పుట్టించాడు. ఆ మాయ ఆధారంగా, ఒక క్రీడగా తానే వివిధమైన జీవులుగా ఈశ్వరుడు సృష్టిలో విస్తరించాడు. జీవుడి రూపంలో ఈశ్వరుడు దిగివస్తున్నాడు. మాయను గ్రహించిన ఈ‌ జీవరూప ఈశ్వరాంశకు జ్ఞానం కొరత పడుతున్నది.  ఇలా జీవుడికి స్వస్వరూపజ్ఞానం‌కొరత చేయటం మాయకు కర్తవ్యంగా ఈశ్వరుడే నిర్దేశించాడు తొలుత. జీవుడిగా ఉన్నది తన ప్రభువైనఈశ్వరుడే కాబట్టి మాయ సిగ్గుపడుతూనే ఆ కర్తవ్యాన్ని  నిర్వహిస్తుంది. వివిధమైన జీవులుగా వాటికి ఉనికి ఐన విశ్వంగా సృష్టిని ఈశ్వరుడు బ్రహ్మ చేత చేయిస్తున్నాడు. జీవులు మాత్రం కొంచెం మందబుధ్ధులు కావటం కారణంగా ఈ సృష్టి అంతా బ్రహ్మ చేస్తున్నాడూ అని భ్రమపడి, ఆ యనకు మొక్కుతూ ఉంటారు కాని ఈశ్వరుడు అసలు సృష్టికర్త అన్నది తెలుసుకోలేరు. బ్రహ్మకు సత్యం తెలుసుకాబట్టి జీవుల మొక్కులు చూసి నవ్వుకుంటూ ఉంటాడు. వాళ్ళ మొక్కులు తిరస్కరించి భగవంతుడైన విష్టువు మాయ ఇదంతా అన్న సృహ కలిగి ఉంటాడు. నిత్యం వినయంగా విష్ణువుకు నమస్కరిస్తూ ఉంటాడు.

కుమ్మరి వాడు సారె మీద కుండలు చేస్తూ ఉంటాడు. సారె గిరగిరా వేగంగా తిరగటానికి కర్రను వాడుతూ ఉంటాడు. సారె తిరగటానికి కనిపించే కారణం కుమ్మరి వాడి చేతిలోని కర్ర. కాని నిజమైన కారణం కుమ్మరి వాడు. కర్ర తనంత తానుగా సారెను తిప్పలేదు. అలాగే బ్రహ్మకూడా సృష్టికర్త అనే కుమ్మరి వాడి చేతిలోని కర్రవంటి వాడు అన్నమాట. సారె తిరగటంలో‌కర్ర గొప్ప  ఎంత? కుండలు తయారవటంలో వాటి అందచందాలలో కర్ర పాత్ర ఏముంది? అంతా కుమ్మరి వాడి సంకల్పంలో ఉంది. ఎవరైన ఆహా ఏం దొడ్డ కర్ర! ఎంత గొప్పగా కుండలు చేస్తోం అంటే ఎలాగుంటుంది?  ఆ  కర్రకే జీవం ఉంటే అది ఎలా నవ్వుకుంటుందీ?

ఇదే భాగవత సంప్రదాయానికి మొదలు. భగవంతుడిచేత నడిపించబడుతున్న సృష్టికి తాను ఒక ఉపకరణమూ, దానిలో కేవలం తానొక భాగమూ అన్న స్పృహ కలిగిన వాడు భాగవతుడు. అతడు ఆ స్పృహ కారణంగా సమస్తమైన సన్మానాలూ అవమానాలూ భగవదర్పణం చేసి నిర్మోహుడై ఉంటాడు.  ఇటు వంటి భాగవతులలో మొదటి వాడు బ్రహ్మ.

ఈ ఈశ్వర క్రీడ గురించి బ్రహ్మ ఇలా అంటున్నారు.

దేహం అనేది ఏర్పడ్డానికి ద్రవ్యాలు  భూమీ, నీరూ, నిప్పూ, గాలీ, ఆకాశం అనే పంచభూతాలు. జీవుడికి ఒక జన్మ ఎత్తి దేహం ధరించటానికి కారణం వాడు పోగుచేసుకున్న కర్మం. ఈ‌ కర్మలు కాలంలో ఫలిస్తున్నాయి.  దీనికి కారణం, కాలానికి పరిణామం చెందుతూ ఉండటం అనే దాని స్వభావం . కాలం యొక్క పరిణామంలో ఫలించి అనుభవానికి వస్తున్న కర్మల ఆధారంగా జీవుడు ఆ కర్మల ఫలాలని అణుభవిస్తున్నాడు.  ఈ   జీవుడు నిజానికి వాసుదేవుడే. కర్మల్ని ఫలింపచేసే కాలమూ వాసుదేవుడే. జీవుడు  అనుభవించే కర్మసముఛ్ఛయమూ వాసుదేవుని విభూతియే. పంచభూతాలూ వాసుదేవుని విభూతులే.  అంతా వాసుదేవుడే కాని తదన్యం‌ మరేమీ లేదు.

ఈ లోకాలన్నీ నారాయణుడే నియమిస్తున్నాడు. దేవతలంతా నారాయణుడిడ శరీరం నుండే పుడుతున్నారు. యజ్ఞమూ, తపస్సూ, యోగం, జ్ఞానం ఇవన్నీ నారాయణుడి ఆధీనంలోనే ఉన్నాయి. 


నారాయణపరా వేదా దేవా నారాయణాఙ్గజాః
నారాయణపరా లోకా నారాయణపరా మఖాః


నారాయణపరో యోగో నారాయణపరం తపః
నారాయణపరం జ్ఞానం నారాయణపరా గతిః


జీవుడిలో దేవుడున్నాడు. ఆయన సర్వాత్మకుడు - అందరిలోనూ‌ అన్ని జీవుల్లోనూ‌ ఉన్నాడు. సమస్తలోక వ్యవహారాలనూ ఆయన నిత్యం గమనిస్తూ ఉంటాడు.  ఆయన నన్ను సృష్టించాడు.  ఈ ప్రపంచాన్ని సృష్టిచేసే సామర్థ్యాన్ని ఆయనే నాకు దయతో ఇచ్చాడు.

ఈశ్వరుడికి  సత్వగుణమూ, రజోగుణమూ, తమోగుణమూ అనే త్రిగుణాల్లో ఏదీ లేదు. ఆయన నిర్గుణుడు. ఆయనే ఈ‌ మూడు గుణాలనీ సృష్టించాడు. ఈ‌ రజోగుణం ఆధారంగా సృష్టీ, సత్వగుణం ఆధారంగా స్థితీ, తమోగుణం ఆధారంగా లయమూ ఈ‌ ప్రపంచానికి ఆయనే‌కల్పిస్తున్నాడు.  తమోగుణం వలన జీవుడికి తాను కర్తను అన్న భావన కలుగుతున్నది.  ఆతడు చేసే క్రియాకలాపాలకు ఈ సత్వగుణం అనేది కారణం, రజోగుణం అనేది కార్యంగా పరిణమిస్తున్నాయి.  ఈ‌ త్రిగుణాల వలన ద్రవ్యరూపమైన పంచభూతాలు ఏర్పడుతున్నాయి. ఈ త్రిగుణాల కారణంగా జ్ఞానరూపులైన దేవతలు పుడుతున్నారు.  ఈ త్రిగుణాల నుండి క్రియాకలాపాలకు ఆధారమైన ఇంద్రియాలు ఏర్పడుతున్నాయి. ద్రవ్య,జ్ఞాన, క్రియా సంబంధంగా జీవుడికి స్థూల, సూక్ష్మ, కారణ  లింగశరీరాలు కలుగుతున్నాయి. (లింగం అంటే చిహ్నం, గుర్తు అని అర్థం.) ఈ లింగశరీరాలు ఏర్పరుచుకుని దేవుడే జీవుడౌతున్నాడు.

ఇలా జీవుడిగా ఉన్న స్థితిలో తాను నిజానికి ఈశ్వరుడినే అన్న 'నేను' అన్న ప్రజ్ఞ జీవుడికి ఉండదు. అలా 'నేను ఈశ్వరుడను' అన్న ప్రజ్ఞ ఉన్న వారికి తప్ప ఈ‌తత్త్వం ఇతరులకి గోచరించదు.

క. ఆ యీశుఁ డనంతుఁడు హరి
నాయకుఁ డీ భువనములకు నాకున్ నీకున్
మాయకుఁ బ్రాణి వ్రాతము
కీ యెడలన్ లేద యీశ్వరత్వము సుతా
 


శ్రీహరి అనంతమైన విభూతి కలవాడు. సమస్త లోకాలకీ ఆయనే అధిపతి.  నాకూ, నీకూ ఆయనే అధిపతి.  అన్ని ప్రాణులకీ, వాటిని ఆడించే మాయకీ ఆయనే ఈశ్వరుడు కాని వీటిలో దేనికీ ఏవిధమైన స్వతంత్రతా లేదు.

నామరూపాత్మకమైన సమస్తమైన విశ్వమూ ఆ శ్రీహరి యొక్క అంశామాత్రమే. ఈ విశ్వంలో పిపీలికాది బ్రహ్మపర్యంతమూ అన్నిటిలో ఈహరి విభూతి నిండి ఉంది. ఈ చరాచరాత్మకమైన ప్రపంచాన్ని స్థూల దృష్టితో చూసి మాయ నడిపిస్తోందీ అనుకుంటారు.  కాని ఆ మాయకూడా శ్రీహరి విభూతియే.  కాబట్టి శ్రీహరి సమస్తవిశ్వానికీ అధిపతి.  వేరెవ్వరికీ స్వతంత్రమైన ప్రతిపత్తి లేదు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి