26, జులై 2013, శుక్రవారం

ప్రథమస్కంధం: 01. పోతనగారు భాగవత రచనకు పూనుకోవటం

శ్రీమధ్బాగవత పురాణాన్ని మనకు అందించిన మహానుభావులు వేదవ్యాసమునీంద్రులు. వేదవ్యాసులవారు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అవతారమూర్తులలో ఒకరు.  ఈ‌ విషయం భాగవతంలోనే స్పష్టంగా ఉంది.

సంస్కృతభాషలో ఉన్న భాగవతాన్ని తెలుగులో అందించిన భాగవతోత్తములు పోతనామాత్యుల వారు. ఆపాతమధురమైన కవితాధార పోతన్నగారి సొత్తు. ఆయనది సహజపాండిత్యం.  శ్రీవిశ్వనాథ సత్యనారాయణగారు పోతన్న తెలుఁగుల పుణ్య పేటి అన్నారు. పోతనగారి ఆంద్రమహాభాగవతగ్రంధం ప్రతి తెలుగు యింటనూ తప్పక ఉండవలసిన పుణ్యగ్రంధం.  ఆ మహర్దివ్యగ్రంథాన్ని ఇంట నుంచు కున్న అదృష్టవంతులకు భగవత్కృప అపారంగా లభిస్తుంది.  పారాయణం చేస్తే అది సాక్షాన్ముక్తి ప్రదాయకమే.

భగవంతుని దివ్యలీలావిలాసాలను సంపూర్ణంగా తెలుసుకోగలగటం కేవలం‌ అసాధ్యం.  భగవంతుని తెలియగలవాడు వేరొకడు ఎవ్వడూ ఉండడు.  పోతన్నగారు అందుకే ఇలా అన్నారు

ఆ. భాగవతముఁ దెలిసి పలుకుట శక్యమే
శూలికైనఁ తమ్మి చూలికైన
విబుధవరుల వలన విన్నంత కన్నంత
దెలియ వచ్చినంత తేట పఱతు

సాక్షాత్తూ బ్రహ్మశివులకైన సంపూర్ణంగా భగవత్తత్వం‌ అవగాహన కాదే‌ అంటే నేనెంత? ఏదో‌ పెద్దలవలన తెలుసుకున్నది నాకు అర్థమైనది అయినట్లుగా తెలియజేస్తాను అన్నారీ‌ పద్యంలో పోతనగారు.  

ఆయన గురించి కొంచెం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

పోతనామాత్యుడను అని చెప్పుకున్నారు కాబట్టి ఆయన నియోగి బ్రాహ్మణులు.  వారిది కౌండిన్య గోత్రం, ఆపస్తంబ సూత్రం. భీమన మంత్రి,  కుమారుడు అన్నయ మంత్రి.  అన్నయ, గౌరమాంబల పుత్రుడు సోమన. సోమన, మల్లమ్మల కుమారుడు ఎల్లన.  ఎల్లన మాచమ్మల కుమారుడు పోతనగారి తండ్రిగారు కేతన

ఆ. లలితమూర్తి బహుకళానిధి కేతన
దాన మాన నీతిధనుడు ఘనుఁడు
దనకు లక్కమాంబ ధర్మగేహిని గాఁగ
మనియె శైవశాస్త్రమతముఁ గనియె

కేతనగారు సౌమ్యులు. మంచి విద్యావంతులు. నీతిపరులు, దానశీలురు. ఆయనభార్య లక్కమాంబ. (వారి కుమారుడే పోతనామాత్యుడు)

పెద్దల పేర్లను బట్టి చూసినా, పై పద్యాన్ని గమనించినా పోతన్నగారి వంశీకులు శివారాధనా తత్పరులని అర్థం‌ అవుతోంది గదా?  శివారాధనాతత్పరులైన పోతనగారు తనది పరమేశ్వర కరుణా కలిత కవిత అని చెప్పుకున్నారు వినయంగా.  వారికి శివకేశవలు ఇద్దరూ సమానమే. ఆయన హరిహరుల చరణారవిందాలకు సమంగా మ్రొక్కే విబుధులు.

తన వేయి జన్మల తపస్సు ఫలితంగా తనకు శ్రీమన్నారాయణుడి కథాప్రపంచం అయిన శ్రీమధ్బాగవతం ఆంద్రీకరించాలనే కోరిక పుట్టింది.  అది ఆంద్రుల అదృష్టం. ఆంద్రజాతి చేసుకున్న పుణ్యఫలం.


ఒకరోజున పోతనగారు నదీస్నానం చేసి, మహేశ్వర ధ్యానం చేసుకుంటున్నారు. ఆయన కన్నులు అరమోడ్పుగా ఉన్నాయి. శివధ్యానంలో మైమరచి ఉన్న పోతనామాత్యులకు ఒక అద్భుతమైన దర్శనం కలిగింది.

సీ. మెఱుఁగు చెంగటనున్న మేఘంబు కైవడి
      నువిద చెంగట నుండ నొప్పువాఁడు
చంద్రమండలసుధాసారంబు పోలిక
      ముఖమునఁ జిరునవ్వు మొలుచువాఁడు
వల్లీయుత తమాల వసుమతీజము భంగి
      బలువిల్లు మూఁపున బరగువాఁడు
నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి
      ఘన కిరీటము దలఁ గలుగువాఁడు

ఆ. పుండరీక యుగముఁ బోలు కన్నుల వాఁడు
వెడఁద యురమువాఁడు విపులభద్ర
మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా
కన్నుఁ‌గవకు నెదురఁ‌ గానఁబడియె

ఆ కనిపించిన మహారాజ మూర్తి యెలా ఉంది? మేఘంలా తానూ మెరుపులా తన పత్నీ ప్రకాశిస్తున్నారట.  అంటే సీతమ్మతో కూడి రామభద్రులు విచ్చేసారన్న మాట. ఆయన ముఖ చంద్రమండలం నుండి చిరునవ్వు అనే‌ అమృతం వర్షిస్తోంది.  ఒక పెద్ద నల్లని కానుగ చెట్టును అంటి ఉన్న లతలాగా ఒక పెద్దవిల్లు ధరించి ఉన్నాడు.  పెద్ద నల్లని కొండశిఖరం మీద ఉన్న సూర్యబింబంలా ఆయన నెత్తిన పెద్ద అందకిరీటం.  తామరరేకుల వంటి అందమైన కళ్ళు. వెడల్పైన వక్షస్థలం.  ఎంతో మంగళకరమైన స్వరూపం.

పోతన్నా, నేను శ్రీరామచంద్రుడి నోయీ. శ్రీమహాభాగవతం తెలుగు చేయి. నాకు అంకితం ఇవ్వు. నీకు మోక్షం కలుగుతుంది అని అనుగ్రహభాషణం చేసి ఆ దివ్యమూర్తి అదృశ్యు డయాడు.

పోతన్నగారి పరవశం వర్ణనాతీతం. సాక్షాత్తూ శ్రీరామచంద్రులవారే అనుజ్ఞ దయచేసారు. ఇంకేమి కావాలి తనకు?
అందుకే ఆయన అన్నారిలా

క. పలికెడిది భాగవత మట
పలికించు విభుండు రామభద్రుండట నేఁ
బలికిన భవహర మగు నఁట
పలికెద వేఱొండుగాథ పలికఁగ నేలా

పలికేది భాగవతంట. అది నా నోట పలికించే ప్రభువు రామభదుడే నట! పైగా భాగవతం చెబితే ఇంక చావుపుట్టుకలు లేక మోక్షమే‌ నట.  ఇంక వేరే చెప్పాలా, భాగవతం కాక?

ఆ భాగవతాన్ని తాను ఎలా తన కవిత్వంలో చెప్పదలచుకున్నదీ పోతనగారు సెలవిస్తున్నారు

క. కొందఱకు దెనుఁగు గుణమగుఁ
గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం
గొందఱకు గుణములగు నే
నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్

కొందరికి తెలుగు కవిత్వం ఇష్టం. కొందరికి సంస్కృతంలో ఉంటే బాగా నచ్చుతుంది. కొందరికి  రెండూ యిష్టమే. సందర్భాన్ని బట్టి నా కవిత్వంతో‌ అందరినీ మెప్పిస్తాను.

భాగవతాన్ని తెనిగించే అదృష్టం సామాన్యమైనది కాదూ, నన్నయ తిక్కన వంటి మహాకవులు దీనిని నాకు వదిలి పెట్టటం నా పూర్వ జన్మల పుణ్యఫలమేనూ‌ అనుకున్నారు.  ఇది చేస్తాను, ఇంక పునర్జన్మ లేకుండా తరిస్తానూ అని సంతోషం వెలిబుచ్చారు.

ఆ భాగవత ప్రశస్తి ఎట్లాంటిదో పోతనగారి మధురపద్యంలో ఇలా పలికింది

మ. లలితస్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతాశోభితమున్ సువర్ణసుమస్సుజ్ఞేయమున్ సుందరో
జ్వలవృత్తంబు మహాఫలంబు విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్విజ శ్రేయమై

ఈ భాగవతం ఒక కల్పవృక్షం. దీని శాఖలు ఎంతో‌ అందంగా ఉన్నాయి. మహాభాగవతులనే చిలకలు ఈ చెట్టుని ఆశ్రయించుకొని ఆలాపనలు చేస్తున్నాయి. అందమైన లతలకు ఆశ్రయమైనది. అందమైన దేవతలు దీని మాహాత్మ్యం తెలిసి ఆశ్రయిస్తున్నారు. అద్భుత మైన చరిత కలది.  దీని ఫలాలు అద్బుతాలు. ఎంతో విశాలమైన మొదలు కలది. ఇలా ఒక వృక్షంగా అన్వయం.  మరొకరకంగా చూస్తే, ఈ‌ భాగవత గ్రంధంలో విభాగాలైన స్కందాలు చాలా పసందుగా ఉంటాయి - వివిధ శాస్త్రశాఖలను బాగా సమన్వయం చేస్తూ‌ ఉంటాయి. ఈ‌భాగవతానికి మూలమైనది శ్రీకృష్ణతత్వం. ఈ తత్వా న్ని హాయిగా వినిపించినది శ్రీశుకయోగీంద్రులు. ఎందరో‌భగవధ్బక్తుల చరిత్రలు ఈ‌భాగవతవృక్షాన్ని లతల్లాగా ఆశ్రయించి తరించాయి.  మంచి మనస్సు గలవారికి చక్కగా బోధపడే లక్షణం గలది భాగవతం. దీనిని ఆశ్రయించిన వారికి ఫలం మోక్షమే. ఈ భాగవత పురాణానికి పాదు వ్యాసమునీంద్రులు. 

ఎంత అందమైన పద్యం!

1 వ్యాఖ్య:

 1. నీల మేఘ శ్యాముడు నా మ్రోల నిలిచెను
  కాలమెల్ల తనలో దాచు లీల మెరిసెను....
  ..............................................................
  ..................................................................
  మరీ మరీ మబ్బులలో మసలుట చేత సూర్యుడే నీలమై సొగసించెనా
  రవిని పదే పదే మూసివేయు ఫలితముగా జలదమే ఇనకులమున జనియించెనా

  ----పి. సుశీల గారు పాడిన శ్రీ రామగాన లహరి గుర్తుకొచ్చింది మేఘంలా మెరుస్తున్న రాముడి గురించిన వర్ణన చదవగానే.

  లలితా త్రిపుర సుందరి

  ప్రత్యుత్తరంతొలగించు