26, జులై 2013, శుక్రవారం

ప్రథమస్కంధం:‌ 02. శ్రీమహాభాగవతం కథా ప్రారంభం

శ్రీమహాభాగవత పురాణం  మనకు అందివచ్చిన కథ నైమిశారణ్యంలో ప్రారంభం అవుతుంది. ఇది విష్ణుక్షేత్రం. ఇక్కడకు కలి పురుషుడు ప్రవేశించనే ప్రవేశించడు - అది అతనికి అసాధ్యం.  అందుచేత అక్కడ, శౌనకుడు మొదలయిన మహర్షులు, శ్రీమహావిష్ణువును చేరుకునేటందుకు గాను వేయేళ్ళపాటు సత్రయాగం చేసారు. ఆ యాగాన్ని చూడటానికి సూతుడు అనే గొప్ప ఋషిపుంగవులు వచ్చారు. ఆ సూతుడు గొప్ప పౌరాణికుడు.  అంటే భగవంతుని మాహాత్మ్యం వినసొంపుగా కథలుకథలుగా విపులంగా చెప్పే మహానుభావుడు.
ఒకరోజున మునులంతా ఆరోజుకు అవసరమైన యాగసంబంధమైన కార్యక్రమాలు ముగించుకుని సూతమహర్షి దగ్గరకు వచ్చి ఇలా అడిగారు.

క. భూషణములు వాణికి నఘ
పేషణములు మృత్యుచిత్తభీషణములు హృ
త్తోషణములు కల్యాణ వి
శేషణములు హరిగుణోపచిత భాషణముల్

ఓ సూతమహర్షీ, శ్రీహరి కథలు సరస్వతీదేవికి అలంకారాలు. ఆ కథలు పాపాలను పొడిపొడిగా నూరి పారేస్తాయి. ఆ కథలంటేనే మృత్యుదేవత గుండెలు అదిరిపోతాయి. అవి చెవుల బడగానే హరిభక్తుల గుండెలు ఆనందంతో ఎగిసిపడతాయి. ఆ కథలన్నీ జగత్కల్యాణం కలిగించేవి.

ఆ కథలు అత్యంత అద్భుతమైనవి.

సీ. హరికథాకథన దావానల జ్వాలచేఁ
      కాలవే ఘోరాఘ కాననములు
వైకుంఠదర్శన వాయుసంఘంబుచేఁ
      దొలఁగవే‌ భవదుఃఖ తోయదములు
కమలనాభ ధ్యాన కంఠీరవంబుచేఁ
      గూలవే సంతాప కుంజరములు
నారాయణ స్మరణ ప్రభాకర దీప్తిఁ
      దీఱవే షడ్వర్గ తిమిరతతులు
ఆ. నళిననయన భక్తినావచేఁ గాక సం
సారజలధి దాఁటి చనఁగ రాదు
వేయు నేల మాకు విష్ణుప్రభావంబు
దెలుపవయ్య సూత ధీ సమేత

మహాపాపాలనే‌ భయంకరమైన అరణ్యాలు హరికథలు అనే దావానలంతో‌ కాలిపోవే!
వైకుంఠవాసుని దర్శనం అనే ప్రచండ వాయువుతో జీవుల్ని ఈదులాడించి దుఃఖపెట్టే ఈ భవసముద్రం‌ ఇంకిపోదా?
విష్ణు ధ్యానం అనే‌ మహాసింహం దెబ్బకి ఏనుగు లంతేసి ఉండే రకరకాల కష్టాలూ కూలిపోవా?
నారాయణస్మరణం అనే సూర్యరశ్మికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే చీకట్లు విచ్చిపోవా?
విష్ణుభక్తి అనే‌ నావనెక్కి తప్ప భవసముద్రం దాటలేము గదా.

ఓ సూతమహర్షీ అందుచేత మాకు శ్రీమహావిష్ణువు ప్రభావం గురించి విశరీకరించి చెప్పవయ్యా అని అడిగారు.

ఆ సూతమహర్షికి ఆనందం‌ కలిగింది ఈ‌ పరిప్రశ్నకి.  ఆయన మునులతో ఇలా అన్నారు.


ఆ. అతిరహస్యమైన హరిజన్మ కథనంబు
మనుజుఁ డెవ్వడేఁని  మాపు రేపుఁ
జాల భక్తితోడఁ జదివిన సంసార
దుఃఖరాశిఁ బాసి తొలగి పోవు

చాలా సంతోషం. ఈ విష్ణుకథలున్నాయే అవి చాలా రహస్యమైనవి.  అంటే శ్రథ్తాభక్తులు గలవారు శ్రధ్ధాభక్తులు గలవారిని ఆశ్రయిస్తే కాని తెలుసుకోవటానికి సులువుగా దొరకనివి. సంపూర్ణమైన భక్తితో, ఏ మానవుడైతే, నిత్యమూ వాటిని మనస్సులో అనుసంధానం చేసుకుంటూ ఉంటాడో వాడు ధన్యుడు.  వాడికి ఇక సంసారం అనే దుఃఖం లేకుండా పోతుంది.
 
మహాత్ములారా,  వినండి. సాక్షాత్తూ విష్ణుస్వరూపులే ఐన వ్యాసభగవానులవారు తెలుసు కదా? ఆయన శ్రీమహాభాగవతం అనే పేరుగల అద్భుతపురాణాన్ని నిర్మించారు.  అది సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపమే!  దానిని మొదట వ్యాసులవారు తమ కుమారుడైన శుకయోగీంద్రులచేత చదివించారు.  ఆ‌ శుకమహర్షి దానిని పరీక్షిత్తు అనే మహారాజుకు ఉపదేశం చేసారు. ఆ పరీక్షిత్తు పాండవుల మనుమడు.  ఆయన గంగ ఒడ్డున ప్రాయోపవేశ దీక్షలో ఉండగా శ్రీశుకులు వచ్చి ఆయనకు భాగవతం చెప్పారు. అప్పుడు నేనూ అక్కడ ఉండి అంతా భక్తితో‌ ఆలకించాను.  ఆ భాగవతాన్ని మీకు వినిస్తాను.

ఆ మునిశ్రేష్ఠులందరికీ ఆశ్చర్యం‌ కలిగింది. సూతుణ్ణి ఇలా అడిగారు.

మహాత్మా, ఆ శుకయోగీంద్రులు మహా యోగి అని చెబుతారే.  అయనకు కనీస స్త్రీపురుష బేధ దృష్టీ లేదు కదా!  ఆయనగురించి ఒక కథ విన్నాం.  

ఒకసారి శుకుడు గోచీగుడ్డకూదా లేకుండా దిస్సమొలతో అడవిలో పోతూ ఉంటే వ్యాసులవారు వెనక వెతుకుతూ వెళ్ళారు.

ఆ అరణ్యంలో ఒక కొలనులో‌ దేవకన్యలు జలకా లాడుతున్నారు.

శుకుడు ఆ కొలను గట్టు మీద నుండి పోతూ ఉండగా చూసి ఆ కన్యలంతా ఆ మహానుభావుడికి నీళ్లలో నుండే నమస్కారాలు సమర్పించుకున్నారు.

ఇంతలోనే కుమారుడి వెనకాలే నాయనా నాయనా అని పిలుస్తూ వెతుక్కుంటూ వ్యాసమహర్షులవారు వస్తున్నారు.  వారిని చూసి సిగ్గుపడి గాభరాగా ఆ కన్యలు బట్టలు వేసుకుని కొలను వెలువడి ఆయనకు మ్రొక్కారు.

వ్యాసులవారు అమ్మాయిలూ మీరు మా శుకుణ్ణి గాని చూసారా అని ఆడిగారు.

వారన్నారూ, మహాత్మా శుకులవారు ఇంతకు ముందే ఈ దారిన వెళ్ళటం కొలనిలోనుండి అందరం చూసాం అని.

వ్యాసులవారికి ఆశ్చర్యం కలిగింది. అమ్మాయిలూ, నన్ను చూసి మీరు నీళ్ళల్లోంచి బయటికి వచ్చి బట్టలు వేసుకున్నారు.  ముసలి వాడిని నన్ను చూసి సిగ్గుపడ్డారే!  నవయువకుడు, అందగాడు అయిన మా శుకుడిని,  ఒంటిమీద నూలుపోగు లేకుండా వస్తూ ఉన్నవాడిని చూసి, మీకు సిగ్గువేయలేదా అని వారిని వ్యాసులవారు అడిగారు.

అప్పుడు ఆ దేవకన్యలు వ్యాసమహర్షితో,  ఇలా అన్నారు. మహాత్మా,  అతడు నిర్వికల్పుడయ్యా. అతడికి స్త్రీలూ పురుషులూ‌ అన్న బేధం కూడా ఏ మాత్రం లేదు.  అందుచేత అతడి కంట మేము పడినా మేము స్త్రీలమూ తాను పురుషుడనూ అన్న భావన లేశమూ లేని వాడైన ఆ శుకుణ్ణి చూసి సిగ్గు పడవలసింది యేమీ‌లేదు. మీకూ వారికీ‌ చాలా పెద్ద బేధం ఉంది.  అతడు కేవలం పరబ్రహ్మ స్వరూపుడు. 

ఎంత అద్భుతమైన విషయం. ఆహా, ఆ శుకయోగీంద్రులు మహాయోగి, సమదర్శనుడు, మాయను జయించినవాడు, ఆనందస్వరూపుడూ‌ కదా!

అలాంటిది, ఆ శుకయోగీంద్రులు హస్తినాపురం వెళ్ళారా? ఎక్కడా కూడా, అవుపాలు పితికేటంత సమయం ఐనా నిలువని ఆ  మహాత్ముడు పరీక్షిత్తుకి పురాణం వినిపించారా రోజుల తరబడి? ఆ పరీక్షిత్తుకూడా మహాధర్మాత్ముడని విన్నాం. ఆయనకు ఏమి కష్టం వచ్చింది స్వామీ‌, రాజ్యంగీజ్యం వదిలేసి గంగ ఒడ్డున కూర్చుని ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదలటానికి?

సూతపౌరాణికులవారు చిరునవ్వుతో, అంతా చెబుతాను వినండి, అన్నారు.

2 కామెంట్‌లు:

  1. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దురితజాలములన్ని ద్రోలవచ్చు
    నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు
    నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత రిపుసంఘముల సంహరింపవచ్చు
    నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల దరుమవచ్చు

    భళిర నేనీ మహా మంత్ర బలముచేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు
    భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర

    ----ఇవాళ్టి మీ వ్యాఖ్యానం చదవగానే నాకెంతో ఇష్టమైన నృసింహ శతకం తలుచుకున్నాను.

    ధన్యవాదాలు,
    లలితా త్రిపుర సుందరి

    రిప్లయితొలగించండి
  2. Sootula vaaru ante Suka maha muni e ani vinnanu ...kaada ?
    Dayachesi cheppagalaru.

    రిప్లయితొలగించండి